Wednesday, May 29, 2013

పెడదోవలో విద్యార్థి నేతలు ----- ఇనప ఉపేందర్ (ఇఫ్లూ), కోట రాజేశ్ (ఓయూ) పరిశోధక విద్యార్థులు



ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో యావత్ దేశ ప్రజానీకాన్ని తనవైపు తిప్పుకున్న ఘన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంకు ఉన్నది. విద్యార్థి జేఏసీ నాయకుల రాజకీయ చేరిక మరొకసారి ఒక చారిత్రక చర్యకు అవకాశాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో అటు యావత్ తెలంగాణలో, ఇటు ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలోనూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర దిశగా సాగుతున్న మలిదశ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులే నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉద్యమ గమనంలో జైలు జీవితాలు, వందల సంఖ్యలో కేసులు, లాఠీ దెబ్బలు, రబ్బరు బులెట్ ఫైరింగులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలను సైతం ఎదుర్కొని వెన్ను చూపని వీరోచిత పోరాటాన్ని నిర్వహించారు.

తెలంగాణ మట్టి బిడ్డల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసే నిజమైన ఉద్యమకారులుగా ఓయూ విద్యార్థులు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేశారు.

తెలంగాణ పట్ల టీఆర్ఎస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీల అవకాశవాద విధానాల్ని ఎండగడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తెలంగాణ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేశారు. విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపులే యావత్ తెలంగాణ ఉద్యమ కార్యాచరణగా కొనసాగింది. ఈ ఉద్యమ ప్రభావంతోనే కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించటం జరిగింది. విద్యార్థుల పాదయాత్రలో భాగంగా తెలంగాణలో పల్లె పల్లె తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు ఉస్మానియా విద్యార్థుల పాదాలను పాలతో కడిగి నీరాజనాలు పలికారు. వృద్ధులు సైతం వారి కొంగుల్లో దాచుకున్న ఫించన్ డబ్బులను విద్యార్థులకు ఇచ్చి 'రాజకీయ పార్టీల బద్మాష్‌గాళ్లను మేము నమ్మం బిడ్డా... వస్తే గిస్తే తెలంగాణ మీతోటే రావాల, మీరే నిజమైన నాయకుల'ని దీవించారు. తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టడం కోసం ప్రజా బాహుళ్యాన్ని ఉరకలు వేయిస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి తెలంగాణ ఉద్యమంలో చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.

ఇంతటి చారిత్రక పాత్ర పోషించిన విద్యార్థి నాయకత్వం నుంచి కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పదవుల వ్యామోహంతో నాయకులకు అమ్ముడుపోతున్న స్థితి యావత్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లినట్లయ్యింది. నాడు 'చలో అసెంబ్లీ' అని నినదించిన నాయకత్వం, నేడు ఎమ్మెల్యే సీట్లకై రాజకీయ పార్టీల ఆఫీసులకు 'చలో' అంటున్నారు. రాజీనామా ప్రమాణాలను ఆత్మత్యాగం చేసిన వారి శవాలపై చేయి ంచిన విద్యార్థి నాయకులే అవే పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. వీరు గతంలో సమరశీల పోరాటాలతోనే తెలంగాణ వస్తుంది తప్ప, ఎన్నికల లాబీయింగులతో తెలంగాణ రాదని చెప్పినవారే. ఈ నయవంచకుల తీరు ను గమనిస్తే 1969 తెలంగాణ ఉద్యమ విద్రోహ వారసత్వానికి వారసులు ఇలాంటి వారేనని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్ర డిమాండును నిర్వీర్యం చేయడానికి ఉద్యమ కేంద్రమైన ఉస్మానియావైపు పాలకవర్గ పార్టీలు చూస్తూండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. గత 60 సంవత్సరాల కాలంలో చవిచూసిన చేదు అనుభవాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తమకు జరిగిన, ఇంకా జరుగుతున్న అన్యాయాల గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ ఆందోళనను అదుపుచేసి అసలు సిసలైన తెలంగాణ గొంతును సమష్టి పోరాటాల ద్వారా బయటి ప్రపంచానికి వినిపించాల్సిన గురుతర బాధ్యత ఉస్మానియా విద్యార్థి నాయకత్వంపై ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో నక్సల్‌బరీ ప్రభావం ఉన్నప్పటికీ అంతర్లీనంగానే ఉన్నది. అంతర్లీనం నుంచి అంతర్భాగమయ్యే గుణాత్మక పరిణామ దశలోనే 1969 తెలంగాణ ఉద్యమం ద్రోహానికి గురయ్యింది. విశాల మద్దతు ఉన్న ఒక ప్రజాస్వామిక డిమాండ్ అనేక ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ప్రజా క్షేత్రంలో సుదీర్ఘకాలం నిలిచి వుండటం ఈ ఉద్యమానికి ఉన్న ఒక ప్రత్యేకత. తెలంగాణ ఆకాంక్ష మరుగునపడిన ప్రతిసారీ, ఆ ఉద్యమ జ్వాలను ఆరనివ్వకుండా కాపాడుతున్నది తెలంగాణ ప్రజలే.

1969 ఉద్యమాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి తెలంగాణకు ద్రోహం తలపెట్టే అన్ని రాజకీయ పార్టీలకు సమష్టి ఉద్యమాలతో సమాధానం చెప్పే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి. విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాజకీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకమని భావించిన పార్టీలన్నీ ఏకమై విద్యార్థి ఉద్యమాన్ని నిలువునా చీల్చిన చేదు అనుభవాన్ని మరువరాదు. ఏ ప్రజలైతే మనపై ఆశలతో కాళ్ళుకడిగి గుండెలకు హత్తుకున్నారో వారి కన్నీళ్ళు తుడిచే చారిత్రక బాధ్యతను నిర్వర్తించాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమరం భీం, బందగి వారసులుగా చరిత్రలో నిలిచిపోతారా? రాజకీయ నాయకులకు పావులుగా ఉపయోగపడి చరిత్రహీనులౌతారా మీరే తేల్చుకోండి. ఇలా మోసపోయిన ప్రతిసారీ దగాపడిన ప్రజలను అక్కున చేర్చుకొని ఉద్యమ గుణపాఠాలను నెమరువేయించి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారే నిజమైన తెలంగాణ ఉద్యమకారులు.
- ఇనప ఉపేందర్ (ఇఫ్లూ),
కోట రాజేశ్ (ఓయూ)
పరిశోధక విద్యార్థులు
Andhra Jyothi Telugu News Paper Dated : 30/5/2013

No comments:

Post a Comment