Wednesday, May 29, 2013

జోగిని వ్యవస్థ అంతమయ్యేదెప్పుడు? ----దుర్గం శ్రీనివాస్





భారతీయ సమాజం స్త్రీని ఆదిశక్తిగా, ధన, ధాన్య, దైర్య, సంపదలక్ష్మి గా కొలుస్తున్నది. పురాణాల్లో ఇతిహసాల్లో స్త్రీ శక్తి గురించి ఎన్నో సాహసగాథలను పలు విధాలుగా పేర్కొన్నారు. ఇన్ని రూపాలుగా కొలిచే స్త్రీని ఇదే సమాజంలో మరో రూపంలో మాంసపు ముద్దగా, భోగ వస్తువుగా కూడా చూస్తున్నది.ఈ క్రమంలోనే అణగారిన, అట్టడుగు కులాలకు చెందిన స్త్రీలను భూస్వా మ్య,పెత్తందారులు లైంగిక వాంఛను తీర్చే సాధనంగా, ఆట వస్తువుగా మార్చారు. దీనికి సజీవ సాక్ష్యమే ‘జోగిని వ్యవస్థ’.
భారత సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతల్లో జోగిని వ్యవస్థ అతి హేయమై నది. బూర్జువా, భూస్వాముల ‘కోరిక’లను తీర్చేందుకు జోగినీ వ్యవస్థను ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగేలా చేస్తున్నారు. దీంట్లో భాగంగానే దళిత, గిరిజన స్త్రీలను కామ వాంఛను తీర్చేందుకు వ్యభిచారులుగా చేస్తున్నారు. ఈ వ్యవస్థను అణగారిన దళిత, గిరిజన స్త్రీలకే పరిమితమయ్యేట్లు చేసి సమాజంలోని ఆధిపత్య కులాలు, వర్గాలు రూపొందించాయి. ఆది నుంచి ఊరికి దూరంగా, అంటరానివారిగా వెలివేశారు. జోగిని వ్యవస్థ మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగాడ్డి, కరీంనగర్, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికీ జోగిని, దేవదాసీ, బసివి, మాతం గి అనే పేర్లతో కొనసాగుతున్నది. 

పేర్లు ఏవైనా రూపం, స్వరూపం ఒక్కటే. గ్రామాల్లో భూస్వాముల కామవాంఛను తీర్చేందుకు వీరిని ఒక వస్తువుగా,సాధనంగా వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8వేల మంది జోగిని, దేవదాసీ, బసివి, మాతంగులు ఉంటారని ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. ఈ వ్యవస్థ అనాదిగా వస్తున్న ఆచారమని అణగారిన కులాలకు అగ్రకుల పెత్తందారులు ఆపాదించారు. కానీ దీని నేపథ్యం చూస్తే..చరిత్రలో వేర్వేరు సామాజిక కారణాలతో ఉద్భవించిందని చెప్పవచ్చు. ప్రఖ్యాత రచయిత తాపి ధర్మారావు రాసిన ఎన్నో రచనలో స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. వీటిలోనే దేవదాసీ వ్యవస్థను కూడా ఆయన రాసిన ‘దేవాలయాలపై బూతు బొమ్మపూందుకు’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. పూర్వం దేవదాసీలు దేవుని సేవకులుగా మాత్రమే ఉండేవారు.

వీరి నివాసం దేవాలయాల్లోనే ఉండేది. వీరి వృత్తి వ్యభిచారం. వీరితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వచ్చే విటులు (అప్పట్లో రాజవంశీకులు, జమీందారులు) నేరుగా దేవాలయానికే వచ్చే వారు. అక్కడే దేవదాసీలు వ్యభిచార వృత్తిని అందరి అంగీకారంతో చేసేవారు. వారు ఇచ్చిన డబ్బు, కానుకలను తాము నమ్ముకున్న దేవుడి హుండిలో సగభాగం వేసే వారని చలం తన రచనల్లో ప్రస్తావించారు. ఈ విధంగా దేవదాసీ వ్యవస్థ ను అప్పటి రాచరిక వ్యవస్థగానీ, భూస్వాములుగానీ ప్రోత్సహించారని, వీరందరూ దేవుడి పేరుతో వ్యభిచారం చేసేవారని తెలుస్తోంది. దేవదాసీ వ్యవస్థకు మూలం తాపీ ధర్మా రావు స్పష్టంగా చెప్పారు. దేవాలయాల్లోనే దేవదాసీలు వ్యభిచారం చేశారు కాబట్టి దేవాలయాల్లో బూతుబొమ్మలను అప్పటి రాజులు వేయించారని ఆయన వాదన. దీనిపై రకరకాల అభివూపాయాలున్నాయి. కానీ ఇదే వ్యవస్థ ఆధునీక కాలంలో రకరకాల పేర్లతో కొనసాగుతున్నది. దీనికి అనవాళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ జిల్లాలో జోగిని పేరుతో కొనసాగుతున్నది. దళిత, గిరిజన, కురుమ కులాల్లోని స్త్రీలను జోగినీలుగా మారుస్తుంటారు. ఏదైన కుటుంబంలో మగపిల్లలు పుట్టకపోవడంతో వారసత్వం లేదని సంబంధిత కుటుంబంలోని పెద్ద కూతురు లేదా అందరికంటే చిన్న కూతురును జోగినీగా మారుస్తారు. ఈమెను ఆ కుటుంబంలో వరుసకు మేనమామ సంబంధమున్న వారితోగానీ, లేదా వారు కొలిచే ఇష్టానుదైవం సన్నిదిలోగానీ తాళిబొట్టు కట్టించి పెళ్లి జరిపిస్తారు. సంబంధిత జోగినీకి ఆ దేవునితో పెళ్లి జరిగినట్లుగా కుల పెద్దలు నిర్దారిస్తారు. వారసత్వం కోసం జోగినీగా మార్చినందుకు సదరు గ్రామంలోని భూస్వామ్య, పెత్తందారి వర్గాలు వ్యభిచారిగా ముద్ర వేయడం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, మక్తల్, దన్వాడ, ఆత్మకూర్, మాగనూరు, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, అలంపూర్, గద్వాల, గట్టు, దరూర్ మండలాల్లో దళిత, గిరిజన, కురుమ కుటుంబాల్లో జోగినీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ వ్యవస్థను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1988 సంవత్సరంలో జోగినీ నిషేధ చట్టాన్ని రూపొందించింది. కానీ ఈ చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. అంతేకానీ జోగినీ, దేవాదాసీ, బసవి, మాతంగి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 

జోగినీ పిల్లలకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితి. దీంతో జోగిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. నేటి విద్యా వ్యవస్థలో పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తండ్రి పేరును తప్పకుండా నమోదు చేయాలనే నిబంధన విధించింది. జోగినీ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తున్నది. 

కొన్ని సందర్భాల్లో సదరు స్త్రీలకు ఇష్టం లేకున్నా బలవంతంగా జోగినులుగా మారుస్తున్నారు. కాదని ఎదిరిస్తే భూస్వామ్య, పెత్తందారులు దాడులకు పాల్పడడం, ఊళ్లో నుంచి వెలివేయడంలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేందుకు జోగినీ వ్యవస్థ నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోగిని నిషేధ చట్టం చేసి చేతులు దులుపుకున్నాయి.వారి ఉద్ధ రణకని కమిటీలు, కమిషన్లు వేశాయి.అలాగే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ కూడా వేసింది. ఈ కమిషన్ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. జోగినీలకు పునరావాసం కల్పించేందుకు ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయాలని, వారి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ జోగినీ, బసివి, దేవాదాసీ, మాతంగీల అరకొర సహాయం కూడా అందలేదు. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 మంది జోగినీలకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్కరికీ ఐదువేల రూపాయల చొప్పున రుణాలను మంజూరు చేశారు. ఒక్కో ఎకరం భూమి కూడా ఇచ్చారు. ఎక్కడో ఊరికి దూరంగా ఎందుకూ పనికిరాని పోరంబోకు భూములను కట్టబెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. కొన్ని ప్రాంతాల్లో సంక్షేమహాస్టళ్లల్లో పిల్లలను చేర్పించి చదివించారు. కానీ ఉన్నత చదువులకు వెళ్లే పరిస్థితి లేక అయా గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా మారినవారే ఎక్కువగా ఉన్నారు. జోగిని వ్యవస్థను నిషేధిస్తామని గొప్పలు చెప్పే స్వచ్ఛందసంస్థలు లబ్ధి పొందాయి. జోగిని వ్యవస్థను భూతద్దంలో చూపించి విదేశాల నుంచి కోట్లాది నిధులను తమ సంస్థల ఖాతాల్లోకి జమ చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు చేసింది శూన్యమనే చెప్పాలి. నిధులు తెచ్చుకున్న స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు కోటీశ్వరులయ్యారు. కానీ జోగినుల దయనీయ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాలేదు. జోగిని, బసివి, దేవాదాసీ, మాతంగి వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యగా గుర్తించాలి. దాని నిర్మూలనకు చిత్తశుద్ధిగా కృషి చేయాలి. జోగినులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. 

అలాగే సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు ప్రభుత్వాలు సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమున్నది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో జోగినీలకు ప్రత్యేక నిధులను కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ప్రత్యేక నిధులను కేటాయించాలి. జోగినీ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, చట్టాన్ని అతిక్షికమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. జోగినీల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలి. సామాజిక, జీవిత భద్రత కింద పింఛన్లు, జీవితబీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వమే విధిగా అమలు చేయా లి. జోగినీల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే దేవదాసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. 

-దుర్గం శ్రీనివాస్
స్కాలర్ (జర్నలిజం), ఉస్మానియా యూనివర్శి

Namasete Telangana Telugu News Paper Dated : 30/5/2013

No comments:

Post a Comment