Friday, May 31, 2013

అమ్మహస్తం-రిక్తహస్తమేనా..? పిట్టల రవి

  Thu, 30 May 2013, IST  

పథకాల 'మాటున' ప్రజలను మాయ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని అమ్మహస్తం మరోసారి నిరూపించింది. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తున్న తొమ్మిది రకాల సరుకులతోనే పేదల కడుపులు నిండిపోతాయంటూ పాలకులు సెలవిస్తుంటే అరకొర సరఫరా, నాసిరకం, పురుగులున్న సరుకులను అంటగడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఆకలితో అలమటించే పేద ప్రజల ఆకలి తీర్చటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కలల పథకంగా పురుడుపోసుకున్న అమ్మహస్తం రిక్తహస్తంగా మారింది. ఓట్ల సాధన వేటలో ప్రభుత్వం చేతిలో ఆయుధంగా మారి అమ్మహస్తం అస్తవ్యస్తంగా తయారైంది. పేదల పాలిటి అమృతహస్తమని ప్రచారం చేస్తోంది. తొమ్మిది రకాల నిత్యావసర వస్తువుల సరఫరా పథకం అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెస్తే స్వాగతించాల్సిందే. కానీ పథకాల 'మాటున' ప్రజలను మాయ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని అమ్మహస్తం మరోసారి నిరూపించింది. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తున్న తొమ్మిది రకాల సరుకులతోనే పేదల కడుపులు నిండిపోతాయంటూ పాలకులు సెలవిస్తుంటే అరకొర సరఫరా, నాసిరకం, పురుగులున్న సరుకులను అంటగడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రజలపై పథకాల మత్తుజల్లి ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తెగబడ్డారనే విషయం స్పష్టమైంది. పేదల కడుపు నింపే పేరుతో అవినీతిపరుల బొజ్జలు నింపేందుకు పథకం ఉపయోగపడుతుందనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ వాదనల్లో నిజమెంత ..?
'ముందుంది మరింత మంచికాలం' అనే నినాదంతో పథకాల పరంపరను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి మరో పథకాన్ని ప్రజలపై వదిలారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలకు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకే అమ్మహస్తం వరం లాగా ప్రవేశపెట్టామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 2013 ఏప్రిల్‌ 11 ఉగాది పండుగ నాడు ఆర్భాటంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని 2.25 కోట్ల మంది తెల్లరేషన్‌కార్డుదారులు ఈ పథకం ద్వారా కందిపప్పు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, పంచదార, పామాయిల్‌, గోధుమలు, గోధుమ పిండి వంటి తొమ్మిది రకాల వస్తువులు మార్కెట్‌లో రూ.292 ధర పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ.185 కే అందిస్తూ ప్రజలపై రూ.107 భారం తగ్గిస్తున్నామంటోంది. దీని కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.660 కోట్లు కేటాయించారు. నిర్వహణలో వైఫల్యం, పథకంలో డొల్లతనం వల్ల ఆచరణలో ముందడుగు పడటం లేదు. ప్రచారంలో చూపుతున్న శ్రద్ధ అమలులో లేకపోవటం వల్ల ప్రజల్లో అభాసుపాలు అవుతోంది. ఈ పథకంతో ఎంతో కొంత ఉపయోగం జరుగుతుందని ఆశతో ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. ఇది జనాన్ని ఉద్ధరించేది కాదని, ఎన్నికల ఎర అనే విషయం అర్థమైంది.
వీటితోనే పేదల కడుపునిండేనా...
ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకూ బియ్యం, పంచదార, గోధుమలు, కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నారు. వీటికి మరికొన్ని కలిపి అమ్మహస్తం ప్రకటించారు. నెలకు అర కేజీ చింతపండు, అరకేజీ పంచదార, కేజీ కందిపప్పు, వందగ్రాముల పసుపు, పావు కేజీ కారం, కేజీ ఉప్పు, కేజీ పామాయిల్‌, కేజీ గోధుమ పిండి, కేజీ గోధుమలు సరఫరా చేసి పేదోడి ఆకలి తీరుస్తామని చెప్పటం విడ్డూరంగా ఉంది. అంతేకాదు ఆచరణలో సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా పథకాన్ని వల్లెవేస్తూ వంచనకు పాల్పడుతోంది. నలుగురు సభ్యులు గల ఒక కుటుంబానికి ప్రభుత్వం రూ.185కు ఇచ్చే పై సరుకులు 8-10 రోజులకు మాత్రమే సరిపోతాయి. మరి మిగతా 20 రోజుల పరిస్థితి ఏమిటి..? అంటే 20 రోజుల తిండి కోసం అధిక ధరలు చెల్లించి మార్కెట్‌లో కొనక తప్పదు. దీనివల్ల ప్రజలపై విపరీతమైన ధరల భారం పడి సామాన్యుడు కుదేలవుతున్నాడు. అంతేకాక మన బియ్యం పేరుతో మనిషికి నెలకు 4 కేజీల చొప్పున ఇస్తున్న బియ్యంతోనే నెలంతా తినగలడా..? అంటే అరకొరగా ఇస్తున్న సరుకులతో నెలంతా బ్రతకటం సాధ్యంకాదు. అయినా పాలకులు అమ్మహస్తంతో గోరంత చేస్తూ కొండంత చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. పథకాన్ని సక్రమంగా అమలుచేస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ చాలా చోట్ల 4-6 రకాలను మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. నాసిరకం, ఎంతో కాలంగా నిల్వ ఉండి పురుగులు పట్టి పాడైపోయిన వాటిని ఇచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యత లోపించిన సరుకులను అంటగడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల చైతన్యనగర్‌కు చెందిన సత్యమ్మకు అమ్మహస్తం సరుకుల్లో చనిపోయి మురుగుడు వాసన వస్తున్న పిచ్చుక వచ్చిందంటే ఈ పథకం ఎలా అమలవుతోందో అర్థమవుతుంది. అప్పులు చేసి మరీ డి.డిలు కట్టిన రేషన్‌ షాప్‌ డీలర్లకు తొమ్మిది రకాలు ఇవ్వకపోవటంతో ఇక్కట్లకు గురవుతున్నారు.
ధరల భారానికి కారణం ఎవరు..?
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఒక కథ అతికినట్లు సరిపోతుంది. మన జేబుకొట్టి మనకే అందులోంచి కొంత సాయం చేసినట్లుంది ప్రభుత్వం తీరు. ప్రపంచబ్యాంకు దర్శకత్వంలో పరిపాలన చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చుతూ ప్రజలపై భారాలు మోపుతోంది. దేశంలోని వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసి విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు. అడ్డూ అదుపూ లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ధరలు పెంచేది, పెరుగుతున్నాయని బాధపడేదీ ప్రభుత్వమే. మార్కెట్‌ శక్తులకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్న పాలకులు ధరలు తగ్గించకుండా ప్రజలకు తాత్కాలికంగా తాయిలాలు ప్రకటిస్తూ పథకాలను వెదజల్లుతున్నారు. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే అమ్మహస్తంలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే పాలకుల పాచికలకు లొంగకుండా ఎదురుతిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. 
-పిట్టల రవి
  
Prajashakti Telugu News Paper Dated : 30/5/2013 

No comments:

Post a Comment