Friday, April 26, 2013

చిరస్మరణీయ 'చర్మకారుడు' (శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ)--డాక్టర్ కె. నారాయణ





ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ చరిత్ర చదివితే ఒళ్ళు పులకరిస్తుంది. అదే సందర్భంలో ముగింపులో కన్నీళ్ళు తెప్పిస్తుంది. జీవిత చరిత్ర చదివాక జ్ఞాపకాలు మిగిలే ఉంటాయి. ఈ పుస్తకం విడుదల కాక ముందే పరుచూరి నరేంద్ర నాకిచ్చారు. అప్పుడే దీన్ని పూర్తిగా చదివినా నా అభిప్రాయాలను రాయడంలో నాకు తీరిక లేకపోయింది. నాయుడమ్మ సామాన్య రైతుకుటుంబం నుంచి వచ్చినవారే. బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి కెమిస్ట్రీ డిగ్రీ పూర్తి చేశారు. ఈ సందర్భంలో నేను గమనించింది ఆయన అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం పెంచుకున్నారు. ఆనాడు బెనారస్ యూ నివర్సిటీలో చదువుతూ అనేక మంది, కమ్యూనిస్టుల ప్రభావానికి ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యం నుంచి నాయుడమ్మ జీవితం పరిశీలిస్తే వారు ఎంపిక చేసుకున్న రంగం, దానికి అంకితమైన తీరు అర్థమవుతు ంది. డిగ్రీ పూర్తిచేసినా ఆ చదువుకు అనుకూల ఉద్యోగాలు లేనందున మద్రాస్‌లో 'లా' చేయడానికి తం డ్రి ప్రోద్బలంతో వెళ్లినా వారికా చదువు ఇష్టం లేదు.

మద్రాసులో ప్రొఫెసర్ కాట్రగడ్డ శేషాచలం చౌదరితో నాయుడమ్మకు పరిచయం కలిగింది. శేషాచలం చౌదరి అప్పటికే లెదర్ టెక్నాలజీ డైరెక్టర్. వారి పోత్స్రాహంతో నాయుడమ్మ 17 రూపాయల నెల జీతానికి కెమిస్ట్రీ డిమాన్‌స్ట్రేటర్‌గా చేరారు. 'మీరెందుకు ఈ రంగంలో పనిచేయదలుచుకున్నారనే' ప్రశ్న నాయుడమ్మకు ఎదురైంది. దానికి ఆయన సమాధానం వారి అంకిత భావానికి అద్దం పడుతుంది. 'పేదవాళ్ళ కన్నా మరింత పేదవాళ్ళు, అందులోనూ దళితులు సైతం వెలివేసిన 'మాదిగ' వర్గం చర్మకారులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. వారి జీవనోపాధితో పాటు సాంకేతికంగా అభివృద్ధి కావడానికి ఈ రంగం ఉపయోగపడుతుంది' అని సమాధానం. గ్రామాల్లో, పట్టణాల్లో చర్మకారుల బాధలు వర్ణనాతీతం. 

ఆ రంగంలో మమేకమై పనిచేయడం వలన తమిళనాడు గవర్నర్ లాంటి వారే ఒక రోజు ఫోన్‌చేసి 'మీదే కులం?' అని అడిగారు. దానికి నాయుడమ్మ సమాధానం 'నేను ఏ రంగంలో పనిచేస్తున్నానో అదే మా కులం' అని సమాధానం చెప్పారు. మూడురోజుల తర్వాత గవర్నర్ మరలా నాయుడమ్మకు ఫోన్‌చేసి కులం అడిగినందుకు క్షమించమని కోరారు. నాయుడమ్మ దృఢ దీక్ష ఆయన మనస్సాక్షికి అద్దం. వారిని ప్రశ్న అడిగిన వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారు. అయినా తొణకకుండా నిర్భయంగా సమాధానమిచ్చారు. వారణాసిలో చదివేటప్పుడు కమ్యూనిస్టుల కార్యక్రమాల్లో పాల్గొని ప్రభావితమైన నేపథ్యమే సమాజంలో అత్యంత క్రింది స్థాయిలో ఉన్న వర్గానికి ఆధునిక సాంకేతిక నిపుణత్వాన్ని తీసుకు వెళ్ళాలని నాయుడమ్మ దృఢంగా నిర్ణయించుకునేందుకు దారితీసింది.

నాయుడమ్మ, క్రమశిక్షణకు అద్దంలా నిలబడ్డారు. డ్యూటీలో ఉన్నప్పుడు, డ్యూటీలో లేనప్పుడు వారి ప్రవర్తనకు ఎంతో తేడా ఉంది. అంటే ఒక మూసలో గాకుండా సంపూర్ణత్వంతో వారి జీవితం గడిచింది. ఆ క్రమశిక్షణే వారి సేవలను పైకి తీసుకొచ్చింది. వారి జీవన విధానం ఎల్లలు దాటి మిత్రులను, అభిమానులను సంపాదించింది. చివరికి కెనడాలో జరిగిన ఐఆర్‌డీసీ బోర్డు మీటింగ్‌కు హాజరై తిరుగు ప్రయాణంలో విమాన ప్రమాదంలో మరణించినా ఆయన చివరి సమావేశంలో పాల్గొన్న హాలును 'నాయుడమ్మ హాల్'గా నామకరణంచేసి వారి జ్ఞాపకాలను శాశ్వతం చేశారు. (ఐఆర్‌డీసీ, 14వ అంతస్తు, 250 ఆల్బ్‌ర్ట్ స్ట్రీట్, ఒట్టానా) నాయుడమ్మ సేవలు జాతీయస్థాయిలో గుర్తించబడ్డాయి.

ఫలితంగా ఇందిరాగాంధీ కూడా ఢిల్లీకి వచ్చి బాధ్యతలు తీసుకొమ్మని కబురు పంపింది. కబురందగానే ఎగిరిగంతేయలేదు. 'నా కండిషన్లు ఆమోదిస్తే వస్తానని' షరతులు విధించిన ఆత్మాభిమాని నాయుడమ్మ. సి. సుబ్రమణ్యం గారిని ఇందిరాగాంధీ అడిగారట 'ఈయన నాకే షరతులు విధిస్తున్నారేంటి?' అని. వారికా అర్హత ఉందని సుబ్రమణ్యం సమాధానం చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన జేఎన్‌యూకు వైస్ ఛాన్సలర్‌గా నియమితులయినా 16 నెలలకే నాయుడమ్మ ఆ పదవి నుంచి వైదొలిగారు. కారణం వారనుకున్న సంస్కరణలు తేలేకపోయారు. నాటుకుపోయిన బ్యూరోక్రసీ ముందు రాజీపడలేక ఆత్మవంచనతో విధి నిర్వహించలేక మద్రాసుకు తిరుగు ప్రయాణం సాగించారు. నాయుడమ్మ చొరవతోనే అన్ని పాలిటెక్నిక్ కళాశాలలో లెదర్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభించారు. అనేక ఆధునిక పరిశ్రమలు వెలసి చివరికి ఫ్యాషన్ షోలు కూడా నిర్వహించే స్థాయికి చేర్చారు.

'నోటి వాక్కు ఫలించిందని' పెద్దల సామెత. అది అక్షరాల నాయుడమ్మకు వర్తిస్తుంది. వచ్చిన ఆదాయం ఖర్చు పెట్టేస్తున్నావు చివరికి నీ శవ దహనానికి కూడా నేనే చూసుకోవాలని వారి మిత్రుడు ఆప్యాయంగా హెచ్చరించిన సందర్భంలో యాదృచ్ఛికంగానే 'ఆ అవకాశం మీకివ్వనులే' అని సమాధానం చెప్పారు. యాదృచ్ఛిక సమాధానమే నిజమని తెలిసి హృదయం ద్రవించింది. చివరికి వారి మృత దేహం దహన సంస్కారానికి కూడా దొరకలేదు. ఏమయితేనేమి వారి పార్థివ దేహం ప్రతి అణువు జల జంతువులకు ఆహారంగా ఉపయోగపడటమంటే అంతకంటే మించిన జన్మ సార్థకత ఇంకేముంటుంది? నాయుడమ్మ ధన్య జీవి. వారి కృషిని మనముందు కండ్లకు కట్టినట్టు పుస్తకరూపంలో రూపొందించిన శిల్పి చంద్రహాస్‌కు ధన్యవాదాలు.

- డాక్టర్ కె. నారాయణ
కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సమితి

Andhra Jyothi Telugu News Paper Dated : 27/4/2013

No comments:

Post a Comment