Wednesday, March 20, 2013

ఆత్మహత్యలు కావు.. హత్యలే! - అంబాల దేవేందర్



ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల పట్ల క్రూరంగా వివక్షాపూరితంగా వ్యవహరించే విద్యాసంస్థలకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకూడదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఆత్మహత్యలను హత్యలుగా పరిగణించి యూనివర్సిటీ అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి సీబీఐ విచారణ జరిపించాలి. 

భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలంటే కుల వ్యవస్థ ధ్వంసం కావాలి. ఇందుకు విద్యను కింది కులాలకు అందించాలని డాక్టర్ అంబేద్కర్ సూచించారు. మహాత్మా గాంధీతో పోరాడి, కిందికులాల వారికి విద్యాహక్కును కమ్యూనల్ అవార్డు ద్వారా అంబేద్కర్ సాధించారు. ఆ తర్వాత విద్యను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఆయన పొందుపరిచారు. రాజ్యాంగ హక్కులను తొలగించే అధికారం పార్లమెంటుకు కూడా లేదని ఆర్టికల్ 13 చెబుతుంది. అందుకే, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను యూనివర్సిటీల్లో అగ్ర కులాలవారు కాలరాస్తున్నారు. అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ విద్యార్థుల రాజ్యాంగ హక్కులను దూరం చేసే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిస్సహాయ స్థితిలో బహుజన విద్యార్థులు ఊపిరి తీసుకుంటున్నారు. వీటిని యూనివర్సిటీ యాజమాన్యాలు ఆత్మహత్యలంటున్నాయి. కానీ అవి మనువాదులు చేస్తున్న హత్యలు.

ఇటీవల 'ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనిర్సిటీ' (ఇఫ్లూ)లో ముదస్సిర్ కమ్రాన్ మల్లా హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు. ముదస్సిర్ కమ్రాన్ మల్లా కాశ్మీరీ ముస్లిం. పీహెచ్‌డీ పరిశోధన కోసం ఇఫ్లూలో చేరాడు. ఈ నెల 19న హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పుల్యాల రాజు అనే విద్యార్థి సాయంత్రం వేళ తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్యాల రాజు నిరుపేద మాదిగ కుటుంబం నుంచి వచ్చాడు. ఓపెన్ క్యాస్టింగ్ వల్ల బొందలగడ్డగా మారిన భూపాలపల్లి నుంచి, ఉన్నత చదువుల కోసం ఆ కుటుంబం నుంచి వచ్చిన తొలి వ్యక్తి కూడా పుల్యాలరాజే కావడం విషాదం. ఈ ఇద్దరూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ క్రూరత్వానికి బలైపోయారు. ఈ రెండు సంఘటనల కన్నా ముందు ఇఫ్లూ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎంతో మంది చనిపోయారు. హైదరాబాదు వర్సిటీలో తమిళనాడుకు చెందిన ఎరుకల కులస్తుడు సెంథిల్ కుమార్ ఇదేరకంగా హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 

కెమిస్ట్రీ శాఖలో పీహెచ్‌డీ కోసం సెంథిల్ మెరిట్ ప్రాతిపదికన చేరాడు. మూడు వేల సంవత్సరాల్లో సెంథిల్ కుమార్ పూర్వీకులెవ్వరూ చదువుకోలేదు. ఆ కుటుంబం నుంచి ఉన్నత చదువుల కోసం వచ్చిన తొలి వ్యక్తి అతడే. పీహెచ్‌డీలో చేరిన మూడేళ్ల తరువాత కూడా తనకు రీసెర్చ్ సూపర్ వైజర్‌ను కేటాయించలేదు. పైగా ఆ మూడు సంవత్సరాలు క్రాష్ కోర్సు పేరుతో పీజీ విద్యార్థులతో పాటు సమానంగా క్లాసుల్లో కూర్చోబెట్టారు. వరుసగా మూడేళ్లు సెంథిల్‌ను ఫెయిల్ చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కెమెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో పట్టించుకున్న వాళ్లు లేరు. సైన్స్ డిపార్ట్ మెంట్‌లన్నీ ఒకేచోట ఉండే సైన్స్ కాంప్లెక్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం విద్యార్థులకు మృత్యుకూపం. ఎన్నో సైన్సు డిపార్ట్‌మెంట్లలో ఎస్సీ, ఎస్టీ టీచింగ్ పోస్టులు నేటికీ భర్తీచేయలేదు. 

తగిన అభ్యర్థులు లేరనే సాకుతో వాటిని ఖాళీగా ఉంచడమో లేదా ఐదుసార్లు నోటిఫై చేసి ఆరోసారి నోటిఫికేషన్‌లో జనరల్ క్యాటగిరీ కిందికి మార్చటమో చేస్తున్నారు. అన్ని శాఖల్లోని ప్రొఫెసర్లలో ఒకే ఒక్క అగ్రకులానిదే ఆధిక్యం. నైతికస్థైర్యాన్నిచ్చే వాళ్లు కూడా లేకపోవడంతో సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెంథిల్ చనిపోయిన ఏడాదికే గొల్ల కుర్మ కులస్తుడు బాలరాజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అత్యంత వెనుకబడిన రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలరాజు హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో పీహెచ్‌డీ కోసం చేరాడు. విభాగం పెద్దల వేధింపులకు తాళలేక తనకు తాను చంపుకున్నాడు. వేల సంవత్సరాల బాలరాజు కుటుంబ చరిత్రలో అతనొక్కడే విద్యావంతుడు. ఇక ముదస్సిర్ కమ్రాన్ మల్లా స్నేహితుడితో గొడవ పడ్డాడనే నెపంతో ఉస్మానియా పోలీసులకు ఇఫ్లూ ప్రొక్టార్ విజ్రా అప్పగించాడు. పోలీసులు ముదస్సిర్ కమ్రాన్‌ను రోజంతా స్టేషన్‌లో ఉంచుకున్నారు. గౌరవప్రదమైన, మర్యాదకరమైన పద్ధతుల్లో విద్యార్థులతో వ్యవహరించాల్సిన ప్రోక్టార్ ముదస్సిర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, పోలీసు కౌన్సిలింగ్ పేరుతో అవమానించాడని, అందుకే ముదస్సిర్ ఆత్మహత్య చేసుకున్నాడని బహుజన్ ఇంటలెక్చవల్స్ కలెక్టివ్ నిజనిర్థారణలోనూ తేలింది.

పుల్యాల రాజు హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఎం.ఏ.లో భాషాశాస్త్రం చదువుతున్న ఫైనలియర్ విద్యార్థి. ఓ అగ్రవర్ణం వారు మాత్రమే అధ్యాపకులుగా ఉండే ఈ శాఖలో పుల్యాలరాజు అనేక మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. కొన్ని సెమిస్టర్లలో అతన్ని ఫెయిల్ కూడా చేశారు. సప్లిమెంటరీ ఫలితాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని లాస్ట్ డేట్‌కు ఒక్కరోజు ముందు వాటిని తెలియజేస్తుంది. సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు తగినంత సమయం కూడా ఇవ్వకపోవటంతో పుల్యాల రాజు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఫేస్‌బుక్‌లో తన చివరి సందేశం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం విద్యార్థులు మాత్రమే ఎందుకు మరణిస్తున్నారు? అగ్రకుల విద్యార్థులెందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? బహుజన విద్యార్థులు మాత్రమే డిప్రెషన్‌లోకి వెళ్లి మతిస్థిమితం కోల్పోవటం వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిందే. 2004లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్ వంటి విశ్వవిద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 27.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లు ప్రవేశపెట్టింది. మనువాద సంస్థలతో పాటు ఓ అగ్రవర్ణం అధ్యాపకులు బీసీ రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు ఉద్యమం నడిపారు. ఆ సందర్భంగా ఒక విచిత్రమైన వాదనను లేవనెత్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది ఆ వాదన. ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్‌ల్లో ఎస్సీ, ఎస్టీ సీట్లలో సగం మాత్రమే భర్తీ అవుతున్నాయనీ మిగతా సగం ఖాళీగా ఉంటున్నాయని అన్నారు. రకరకాల కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీల్లో సగం మంది కోర్సులు చదివే శక్తి లేక మధ్యలోనే వదిలేస్తున్నారనీ, అలా వదిలేయని వాళ్లలో సగం మంది ఫెయిల్ అవుతున్నారనీ, పాస్ అవుతున్న వాళ్లు అత్తెసరు మార్కులతో బయటపడుతున్నారని అన్నారు. ఇలా ప్రమాణాలు పడిపోవటమే కాకుండా నిరుపయోగంగా మారిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసేయమని అడుగుతుంటే కొత్తగా బీసీ రిజర్వేషన్ అంటారేంటని అగ్రకులాల వాదన.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బహుజన విద్యార్థులను రక్షించాలంటే జాతీయ విధానం రూపొందించాలి. ముందుగా పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల బలవన్మరణాల గురించి నిజాయితీతో కూడిన చర్చ జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టాలి. అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్ వంటి అత్యున్నత విద్యాసంస్థలను ప్రజాస్వామీకరించాలి. కేవలం ఒకటి, రెండు కులాలు మాత్రమే అధ్యాపక రంగాన్ని నియంత్రించటం అప్రజాస్వామికం. ఓబీసీ, ముస్లిం, మైనార్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వ్యవస్థను ప్రజాస్వామీకరించాలి.

అమ్మాయిల మీద లైంగిక వేధింపులను నివారించే కమిటీలు ఏర్పాటు చేసినట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలకు విడివిడిగా గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అవి అడ్మినిస్ట్రేషన్ కబంధ హస్తాల్లో బందీ కాకుండా ఉండాలి. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలుగా వాటిని ఏర్పాటు చేయాలి. విచారించే, శిక్షలు విధించే అధికారం ఉండాలి. వేధింపులకు పాల్పడ్డ అధ్యాపకుడు, అధికారి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలి. శాశ్వతంగా ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల పట్ల క్రూరంగా వివక్షాపూరితంగా వ్యవహరించే విద్యాసంస్థలకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకూడదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఆత్మహత్యలను హత్యలుగా పరిగణించి యూనివర్సిటీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అత్యున్నత సీబీఐ అధికారులతో విచారణ జరిపించాలి. విద్యార్థి సంఘాలను రకరకాల పద్ధతుల్లో నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ విద్యాసంస్థల్లో కనిపిస్తుంది. విద్యార్థి సంఘాలకు స్వేచ్ఛ ఉండాలి. అంబేద్కర్ భావజాలం పునాదులుగా వాటిని నిర్మించాలి. అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం దొరుకుతుంది.

- అంబాల దేవేందర్
బహుజన ఇంటలెక్చువల్స్ కలెక్టివ్

Andhra Jyothi Telugu News Paper Dated : 21/3/2013

No comments:

Post a Comment