Sunday, May 12, 2013

దళిత సమస్యల్లో కార్యాచరణకే ప్రాధాన్యత ---తమ్మినేని వీరభద్రం


  Sun, 12 May 2013, IST  

దళితుల విషయంలో ఈ చట్టంగానీ, రిజర్వేషన్లుగానీ కొన్ని సౌకర్యాలో, కొద్ది సంపదలో ఇవ్వచ్చేమోగానీ మూల సమస్య మాత్రం పరిష్కారం కాదు. సాటి పౌరులందరితో సమానత్వం సాధించటం, ఆత్మగౌరవంతో జీవించటం అనేది అతిముఖ్య విషయం. ఇందుకు కులవివక్షను, కులాన్ని నిర్మూలించే ఉద్యమాలూ, కార్యక్రమాలూ, కృషీ ఎంత ఎక్కువగా సాగించగలిగితే అంత వేగంగా లక్ష్యానికి దగ్గరవుతాము. మన రాష్ట్రంలో ఆ ఉద్యమాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా, ఉధృతంగా జరగటం లేదు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఇంకా కొన్ని లొసుగులూ, లోపాలూ ఉన్నా మొత్తంగా చూస్తే ఇది అందరూ హర్షించాల్సిన, ఆహ్వానించాల్సిన శాసనం. ఎన్నో ఏళ్ళుగా ఈ చట్టం కోసం రాష్ట్రంలో జరిగిన కృషీ, పోరాటాలూ ఈ విధంగా ఫలించాయని చెప్పవచ్చు.
అయితే ముఖ్యమంత్రి ఈ చట్టం తానే తెచ్చానని (కనీసం కాంగ్రెస్‌ పార్టీ కూడా కాదట), ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయని 'నోటి గద్దరితనం' ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సభలో 'దళిత బంధు' అనే బిరుదు కూడా ఇప్పించుకున్నారు. మన ముఖ్యమంత్రికి దళితులపై అంత ప్రేమ నిజంగానే ఉంటే ఇతర సమస్యలన్నీ అలా ఉంచినా, కనీసం రాష్ట్రంలో ఎస్‌సి కమిషన్‌కు ఏళ్ళ తరబడి ఛైర్మన్‌ లేకుండా ఉంటాడా? దళితుల సమస్యల పరిష్కారానికి కొంతైనా ఉపకరించే అలాంటి ముఖ్యమైన పదవికి ఇన్నేళ్లూ ఎవరినీ ఎందుకని నియమించలేదు? ఈ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ పున్నయ్య తరువాత ఒక కాంగ్రెస్‌వాదిని ఛైర్మన్‌గా నియమించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయటంతో ఏర్పడిన ఖాళీని ఇక ఇంతవరకూ పూరించనే లేదు. పోనీ కావాలనుకుంటే మరో కాంగ్రెస్‌ మనిషినే మళ్లీ నియమించుకోవచ్చు కదా? ఆ మాత్రం సరుకున్న మనిషి కాంగ్రెస్‌లో లేడని ముఖ్యమంత్రి అభిప్రాయమా? తెనాలిలో దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే, లక్ష్మింపేటలో దళితులను ఊచకోత కోస్తే, ఎక్కడి నుంచో జాతీయ కమిషన్‌ వాళ్లు రావాల్సి వచ్చింది కదా? అదే మన కమిషన్‌కు ఛైర్మన్‌ ఉంటే ఇలాంటి ఘటనలపై స్పందించే అవకాశం ఉండేది కాదా? ఈ మాత్రం ఇంగితం లేని మన ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి 'దళిత బంధు' లవుతారా? లేక అలాంటి హక్కులు దళితులకు దక్కటం సహించలేని అగ్రకుల మద్దతుదార్లవుతారా?
ముఖ్యమంత్రి వాచాలత్వం ఎలా ఉన్నా 'మా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చిందనటం వాస్తవమే కదా?' అని ఈ మధ్య ఓ కాంగ్రెస్‌ మిత్రుడు నన్ను ప్రశ్నించారు. ఇలాంటిదే ఒక సందర్భం నేను శాసనసభ్యుడిగా ఉన్నపుడు సభలోనే నాకు ఎదురైంది. ఆరోజు మన రాష్ట్రంలో వచ్చిన వివిధ భూ చట్టాల గురించి నేను సభలో ఉపన్యసిస్తూ.. 'ఈ చట్టాలన్నీ ప్రజా పోరాటాల వల్లే వచ్చాయని' నేనన్న మాటకు కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కుమ్మడిగా అడ్డు తగిలారు. 'కాదు, కాదు.. ఈ చట్టాలన్నీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే తెచ్చాయి' అన్నారు. అపుడు నేనడిగాను ... మరి మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందెవరు? .. అని. కాంగ్రెస్‌ బల్లల వైపు నుంచి 'మా కాంగ్రెస్సే కదా' అని సమాధానం వచ్చింది. అపుడు నేనేమన్నానంటే .. 'అదెలా కుదురుతుంది? కాంగ్రెస్సో, కమ్యూనిస్టులో.. గాంధీయో, ఒక సుందరయ్యో, అల్లూరి సీతారామరాజో, భగత్‌ సింగో వీళ్లంతా స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లు తప్ప ఇచ్చిన వాళ్లు కాదు గదా? స్వాతంత్య్రం ఇచ్చిన వాళ్లంటే .. మరి మీ లెక్క ప్రకారం బ్రిటిష్‌వాళ్లు అవుతారు గదా? అలా కాదంటే 'స్వాతంత్య్రం రావటానికి పోరాడిన వాళ్లే కారణంగా ఎలా అయితే చెబుతామో, అలాగే భూ చట్టాల కోసం జరిగిన పోరాటాలే ఆ చట్టాలు రావటానికి కారణం అని చెప్పటం సరైంది కాదా?' అని ప్రశ్నించే సరికి కాంగ్రెస్‌ పెద్దలందరికీ నోళ్లుమూతబడిపోయాయి. ఎక్కడివాళ్లు అక్కడ కూర్చుండిపోయారు. అందువల్ల ఎవరు ఎన్ని వాదాలు చేసినా, వాక్చాతుర్యాలు ప్రదర్శించినా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం కోసం అనేక సంవత్సరాలుగా సిపియం, ఇతర వామపక్షాలు, దళిత సంఘాలు, ఇతర ప్రజాస్వామికవాదులు సాగించిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ ప్రదర్శించిన వాడిగా సిపియం కార్యదర్శి రాఘవులును అనేక మంది ప్రముఖులు ప్రశంసిస్తుంటారు కూడా. ఈ పోరాటాలకు విశాలమైన మద్దతు కూడా లభించిన మాట కూడా నిజం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వివిధ సందర్భాలలో తమ సంఘీభావం (ఇలాంటి చట్టం వారికి ఇష్టమున్నా, లేకపోయినా) ప్రకటించాయి. అలాగే చివరి రోజులలో కాంగ్రెస్‌లోనే ఉన్న దళిత మంత్రులంతా - ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ ప్రభృతులు కూడా ఈ ఉద్యమ డిమాండ్‌ పట్ల సానుకూలత ప్రదర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈ ఒత్తిడి అంతా పనిచేసిన మాట వాస్తవం. ఆ విధంగా ఈ చట్ట సాధనలో అనేక మంది తమ, తమ పాత్రలు పోషించారనే చెప్పాలి.
అలాగే ఈ చట్టానికి పాత చరిత్ర కూడా జోడించాల్సి ఉంటుంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉండగా కుల వివక్ష రాష్ట్రంలో ఏ మోతాదులో ఉందో కెవిపియస్‌ రాష్ట్రమంతా సర్వే చేసింది. ఎన్నెన్ని వికృత రూపాలలో ఇంకా వివక్ష సాగుతోందో సోదాహరణంగా నిరూపించింది. మరింత లోతైన అధ్యయనం కోసం కమిషన్‌ వేయాలని ప్రభుత్వంపై అనేక రూపాల్లో ఒత్తిడి చేసిన ఫలితంగా 'పున్నయ్య కమిషన్‌' ఏర్పడింది. ఆయన అపార కృషితో వివక్ష విరాట్‌ స్వరూపం వెలుగులోకొచ్చింది. ఆ తర్వాత మరిన్ని పోరాటాలతో కమిషన్‌ ఏర్పడి ఆ పున్నయ్యగారే ఛైర్మన్‌గా నియమించబడ్డారు. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయింపు జరపాలనే నిబంధనను అమలు జరపకపోవటంపై ఉద్యమం కేంద్రీకరించబడింది. ఆ నిధులు రకరకాలుగా ఎలా దుర్వినియోగం జరిగాయో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు బదులుగా ఆ నిధుల ఖర్చు అనివార్యం చేసే విధంగా చట్టం కావాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఈ చట్ట సాధనకు అన్ని జిల్లాలలోనూ, రాష్ట్ర రాజధానిలోనూ ఎన్నో పోరాటాలు కెవిపియస్‌, సిపియం, వామపక్షాల ఆధ్వర్యంలో దళిత సంఘాల సహకారంతో జరిగాయి. అన్ని సంఘాల ఐక్య కార్యాచరణకు కాకి మాధవరావు లాంటి ప్రముఖుడు నాయకత్వం వహించారు. ఈ పోరాటంలో భాగంగానే ఖమ్మం జిల్లాలో 76 రోజుల 'దళితవాడల సైకిల్‌ యాత్ర' జరిపాము. ఆ యాత్రను మాధవరావుగారే సైకిలు తొక్కి ప్రారంభించారు. నేడు ఈ చరిత్రంతా చెరిపేసి పుణ్యం అంతా తమ ఖాతాలోనే వేసుకోవాలని ఎవరు అనుకున్నా అది వృథా ప్రయాసే అవుతుంది. అందువల్ల ఈ చట్టానికి తల్లెవరు? తండ్రెవరు? అనే పంచాయితీ కంటే దాని ఆలనా, పాలనా చూడటానికి ప్రభుత్వ పెద్దలు శ్రద్ధ చూపితే బావుంటుంది. అంటే ఆ చట్టం అమలులో తమ చిత్తశుద్ధిని చూపిస్తే బావుంటుంది.
ఇక 'ఇల్లు అలకగానే పండుగ కాద'న్నట్లు ఈ చట్టం రాగానే బడ్జెట్లలో కేటాయింపులన్నీ సక్రమంగానే జరిగిపోతాయని, ఆ నిధుల ఖర్చుతో ఇక దళిత పేటలు వెలిగిపోతాయనీ ఎవరైనా అనుకుంటే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అంటరానితనం నేరం అనే చట్టం వచ్చి చాలా ఏళ్లయింది. అయినా ఇప్పటికీ ఆ దురాచారం విస్తృత ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం, వరకట్న నిషేధం లాంటి చట్టాలున్నప్పటికీ వాటి అమలు ఎలా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఇలాంటివే ఇంకెన్నో చట్టాలు అమలుకు నోచుకోవటం లేదు. అందువల్ల పాలక వర్గాలు తమ ఇష్టపూర్తిగా, తమ లాభాల కోసం తెచ్చే చట్టాలను అమలు జరిపినంత వేగంగా, నమ్మకంగా ఇలాంటి చట్టాలను (ప్రజల ఒత్తిడి వల్ల తప్పనిసరై తెచ్చినవి) అమలు జరపవనేది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. అందువల్ల సబ్‌ప్లాన్‌ చట్టం సాధించటానికి పోరాడిన శక్తులన్నీ దాని అమలు కోసం కూడా నిరంతరం శ్రమించాల్సి ఉంటుందనటంలో ఎలాంటి సందేహానికీ ఆస్కారం లేదు.
అలాగే ఈ చట్టంగానీ, రిజర్వేషన్లుగానీ దళితుల విషయంలో కొన్ని సౌకర్యాలో, కొద్ది సంపదలో ఇవ్వచ్చేమోగానీ మూల సమస్య మాత్రం పరిష్కారం కాదు. సాటి పౌరులందరితో సమానత్వం సాధించటం, ఆత్మగౌరవంతో జీవించటం అనేది అతిముఖ్య విషయం. ఇందుకు కులవివక్షను, కులాన్ని నిర్మూలించే ఉద్యమాలూ, కార్యక్రమాలూ, కృషీ ఎంత ఎక్కువగా సాగించగలిగితే అంత వేగంగా లక్ష్యానికి దగ్గరవుతాము. మన రాష్ట్రంలో ఆ ఉద్యమాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా, ఉధృతంగా జరగటం లేదు. అందుకు బహుశా మూడు కారణాలున్నాయనిపిస్తోంది.
మొదటిదేమంటే అంటరానితనమూ, కులవివక్షా కేవలం దళితులు బాధపడే సమస్యగానూ, దాని పరిష్కారం అంటే వారిని ఉద్ధరించటం కోసం మాత్రమే అన్నట్లుగా చూడబడుతోంది. అలా చూడటం ఈ సమస్యలో ఒక పరిమిత కోణం మాత్రమే అవుతుంది. అంటరానితనం, కులవివక్ష పోవాలనటం దళితుల కోసం మాత్రమే కాదు. వారిపై జాలితోనో, మానవత్వంతోనో మాత్రమే కాదు. ఈ సమస్యను అలా పరిమితం చేయటం సరైంది కూడా కాదు. ఈ సమస్య మన దేశ నాగరికతకు, ఆధునికతకు సంబంధించిన విషయంగా కూడా చూడాలి. మనం నాగరిక దేశంగా ప్రపంచం ముందు నిలవాలంటే, అంతకంటే మించి మన ఉత్పత్తిలో అగ్రదేశాల సరసకు చేరాలంటే మన పౌరులందరూ సమాన గౌరవం పొందగలగాలి. ముఖ్యంగా 'శ్రమ' గౌరవించబడాలి. ఉత్పత్తిదారులైన శ్రామికులు ఆ స్థితి నుంచి స్ఫూర్తిని పొందాలి. మన దేశ శ్రామికులలో అత్యధికులైన దళితులను అంటరాని వారుగా, తక్కువ కులం వారుగా హీనంగా చూసినంత కాలం, శ్రమ అంటే బ్రతుకు తెరువు కోసం చేసే నీచమైన పనిగా భావించినంత కాలం మన దేశం ఆ స్థానాన్ని పొందటం అసాధ్యమే కాదు, అసంభవం కూడా. అందువల్ల ఈ సమస్య దళితుల సమస్య మాత్రమే కానే కాదు. కొందరు దళిత నాయకులు భావిస్తున్నట్లుగా దళితుల సమస్యలపై దళితులే పోరాడాలి అనుకోవటం కూడా ఎలా తప్పో ఈ అవగాహనలోంచి మనం చూడాలి. అందువల్ల ఈ సమస్య దేశాభివృద్ధికి సంబంధించిన ముఖ్య సమస్యగా మనం గ్రహించాల్సి ఉంటుంది.
రెండవదేమంటే ఈ సమస్య ప్రాధాన్యత గుర్తించిన వారు కూడా 'పండిత' చర్చలకు పరిమితం కావటం, ఆచరణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఒక ముఖ్య ఆటంకంగా మారింది. అలా కాకుండా 'ఆచరణ'కు ప్రాధాన్యత ఇవ్వటం నేటి అవసరంగా ఉంది. అంటరానితనం, కులవివక్ష, కుల నిర్మూలన సమస్య వచ్చేప్పటికి కులం ముఖ్యమైందా? వర్గం ముఖ్యమైందా? దేనిపై ముందు పోరాడాలి? కులం మూలం ఎక్కడుంది? మతంలో ఉందా లేక ఇంకెక్కడైనా ఉందా? మతం పోకుండా కులం పోతుందా? ఏది మూలం? ఈ సమస్యలపై ఎవరేం చెప్పారు? కులం పోకుండా వివక్షత పోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటిపైనా ఏళ్ళ తరబడి చర్చలు, వాదవివాదాలు సాగుతూ వస్తున్నాయి. ఈ చర్చ సాగించటంలో తప్పేమీ లేదు. పైగా ఇలాంటి చర్చ కూడా సమస్యలపై సరైన అవగాహన కోసం తప్పకుండా అవసరమే. అయితే చర్చోపచర్చలకే పరిమితం కావటం, ఆచరణకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ప్రధాన లోపంగా ఉంది. ఏది ముందైనా, వెనకైనా ఆ చర్చల మంచిచెడుల సంగతెలా ఉన్నా, అంటరానితనం, కులవివక్ష యొక్క వివిధ దుష్ట రూపాలు తక్షణం ఎదిరించి పోరాడాల్సిన ఆచరణాత్మక సమస్యలుగా ఉన్నాయనే దాంట్లో ఎవరికీ సందేహం ఉండనక్కర్లేదు. అయినపుడు ఆ సమస్యలపైనే ఉమ్మడిగా కార్యక్రమాలు, కార్యాచరణలు, పోరాటాలు సాగించటానికి ఇబ్బందేమి ఉంటుంది? ఇది ఈ ఉద్యమ శ్రేయోభిలాషులందరూ తప్పకుండా తక్షణమే దృష్టి పెట్టాల్సిన అంశం కాదా?
ఇక మూడో విషయమేమంటే ఈ సమస్యలపై అంతో, ఇంతో ఆచరణ సాగిస్తున్న దళిత సంఘాలూ, కమ్యూనిస్టులూ పరస్పరం అనుమానంతో చూసుకోవటం, విమర్శించుకోవటం జరుగుతోంది. కమ్యూనిస్టులు కొన్ని కార్యక్రమాలు చేస్తే కూడా 'వీరికి ఇపుడు గుర్తొచ్చాయా? ఇప్పటిదాకా ఏం చేశారు. ఇపుడైనా దేనికోసం చేస్తున్నారు? లాంటి విమర్శలు కూడా కొన్ని ముందుకు రావటం మనం చూస్తున్నాం. దళితులను అస్తమానం వేధించే శక్తుల గురించి పల్లెత్తు మాట అనకుండా కమ్యూనిస్టులు ఇంకా సరిగా ఎందుకు చేయలేదు? అనే లాంటి విమర్శలు ఎవరికి మేలు చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల దళితులు, గిరిజనుల కోసం మరింత చురుకైన కార్యాచరణ కార్యరూపం దాల్చాలంటే ఈ సంఘాల మధ్య, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత సయోధ్య అవసరం. రాజకీయ విషయాల్లో, ఇంకా ఇతర కొన్ని సమస్యలు, డిమాండ్ల విషయాలలో వీరి మధ్య సఖ్యత అప్పుడే సాధ్యమైనా, కాకపోయినా అంగీకరించిన సమస్యల్లోనయినా ముఖ్యంగా దళితుల ఆత్మగౌరవ సమస్యగానూ, మన దేశ అభ్యున్నతికి ఆటంకంగా తయారైన పరమ జాఢ్యంగానూ పరిణమించిన కుల సమస్యపై, వివక్షతా సమస్యలపై ఐక్యంగా ఉద్యమించటానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఈ ఐక్యత సాధించగలిగితే వివిధ సమస్యలపై పాలకుల మెడలు వంచగలిగే శక్తి పెరుగుతుంది. ఇందువల్ల రాష్ట్రంలో శ్రామికుల ఉద్యమంలో ముఖ్యమైన మలుపు సంభవిస్తుంది. అణగారిన బతుకుల్లో కాంతిరేఖ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇందుకు సత్వరమే చొరవ చూపబడుతుందని ఆశిద్దాం. 
-తమ్మినేని వీరభద్రం
  

Prajashakti Telugu News Paper Dated : 12/5/2013

No comments:

Post a Comment