Thursday, January 10, 2013

దళితుల సామాజిక బహిస్కరణ ---పి.జితేందర్‌



  • అంతిమ సంస్కారానికి సహకరించలేదని...
  • ధిక్కరిస్తే జరిమానా, చెప్పుదెబ్బలు
  • పసి పిల్లలకు సైతం పాలు పోయొద్దని తీర్మానం
సామాజికంగా కలిసి ఉండాల్సిన మనుషులు కుల వివక్ష చూపుతూ సాటి మనిషిని దూరంగా ఉచండం సిగ్గు చేటు. నవ నాగరిక సమాజంగా చెప్పుకుంటున్నాం. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా అంటరానితనం వెంటాడుతోంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎన్ని చట్టాలు చేసినా.. అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో తరుచూ ఎస్సీ,ఎస్టీలు అవమా నాలకు గురవుతున్నారు. పెత్తందారులు దాడులు, దౌర్జన్యాలు , సామాజిక బహిస్కరణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో అగ్రకులస్తులు మరణిస్తే అంతిమ సంస్కారాలకు దళితులు రాలేదని సామాజిక బహిష్కరణ చేశారు. గ్రామంలో వారికి సహకరించిన వారికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని, 25 చెప్పుదెబ్బలు కొడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....


అసలేం జరిగిందంటే........
లింగంపల్లి గ్రామంలో 2012 డిసెంబర్‌ 23న ఒకరు సహజంగా మరణించారు. లింగంపల్లి శివారు గ్రామంలో మరోవ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. డప్పులు కొట్టడానికి అగ్ర కులాల వారు దళితులకు సమాచారం అందించారు. కాని డప్పులు కొట్టే వారు తక్కువగా ఉండడం వలన రెండు చావులకు డప్పులు కొట్టలేమని చెప్పారు. మీ పిల్లలున్నారుగా వారితో కొట్టించాలని పెత్తందారులు చెప్పారు. వారు చదువుకుంటున్నారు. డప్పులు కొట్టడం రాదని వివరించారు. మీ కులం వాళ్లే డప్పులు కొట్టాలి. గోతి తవ్వాలి.మరే కులం వాళ్లు ఈ పనులు చేయరు మీకు తప్పదని ఆగ్రహంతో ఊగిపోయారు అగ్ర కుల పెత్తందార్లు. మీరు డప్పులు కొట్టకపోతే, చావు బొందలు తీయకపోతే, కాష్టం కట్టెలు పేర్చకపోతే బాగుండదంటూ హెచ్చరించారు. వారా పని చేయక పోతే ఎవరు కూడా దళితులకు సహరించవద్దని తీర్మానం చివరకు సామాజిక బహిష్కరణ విధించారు.
చిన్నపిల్లలకు వైద్యం చేయలేదు: జంగం యాదమ్మ
లింగంపల్లి గ్రామంలో 9 నెలల చిన్నారి నామనుమరాలు సిరికి జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపి వైద్యుడు మహేష్‌ వైద్యం చేయడానికి నిరాకరించాడు. ఆటో ఎక్కి పక్కగ్రామానికి వెళ్దామంటే ఆటోలలో ఎక్కనివ్వలేదు. ఈ దుస్తితిలో తమ కులం ఉండడం ఏంటి. గ్రామంలో కొందరి కుల పెత్తనం జరుగుతుందని, ఎవరైనా.. ఎదురు తిరిగితే వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. రోజు కూలీ నాలి చేసుకునే వాళ్లం సారు.. మా చిన్నప్పుడే మేము అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మా మనుమలు, మనుమరాళ్లు కూడా ఈ ఇబ్బంది పడొద్దని కోరుకుంటున్నామన్నారు. మా కులం ఏమైనా.. డప్పులు కొట్టాలని, కాష్టం పేర్చాలని, బొంద తోడాలని ఎక్కడనైనా రాసుందా..? సారు అంటూ రోధించారు. మా వయస్సులో ఉన్న వాళ్లం డప్పులు కొడుతాం. ఎందుకంటే మాకు వచ్చిన పని చేయడం తప్పు కాదు కదా . ఒకే రోజు రెండు చావులు జరిగితే డప్పులు కొట్టేవాళ్లం తక్కువగా ఉన్నాం. విషయం చెప్పినా వినకుండా మా పిల్లలను డప్పులు కొట్టమన్నారు. వారు ఇప్పటి వరకు చదువుకున్నారు. వాళ్లకు డప్పులు కొట్టడం రాదు అని చెప్పినా వినకుండా పెత్తందార్లు గ్రామంలో మా కులం వాళ్లకు ఎవరు సహకరించకుండా చేశారు. ఎవరు సాయం చేసినా..జరిమానా వేస్తామని, చెప్పు దెబ్బలు కొడతామని చెప్పడంతో సాయం చేసే వాళ్లు కూడా భయపడి సాయం చేయలేదు. మా గ్రామంలో ఉన్న కుల వివక్ష ఏ గ్రామంలో ఉండకూదన్నారు.
కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు
స్థానికుడు జంగా పోషయ్యతో పాటు మరో 20 మంది కలిసి గ్రామంలోని 16 మంది అగ్రకుల పెత్తందార్లపై కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామంలో కుల వివక్ష చూపిన పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేస్తామని చెప్పారు. గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఫికెటింగ్‌ నిర్వహించారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో జనగామ నుంచి వెళ్లి గ్రామంలో కుల వివక్ష చూపిన వారిపై చర్య తీసుకోవాలని ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు.
కెవిపిఎస్‌ విచారణలో వెల్లడయినా వివక్ష
సంఘటన వెలుగులోకి వచ్చిన నాలుగైదు రోజుల తరువాత గ్రామంలోని అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండేలా తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా జనగామ ఆర్‌డిఓ హరిత గ్రామంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. అయినా.. ఒకరిద్దరు తప్ప స్థానిక గ్రామ ప్రజలు సహపంక్తి భోజనం చేయలేదు. కెవిపిఎస్‌ జనగామ డివిజన్‌ గౌరవాధ్యక్షులు బొట్ల చిన్న శ్రీనివాస్‌ మిద్దెపాక సుధాకర్‌, అంబేద్కర్‌ సంఘం నాయకులు కన్నారపు పరశురాములును వెంట తీసుకుని వెళ్లి జరిగిన సంఘటన నిజమేనా..? కాదా..? అని ఆరా తీశారు. మంచి నీళ్లు ఇవ్వమని కొందరిని అడుగ్గా మీరు ఏ కులం వాళ్లు అని ఎదురు ప్రశ్నించారని తెలిపారు. మేం మాదిగ కులానికి చెందిన వాళ్లం అని చెప్పడంతో వేరే ఊరి నుండి వచ్చిన ఏ కులం వాళ్లకైనా సహకరిస్తాం కాని మా ఊరి మాదిగోళ్లకు మాత్రం నీళ్లు కాదు కదా ఎలాంటి సహకారం అందివ్వబోమని గ్రామంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న కెవిపిఎస్‌ జనగామ డివిజన్‌ కమిటి కార్యదర్శి సుంచు విజేందర్‌, నాయకులు తమ ఆధ్వర్యంలో కుల వివక్షను తొలగించి సామరస్యంతో ప్రజలు కలిసేలా మాట్లాడి సమస్యను కొలిక్కి తెచ్చారు.
కాని సామాజికంగా వారికి జరిగిన అన్యాయం ఎవరు భర్తీ చేస్తారు. పాలకులా..? పోలీసులా..? పెత్తందార్లా...? సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన భవిష్యత్‌లో మరే గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులు నీరుగారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు టి.స్కైలాబ్‌బాబు, జనగామ డివిజన్‌ గౌరవాధ్యక్షులు బొట్ల చిన్న శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తాత్కాలికంగా ఈ సంఘటన సద్దుమణిగినా.. కుంపటి కింద నిప్పులా.. ఉన్న ఈ కుల వివక్షను భవిష్యత్‌ తరాల ప్రజలకు అంటకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. కుల వివక్షను చూపే కుల పెత్తందార్ల ఆగడాలను అరికట్టి, సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో సుమారు రెండు వేల జనాభా, 1400 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో సుమారు 50 దళిత కుటుంబాలు ఉంటాయి. ఆరుగురు దళితులు కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. దళితులలో ఎనిమిది మంది మాత్రమే డప్పులు కొట్టగలిగినవారు ఉన్నారు. మిగతా వారికి డప్పులు కొట్టడం రాదు. దళిత యువకులు ఎక్కువగా చదువుకునే వారున్నారు. పెత్తందార్ల చావుకు డప్పు కొట్టాలని, ఖననం చేయడానికి గోతి తవ్వాలనీ, కాష్టం పేర్చడం వంటి పనులు ఎస్సీలే చేయాలని గ్రామంలో పూర్వం నుంచి వస్తున్నది. కాని కాల క్రమంలో చదువుకున్న యువకులు ఆపనులు చేయడానికి నిరాకరిస్తున్నారు. కాని పెత్తందారులు దానిని జీర్జించుకోలేక పోతున్నారు. అంటూ గ్రామంలోని దళితులకు ట్యాంకుల ద్వారా తాగు నీరు దగ్గర నుండి నిత్యావసర వస్తువులను కూడా దుకాణాలలో ఇవ్వకుండా గ్రామంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఎవరైనా దిక్కరిస్తే వారికి 5 వేల రూపాయల జరిమానా 25 చెప్పుదెబ్బలు, దళితులకు పాలు పోయవద్దనీ, వారి వద్ద నుండి పాలు కొనుగోలు చేయవద్దనీ, చివరకు న్యూస్‌ పేపర్లను కూడా ఇవ్వకుండా హెచ్చరికలు జారీ చేశారు.
Prajashakti News Paper Dated : 07/1/2013

No comments:

Post a Comment