Thursday, January 10, 2013

ఆదివాసీలకు ఉపాధి హామీ?----పి.యస్‌. అజయ్‌ కుమార్‌



ఆదివాసీలు గణనీయంగాఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఇక్కడ 9 జిల్లాలలో షెడ్యూల్డ్‌ (ఆదివాసీ) ప్రాంతంఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా గుర్తింపు పొందని నల్లమల (చెంచు) అటవీప్రాంతం, యానాదులువంటి మైదాన ప్రాంత ఆదివాసీలు, నాన్‌షెడ్యూల్‌ ఆదివాసీలు కూడా కలుపుకుంటే 23 జిల్లాలలో వారు జనాభాలో (2001 లెక్కల ప్రకారం) 6.59 శాతంగా ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం వలన నష్టం జరుగుతుందని గట్టిగా వాదించేవారు సహితం ఆదివాసీలకు, ఆదివాసీ ప్రాంతాలకు వచ్చే సరికి పథకం పట్ల(ఆదివాసీ ప్రాంతాలలోకి చొరబడి వారిభూములు కబళించినవారుతప్ప) సాను కూలత వ్యక్తం చేస్తుంటారు.
మెట్టు (కుష్కి) వ్యవసాయం, అటవీ ఫలసాయం తప్ప మరో విధమైన ఉపాధికి అవకాశం లేని ఆదివాసీ ప్రాంతాలు పేదరికంతో కూనరిల్లుతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 61 శాతం ఆదివాసీలు పేదరికంలోఉన్నారు. మనరాష్ట్రంలో నోటిఫైచేసిన 35 తెగలలో 8 తెగలను అత్యంత పేదరికంలో ఉన్నవారిగా గుర్తించారు. పౌష్ఠికాహారలేమి, రక్తహీనతలలో జాతీయ, రాష్ట్ర సగటుకంటే ఆదివా సీ ప్రాంతాలు అధికంగా ఉంటాయి.

ఈనేపథ్యంలో ఉన్న గ్రామంలోనే ఉపాధి లభించడం చిన్నవిషయం కాదు. దేశ వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల ప్రణాళిక వ్యయం బాగాతగ్గిపోయిన ఈ రోజులలో ఆదివాసీప్రాంతాల వ్యవసాయ రంగం దుస్థితి ఎలా ఉంటుందో సులువుగా ఊహాంచవచ్చు.ఒక సంవత్సరంలో 100 రోజుల పని ద్వారా ఒక కుటుంబానికి ప్రస్తుతం ఉన్న రేటు (ఒక పని దినానికి రూ. 137) ప్రకారం రూ. 13,700 ఈ పథకం ద్వారా పొందే వీలుంది. ఒక మారుమూల ఆవాసానికి చెందిన ఒక ఆదివాసీ కుటుంబానికి ఈ నగదు తక్కువ మొత్తం ఏమీకాదు.12 నెలలపాటు రేషన్‌ దుకాణంలో సర కులు విడిపించుకోవడానికీ, సంతఖర్చులకు హామీ లభిస్తుంది. ఆదివాసీ ప్రాంతా లలో ఉపాధి సృష్టించాలంటే తప్పనిసరిగా భూమి, అడవి అభివృద్ధిపనులను చేపట్టి తీరాలి. కనుక ఆదివాసీ ప్రాంతాలలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ‘భూ అభివృద్ధికి’ స్థిరమైన పెట్టుబడి వ్యయం లభిస్తుంది.అందుచేత ఏజెన్సీ ప్రాంతాలు, ఆదివాసీలకు సంబంధించినంత వరకు ఉపాధిహామీ పథకానికి చాలా ప్రాధాన్యతఉంది. ఆదివాసీ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, సమస్యలు-మన రాష్ట్రంలో 9 జిల్లాలలో షెడ్యూల్డ్‌ ప్రాంతాల భౌగోళిక స్థితిగతులు అన్నీ ఒకే విధంగా లేవు. మైదాన ప్రాంతాలకు ఇవి భిన్నంగా ఉంటాయి.

మైదాన ప్రాంతా లతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాలలో, ఒక మండలానికి సగటు ఆవాసాల సంఖ్య ఎక్కు వ.మైదానాలకు, ఆదివాసీ ప్రాంతాలకు ఈతేడా 6373గాఉంది. శ్రీకాకుళం, విశాఖ పట్నం జిల్లాలలో ఈ తేడా 321, 231గా ఉంటుంది. ఆదివాసీ మండలాల్లో శివారుగ్రామాలు/ ఆవాసాలు అధికంగా ఉండటంతోబాటు వాటి మధ్య దూరం కూడా (మైదానాలతో పోలిస్తే) ఎక్కువ. అయితే ఆవాసాలలో జనాభా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉపాధి పథకంలో నమోదైన శ్రామికులు గ్రామీణ ప్రాంత పంచాయితీలో సగటున 126 ఉంటే, ఆదివాసీ ప్రాంతంలో 166 కుటుం బాలు. గిరిజన సంక్షేమశాఖ లెక్కల ప్రకారం 5947 ఏజెన్సీ గ్రామాలు ఉంటే వాటిలో 1902 ఆవాసాలకు ఎలాంటి రహదారి మార్గం లేదు. మిగిలిన వాటికి కొద్దో గొప్పో దారి సౌకర్యం ఉంది. ఒక వర్షం పడితే రాకపోకలు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం అమలు తీరునుపరిశీలించవ లసి ఉంటుం ది.ఉపాధి పథకాన్ని రాష్ట్రంలో, దేశంలో అమలు పరుస్తున్నది గ్రామీణాభివృద్ధి శాఖ. దాని రాజ్యాంగ బాధ్యత గ్రామాల అభివృద్ధి. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, రక్షణకు గిరిజన సంక్షేమశాఖ ఉంది. 

దాని రాజ్యాంగబాధ్యత ఆదివాసీల సంక్షేమం. ఇక్కడే అసలుసమస్య ఎదురౌతుంది. మైదాన ప్రాంత గ్రామాలకు, ఆదివాసీ ప్రాంతాలకు మధ్య ఉన్న తేడాను గ్రామీణాభివృద్ధి శాఖ చూడలేదు. అది దాని బాధ్యతకూడా కాదు. ఉదాహరణకు మైదానప్రాంత పంచాయితీలు, ఆదివాసీ గ్రా మపంచాయితీలు ఒకటి కాదు. ఆదివాసీ ప్రాంతాల పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అంతేగాక ‘గ్రామం’ అంటే ఆదివాసీ ప్రాంతం అని అర్ధం, నిర్వచనంవేరు. ఈ తేడా గుర్తించకపోవడం వలన మైదాన ప్రాంతాల అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ యథా తథంగా ఆదివాసీ ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనల పరిధిలో ఉన్నప్పటికీ గ్రామీణాభివృద్ధిశాఖ తనఅధీనంలోని ‘జిల్లా నీటి పారుదల యాజమాన్యసంస్థ’ ద్వారా ఉపాధి హామీపథకాన్ని ఈ ప్రాంతాలలో అమ లుపరుస్తుంది. వర్షాలు పడినప్పుడు మెరక (కుష్కి) పొలాల్లో నీరు నిలిచి ఉండేం దుకు కందకాల (ట్రెంచ్‌) పనిని ఉపాధి హామీ పథకంలో రూపొందించారు. సుమా రు 2.50 మీటర్ల పొడవు ఉండే ఈ కందకపులోతును 0.50 మీటర్లుగా నిర్ణయించి రాష్ట్రంలో పనులు చేయించారు.

ఈ కందకాల వలన ఒనగూడె దీర్ఘకాలిక లాభాల్ని అనేక చోట్ల మెట్టప్రాంత రైతులకు సరిగ్గా వివరించలేదు. దాంతో కొందరు రైతులు తవ్వినవాటిని కప్పివేయడం మొదలుపెట్టారు. దీనికి విరుగుడుగా కందకం లోతు ను 0.50 మీటరు నుండి1 మీటరుకు పెంచారు. యథాలాపంగా ఈ నియమాన్ని ఆదివాసీ ప్రాంతాలకు వర్తింపచేశారు. విశాఖ జిల్లాలో మొత్తం ఆదివాసీ ప్రాంతం (11మండలాలు, 245పంచాయితీలు, 3914ఆవాసాలు, లక్ష 50 వేల ఆదివాసీ జాబ్‌కార్డు కుటుంబాలు) ఎత్తయిన కొండలపైఉన్నాయి. ఇక్కడ కొండల్లో ఆదివాసీ లు ఒక మీటరు లోతు ఎలాతవ్వగలరు? గ్రామీణాభివృద్ధి శాఖకు తెలీదు, గిరిజన సంక్షేమ శాఖకు పట్టదు. రెండవ ఉదాహరణ- గ్రామ పంచాయితీస్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని అమలుపర్చే కీలకమైన ఉద్యోగి విలేజ్‌ రిసోర్స్‌ పర్సన్‌/ ఫీల్డ్‌ అసి స్టెంట్‌/ రోజ్‌గార్‌ సేవక్‌.పేరు ఏదైనా చేసేపని ఒకటే).గ్రామీణాభి వృద్ధి శాఖ ఉత్త ర్వుల ప్రకారం ఒక పంచాయితీకి ఒక విఆర్‌పి ఉంటారు. ఆపంచాయితీలో 5కు మించి శివారుగ్రామాలు ఉంటే ఇద్దరు విఆర్‌పిలు ఉండాలని నియమం. విశాఖ జిల్లాలో మైదానప్రాంత మండలం టి.అర్జాపురం పంచాయితీలో 7 శివారు గ్రామాలున్నాయి.

కనుక అక్కడ ఇద్దరు విఆర్‌పిలను నియమించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతమై జి. మాడుగుల మండలం, సొలం పంచాయితీలో 56 శివారు గ్రామాలు న్నాయి. వీటిలో కొన్ని గ్రామాలకు వెళ్ళి పంచాయితీకేంద్రానికి రావాలంటే 2 నుం డి 3 రోజులు పడుతుంది.5 శివారు గ్రామాలు మించితే ఇద్దరు విఆర్‌పిలు గనుక ఈ పంచాయితీలోనూ ఇద్దరినే నియమించారు. ఈఇద్దరూ మహిళలే. 2008 ఏప్రిల్‌ నుండి విశాఖ జిల్లాల లో ఈపథకం అమలౌతుంది. ఈ ఐదు సంవత్సరాలలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, అడిష నల్‌ ప్రోగ్రాంఆఫీసర్‌లు ఒక్కసారికూడా వెళ్ళని ఏజెన్సీ గ్రామాలు వందల సంఖ్యలో ఉంటాయి. అయినా విఆర్‌పిలు మస్తరు వేస్తున్నట్లు, టిఎలు కొలతలు తీస్తున్నట్లు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌లు చెక్‌ మెజెర్‌మెంట్‌ చేస్తున్నట్లు రికార్డులు చెపుతుంటా యి. కొలతలు నమోదు చేసే పుస్తకాలలో కొలతలు ఉండవు. కేవలం క్యూబిక్‌ మీటర్ల గుండగుత్త సంఖ్యలు ఉంటాయి. సోషల్‌ ఆడిట్‌లో వీటిపై ప్రజాఆడిటర్లు ఫిర్యాదులు వ్రాస్తుంటారు. ప్రిసైడింగ్‌ అధికారులు వాటిని బుట్టదాఖల చేస్తుంటారు. 

అసలు సమస్యలు, టిఎలు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లతో లేవు, గ్రామీణాభివృద్ధి శాఖతో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలనుగూర్చి అందులో కొందరికి వ్యక్తులుగా తెలిస్తే తెలిసి ఉండవచ్చు. కాని ఒకశాఖగా దానికి ఆప్రాంతాల ప్రత్యేక పరిస్థి తులను గూర్చి తెలిసే అవకాశం లేదు, సొలభం వంటి 17 పంచాయితీలు ఉన్న జి.మాడుగుల మండలంలో ముగ్గురు టిఎలు ఉంటే వారందరూ కూడా ‘ఔట్‌ సోర్సింగ్‌’ పేరున నామమాత్రపు వేతనాలతో పనిచేస్తుంటారు.గ్రామీణ వేతన శ్రామికులకు ఉపాధి హామీ పథకంలో వారికి ఉన్న ‘హక్కు’లు రెండు. ఒకటి 100రోజుల పరిమితితో ‘పనిహక్కు’. ఆపనికి పొందే ‘వేతన హక్కు’. ఈ రెండు హక్కులఅమలులో ప్రభుత్వం విఫలమైతే రెండు రకాలైన నష్టపరిహా రాలను పొందే అవకాశం ఉంది. అవి పనిహక్కు కల్పనలో వైఫల్యానికి ‘నిరుద్యోగ భృతి’, 15 రోజులలో వేతన చెల్లింపులో విఫలమైతే అందుకు ‘నష్టపరిహారం’. గత ఐదు సంవత్సరాలలో పనికల్పించమని అధికారులనుఅడిగి, పని పొందని సందర్భా లు ఏజెన్సీ ప్రాంతాలలో వేలసంఖ్యలో ఉన్నాయి.

అయినా ఒక్క ఆదివాసీ శ్రామికు నికీ నిరుద్యోగభృతి చెల్లించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి చెల్లిం చిన కేసులు రెండే. ఒకటి మెదక్‌ జిల్లాలో, రెండవది శ్రీకాకుళం జిల్లా లకింపేట (హత్యాకాండ అనంతరం)లో.ఈ రెండు సందర్భాలలోను దళిత వేతనశ్రామి కులకు నిరుద్యోగభృతి చెల్లించారు. ఆదివాసీలకు నిరుద్యోగ భృతి ఎందుకు చెల్లిం చలేదని ప్రశ్నిస్తే, వారు అడిగిన వెంటనే 15 రోజులలో పని ఇచ్చేయడం వలన ఈ అవసరం రాలేదని వారంటారు. ఇది నిజం కాదు. ఇక్కడ కూడా కనిపించేది ‘వ్యవస్తాగత’సమస్య. నిరుద్యోగభృతి పొందాలంటే పనికి దరఖాస్తు పెట్టినట్లు నిరూ పించుకునే సాక్ష్యం ఆదివాసీ వద్ద ఉండాలి. అంటే అతను/ ఆమె పనికి దరఖాస్తు పెట్టి, దాన్ని అధికారికి సమర్పించి, వారి నుండి రశీదు పొందగలగాలి. ‘సొలభం’ పంచాయితీకి చెందిన మారుమూల ఆదివాసీలకు దరఖాస్తులు ఇచ్చేదిఎవరు?అవి నింపేదిఎవరు? అవన్నీ పూర్తిచేసుకొని పంచాయితీ కార్యాలయానికి వస్తే ఆ సమ యానికి విఆర్‌పి అక్కడ ఉంటాడన్న నమ్మకంలేదు.

అయితే దీనికి పరిష్కారం? ఆదివాసీలు సాధారణంగా వారపుసంతలకు వస్తుంటారు. అక్కడ ఆయా పంచాయి తీ దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు పెట్టవచ్చు. ఖాళీ దరఖాస్తులు, వాటిని నింపే సహా యకులను ఏర్పాటు చేయవచ్చు. దీనిని నిర్వహిస్తే ఆదివాసీ వేతన శ్రామికులకు అది ఒక అలవాటుగా మారుతుంది. కాని గ్రామీణాభివృద్ధిశాఖ ఇటువంటి పనులు చేయదు. ఎందుకంటే దానికి ఆదివాసీప్రాంతాలంటే ఏమిటో తెలీదు, తెలుసుకో దు. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి ఉపాధి హామీలో రెండు ముఖ్యమైన అంశాలు- ఒకటి, కనీస వేతనం పూర్తిగా అందడం, రెండవది, సకాలంలో అందడం. 100 రోజులకు కలిపి ఒక కుటుంబానికి 13,700 అందాలి. అప్పుడు పూర్తిస్థాయిలో పథకం వారికి చేరినట్లు. దిన వేతనం రూ 137వచ్చి 100 రోజు లు పని కల్పించకపోయినా,100 రోజులూ పనిలభించినా- ప్రతి పనిదినానికి రూ.137 అందకపోయినా నష్టపోయేది ఆదివాసీలే. 100 రోజులు పని పూర్తిగా లభించదు.

దిన కూలి రూ.137 పడదు. ఈ 8 ఐటిడిఎలలో 3నుండి 4 లక్షల కు టుంబాలు ఉపాధి పథకానికి బయట ఉండిపోతున్నాయి. సగటున 65 నుండి 85 పనిదినాల కల్పన జరుగుతోంది. 2008-09 మినహాయిస్తే ఏ సంవత్సరంలో ఆది వాసీలకు అందిన వేతనం కనీసవేతనాల కంటే తక్కువ ఉండటంతో బాటు ఈ తేడా పెరుగుతున్నది.100 రోజులు పూర్తిగా పనిపొందిన కుటుంబాలు మొత్తం కుటుం బాలలో 20 శాతం కంటే తక్కువ. ఈ వివరాలను ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న పేద రికం, రక్తహీనత, పోషకాహారలేమి గణాంకాలతో పోల్చి చూసినప్పుడు బడ్జెట్‌ కేటాయింపులు, పుష్కలంగా నిధులు ఉండికూడా ఆదివాసీలు అల్లాడుతున్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితికి వ్యవస్థాగతమైన లోపాలు కాకపోతే కారణం మరి ఏమిటి? 5వ షెడ్యూల్‌ ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసేతరులకు ఆర్ధికంగా లబ్ధి కలి గించే కార్యక్రమాలను చేపట్టి వారిని మరింత శక్తిమంతులుగా చేయవచ్చునా? 

అది 1/70 చట్టం, సుప్రీంకోర్టు సమతతీర్పు, పీసా చట్టాల స్ఫూర్తికి వ్యతిరేకం కా దా?! ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి రాజ్యాంగం చెప్పిన ‘సత్‌ పరిపాలన’కు అర్ధం ఏమిటి? రాష్ట్రం మొత్తంమీద నమోదైన జాబ్‌కార్డులు కోటి 25 లక్షలు. వాటి లో ఆదివాసీల జాబ్‌కార్డులు 14 లక్షల 21 వేలు. ఇవి మొత్తం జాబ్‌కార్డులలో 11 శాతం. 8 జిల్లాల ఆదివాసీ ప్రాంతాలలో వారి జాబ్‌కార్డులు 5 లక్షల 34 వేలు. మొ త్తం జాబ్‌కార్డులో ఇవి 4 శాతం. రాష్ట్రంలో మొత్తం ఆదివాసీ జాబ్‌కార్డులలో షెడ్యూ ల్డ్‌ ప్రాంతాల జాబ్‌కార్డులు37 శాతం. అంటే 63శాతం ఆదివాసీ జాబ్‌కార్డు దారులు, వారి (నాన్‌షెడ్యూల్డ్‌) ప్రాంతాలు, ఉపాధి హామీ పథకం అమలులో వారు ఎదుర్కొం టున్న సమస్యలు ఈ చర్చలోకి రాలేదు. వాటన్నింటిని దగ్గరకు తేవలసి ఉంది. రచయిత ఎ.పి. వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌ కార్యదర్శి 
పి.యస్‌. అజయ్‌ కుమార్‌ 

sdg

Surya News Paper Dated: 10/1/2013

ప్రియమైన ఓయూ విద్యార్థులారా.. ప్రొఫెసర్ జి.హరగోపాల్



Osmania
ప్రియమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు,
ఈ లేఖ మీకు రాయడానికి ప్రధాన కారణం ఇంత కాలంగా మీరు మమ్మల్ని గౌరవించారు. ఏ అంశం మీద మాట్లాడినా గంటల తరబడి విన్నారు. మేం కూడామిమ్మల్ని గౌరవించాం. మీలో చాలామంది మొదటి తరం విద్యార్థులు. మీరు ఈ ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించే నిర్ణేతలు. ఈ పీహెచ్‌డీ సీట్ల సమస్యకు పరిష్కారం తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెతుకుతూనే... ఉద్యమంలో భాగం కండి. మీరులేని ఉద్యమం ద్వారా తెలంగాణ రావడం తెలంగాణకు మంచిది కాదు. మీకు మంచిది కాదు.
ఒకటి, రెండు వారాలుగా ఉస్మానియా క్యాంపస్‌లో సంఘటనలు మాలాంటి వాళ్లను చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ పాలనాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ అగాథము ఇంకా పెరిగింది. ఈ సంఘటనలు రాబోయే కాలంలో విద్యార్థుల, అధ్యాపకుల మధ్య ఒక విజ్ఞానదాయకమైన సంబంధానికి దారితీస్తాయా? రేపు అధ్యాపకులు క్లాస్ గదులలో ఒక విశ్వాసంతో మీ మీద ప్రేమతో ఎలా బోధించగలరు. 

ఇప్పుడు కూడా కొందరు అధ్యాపకులు మీ పట్ల ఆసక్తి కలిగిలేరని, వాళ్ల వృత్తిని వారు సరిగా నిర్వహించడం లేదని మీరు అనవచ్చు. ఆ దూరాన్ని, ఆ పరస్పర అవగాహనను తెలంగాణ ఉద్యమం కొంత వరకు తీర్చగలదని, తెలంగాణ రాష్ట్ర మంటూ ఏర్పడితే, కొత్త రాష్ట్రంలో ఉద్యమ కాలంలో ఏర్పడిన బంధం మరింత బలపడి ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని పునః నిర్మించుకుంటుందని భావించాం. తెలంగాణ వస్తుందేమో, కేంద్రం ఏదైనా నిర్ణయం ఆ దిశగా తీసుకుంటుందేమోనని ప్రజలు ఆశపడుతున్న తరుణంలో మీ సంబంధాలు ఇంత సంక్షోభంలో పడితే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికాక ఈ బాధకరమైన అనుభవమే, మన జ్ఞాపకంగా నిలిచిపోతే మీరు ఎందుకు త్యాగాలు చేసినట్టు? బోలెడంత మంది ఎందుకు ప్రాణాలు ఇచ్చినట్టు? లక్షలాదిమందిని మీరు ఎందుకు సమీకరించినట్టు? మూడు, నాలుగు ఏళ్లుగా మీరు ఎందుకు పోరాటాలు చేసినట్టు?

ఒక నెలలోపలే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి ప్రకటించి, ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అఖిలపక్షం మీటింగ్ పెట్టారు. ఈసారి అఖిలపక్షంలో జరిగిన చర్చ గతం కంటే కొంత మెరుగుగా ఉంది. సోనియాగాంధీ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అగుపిస్తున్నది. ఈ నిర్ణయ ప్రక్రియ దశదిశను నిర్దేశించడానికి తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ విభేదాలను పక్కకు పెట్టి, ఒకే వాయిస్‌తో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం తమకు అంగీకారం కాదని స్పష్టంగా ప్రకటించవలసి ఉన్నది. ఈ దిశగా మనం కదలాలని తెలంగాణ జర్నలిస్టు ఫోర మ్ నిర్వహించిన అఖిలపక్ష సదస్సులో అందరూ భావించారు. రాజకీయ పార్టీల మీద, కేంద్రం మీద అవసరమైన ఒత్తిడి ప్రజలు పెట్టాలని జర్నలిస్టు ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒత్తిడి పెట్టవలసిన దశ లో మీరు ఎక్కడున్నారు? మీరు పీహెచ్‌డీ సీట్ల కోసం ఆందోళనపడుతున్నారు. మీ ఆందోళన చూస్తే డాక్టర్ జయశంకర్ ఒక సందర్భంలో ‘తలకాయే పోతున్నప్పుడు ముక్కుపుల్ల కోసం ఆందోళన పడ్డ ట్టు’ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. 

ఇక పీహెచ్‌డీ సీట్ల విషయంలో మీరు ఆలోచించవలసిన కొన్ని అంశాలున్నాయి. పరిశోధన చేయడానికి బడుగు వర్గాలకు కొన్ని సౌకర్యాలు యూజీసీ వారు కల్పించారు. ఇందులో స్కాలర్‌షిప్‌ల డబ్బులను పెంచారు. దీనికి అప్పటి యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ థోరట్, అప్పటి ప్లానింగ్ కమిషన్ సభ్యు డు ప్రొఫెసర్ ముంగేకర్ చాలా ప్రయత్నం చేశారు. చాలామంది తమ పోస్ట్‌క్షిగాడ్యుయేషన్ అయిపోతూనే బయట అవకాశాలు లేకపోవడం వలన తమ అర్హతలను పెంచుకొనడానికి, లేదా ఒక ఉద్యోగం దొరికే దాకా ఇది ఒక తాత్కాలికమైన ఊరటగా చూస్తున్నారు. పేదరికం, అవకాశలేమి ఉన్న సమాజంలో ఉండే పరిస్థితే ఇది. పీహెచ్‌డీ అన్ని కోర్సులలాగా ఉండదు. ఒక్కొక్క అర్హత ఉన్నా అధ్యాపకుడి కింద ఆరుమందే పనిచేయాలని యూజీసీ ఒక నిబంధన విధించింది. (ఈ నిబంధన సహేతుకమా లేదా అన్నది మరోచర్చ) ఒక డిపార్టుమెంటులో ఉండవలసిన కనీస అధ్యాపకుల సంఖ్య ఆరుగా ఉండాలని యూజీసీయే నిర్ణయం చేసింది. ఈ లెక్క ప్రకారం ఆరు మంది దగ్గర కలిసి మొత్తం 36 మంది పరిశోధన చేయవచ్చు. ఒక స్కాలర్ చేరితే ఆయన ఐదు, ఆరు సంవత్సరాలు పనిచేయవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు చేయవలసిన డిమాండ్ ఉస్మానియాలో అన్ని ఖాళీ పోస్టులను నింపాలని, పరిశోధనకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని.. అలాగే ప్రత్యేకంగా రీసెర్చ్ ప్రొఫెసర్స్‌ను నియమించి వాళ్లు కేవలం రీసెర్చ్ గైడెన్స్ చేయాలని డిమాండ్ చేస్తే మరికొన్ని సీట్లు పెరుగుతాయి.

ఇప్పుడు అధ్యాపకుల సంఖ్య బోధనా పీరియడ్స్ మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతం రీసెర్చ్‌కు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో అంత ప్రాముఖ్యం లేదు. పాశ్చాత్య విశ్వవిద్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో వందల అధ్యాపకులుంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మెడికల్ స్కూల్‌లో 8,000మంది అధ్యాపకులున్నారు. మన ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలను చూసి బుద్ధి తెచ్చుకోండి అని బుద్ధిలేని మాటలు మనకు చెబుతున్నది. మనం హార్వర్డ్ కావలసిన అవసరంలేదు. మన విశ్వవిద్యాలయాలు పేద వర్గాల నుంచి వచ్చే పిల్లల ప్రతిభ పెంచి, సామాజిక స్పృహ కలిగించగలిగేతే చాలు. పేద వర్గాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న పిల్లల అవసరాలు తీరిస్తే చాలు. విశ్వవిద్యాలయాలలో అవకాశాలను పెంచే బదులు గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచబ్యాంకు ఒత్తిడి మేరకు సామ్రాజ్యవాద దుర్మార్గం వలన విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ తగ్గాయి, పోస్టులు తగ్గాయి, వసతులు తగ్గాయి. మీరు ఆవేశంలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్ని ఇప్పుడు అప్రస్తుతంగా తోచవచ్చు. కానీ మనుషులు ఆవేశంలో ఉన్నప్పుడే వాస్తవాలు చెప్పాలి. 

మీకు తెలుసో లేదో ప్రపంచబ్యాంకు ఉన్నత విద్యను ‘నాన్ మెరిట్ గూడ్’ గా పరిగణిస్తున్నది. వాళ్ల విభజీకరణలో, పబ్లిక్ గూడ్, మెరిట్ గూడ్, నాన్ మెరిట్ గూడ్ అని మూడు రకాలు. పబ్లిక్‌గూడ్‌లో సైన్యం, పోలీసు, పాలనా వ్యవస్థ; మెరిట్ గూడ్‌లో స్కూలు విద్య లాంటివి చేర్చారు. నాన్ మెరిట్ గూడ్ అంటే సమాజము ఒక సేవను అందిస్తే ఆసేవ నుంచి వ్యక్తి ఎక్కువ ప్రయోజనం పొంది, సమాజం తక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నదన్నది ఈ సూత్రీకరణకు ప్రధాన భూమిక. ఆ కారణం వల్లే చంద్రబాబు ప్రపంచబ్యాంకు కనుసన్నలలో పనిచేసినప్పుడు, వాళ్ల ఆదేశాల మేరకే కాలేజీ సర్వీస్ కమిషన్‌ను మూసేశారు. అప్పుడు విద్యార్థులు ఆందోళన చేసినట్టు నాకు గుర్తులేదు. అప్పటి ఉన్నత విద్య కమిషనర్‌ను కలిసినప్పుడు ఆయన ప్రపంచబ్యాంకు ఒత్తిడి మీద పనిచేయవలసి వస్తున్నదని చెప్పాడు. మీకు తెలుసో లేదో ప్రపంచ బ్యాంకు ఆంధ్రవూపదేశ్‌కు అప్పు ఆపివేయడానికి చెప్పిన ఐదు, ఆరు కారణాలలో స్కూలు విద్యలో ఉపాధ్యాయుల నియామకాలు రద్దు చేయలేదని, నియామకాలను పంచాయతీ వ్యవస్థలకు అప్పగించలేదన్న అంశంపై మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. పంచాయతీలకు ఉపాధ్యాయుల నియామక అధికారం ఇస్తే దానికి కావలసిన మొత్తం నిధులను ఆ సంస్థలకు ఇస్తారా, తెలియదు. చాలా కాలంగా ఆంధ్రవూపదేశ్ విద్యా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మేం ఈ ప్రశ్న లు అడుగుతూనే ఉన్నాం. రాష్ట్రంలోని, లేదా తెలంగాణ ప్రాంతంలోని విశ్వవిద్యాలయ అధ్యాపకులు చాలామంది తాము తీసుకోవలసిన చొరవ తీసుకోలేదు. ఇప్పు డు అధ్యాపకులు విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక ఉద్యమంలో భాగమైతే మనకుండే నైతిక ధైర్యం, మనకుండే స్పష్టమైన సమాధానాల వల్ల పరిస్థితి ఈ దశకు వచ్చేది కాదు. 

తెలంగాణ ఏర్పడితే విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలి అనే అంశం మీద మా లాంటి వాళ్లం మాట్లాడుతూనే ఉన్నాం. ఉద్యమ ఎజెండాలో భాగంగా ఈ సమస్యలు ఉండాలని వాదిస్తూనే ఉన్నాం. ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉండే విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు వివరించి, మనం ఎలాంటి విశ్వవిద్యాలయాలను తెలంగాణలో కోరుకుంటున్నాం. గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా ఉద్యమం ఉధృతంగా ఉన్న గత రెండు, మూడు సంవత్సరాలుగా మాట్లాడి ఉంటే పిల్లలకు సమస్యలకు కారణాలు, పరిష్కారాలు అర్థమయ్యేవి. అలా అవగాహన అయితే తొందరలోనే తెలంగాణ రాష్ట్రం మీద నిర్ణయం తీసుకుంటాం అని అంటున్న సందర్భంలో, పోరాటం దేనిమీద చేయాలో చేయక తమ అధ్యాపకుల మీదే పోరా టం చేసేవారు కాదేమో! ఇప్పటికైనా ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థి సంఘాలతో, ముఖ్యంగా బడుగు వర్గాల నుంచి వచ్చిన వారితో ఒక డైలాగ్ ప్రారంభించాలి. వాస్తవ విషయాలను చెప్పాలి. అది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా మాట్లాడకపోతే విశ్వవిద్యాలయాల స్వ తంత్ర ప్రతిపత్తి మూలాలే ధ్వంసమైపోతాయి. 
విద్యార్థులకు చివరిగా ఒక విజ్ఞప్తి.

మీరు మా లాంటి వాళ్లను పిలిపించి ఎన్నో ప్రసంగాలు నిర్వహించారు. మీరు ఎప్పుడు కోరినా మీ యూనివర్సిటీకి నేను వచ్చాను. మీరు ఏ అంశం మీద మాట్లాడమంటే ఆ అంశంమీద మాట్లాడాను. మీ రు లక్షల మంది విద్యార్థులను సమీకరించగలిగినప్పుడు రాజకీయ నాయకులను రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించినప్పుడు, లాఠీదెబ్బలు తిన్నప్పు డు, జైళ్లకు వెళ్లినప్పుడు మేం గర్వపడ్డాం. ఇంత పోరాటం చేసి చివరకు తెలంగాణ ఒక కీలకమైన దశలో సంతృప్తికర సమాధానం లేని పీహెచ్‌డీ సీట్ల కోసం పోరాడే ఒక చిన్న ఉద్యమంలో ఇరుక్కుపోయారు, లేదా దాంట్లోకి నెట్టబడ్డారు. మీ తరం సామ్రాజ్యవాదంతో తలపడవలసి ఉంది. సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు తప్పు డు సలహాలు ఇస్తుంటే చరిత్ర తెలియని, సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు వాటికి తల ఊపుతుంటే మౌలిక ప్రశ్నలు అడిగే సాహసమున్న మీరు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో సాహసం చేసిన మీరు, మాలాంటి వాళ్లకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన మీ చేతిలో తెలంగాణ భవిష్యత్తు భద్రంగా ఉందని మేం భావించాం.

ఈ లేఖ మీకు రాయడానికి ప్రధాన కారణం ఇంత కాలంగా మీరు మమ్మల్ని గౌరవించారు. ఏ అంశం మీద మాట్లాడినా గంటల తరబడి విన్నారు. మేం కూడామిమ్మల్ని గౌరవించాం. మీలో చాలామంది మొదటి తరం విద్యార్థులు. మీరు ఈ ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించే నిర్ణేతలు. ఈ పీహెచ్‌డీ సీట్ల సమస్యకు పరిష్కారం తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెతుకుతూనే... ఉద్యమంలో భాగం కండి. మీరులేని ఉద్యమం ద్వారా తెలంగాణ రావడం తెలంగాణకు మంచిది కాదు. మీకు మంచిది కాదు. తక్షణమే తెలంగాణ ప్రకటిస్తే చరివూతలో మీ స్థానమేముంటుందో ఆలోచించండి. అధ్యాపకులతో చర్చలు ప్రారంభించండి. మీ ఆగ్రహానికి వివరణ ఇవ్వండి. అలాగే ఈ పిల్లలు మన పిల్లలు కాబట్టి పిల్లల ప్రవర్తనను ఒక సామాజిక నేపథ్యంలో విశాల మనసుతో అధ్యాపకులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి పాల్గొని ఆ పరస్పర సమష్టి అవగాహన పునాదిపై విశ్వవిద్యాలయ భవిష్యత్ సౌధాన్ని నిర్మించాలి.

మీ ప్రియమైన
ప్రొఫెసర్ జి. హరగోపా

Namasete Telangana New Paper Dated: 10/1/2013

Thursday, January 3, 2013

దళితులకు భూమి ఏది? -- పి.యస్‌. అజయ్‌ కుమార్‌



Sivakami-speach
తెలుగు మహాసభలకు ముస్తాబవుతున్న తరుణంలో తిరుపతి పట్టణానికి ఒక విశిష్టఅతిథి వచ్చారు. ఆమె పేరు శివగామి. తమిళనాడుకు చెందిన సీని యరు ఐ.ఎ.ఎస్‌.అధికారిణి. ఇప్పుడామె ఆ పదవిలో లేరు. స్వచ్ఛంద పదవీ వి రమణ తీసుకొని తమిళనాడులో దళిత భూమి హక్కులకోసం ఆమె పోరాడు తున్నారు. ఈ నెల (డిసెంబరు) 17, 18 తేదీలలో తిరుపతి పట్టణంలో భూసంస్క రణల కార్యాచరణ ఉద్యమం నిర్వహించిన ‘ప్రజా కోర్టు’లో ఆమె జ్యూరి సభ్యురా లుగా పాల్గొన్నారు. దళితులు, ఆదివాసీలు, పేదల భూ సమస్యలపై రెండు రోజులు జరిగిన ఈ ప్రజా న్యాయస్థానంగాని, దళిత కులంలో పుట్టి ఐ.ఎ. ఎస్‌.సాధించి ఒక ఆదర్శంకోసం దాన్ని పరిత్యజించి పల్లెల్లో పోరాడుతున్న శివగామి రాకగాని మీడి యాకు ఎలాంటి ఆశక్తిని కల్గించలేక పోయింది. 

అందులో ఆశ్చర్యం ఏమీలేదు. తన ఎదురుగా ఉన్న దళిత, అణగారిన వర్గాల భూ బాధితులను ఉద్దేశించి 18వ తేది మధ్యాహ్నం ఎస్‌.వి. యూనివర్శిటీ సెనేట్‌హాలులో ఆమె చేసిన లోతైన సుదీర్ఘ ప్రసంగం అనేక అంశాలను స్పృజించి, పలు ప్రశ్నలను ఆంధ్రప్రదేశ్‌ పౌర సమాజం ముందు ఉంచింది.
80 శాతం మంది దళితులు జీవిస్తున్నది గ్రామాలలో. వారు జీవిక కోసం ఆధార పడింది భూమి, వ్యవసాయం పైన. తొలినాళ్లలో శూద్ర వ్యవసాయదారులుగా ఉన్న వారు ఇప్పుడు అగ్ర కులాలుగా మారి ఇతర వ్యాపారాలు, వ్యవహారాలకు మళ్ళిపో యినా భూమిని అంటిపెట్టుకొని ఉన్నది దళితులు, ఆదివాసీలు, శూద్ర కులాల క్రింది పొర అయిన వెనుకబడిన కులాల ప్రజలే. 

భూమి తమ ప్రధాన జీవనాధారం కాకపోయినా అగ్రకులాలు భూమిని వదలడం లేదు. కొడుకులు, కూతుళ్లు, అల్లు ళ్లూ అమెరికాలోనే ఉన్నా, తమ మకాం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయ వాడ, విశాఖపట్నంవంటి నగరాలకు మారిపోయినా వారు భూమిహక్కు పత్రాలను చేతిలో పట్టుకొని సాగుదార్ల కష్టాన్ని పరాన్న భుక్కుల్లా మెక్కుతున్నారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో జమిందారిరద్దు చట్టం వంటి మొదటితరం భూ సంస్కరణల వలన లబ్ధి పొందింది అప్పటి శూద్రకుల రైతు వర్గాలే. మధ్య దళారీలు పోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తద్వారా ‘ట్రికిల్‌ డవున్‌’ సూత్రంలో క్రిందనున్న వ్యవసా యకూలీలకు ఆ ఫలితాలు చేరుతాయని భావించారు.

వ్యవసాయంలో అభివృద్ధి శూద్ర కులాలను అగ్రకులాలుగా మార్చింది. కాని ఈ అభివృద్ధిలో దళితులకు భాగ స్వామ్యంలేదు. దేశ వ్యవసాయరంగంలో గరిష్ఠఅభివృద్ధి సాధించాయన్న పంజాబు, హర్యానా రాష్ట్రాల వ్యవసాయ కూలీలలో దళితులు 79, 55 శాతంగా ఉన్నారు. 1961 లో మొదటిసారి, 1973లో రెండవసారి తెచ్చిన భూ గరిష్ఠ పరిమితి చట్టాలలో ఒక కుటుంబా నికి నిర్ధారించిన ‘గరిష్ఠ పరిమితి’కి ఆధారం ఏమిటని శివగామి ప్రశ్నించారు. 

కేంబ్రిడ్జి భారతీయచరిత్ర ప్రకారం ఆనాటి బ్రిటిష్‌ ప్రభు త్వం ఒక కుటుంబానికి కావలసిన ఆర్ధిక కమతం 2.50 ఎకరాలు మాగాణి (తరి), లేదా 5 ఎకరాలు మెట్ట (కుష్కి) అని నిర్ధారించిందని ఆమెఅన్నారు. ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. 150 సంవత్సరాల కిందట మద్రాసు రెవిన్యూ బోర్డు రూపొందించిన ప్రభుత్వ భూముల నియమాలలో ఒక కుటుంబానికి 2.50 మాగాణి, లేదా 5 ఎకరాలు మెట్ట భూమి వరకు (10 శాతం తేడాతో) మంజూరు చేయవచ్చని చెపుతుంది. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల వరకు ప్రభుత్వ భూముల మంజూరుకు మన రాష్ట్రంలో ఇదే ప్రమాణం కొనసాగింది.

పేదలకు భూమి మంజూరు చేసే సందర్భంలో 2.50 ఎకరాల పల్లం (మాగాణి, తరి)ను ఒక ఎకరాకు, 5 ఎకరాల మెట్ట (కుష్కి/చేను)ను రెండు ఎకరాలకు తగ్గించమని కోనేరు కమిటీ తన 1.3 సిఫార్సులో చెప్పింది. అప్పటి ‘మహానేత’ ప్రభుత్వం దీనిని అంగీకరించింది. అదే కమిటీ సీలింగు మిగులు భూముల ‘గరిష్ఠ పరిమితి’ని తగ్గించమని మాత్రం చెప్పలేకపోయింది. విడతల వారి భూపంపిణీలో ప్రభుత్వం ఎకరాలను సెంట్ల(కుంట)కు దిగజార్చింది. 1961 భూ సంస్కరణల చట్టంలో ఒక కుటుంబ సభ్యుడ్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఒక కుటుంబానికి మాగాణి 180 నుండి 360 ఎకరాలు, మెట్ట 1080 నుండి 2160 ఎకరాలు ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. 

ఈచట్టంద్వారా 30 లక్షల ఎకరాలు వస్తాయ న్నారు. చివరికి స్వాధీనంచేసుకున్నది 2384ఎకరాలు. అందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు 14 లక్షలు. ఇక రెండవ భూ సంస్కరణల చట్టం 1973 ద్వారా బయటకు వచ్చిన సీలింగు మిగులు భూమి 5 లక్షల 25 వేల ఎకరాలను- 5 లక్షల 82 వేల మందికి పంపిణీచేశారు. ఇందులో 2 లక్షల 24 వేలమంది దళితులకు లభించింది 2 లక్షల 26 ఎకరాలు (2005 మార్చి 31 నాటికి). ఒక కుటుంబానికి సుమారు 1 ఎకరా వచ్చింది. పేదల ఆర్ధిక కమతం 2.50 ఎకరాలు తరికాగా ఇదే సీలింగు చట్టంలో ఈ పరిమితి 15 నుండి 27 ఎకరాలుగాఉంది. అదే మెట్టభూమి తీసుకుం టే పేదల ఆర్ధిక కమతం 5 ఎకరాలైతే పెద్దలది 37 నుండి 54 ఎకరాలుగా ఉంది. అదిచాలదని చట్టానికి సవరణతెచ్చి ‘మేజర్ల’కు అదనపు విస్తీర్ణం చేర్చారు. తెల్లకాగి తాలపై జరిగిన అమ్మకాలు చెల్లుతాయన్నది హైకోర్టు.

‘ఆర్ధిక కమతం’ నిర్ధారణలో అసలు కుట్ర ఉంది. గ్రామీణ పేదరికం పెరుగు తుంటే దానితోబాటు వారి ఆర్ధిక కమతం తగ్గిపోయింది. 1973లో నిర్ధారించిన గరిష్ఠ పరిమితి మాత్రం నేటికీ అలాగే కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం నియమించిన బందోపాధ్యాయ కమిటీ (మన రాష్ట్రం నుండి బాలగోపాల్‌ ఇందులో సభ్యులు) ఈ విషయాన్నిగుర్తించి గరిష్ఠ పరిమితిని కనిష్ఠపరిమితిగా మార్చమంది. సహజంగానే మన ప్రధాన మంత్రి ఆ నివేదికను చెత్తబుట్ట సమర్పయామి చేశారు.
రెండవ భూ సంస్కరణల చట్టం (1973) అనుసరించి 10 ఎకరాల పైబడి ఉన్న వారందరూ భూ సంస్కరణల ట్రిబ్యునల్‌ ముందు ‘డిక్లరేషన్‌’ (రూఢిప్రకటన) దాఖలు చేయాలి.

ఈ ప్రకటనలు ‘పబ్లిక్‌ డాక్యుమెంట్లు’. నిజానికి ప్రతి డిక్లరేషన్‌ ఒక వర్గ పోరాట సాధనం. భూమి లేని కూలీలను సమీకరించి ట్రిబ్యునళ్ళను వర్గ పోరాటకేంద్రాలుగా మార్చేయడానికి అవకాశంఉన్నా కామ్రేడ్లు వాటి జోలికిపోలే దు. భూస్వాముల నుండి భూములు సేకరించే పనిని ప్రభుత్వానికి, ట్రిబ్యునల్స్‌కు వదిలేశారు. 1976-77 కమతాల లెక్కలను, ట్రిబ్యునళ్ళ ముందు దాఖలైన రూఢి ప్రకటనలను పరిశీలిస్తే కోస్తా ఆంధ్రాలో 41శాతం, రాయలసీమలో 63శాతం, తెలంగాణలో 57శాతం కమతదార్లు అసలు డిక్లరేషన్‌లేఇవ్వలేదు. ఇది చట్ట ప్రకా రం నేరం. ప్రకటన ఇవ్వకుండా భూములు అమ్మడానికి లేదు. అయినా ఏం జరిగిందో చూశాం. 

శూద్ర రైతు కులాలకు భూమి హక్కులు కల్పించే జమిందారీ వ్యతిరేకపోరాటం, దళిత పేదలకు భూములను అందించే భూసంస్కరణల పోరా టంలో కామ్రేడ్ల పాత్రను తులనాత్మకంగా పరిశీలించవలసి ఉంది. అయితే ఇందు కు రెండు మినహాయింపులున్నాయి. అవి తెలంగాణ సాయుధపోరాటం, జగిత్యాల నాగేటిచాళ్ళ పోరాటం, అవి రెండూ తెలంగాణలో జరిగాయి.2005 వరకు ఉన్న లెక్కల్ని తీసుకొని చూస్తే, మన రాష్ట్రంలో పంపిణీ అయిన ప్రభుత్వ భూమి 42 లక్షల ఎకరాలు. 23 జిల్లాలలో ఆయా సామాజిక వర్గాలకు పంపిణీ అయిన భూవిస్తీర్ణం అన్ని జిల్లాలలో, ఆ జిల్లాలో దళిత జనాభాతో సంబం ధం లేకుండా 22శాతంకు మించలేదు. 

రాష్ట్ర జనాభాలో దళితులు 18.45 శాతం (2001) ఉండగా, గ్రామీణ పేదలలో వారు 35 శాతం ఉన్నారు. పంపిణీ అయిన భూమిలో 40 శాతం పేదల నుండి పెద్దలకు అన్యాక్రాంతం అయ్యిందని అంచనా. దీనిని నివారించేందుకు 1977లో తెచ్చిన అన్యాక్రాంత నిషేథ చట్టాన్ని ప్రభుత్వం అమలుపరచనూ లేదు, అందుకు ఉద్యమాలు రానూలేదు. పేదలు ముఖ్యంగా దళిత ఎసైనీదార్లకు రక్షణకల్పించే ఈ చట్టాన్ని 2007 అప్పటి ‘మహానేత’ ప్రభుత్వం సవరణ తెచ్చి నీరుగార్చింది. ఈ సవరణ ఆధారం చేసుకొని కడప జిల్లా మొత్తాన్ని చట్టం పరిధి నుండి మినహాయించారు. ఎక్కడ ఎసైన్‌మెంటు భూములు ఎక్కువగా ఉంటే అక్కడ సవరణ చట్టాన్ని వాడుకొని పేదల నుండి భూములు లాక్కున్నారు. భూముల విషయంలో దళితులకు ఇంత పబ్లిక్‌గా జరిగిన మోసం, దగా బహుశా ఈ ఐదు దశాబ్దాలలో మరొకటి లేదు.

దళితులకు భూమి ఉండవలసిన అవసరాన్ని శివగామి నొక్కి చెబుతున్నారు. తాను ఎంత పేదరికంలోఉన్నా ఐ.ఎ.ఎస్‌. వరకు వెళ్ళడానికి కారణం తన తల్లిదండ్రులకు ఉన్న కొద్దిపాటి భూమేనని ఆమె అన్నారు. అంతేకాదు దేశంలో దళిత వర్గాల నుండి ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌. అయినవారు, ఇతర ఉన్నత స్థానాలలోకి వెళ్లగలిగిన వారి నేపథ్యం పరిశీలిస్తే ‘భూమి’ పోషించిన పాత్ర కనిపిస్తుందని చెప్పారు. భూమిలో వ్యవసాయం చేయకపోయినా ఫర్వాలేదు, అది దళితులకు భరోసాను, భద్రతను, ఆత్మగౌరవాన్ని పరపతిని ఇస్తుందని, కనుక ఎవరికంటే కూడా దళితులకు భూమి అవసరం ఉంటుందనీ అన్నారామె. 

శివగామి వంటి ఐ.ఎ.ఎస్‌.లకు ఆదర్శంగా నిలచిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ దళిత గ్రామీణ పేదల అభివృద్ధిలో ‘భూమి’ ప్రాధాన్యతను గూర్చి ఇలాఅన్నారు- ‘భూమికి సంబంధించిన అన్నిసంబంధాలు లేదా భూమికి సంబంధించిన ఉత్పత్తి సంబంధా లను, భూమిలేని పేదలకు అనుకూలంగా పునర్నిర్మించడమే భూ సంస్కరణలు. భూ బదలాయిపు ద్వారా ఉన్నవారి నుండి లేని వారికి అధికారం, ఆస్తి, హోదా అన్నీ ఒక బృందం నుండి మరో బృందానికి మారుతాయి.

కొంత భూమి తమ స్వంతం అని పేదవారు అనిపించుకున్నపడు స్వతహాగా ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం, ఇతరు లతో తాము సమానం అనే భావనలు వారిలో కలుగుతాయి. దారిద్య్రానికి, పరాన్న భుక్కులకి, దోపిడీ అసమానత సంబంధాలకు మూలకారణంగా భూసమస్య కనిపి స్తుంది. పేదవారికి భూ పంపిణీ చేయడంద్వారా వారు దోపిడీ నుండి విముక్తి పొందగలరు. తద్వారా మార్కెట్‌లో కార్మిక శక్తి, రుణ లావాదేవీలు బలపడతాయి. లబ్దిదారులకు బ్రతికేందుకు ఒక బలమైన ఆధారం దొరుకుతుంది. అంతేగాకుండా వారి సాంఘిక, ఆర్ధిక హోదాలు మెరుగుపడతాయి’.

సాలుకు లక్ష రూపాయలు వ్యవసాయేత ఆదాయం ఉన్నవారికి భూమి ఉండన వసరం లేదన్నది శివగామి భావన. వ్యవసాయేతర రంగాలలో ఆదాయాలు పొందు తున్నవారు, పన్ను ఎగవేత కోసం వ్యవసాయ భూములను కొనసాగిస్తున్నారు. విదేశాలలో స్థిరపడి ‘గ్రీన్‌ కార్డు’లు పొందిన వారికి వ్యవసాయం భూమితో ఏమి పనని శివగామి సూటిగాప్రశ్నిస్తున్నారు. భూమిపై జీవనోపాధి పొందుతున్న వారికి, వ్యవసాయంపై జీవిస్తూ భూమిపై హక్కులేని వారికి ఇచ్చేందుకు దేశంలో కావలసి నంత భూమి ఉందని ఆమె అంటారు. 

వామపక్ష పార్టీలను మినహాయిస్తే రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీ లు, వాటి నాయకులు పల్లెబాటలు, కాలిబాటలు, సురాజ్యాలు ఇలా రకరకాల పేర్ల తో యాత్రలు చేస్తున్నారు. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. దళిత, పేద ప్రజలారా జాగ్రత్తగా చెవి ఒగ్గి వినండి. అందులో ‘భూమి’, ‘పంపకం’ అనే మాటలు మీకు వినిపించవు, కనిపించవు. కలెక్టరుగా తాను ఆదేశాలు ఇవ్వగలను గాని అవి తమ దళితులకు చేరాలంటే ముందువారు సంఘటితం కావాలని శివగామి గుర్తించారు. అదే జరిగి తే కలెక్టరుగా తాను లేకపోయినా పనులు జరుగుతాయని భావించారు. తమిళనా డు దళితభూఉద్యమానికి,పంచమిభూముల సాధనకు ప్రజలను సమీకరి స్తున్నారు ఆమె. గొప్ప చరిత్రకలిగిన దళితఉద్యమం- దారి ఎక్కడతప్పిందో గ్రహిస్తుందా!?


పి.యస్‌. అజయ్‌ కుమార్‌

Surya News Paper Dated : 30/12/2012

పురుషాధిక్య విష సంస్కృతి --డేవిడ్,



దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల మెడికో విద్యార్థి సామూహిక అత్యా చారానికి గురైన సంఘటన యావత్‌ దేశా న్ని కుదిపేసింది. దేశ రాజధాని సైతం మహి ళలకు ఏమాత్రం క్షేమ దాయకం కాదని మరోసారి ప్రపంచానికి రుజువు చేసింది. ఒక మహిళానేత కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తున్న, దేశాన్నెలా పాలించాలో చట్టా లుచేసే సభకు మరో మహిళ నాయకత్వం వహిస్తున్న, చట్టాలు చేసే సభకు ప్రధాన ప్రతిపక్షనేతగా ఒక మహిళ నేతృత్వం వహిస్తున్న ఈ దేశంలో నిత్యం ఏదో ఓ మూలన జరుగుతున్న అత్యా చారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేయడం, ప్రభుత్వాలు చట్టాలు చేస్తామని హమీలు గుప్పించడం తప్ప- సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలే పోతున్నాము. మెడికో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలోనే దేశ రాజధానితోపాటు అనేక ప్రాంతాల్లో ఇలాంటివే అనేక ఘటనలు వెలుగు చూశాయి. మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రూపంలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. 

అసలు మానవ సంబంధాలు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషిపట్ల తోటి మనిషికి ఉండాల్సిన మానవ సంబంధం ఎందుకు మృగ వాంఛగా మారుతోంది? ఇలాంటి సంఘటనలు నిత్యం జరగడానికి కారణం ఏమిటి? నేటి సామాజిక, ఆర్థిక, రాజరీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులలోని మానసిన బలహీనతలే ఈ చర్యలకు కారణమా అనేది ఆలోచిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వలోఉన్న పెద్దలు అత్యాచారాలు జరగడానికి మహిళలలే కారకులంటూ నెపాన్ని వారిపైనే నెట్టి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిసున్నారు. దేశంలో జరుగున్న వరుస అత్యాచారాలకు కారణం స్త్రీలు, పురుషులు రాసుకు పూసుకు తిరగడమే కారణమంటూ ఈ మధ్య పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. మొన్న హర్యానాలోని జింద్‌ జిల్లాలో 16ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన సందర్భంగా అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి బాలికలకు 16 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేయాలని ఆ గ్రామ ఖాప్‌ పెద్దలు సూచించారు. 

ఇందుకు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా కూడా వంత పాడారు. ఇదే హర్యానాలో ఇంకో పెద్దమనిషి అత్యాచారాలకు కారణం పురుషులు మంసాహారం తినడమే కారణమంటూ ఇంకో విచిత్ర ఆరోపణ చేశాడు. గతంలో మన రాష్ర్ట డీజీపీ దినేష్‌ రెడ్డి కూడా స్త్రీలపై అత్యాచారాలు జరగడానికి వారు ధరిస్తున్న వస్త్రాలు కూడా ఒక కారణం అంటూ వ్యాఖ్యానిం చారు. మహిళలపై, బాలికలపై ఈవ్‌ టీజింగ్‌ ఘటనలు పెరిగిపోవడానికి స్త్రీలు ధరిస్తున్న కురచ దుస్తులు, స్కర్టులు కారణమని, అవి యువకులను రెచ్చగొడుతున్నాయి’ అని తృణమూల్‌ ఎమ్మెల్యే చిరంజీత్‌ చక్రబర్తి కూడా వ్యాఖ్యానించారు.
అత్యాచారం చేయడం, బలహీనులపై శారీర కంగా, మానసికంగా దౌర్జన్యం చేయడం వంటివి అర్థనగ్న దుస్తులవల్ల జరగటం లేదు. ఎందు కంటే నేడు దేశంలో, రాష్ర్టంలో జరుగుతున్న అత్యాచారాల్లో పురుష మద మృగాలు 3 సంవత్సరాల పసి పిల్లల నుంచి పండు ముసలివాళ్లను సహితం వదలడం లేదు. ఈ మధ్యనే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో దేశంలో మహిళలపై జరిగిన అత్యాచారాల రికార్టును బయట పెట్టింది. దేశ వ్యాప్తంగా గత సంవత్సరం 24,003 అత్యాచార సంఘటనలు జరిగితే వాటిలో మైనారిటీ తీరని పసి పిల్లలపై 7058 అత్యాచారాలు జరిగినట్లు ఆ లెక్కలు చెబుతున్నాయి. అంటే అత్యాచార బాధితుల్లో 30 శాతం మంది పసిపిల్లలు ఉంటున్నారు.

ఇక మన రాష్ర్టంలో గత సంవత్సరం 1442 అత్యాచార సంఘటనలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతుంటే వాటిలో 646 మంది బాధితులు పసిపిల్లలు ఉన్నారు. అంటే మన రాష్ర్టంలో దాదాపు 44.7 శాతం అత్యాచారాలు బాలికలపై, చిన్న పిల్లలపై జరిగినట్లు తెలుస్తోంది. మమత బెనర్జీ పరిపాలిస్తున్న రాష్టంలో గత సంవత్సరం మొత్తం 2363 మందిపై అత్యాచార ఘటనలు జరిగితే, వాటిలో మైనారీటి తీరని 345 మంది పసిపిల్లలు ఉన్నారని జాతీయ నేరపరిశోధన విభాగం చెబుతోంది. మరి ఇంత మంది పసి పిల్లలు అత్యాచారానికి గురికావడానికి ఆ పిల్లలు ఎవరిని రాసుకు పూసుకు తిరిగారో మమతా బేనర్జీయే సెలవివ్వాలి. ఒక మహిళగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అత్యాచారాలకు ఇలాంటి చౌకబారు కారణాలు చెప్పడం భావ్యంకాదు. ఇక బాల్యవివాహాలు అత్యా చారాలను అరికడతాయని ఖాప్‌ పెద్దలు అంటున్నారు. అయితే హర్యానా వంటి రాష్ర్టంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను పరిశీలిస్తే అది వాస్తవం కాదని తెలుస్తోంది. గత సంవత్సరం హర్యానాలో మొత్తం 725 అత్యాచారాలు జరిగితే వారిలో 661 మంది బాధితులు వివాహితులే (30 ఏళ్లకు పైబడిన వాళ్లే) అని జాతీయ నేర పరిశోధన విభాగం లెక్కలు చెబుతున్నాయి. 

devidఅంటే బాల్య వివాహాలు చేసినంత మాత్రాన ఈ అత్యాచారాలు ఆగిపోవని, పైగా ఈ బాల్యవివాహాలవల్ల బాలి కలనుఇంకా అంధకారంలోకి నెట్టివేయడమేతప్ప సమస్యను పరిష్కరిం చడంకాదని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా మహిళలు ముఖ్యమంత్రు లుగా, హోంమంత్రులుగా అధికారంలోఉన్న రాష్ట్రాల్లో సైతం (ఉదా: ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌) స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. పైగా ఈ అత్యాచారాలకు పాల్పడుతున్న వాళ్లలో ఎక్కువమంది బాధితులకు తెలిసిన వ్యక్తులు, బంధువులే! నేడు మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు కారణం- పురుష స్వామ్యం, లేదా ఆపోజిట్‌ సెక్స్‌ని బలవంతంగా లోబర్చుకోవడం. అది అదిమకాలం నుంచి నేటివరకు కొనసాగుతోంది. ఇందుకు కారణం మన చుట్టూ కొనసాగుతున్న సామాజిక కారణాలే తప్పితే వస్త్రధారణో, బాల్య వివాహాలు చేయక పోవడమో కారణం కాదు.

Surya News Paper Dated : 4/1/2013

నేరము-శిక్ష-రాజ్యము --పొఫెసర్ జి. హరగోపాల్



rape
డల్లీలో జరిగిన అత్యాచారం మీద సమాజంలో చాలామంది ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భంలోనే బాధితురాలు మరణించడం, ఆగ్రహంగా ఉన్న మధ్యతరగతిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఉద్య మం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆందోళన రాజ్య వ్యవస్థను వెంటాడింది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అని మనం అనుకుంటున్న దేశంలో ప్రజావూపతినిధులకు ప్రజల మీద విశ్వాసం లేకపోవడం ఒక ఎత్తైతే, ప్రజలకు వ్యవస్థమీద ఏ మాత్రం విశ్వాసం లేకపోవడం మరొక ఎత్తు. ఈ విశ్వాసరాహిత్యం సర్వత్రా, అన్ని రంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. చిన్న సంఘటన జరిగినా ప్రజలు ఎక్కడికక్కడ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. పాలకులు మళ్లీ మళ్లీ ప్రజలకు చట్టబద్ధ పాలన గురించి నీతులు చెప్పడం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అనడం హాస్యాస్పదంగా తోస్తుంది. నిజానికి మన దేశంలో పాలకులకు చట్టం మీద ఏ మాత్రం గౌరవం లేదు. చట్టా న్ని అడ్డం పెట్టుకుని చాలా చాలా దుర్మార్గమైన, అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చట్టాన్ని అమలు చేయవలసిన సంస్థలను నిర్వీర్యం చేసే వాటిని చాలా వరకు దురుపయోగం చేస్తున్నారు. ఇంత చట్టరాహిత్యమున్న దేశంలో, రాజ్యానికి మరింత అధికారం ఇవ్వడానికి ఒత్తిడి పెట్టడం, రాజ్యం ఎంత క్రూర చట్టాన్నైనా చేయవచ్చు అనే ఆలోచనకు మద్దతును ప్రకటించడం ఒక విచిత్రం. ఏ మాత్రం తమకు విశ్వాసంలేని రాజ్యానికి ఎంత అధికారాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం చాలా ప్రమాదకర ధోరణి.

ఒక తెలుగు టీవీ ఛానల్ ఈ సమస్యమీద నిర్వహించిన ఒక సదస్సులో చాలామంది విద్యార్థులు, విద్యార్థినులు ఢిల్లీలో అత్యాచారానికి పాల్పడిన దోషులకు ఉరిశిక్ష వేయాలని ముక్తకం డిమాండ్ చేశారు. కొందరు సంఘటన జరిగిన వెంటనే వాళ్లను చంపివేయాలని వాదించారు. ఉరిశిక్ష వేయాలని ఎవ్వరూ అన్నా చప్పట్లు కొట్టా రు. ఈ డిమాండ్ చేసిన వాళ్లలో తెలంగాణ విద్యా ర్థి సంఘానికి చెందిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. తెలంగాణలో రాజ్యం తన అధికారా న్ని ఎంత దుర్వినియోగం చేసిందో అతనికి పూర్తి గా అవగాహన లేదు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు ఎలా ప్రవర్తించారో చూసి కూడా దాని నుంచి ఏమీ నేర్చుకున్నట్లు లేదు. ఆంధ్ర ప్రాంతంలోని కొందరు ఆవేశపరు లు తెలంగాణ ఉద్యమాన్ని సైన్యం సహాయంతో అణచివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి మనం అంగీకరిస్తామా? అలాగే ఒక పీడీఎస్ యూ అమ్మాయి, ఒక ఏఐఎస్‌ఎఫ్ అమ్మాయి కూడా అందరూ వాదించినట్లుగానే వాదించారు. వామపక్ష రాజకీయాలలో ఉన్న విద్యార్థుల అవగాహన మిగతా వాళ్లకంటే భిన్నంగా లేదు. మార్క్సిస్టు అవగాహన ఉన్నవాళ్లు నేరాన్ని ఎలా చూడాలి? రాజ్యాన్ని ఎలా చూడాలి అనే విషయంలో వాళ్ల రాజకీయ అవగాహన, రాజకీయార్థిక దృక్పథం భిన్నంగా లేకపోవడం ఎంత విషాదం.

ఇలా వాదించడం నేరస్థులకు శిక్ష వెయ్యవద్దని కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో నేరస్థులకు శిక్ష వెయ్యవలసిందే. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలి అన్న దానిమీద ఆవేశంలో ఉండేవారు చేసే డిమాండ్ న్యాయసూవూతాలకు, నాగరికత ప్రమాణాలకు విరుద్ధంగా ఉండకూడదు. చారివూతికంగా నేరం-శిక్ష చాలా మార్పులకు గురైంది. చట్టబద్ధ పాలన ఆవిర్భావానికి ఒక ప్రధాన కారణం ఒక వ్యక్తి నేరం చేస్తే, నేర బాధితులు చాలా ఆగ్రహంగా ఉండి నేరాలపై ప్రత్యక్షంగా తామే చర్య తీసుకుంటే, ప్రతీకార చర్య నేరం కంటే తీవ్రంగా ఉండవచ్చు. ఆవేశకావేశాలలో వ్యక్తులు నిగ్రహం కోల్పోవడం, సంయమనం పాటించకపోవడం సహజమే. అందుకే నేరం చేసిన వ్యక్తులను, లేదా నిందితులను, పోలీసుల కస్టడీలోకి తీసుకుని, వాళ్ల చేసిన నేరాన్ని న్యాయస్థానాలకు తీసుకెళ్లి, అమలులో లేదా మనం చట్టబద్ధంగా అంగీకరించిన శిక్షను వేయాలి. కస్టడీ అంటే రక్షణ. కానీ పోలీసుల రక్షణలో భద్రంగా ఉండవలసిన వాళ్లను చంపడం కస్టోడియల్ మరణాలు ఎంత చట్ట వ్యతిరేకం. కానీ ఇప్పుడున్న ఆవేశంలో ఢిల్లీలో ఈ నేరానికి పాల్పడ్డ వాళ్లను ఎవరో పోలీసు అధికారి ఎన్‌కౌంటర్ చేస్తే సంతోషపడేవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారి రేపు ఎన్నికల్లో పాల్గొని ఢిల్లీ ప్రభుత్వంలో హోంమినిస్టర్ కూడా కావచ్చు. మన రాష్ట్రంలో దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. కానీ పోలీసులకు మనం అలాంటి అధికారాలు ఇస్తే, రేపు అమాయకులను చంపితే రక్షణ ఏమిటి? నిందితులను ఉరితీయండి అని ఎంత బలంగా డిమాండ్ చేస్తున్నామో, అంతే బలంగా అమాయకులను చంపినప్పుడు పోలీసుల మీద చర్య తీసుకోండి అని డిమాండ్ చేసే సంస్కృతి సమాజంలో ఉందా?

నేరము-శిక్ష-రాజ్యము

నిజానికి ఢిల్లీ సంఘటనలో అమానత్ చాలా పోరాటమే చేసి చనిపోయిం ది. కాబట్టి దీంట్లో అత్యాచారమే కాక హత్య కూడా ఉంది. ఈ నేరానికి చట్టపరిధిలోనే ఉరిశిక్ష వేయవచ్చు. (ఉరిశిక్ష అనాగరికం అనేది మరొక అంశం) ఉన్న చట్టాలను అమలు చేయండి అని అడిగే బదులు, కఠినాతి కఠినమైన శిక్ష వేయండి అనే డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన జస్టిస్ వర్మ కమిటీని నియమించి, శిక్షాస్మృతిని పరిశీలించవలసిందిగా కోరింది. కొన్ని పార్టీలు పార్లమెంటు అత్యవసర సమావేశం జరపాలని కోరుతున్నాయి. జరిగిన దుర్మార్గాన్ని వాళ్ల వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నా రే కానీ బాధితురాలి పట్ల అది నమ్మదగిన కన్‌సర్న్ కాదు. కన్‌సర్న్ ఉంటే అసలు పరిస్థితి ఇంత దిగజారేది కాదు. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లను అనుమానంగా చూడడం మానవీయం కాదు. కానీ ఈ కన్నీళల్లలో మనదేశంలో స్త్రీలు అనుభవిస్తున్న హింస ఉందా, ఈ కన్నీళ్ల వెనుక అమానుషంగా మారుతున్న స్త్రీ, పురుష సంబంధాలున్నాయా? ఒక మానవీయ సమాజాన్ని నిర్మించాలనే తపన ఉందా? ఈ ప్రశ్నలు మనం రాజకీయ నాయకులను అడగవలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్లు విధానాలను నిర్ణయిస్తున్నారు. మానవ సంబంధాలను మానవీకరించే రాజకీయ, ఆర్థిక ప్రక్రియ చేపట్టకుండా, దుర్మార్గమైన ఆర్థిక విధానాలను దేశం మీద రుద్ది, లక్షలాదిమంది స్త్రీలు తమ శరీరాన్ని అమ్ముకునే స్థితికి నెట్టారు.

పాలకులు ఏ మాత్రం జ్ఞానం లేకుండా అమెరికా వాడు, అంతర్జాతీయ ఆర్థికశక్తులకు దాసోహం అని, తాము దిగుమతి చేసుకున్న విధానంలో మానవీయత ఏమైనా ఉందా? ఈ విధాన ప్రభావం సామాజిక సంబంధాల మీద ఏం ఉంటుందో ఎవరైనా ఆలోచించారా? ఈ ఆర్థిక నమూనా మౌలిక విలువలు ఏమిటి? ఆస్తి, అధికారం, సౌఖ్యం. అందుకే ప్రపంచంలోని అతి సంపన్నులలో మన వాళ్లున్నారు. అధికారం నియంతృత్వం వారిలో ఉంది. ఈ రెంటికి మించి సౌఖ్యం సామాజిక పునాదులను కూలుస్తున్నది. సౌఖ్యం అంటే ఏమిటి? ఏడు నక్షవూతాల హోటలు, అతిఖరీదైన కారు, కళ్లు తిరిగే బంగళా, ఇంటినిండా విలాసవస్తువులు. ఇది వస్తువులకు సంబంధించిందే అయినా ఈ వస్తువులలో ఈ వర్గం మహిళను కూడా చేర్చింది. సాంస్కృతిక విలువలు సినిమా పరిక్షిశమ వీటి చుట్టే తిరుగుతుంది. మహిళల పట్ల ఇంత జుగుప్సాకరమైన సంస్కృతిని అల్లి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని కళ్లనీళ్లు పెట్టుకుంటే ఏం లాభం?

సమాజంలో ఏ నేరానికైనా చాలావరకు ఆర్థి క వ్యవస్థలో పాలకుల ‘విలువల ఛట్రం’లో వేళ్లు ఉంటాయి. ఒక్క సంఘటనకు స్పందిస్తూ.. చట్టాలను మార్చండి, మరింత కఠినమైన చట్టాలను తీసుకరాండి అని అడిగి ఏం లాభం? ఈ మధ్యే ఒక వ్యాసంలో మాజీ ఐఎఎస్ అధికారి యుగంధర్ ఒక మానవ సమూహం పైనుంచి ప్రవహిస్తున్న ఒక నదిలో రోజూ శవాలు వస్తుంటే, ఈ శవాలను ఏం చేయాలి అని బాధలు పడుతూనే ఉంటారు. ఆ శవాలకు అంతిమక్షికియలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ శవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని పైకి వెళ్లి మాత్రం చూడరని ఉదహరించా డు. వీళ్లు ఎందుకు చస్తున్నారో, చంపబడుతున్నారో కనుక్కొనడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనం కూడా అత్యాచార బాధితులను చూస్తున్నాం కానీ వీటికి మూలాలు వెతకడానికి సిద్ధంగా లేము. అలా సిద్ధంగా లేని సమాజమే శిక్షతో సరిపుచ్చుకుని, అప్పుడప్పుడు వీధుల్లోకి వెళ్లి ఆందోళన చేస్తుంటారు. ఆందోళన అవసరం. కానీ అది ఆరంభం మాత్రమే. అక్కడే ఆగి రాజ్యానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం మన గోతిని మనం తవ్వుకోవడమే.

మన సమాజంలో ప్రజాస్వామ్య సంస్కృతి చాలా బలహీనంగా ఉంది. నిజానికి ఇది పునాదులు లేని ప్రజాస్వామ్యం. అందుకే నియంతృత్వంవైపు మనకు తెలియకుండానే ప్రయోగిస్తున్నాం. ఏ రాజకీయపార్టీ సంస్కృతి చూస్తున్నా, వాళ్ల నాయకులు విచ్ఛలవిడి అధికారాలు కలిగి ఉన్నారు. అది జయలలితే కావచ్చు, మమతాబెనర్జే కావచ్చు, చిదంబరమే కావచ్చు, వీళ్లకు నాయకుడు నరేంవూదమోడీయే కావచ్చు. గుజరాత్‌లో స్త్రీలపై జరిగిన అత్యాచారాల గురించి ఇంతకు ముందు వ్యాసంలో నేను ప్రస్తావించాను. నేరాన్ని గురించి కాక శిక్ష గురించే ఆలోచిస్తే గుజరాత్ దుర్మార్గమే పునరావృతమౌతుం ది. నేరం మూలాలను వెతికే ధైర్యం లేని సమాజానికి నరేంద్ర మోడీయే పరిష్కారంగా కనిపిస్తాడు. ఢిల్లీ సంఘటన మీద స్పందన స్త్రీ గౌరవాన్ని, స్త్రీ, పురు ష సంబంధాలను మానవీకరించే దిశగా కాక, మోడీ లాంటి నియంత ఎదుగుదలకు దారి తీస్తుంది. నేరము, శిక్ష చర్చలో సమాజ బాధ్యత, ప్రజల స్వేచ్ఛ, రాజ్యాధికారం ప్రధాన అంశాలుగా ఉండాలి. ఇప్పటి చర్చ నేరము, రాజ్యాధికారానికి మాత్రమే పరిమితం కావడం అపరిపక్వ సమాజ లక్షణం. ఈ ప్రక్రియలో శిక్ష పేర రాజ్యం బలపడడం ఎంత నిజమో, ప్రజలు స్వేచ్ఛను కోల్పోవడం కూడా అంతే నిజం, నేరాన్ని నియంవూతించడం మాత్రం అనుమానమే.
పొఫెసర్ జి. హరగోపాల్

Namasete Telangana Telugu News Paper Dated: 3/1/2013

నిరంకుశ స్థాపన వద్దు --జగన్ ఎన్‌టీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి(సీపీఐ మావోయిస్టు)



డిల్లీలో జరిగిన అమానత్ సామూహిక అత్యాచార ఘటన. ఇది దేశాన్ని కుదిపేసింది. ఘటన జరిగిన తీరు మానవీయత ఉన్న మనుషులనందరినీ కదిలించింది. దేశవ్యాప్తంగా ప్రజలు విద్యార్థి యువకులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు.అమానత్‌పై నిందితులు ప్రవర్తించిన తీరు ఫలితంగా అమానత్ ఘటనతో ఆగ్రహజ్వాలలైన యువత నిందితులను ఉరితీయాలనేది మొదలు నపుంసకులుగా చేయాలనీ, బహిరంగంగా ఉరితీయాలనీ, బహిరంగ ప్రదేశంలో రాళ్లతో కొట్టి చంపాలని(అరబ్‌దేశాల్లో అమలు చేస్తున్న మధ్యయుగాల నాటి శిక్షల తీరు గా)రకరకాలుగా డిమాండ్ చేస్తున్నారు. అతి కిరాతకంగా నిండు ప్రాణాన్ని బలిగొన్న వారికి ఎలాంటి శిక్ష వేయాల్నో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ కూడా సత్వర, శిక్షలు అమలు చేయడానికి సంబంధించి న బిల్లు రూపకల్పనలో తలమునకలై ఉన్నటు ్లవార్తలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలోని కమిటీకి శిక్షలకు సంబంధించిన సూచనలు పౌరుల నుంచి కోరుతున్నది. ఇప్పటికే అమలులో ఉన్న అత్యాచార చట్టాల కోరలకు పదునుపెట్టి సత్వరమే చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నది. 

ఇక్కడ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కుట్ర ఒకటి పకడ్బందీగా జరుగుతున్నది. లైంగికహింసకు సంబంధించిన మౌలిక కారణాన్ని పట్టించుకోకుండా నేరానికి మనిషిని మాత్రమే బాధ్యున్ని చేసే ప్రయత్నమొకటి జరుగుతున్నది. ఎక్కడైనా, ఒక వ్యక్తి నేరాని పాల్పడితే దానికి అతనున్న సామాజిక పరిస్థితుల ప్రభావమే ప్రధాన కారణమవుతుందని సామాజిక శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ నిజాన్ని దాచి పెట్టే కుట్ర పాలకులు ప్రయత్న పూర్వకంగా దాచి పెడుతున్నారు. అమానత్ విషయంలో ప్రజల్లో రగిలిన ఆగ్రహావేశాలను సాకుగా తీసుకుని ప్రభుత్వం నిర్బంధ కోరలకు మరింత పదు నుపె ఉపయోగించుకోవాలనుకుంటున్నది. అంతేగాకుండా ప్రజల ప్రాణాలను తీసే హక్కును రాజ్యం తన చేతుల్లోకి తీసుకునే కుట్రను అమలు చేస్తున్నది.ఇప్పటికే ప్రజలను చంపే అధికారాన్ని చేతిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రజల మాన, ప్రాణాలను తోడేస్తున్న రాజ్యం, ఢిల్లీ ఘటన సాకుగా తీసుకుని మరింత నగ్నంగా ప్రజలను బలిగొనేందుకు సమాయత్తమవుతున్నది. మధ్య యుగాల నాటి చీకటి కాలానికి దేశాన్ని వెనక్కి తీసుకపోయే ప్రయత్నం జరుగు తున్నది.

ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు అమానత్ పైన జరిగిన ఘటన పట్ల తీవ్రంగా స్పందించాలని కోరుతూనే రాజ్య స్వభావాన్ని, కుట్రలను పసిగట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా విధ్వం సక అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు పోరాడుతున్నప్పుడు రాజ్యం వారిపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. వేలాది మందిని జైళ్లో నిర్బంధిస్తున్నది. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, ఎదిరిస్తున్న ప్రజలపై, ముఖ్యంగా స్త్రీలపై రాజ్యం అత్యాచారాలనే ఆయుధంగా ఎంచుకున్నది. కశ్మీర్, ఈశా న్య రాష్ట్రాలు, మధ్య భారతంలోని దండకారణ్యంలో ప్రజల మాన ప్రాణాలను భద్రతా బలగాలు ఇప్పటికే తోడేస్తున్నాయి. ఎంతో మందిని మాయం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సోనిసోరి ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విష యం తెలిసిందే. మావోయిస్టులకు సహకరిస్తుందన్న సాకుతో సోనిసోరిని ఎంత రాక్షసంగా పోలీసులు చిత్రహింసల పాలు చేశారో చూశాము. సోరీ ఇంకా జైలులోనే న్యాయం కోసం పోరాడుతున్నది.

అసాధారణమైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష వేయాలన్నది ఓ నియమమున్నా.. దానిని సాధారణం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ది. ఇప్పటి దాకా సమాజంలోని పేదలు, వెనుకబడిన బడుగువర్గాల ప్రజలు, మైనారిటీలు మాత్రమే ఉరికంబాపూక్కారు. అలాగే దేశంలో జరుగుతున్న అత్యాచార కేసుల్లో 25 శాతానికి మించి శిక్షలు పడటం లేదు. చట్టంలోని లొసుగులను ఉన్నత వర్గాలు రక్షణకు అనువుగా వాడుకుంటున్న తీరును చూస్తున్నాం. 

కాబట్టి అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించే మాటు న సమాజాన్ని అమానవీయం చేసే విధానాన్ని వ్యతిరేకించాలి. నేరాల విషయంలో సామాజిక బాధ్యతను మరుగు పరిచే చర్యలను వ్యతిరేకించాలి. వ్యక్తి నిర్మూలనతో నేరం అంతం కాదు, నేరానికి మూలం సమాజంలో ఉంటుంది. మధ్యయుగాల నాటి అమానవీయ ఉరిశిక్ష రద్దు చేయాలి.మహిళను లైంగిక వస్తువుగా చూసే దృక్పథం మారనంత వరకు ఈ అత్యాచారాలకు అంతం వుండదు. ఒకవైపు పాలకులు మహిళ సాధికరత, మహిళా స్వాతంత్య్రం అంటూ ఆకర్షణీయ మైన మాటలను వల్లి స్తున్నారు. మరోవైపు మహిళల పట్ల సమాజ దృక్ప థం కించిత్తు కూడా మారడం లేదు. కేవలం కల్లబొల్లి మాటలతో, ప్రచార్భాటాలతో మహిళ ల సమస్యలు పరిష్కారం కావు. మహిళల సమస్యల పరిష్కారానికి సమాజంలో మౌలిక మార్పులు జరగాలి. మహిళల మీద అమలవుతున్న సమస్త పీడనలకు మూలాలు దోపిడీ సమాజంలోనే వున్నాయి. కనుక తమ మీద జరుగుతున్న సమస్త పీడనలను తొలగించుకోవడానికి మహిళలు దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సగభా గం కావాలి. అప్పుడే నిజమైన సాధికారత, స్వతంవూతలను పొందగలరు.
-జగన్
ఎన్‌టీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి(సీపీఐ మావోయిస్టు)

Namasete Telangana Telugu News Paper Dated: 3/1/2013

తెలుగు మంత్రి ఏం చెయ్యాలి? - కంచ ఐలయ్య



భాష సెంటిమెంటు సమస్య కాదని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. భాష ప్రజల బతుకుదెరువు సమస్య అని ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే తెలుగు మేధావి వర్గం అర్థం చేసుకోవాలి. తెలుగు ఎవరి సొత్తు కాదు. అలాగే ఇంగ్లీషు ఏ ఒక్కరి సొత్తు కావడానికి వీలులేదు. భాష, సిలబస్, టీచింగ్ స్థాయి, వసతులు సంపూర్ణ సమానత్వం రూపొందించగలిగే విద్యావిధానం ఇక్కడ ఏర్పడితే ఇదొక మోడల్ రాష్ట్రంగా రూపుదిద్దుకొనే అవకాశముంది. 

ప్రపంచ తెలుగు మహాసభల్లో మొదటిసారిగా రాష్ట్రంలో తెలుగు మంత్రి ఒకరుంటారని, 2013ని తెలుగు నామ సంవత్సరంగా పాటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక మంత్రిత్వ శాఖ ద్వారా ఆ భాషకు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు తెలుగు ఏ కుటుంబాల్లో, కులాల్లో, ప్రాంతాల్లో చచ్చిపోతున్నది? ఎవరి మీద బతికి బట్టకడుతున్నది అనే ప్రశ్నల్ని కొంత లోతుగానే చూడాలి. 

పై ప్రశ్నల్ని పరిశీలించే ముందు నేనొక్క విషయం స్పష్టం చేయాలి. నేను ఇంగ్లీషు, తెలుగు భాషల్లో రాస్తానన్న విషయం తెలిసిందే. అదీ నా దస్తూరితోనే రాస్తాను. దస్తూరి అనే పదం ఉర్దూ నుంచి తెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో పుట్టినందుకు నేను తెలుగును ఎంత ప్రేమిస్తానో, ఉర్దూను అంతే ప్రేమిస్తాను. ఉర్దూను నేను రాయలేను, చదవలేను కానీ మాట్లాడతాను. తెలుగు కూడా రాయలేనోళ్ళు, చదవలేనోళ్ళు వేలాది మంది బ్రహ్మండంగా పాడేటోళ్ళుగా, మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు. 

నేను పుట్టినప్పుడు మా ఇంట్లో కురుమ భాష ఉండేది. తెలుగు దాన్ని క్రమంగా చంపింది. నేను తెలుగులో చదువు ప్రారంభించి, పి.యు.సి.లో ఇంగ్లీషు మీడియంలోకి మారి ఇంగ్లీషు పట్టుబట్టి నేర్చుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాస్తాను. ఇప్పుడు ఇంగ్లీషు నా ఆలోచన, రాత, పూత భాష. అది నాచే 'వై అయామ్ నాట్ ఎ హిందూ' రాయించిన భాష. అది నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన భాష. నా కుల దైవం బీరప్పను, ఊరి దేవత పోచమ్మను ప్రపంచ పాఠాల్లోకి ఎక్కించిన భాష. అది నా మాతృ భాష కాదు, పితృ భాష కాదు కానీ బతుకు భాష, చదువు-సంస్కార భాష. ఆ భాషలో ఆలోచిస్తున్నందుకు, రాస్తున్నందుకు పన్ను కట్టాలా? 

తెలుగు నన్ను నా అవ్వతో, బువ్వతో, చేపల పులుసులతో, వట్టితునకల కూరతో అనునిత్యం అనుబంధాల్లో ఉంచుతున్న భాష. ఉర్దూ నాకు హలీమ్‌ను, బిర్యానీని, ఖుబాని తినిపించిన భాష. నేనిప్పుడు ఈ మూడు భాషల్ని ప్రేమిస్తాను. ఉర్దూ తెలుగుకంటే రిచ్ భాష అని గుర్తిస్తాను. ఇంగ్లీషు ఉర్దూ కంటే రిచ్చర్ భాష అని కూడా గుర్తిస్తాను. ఇప్పుడూ నా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, నా ఇండియాలో ఈ మూడింటినీ నా భాషలుగానే గుర్తిస్తాను. 

చచ్చిపోయిన నా కురుమ భాష శవంపై ఏడ్చే ఆలోచన నాకు లేదు, అట్లా ఎవరికీ ఉండొద్దంటాను. మరి మన తెలుగు మంత్రి ఇక్కడి ఉర్దూ భాషనేం చేస్తాడు? ఇంగ్లీషు భాషనేం చేస్తాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది ఒకే ఒక్క భాష రాష్ట్రం కాదన్న విషయం తెలుసా! పంచెకట్టుకోగానే పైజామా, ప్యాంటు కూడా ఇక్కడ ఉన్నాయి, ఉంటాయి, తన శరీరంపైనే ఉంటాయి అనే విషయం మర్చిపోయాడా? 

ఒక భాష లేదా భాషల సంయుక్త లేక ప్రయుక్త రాష్ట్రంలో - తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ - వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పిచ్చి శృతిమించి రాగాన పడగా, ఫెడరల్ కేంద్రం ఒకరోజు వాటి మెడలు వంచాల్సి వస్తుంది. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టినట్టే, తెలుగు సెంటిమెంటును కూడా రెచ్చగొట్టాలని కొంతమంది సమైక్యవాదులు చూస్తున్నారు. తెలుగు అభిమానులు చాలా మంది ఫ్రెంచి, జర్మనీ, ఇటలీ, జపాన్ భాషల లాగా తెలుగును కూడా అభివృద్ధి చేసుకోవాలంటున్నారు. 

అవన్నీ దేశ భాషలు, తెలుగు ఒక ప్రాంత భాష. ఒక విశాల ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు, సంపూర్ణ మానవ అభివృద్ధికి కావలసిన వనరులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యలేవు. ప్రతి ప్రాంతీయ భాషతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ శ్రద్ధతో ఇక్కడొక జాతీయ భాష అభివృద్ధి చెందాల్సి ఉంది. క్రమంగా ఇంగ్లీషుకు ఆ హోదా రాబోతున్నది. అందుకే లంబాడీ తండా నుంచి బంజారాహిల్స్‌లోని స్కూళ్ళన్నిటిలో ఇంగ్లీషు-తెలుగు (ఇంగ్లీషు, ఉర్దూ కొన్ని ప్రాంతాల్లో) సమపాళ్ళలో లేదా కాస్త ఇంగ్లీషు ఎక్కువ సిలబస్ రూపొందించాల్సి ఉంటుంది. ఇంగ్లీషు విదేశీ భాష అన్న సొల్లు సిద్ధాంతం కాసేపు పక్కకు పెడితే ప్రతి ఛైల్డ్ (ప్రాంతీయ భాషతో పాటు) ఇంగ్లీషుపై పట్టుసాధిస్తే ప్రపంచ సంబంధాల్నే భారతదేశం మార్చే అవకాశముంది. ప్రస్తుత చారిత్రక దశలో మనకు కలిసొచ్చిన అంశం మనదేశంలో బాగా భారతీయ ఇంగ్లీషు అభివృద్ధి అవుతున్న దశ ఇది. 

ప్రతి ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఒక సబ్జెక్టు తెలుగు ఖచ్చితంగా ఉండాలి అనే తెలుగు ప్రియులంతా తమ పిల్లల్ని ఈ స్కూళ్ళల్లో గానీ, లేదా అందుకు అవకాశం లేని సి.బి.యస్.సి సిలబస్ స్కూళ్ళలో గానీ చదివిస్తారని అందరికీ తెలుసు. మరి ఈ పండితులే ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా అదే రేషియో ఇంగ్లీషు-తెలుగు ఉండాలని ఎందుకు అడగడం లేదు. రేపు రాబోయే తెలుగు మంత్రి ద్వారా గ్రామీణ బీద పిల్లల భవిష్యత్‌పై దెబ్బకొట్టే నిర్ణయాలే తీసుకుంటే వాళ్ళెందుకు ఊరుకోవాలి? 

విద్యారంగంలో భాష, స్టాండర్, వసతుల సమతుల్యత గురించి వీళ్ళెందుకు మాట్లాడడం లేదు. తెలుగు మంత్రి తెలుగు యూనివర్సిటీ, దాని చుట్టూ పంచెకట్టు దారులకు అవార్డుల పంపిణీలకే పరిమితమౌతాడా! తెలుగు బోర్డులు, ప్రభుత్వ జీవోలు, స్కూలు సిలబస్‌లపై అజమాయిషీ చేస్తాడా/చేస్తుందా? రాష్ట్రంలో సమతుల్య విద్యా విధానాన్ని అభివృద్ధి చెయ్యడానికైతే ఇంగ్లీషు, ఉర్దూ భాషల అభివృద్ధికి కూడా మంత్రిత్వ శాఖలుండాలి కదా! 

తెలుగు మహాసభల్లో 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన మేధావులు, వారికి సహకరించిన ప్రభుత్వం ఇక్కడ ప్రపంచ ఇంగ్లీషు మహాసభలు పెట్టకపోయినా ప్రపంచ ఉర్దూ మహాసభలైతే పెట్టాలి కదా? ఈ మహాసభలు కేవలం తెలుగు భాష అభివృద్ధికే కాదు తెలుగు సంస్కృతి అభివృద్ధి లేదా ఉన్న తెలుగు సంస్కృతిని కాపాడటం కోసం అంటున్నారు. 

తెలుగు సంస్కృతి అంటే ఏమిటి? పంచెగట్టి, బొట్టుపెట్టి (చీర బెంగాల్‌దో, బీహార్‌దో తెలుగుదో ఇంకా నిర్వచించలేదు మనం) ఉగాది నాడు పచ్చడి తాగి పప్పన్నం తినడమా? తల్లిదండ్రుల్ని 'మమ్మీ, డాడీ' అని పిలవడం మానేసి 'అమ్మా, నాన్న' అని పిలవడమా? అలాగయితే ఉగాది నాడు లాగుతొడిగి 'కల్లుదాగి, కార్జిం' తినేవాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలా? తెలుగు సంస్కృతి నన్నయ, తిక్కన, ఎర్రన, మహాభారతంలో ఉందా, ఈ మహాభారతం కంటే ముందే ఇక్కడున్న పోచమ్మ, కట్టమైసమ్మ, కొమురెల్లి మల్లన్నల్లో చూడాలా వద్దా? తెలుగు పిలుపు అంటే 'అమ్మా, నాన్న' లేనా? అందులో 'అవ్వా, అయ్యా' కూడా ఉంటాయా? 

తెలంగాణ అంతటా తండ్రిని 'బాపు' అని కూడా పిలుస్తారే, అది తెలుగు సంస్కృతిలోకి రాదా? ఈ పిలుపులపై వలపులెందుకూ? భాషను రక్షించడమో అభివృద్ధి చెయ్యడమో అంటే కళాకారులందరినీ తిండి పెట్టి, పెట్టక నగ్నంగా ఎగిరించడమా? ఇప్పుడు కళాకారులుగా, జానపదులుగా అర్ధనగ్నంగా ఎగురుతున్న వారి పిల్లలంతా ఒక్క సబ్జెక్టు మాత్రమే తెలుగు ఉండే స్కూళ్ళలో చదివితే ముందు తరాలు ఇట్లా ఎగురవని మీ అందరికీ తెలుసుగదా? 

ఆదివాసీ, డ్యాన్సులు, జానపద నృత్యాలు అంత గొప్పవయితే మన సినీ యాక్టర్ల పిల్లలందరూ అవే నేర్చుకొని, నిరంతరం అడవుల్లో, తండాల్లో, గ్రామాల్లో ఆడుతూ, పాడుతూ జీవించొచ్చు గదా! అందరూ ఇంగ్లీషులో చదువుకొని ప్రపంచ దేశాలన్నిటిలో సినిమాలెందుకు తీస్తున్నారు? ఒక్కసినిమా సంపూర్ణ జానపదంలో తియ్యమనండీ ఎన్నిరోజులు ఆడుతుందో చూద్దాం. తెలుగుమంత్రి జానపదుల్ని తెలుగు సినిమాలోకి తెస్తాడా, తెలుగు సినిమా జానపదంలోకి మారుస్తాడా? 

భారతీయులుగా ప్రపంచాన్ని ఢీకొని ఇక్కడి ప్రజల్ని అందరికంటే ఒక్కడుగు ముందుచాలనుకుంటే 'దేశ భాషలందు తెలుగు లెస్స', 'సోనార్ బంగ్ల', 'మారాఠా మను', 'గుజరాత్ అస్మిత్' ఎటువైపుకు తీసుకుపోతాయి? చాలా కాలం మన పూర్వీకులు ఒక గ్రామానికి మరో గ్రామాన్ని పరాయి దేశమనుకున్నారు. ఆనాడు 'దేశం' అనే పదానికున్న అర్థం వేరు, ఇప్పుడున్న అర్థం వేరు. ఈ దేశ అధ్యక్షుని చేత అతనికర్థం గాని తెలుగు, మరాఠీ కొటేషన్లతో ఫెడరల్ నిర్మాణానికే భంగం కలిగే ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వాలిప్పిస్తే రాబోయే పరిణామాలేమిటి? 

ఒక భాషను అభివృద్ధి చెయ్యాలంటే మహాసభలు, మంత్రిత్వ శాఖలు పనిచెయ్యవు. గ్రీకు భాష చాలా చిన్న దేశంలో పుట్టి అందులో వచ్చిన రచనల వల్ల ప్రపంచాన్ని శాసించింది. ఈనాటికీ అది బతికి ఉన్నది. ప్లేటో, అరిస్టాటిల్ వేసిన పునాదుల్ని ఎవరూ కూలగొట్టలేకపోతున్నారు. రామాయణ, మహాభారతాలు, వేదాలు కూడా అంత బలమైన మానవ తాత్వికతను నిర్మించలేదు, ఇక్కడి అన్ని రంగాల్లో పనిచేసే ప్రజలను ఇముడ్చుకోలేదు కనుక సంస్కృతం చచ్చిపోయింది. 

గుడుల్లో, సంస్కృత పూజలు, కర్మకాండల్లోని మంత్రాలు ఆ భాష నుంచి బయటకుపోతే ఆ భాష పూర్తిగా చచ్చిపోతుంది. హిబ్రూ భాష, గ్రీకు భాష బైబిల్ భాషలైనాయి కనుక వాటి మనుగడ ఇంకా బలంగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని గుడుల్లో తెలుగులోనే పూజలు, మంత్ర పఠన జరగాలని తెలుగు మంత్రి శాసిస్తే ఆ భాష కొంత మేరకు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ సంస్కృతాన్ని కాపాడుతూ, ప్రజల అభివృద్ధితో ముడిపడి ఉన్న ఇంగ్లీషునుచంపాలనుకుంటే ప్రజల తిరుగుబాట్లు మరో రూపంలో గోచరిస్తాయి. 

ఇవ్వాళ బ్రాహ్మణీయ శక్తులు వేసే ప్రతి అడుగునూ, దళిత - బహుజనులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. 17వ శతాబ్దంలోని వైభవాన్ని తిరిగి తెలుగు గడ్డ మీదికి తిరిగి తేవడమంటే కదిరె కృష్ణ చెప్పినట్లు కుల వ్యవస్థను, అంటరాని తనాన్ని మళ్ళీ తిష్ట వేయించడమే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సాంస్కృతిక జీవనం, కమ్యూనికేషన్ పద్ధతులు, భాష ఈరోజు బాగున్నాయా? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో బాగున్నాయా! రాజు ఆస్థానంలో కొంతమంది కవులు కూర్చొని 'కావ్యాలు' రాస్తే తెలుగు విరాజిల్లినట్లా! 'మీ కావ్యములన్నీ నా కర్రు ముందు బలాదూర్' అని పాటపాడుతూ నాగలి దున్నే శూద్ర-దళిత రైతు తెలుగును, ఉత్పత్తిని, జీవనాన్ని వందలాది బ్రాహ్మణీయ పండితుల కంటే ఎక్కువ అభివృద్ధి చెయ్యలేదా? 'పండితులారా పంచెకట్టుకొనే' తిరగండి లాగు తొడిగితే తురకలైనట్లే ఊళ్ళల్లో పిల్లలు కూడా పాటలు పాడే దశ దూరం లేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో భాష, బతుకుదెరువు పోరాటం ఒక కొలిక్కి వస్తున్నది. తిరుపతి మహాసభల్లో పంచెకట్టుకొని పండుగ చేసుకున్న పండితులందరూ తమ పిల్లల్ని ఒక్క సబ్జెక్టు తెలుగు ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివిస్తే రాష్ట్రంలోని శ్రమజీవులంతా తమ పిల్లల్ని కూడా ఒక్క సబ్జెక్టు తెలుగు ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించే హక్కు ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఈ విధమైన ఇంగ్లీషు మీడియంలోకి మార్చాల్సిన బాధ్యత తెలుగు మంత్రిపైనా ఉంటుంది. సైన్ బోర్డులను, ప్రభుత్వ జీవోలను, విద్యార్థుల మార్కుల మెమోను తెలుగులో రాస్తే, ఉర్దూ సంగతేమిటనే ప్రశ్న మంత్రి ముందు ఉంటుంది. 

కేంద్రం నిర్ణయాత్మకంగా ఉన్న ఫెడరలిజంలో ప్రాంతీయ భాషల పిచ్చిని శృతిమించి రాగాన పడేస్తే భాష-అవకాశ సమానత్వాల పోరాటం రాష్ట్రమంతటా ప్రారంభం కావాలి. భాష సెంటిమెంటు సమస్య కాదని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. భాష ప్రజల బతుకుదెరువు సమస్య అని ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే తెలుగు మేధావి వర్గం అర్థం చేసుకోవాలి. తెలుగు ఎవరి సొత్తు కాదు. అలాగే ఇంగ్లీషు ఏ ఒక్కరి సొత్తు కావడానికి వీలులేదు. భాష, సిలబస్, టీచింగ్ స్థాయి, వసతులు సంపూర్ణ సమానత్వం రూపొందించగలిగే విద్యావిధానం ఇక్కడ ఏర్పడితే ఇదొక మోడల్ రాష్ట్రంగా రూపుదిద్దుకొనే అవకాశముంది. ముఖ్యమంత్రి, రాబోయే తెలుగు మంత్రి, ప్రభుత్వాన్ని భాషా వివాదంలోకి లాగే పండిత వర్గం అర్థం చేసుకుంటే మంచిది.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi News Paper Dated: 4/1/2013