Thursday, January 3, 2013

తెలుగు మంత్రి ఏం చెయ్యాలి? - కంచ ఐలయ్యభాష సెంటిమెంటు సమస్య కాదని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. భాష ప్రజల బతుకుదెరువు సమస్య అని ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే తెలుగు మేధావి వర్గం అర్థం చేసుకోవాలి. తెలుగు ఎవరి సొత్తు కాదు. అలాగే ఇంగ్లీషు ఏ ఒక్కరి సొత్తు కావడానికి వీలులేదు. భాష, సిలబస్, టీచింగ్ స్థాయి, వసతులు సంపూర్ణ సమానత్వం రూపొందించగలిగే విద్యావిధానం ఇక్కడ ఏర్పడితే ఇదొక మోడల్ రాష్ట్రంగా రూపుదిద్దుకొనే అవకాశముంది. 

ప్రపంచ తెలుగు మహాసభల్లో మొదటిసారిగా రాష్ట్రంలో తెలుగు మంత్రి ఒకరుంటారని, 2013ని తెలుగు నామ సంవత్సరంగా పాటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక మంత్రిత్వ శాఖ ద్వారా ఆ భాషకు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు తెలుగు ఏ కుటుంబాల్లో, కులాల్లో, ప్రాంతాల్లో చచ్చిపోతున్నది? ఎవరి మీద బతికి బట్టకడుతున్నది అనే ప్రశ్నల్ని కొంత లోతుగానే చూడాలి. 

పై ప్రశ్నల్ని పరిశీలించే ముందు నేనొక్క విషయం స్పష్టం చేయాలి. నేను ఇంగ్లీషు, తెలుగు భాషల్లో రాస్తానన్న విషయం తెలిసిందే. అదీ నా దస్తూరితోనే రాస్తాను. దస్తూరి అనే పదం ఉర్దూ నుంచి తెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో పుట్టినందుకు నేను తెలుగును ఎంత ప్రేమిస్తానో, ఉర్దూను అంతే ప్రేమిస్తాను. ఉర్దూను నేను రాయలేను, చదవలేను కానీ మాట్లాడతాను. తెలుగు కూడా రాయలేనోళ్ళు, చదవలేనోళ్ళు వేలాది మంది బ్రహ్మండంగా పాడేటోళ్ళుగా, మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు. 

నేను పుట్టినప్పుడు మా ఇంట్లో కురుమ భాష ఉండేది. తెలుగు దాన్ని క్రమంగా చంపింది. నేను తెలుగులో చదువు ప్రారంభించి, పి.యు.సి.లో ఇంగ్లీషు మీడియంలోకి మారి ఇంగ్లీషు పట్టుబట్టి నేర్చుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాస్తాను. ఇప్పుడు ఇంగ్లీషు నా ఆలోచన, రాత, పూత భాష. అది నాచే 'వై అయామ్ నాట్ ఎ హిందూ' రాయించిన భాష. అది నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన భాష. నా కుల దైవం బీరప్పను, ఊరి దేవత పోచమ్మను ప్రపంచ పాఠాల్లోకి ఎక్కించిన భాష. అది నా మాతృ భాష కాదు, పితృ భాష కాదు కానీ బతుకు భాష, చదువు-సంస్కార భాష. ఆ భాషలో ఆలోచిస్తున్నందుకు, రాస్తున్నందుకు పన్ను కట్టాలా? 

తెలుగు నన్ను నా అవ్వతో, బువ్వతో, చేపల పులుసులతో, వట్టితునకల కూరతో అనునిత్యం అనుబంధాల్లో ఉంచుతున్న భాష. ఉర్దూ నాకు హలీమ్‌ను, బిర్యానీని, ఖుబాని తినిపించిన భాష. నేనిప్పుడు ఈ మూడు భాషల్ని ప్రేమిస్తాను. ఉర్దూ తెలుగుకంటే రిచ్ భాష అని గుర్తిస్తాను. ఇంగ్లీషు ఉర్దూ కంటే రిచ్చర్ భాష అని కూడా గుర్తిస్తాను. ఇప్పుడూ నా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, నా ఇండియాలో ఈ మూడింటినీ నా భాషలుగానే గుర్తిస్తాను. 

చచ్చిపోయిన నా కురుమ భాష శవంపై ఏడ్చే ఆలోచన నాకు లేదు, అట్లా ఎవరికీ ఉండొద్దంటాను. మరి మన తెలుగు మంత్రి ఇక్కడి ఉర్దూ భాషనేం చేస్తాడు? ఇంగ్లీషు భాషనేం చేస్తాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది ఒకే ఒక్క భాష రాష్ట్రం కాదన్న విషయం తెలుసా! పంచెకట్టుకోగానే పైజామా, ప్యాంటు కూడా ఇక్కడ ఉన్నాయి, ఉంటాయి, తన శరీరంపైనే ఉంటాయి అనే విషయం మర్చిపోయాడా? 

ఒక భాష లేదా భాషల సంయుక్త లేక ప్రయుక్త రాష్ట్రంలో - తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ - వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పిచ్చి శృతిమించి రాగాన పడగా, ఫెడరల్ కేంద్రం ఒకరోజు వాటి మెడలు వంచాల్సి వస్తుంది. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టినట్టే, తెలుగు సెంటిమెంటును కూడా రెచ్చగొట్టాలని కొంతమంది సమైక్యవాదులు చూస్తున్నారు. తెలుగు అభిమానులు చాలా మంది ఫ్రెంచి, జర్మనీ, ఇటలీ, జపాన్ భాషల లాగా తెలుగును కూడా అభివృద్ధి చేసుకోవాలంటున్నారు. 

అవన్నీ దేశ భాషలు, తెలుగు ఒక ప్రాంత భాష. ఒక విశాల ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు, సంపూర్ణ మానవ అభివృద్ధికి కావలసిన వనరులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యలేవు. ప్రతి ప్రాంతీయ భాషతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ శ్రద్ధతో ఇక్కడొక జాతీయ భాష అభివృద్ధి చెందాల్సి ఉంది. క్రమంగా ఇంగ్లీషుకు ఆ హోదా రాబోతున్నది. అందుకే లంబాడీ తండా నుంచి బంజారాహిల్స్‌లోని స్కూళ్ళన్నిటిలో ఇంగ్లీషు-తెలుగు (ఇంగ్లీషు, ఉర్దూ కొన్ని ప్రాంతాల్లో) సమపాళ్ళలో లేదా కాస్త ఇంగ్లీషు ఎక్కువ సిలబస్ రూపొందించాల్సి ఉంటుంది. ఇంగ్లీషు విదేశీ భాష అన్న సొల్లు సిద్ధాంతం కాసేపు పక్కకు పెడితే ప్రతి ఛైల్డ్ (ప్రాంతీయ భాషతో పాటు) ఇంగ్లీషుపై పట్టుసాధిస్తే ప్రపంచ సంబంధాల్నే భారతదేశం మార్చే అవకాశముంది. ప్రస్తుత చారిత్రక దశలో మనకు కలిసొచ్చిన అంశం మనదేశంలో బాగా భారతీయ ఇంగ్లీషు అభివృద్ధి అవుతున్న దశ ఇది. 

ప్రతి ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఒక సబ్జెక్టు తెలుగు ఖచ్చితంగా ఉండాలి అనే తెలుగు ప్రియులంతా తమ పిల్లల్ని ఈ స్కూళ్ళల్లో గానీ, లేదా అందుకు అవకాశం లేని సి.బి.యస్.సి సిలబస్ స్కూళ్ళలో గానీ చదివిస్తారని అందరికీ తెలుసు. మరి ఈ పండితులే ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా అదే రేషియో ఇంగ్లీషు-తెలుగు ఉండాలని ఎందుకు అడగడం లేదు. రేపు రాబోయే తెలుగు మంత్రి ద్వారా గ్రామీణ బీద పిల్లల భవిష్యత్‌పై దెబ్బకొట్టే నిర్ణయాలే తీసుకుంటే వాళ్ళెందుకు ఊరుకోవాలి? 

విద్యారంగంలో భాష, స్టాండర్, వసతుల సమతుల్యత గురించి వీళ్ళెందుకు మాట్లాడడం లేదు. తెలుగు మంత్రి తెలుగు యూనివర్సిటీ, దాని చుట్టూ పంచెకట్టు దారులకు అవార్డుల పంపిణీలకే పరిమితమౌతాడా! తెలుగు బోర్డులు, ప్రభుత్వ జీవోలు, స్కూలు సిలబస్‌లపై అజమాయిషీ చేస్తాడా/చేస్తుందా? రాష్ట్రంలో సమతుల్య విద్యా విధానాన్ని అభివృద్ధి చెయ్యడానికైతే ఇంగ్లీషు, ఉర్దూ భాషల అభివృద్ధికి కూడా మంత్రిత్వ శాఖలుండాలి కదా! 

తెలుగు మహాసభల్లో 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన మేధావులు, వారికి సహకరించిన ప్రభుత్వం ఇక్కడ ప్రపంచ ఇంగ్లీషు మహాసభలు పెట్టకపోయినా ప్రపంచ ఉర్దూ మహాసభలైతే పెట్టాలి కదా? ఈ మహాసభలు కేవలం తెలుగు భాష అభివృద్ధికే కాదు తెలుగు సంస్కృతి అభివృద్ధి లేదా ఉన్న తెలుగు సంస్కృతిని కాపాడటం కోసం అంటున్నారు. 

తెలుగు సంస్కృతి అంటే ఏమిటి? పంచెగట్టి, బొట్టుపెట్టి (చీర బెంగాల్‌దో, బీహార్‌దో తెలుగుదో ఇంకా నిర్వచించలేదు మనం) ఉగాది నాడు పచ్చడి తాగి పప్పన్నం తినడమా? తల్లిదండ్రుల్ని 'మమ్మీ, డాడీ' అని పిలవడం మానేసి 'అమ్మా, నాన్న' అని పిలవడమా? అలాగయితే ఉగాది నాడు లాగుతొడిగి 'కల్లుదాగి, కార్జిం' తినేవాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలా? తెలుగు సంస్కృతి నన్నయ, తిక్కన, ఎర్రన, మహాభారతంలో ఉందా, ఈ మహాభారతం కంటే ముందే ఇక్కడున్న పోచమ్మ, కట్టమైసమ్మ, కొమురెల్లి మల్లన్నల్లో చూడాలా వద్దా? తెలుగు పిలుపు అంటే 'అమ్మా, నాన్న' లేనా? అందులో 'అవ్వా, అయ్యా' కూడా ఉంటాయా? 

తెలంగాణ అంతటా తండ్రిని 'బాపు' అని కూడా పిలుస్తారే, అది తెలుగు సంస్కృతిలోకి రాదా? ఈ పిలుపులపై వలపులెందుకూ? భాషను రక్షించడమో అభివృద్ధి చెయ్యడమో అంటే కళాకారులందరినీ తిండి పెట్టి, పెట్టక నగ్నంగా ఎగిరించడమా? ఇప్పుడు కళాకారులుగా, జానపదులుగా అర్ధనగ్నంగా ఎగురుతున్న వారి పిల్లలంతా ఒక్క సబ్జెక్టు మాత్రమే తెలుగు ఉండే స్కూళ్ళలో చదివితే ముందు తరాలు ఇట్లా ఎగురవని మీ అందరికీ తెలుసుగదా? 

ఆదివాసీ, డ్యాన్సులు, జానపద నృత్యాలు అంత గొప్పవయితే మన సినీ యాక్టర్ల పిల్లలందరూ అవే నేర్చుకొని, నిరంతరం అడవుల్లో, తండాల్లో, గ్రామాల్లో ఆడుతూ, పాడుతూ జీవించొచ్చు గదా! అందరూ ఇంగ్లీషులో చదువుకొని ప్రపంచ దేశాలన్నిటిలో సినిమాలెందుకు తీస్తున్నారు? ఒక్కసినిమా సంపూర్ణ జానపదంలో తియ్యమనండీ ఎన్నిరోజులు ఆడుతుందో చూద్దాం. తెలుగుమంత్రి జానపదుల్ని తెలుగు సినిమాలోకి తెస్తాడా, తెలుగు సినిమా జానపదంలోకి మారుస్తాడా? 

భారతీయులుగా ప్రపంచాన్ని ఢీకొని ఇక్కడి ప్రజల్ని అందరికంటే ఒక్కడుగు ముందుచాలనుకుంటే 'దేశ భాషలందు తెలుగు లెస్స', 'సోనార్ బంగ్ల', 'మారాఠా మను', 'గుజరాత్ అస్మిత్' ఎటువైపుకు తీసుకుపోతాయి? చాలా కాలం మన పూర్వీకులు ఒక గ్రామానికి మరో గ్రామాన్ని పరాయి దేశమనుకున్నారు. ఆనాడు 'దేశం' అనే పదానికున్న అర్థం వేరు, ఇప్పుడున్న అర్థం వేరు. ఈ దేశ అధ్యక్షుని చేత అతనికర్థం గాని తెలుగు, మరాఠీ కొటేషన్లతో ఫెడరల్ నిర్మాణానికే భంగం కలిగే ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వాలిప్పిస్తే రాబోయే పరిణామాలేమిటి? 

ఒక భాషను అభివృద్ధి చెయ్యాలంటే మహాసభలు, మంత్రిత్వ శాఖలు పనిచెయ్యవు. గ్రీకు భాష చాలా చిన్న దేశంలో పుట్టి అందులో వచ్చిన రచనల వల్ల ప్రపంచాన్ని శాసించింది. ఈనాటికీ అది బతికి ఉన్నది. ప్లేటో, అరిస్టాటిల్ వేసిన పునాదుల్ని ఎవరూ కూలగొట్టలేకపోతున్నారు. రామాయణ, మహాభారతాలు, వేదాలు కూడా అంత బలమైన మానవ తాత్వికతను నిర్మించలేదు, ఇక్కడి అన్ని రంగాల్లో పనిచేసే ప్రజలను ఇముడ్చుకోలేదు కనుక సంస్కృతం చచ్చిపోయింది. 

గుడుల్లో, సంస్కృత పూజలు, కర్మకాండల్లోని మంత్రాలు ఆ భాష నుంచి బయటకుపోతే ఆ భాష పూర్తిగా చచ్చిపోతుంది. హిబ్రూ భాష, గ్రీకు భాష బైబిల్ భాషలైనాయి కనుక వాటి మనుగడ ఇంకా బలంగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని గుడుల్లో తెలుగులోనే పూజలు, మంత్ర పఠన జరగాలని తెలుగు మంత్రి శాసిస్తే ఆ భాష కొంత మేరకు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ సంస్కృతాన్ని కాపాడుతూ, ప్రజల అభివృద్ధితో ముడిపడి ఉన్న ఇంగ్లీషునుచంపాలనుకుంటే ప్రజల తిరుగుబాట్లు మరో రూపంలో గోచరిస్తాయి. 

ఇవ్వాళ బ్రాహ్మణీయ శక్తులు వేసే ప్రతి అడుగునూ, దళిత - బహుజనులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. 17వ శతాబ్దంలోని వైభవాన్ని తిరిగి తెలుగు గడ్డ మీదికి తిరిగి తేవడమంటే కదిరె కృష్ణ చెప్పినట్లు కుల వ్యవస్థను, అంటరాని తనాన్ని మళ్ళీ తిష్ట వేయించడమే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సాంస్కృతిక జీవనం, కమ్యూనికేషన్ పద్ధతులు, భాష ఈరోజు బాగున్నాయా? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో బాగున్నాయా! రాజు ఆస్థానంలో కొంతమంది కవులు కూర్చొని 'కావ్యాలు' రాస్తే తెలుగు విరాజిల్లినట్లా! 'మీ కావ్యములన్నీ నా కర్రు ముందు బలాదూర్' అని పాటపాడుతూ నాగలి దున్నే శూద్ర-దళిత రైతు తెలుగును, ఉత్పత్తిని, జీవనాన్ని వందలాది బ్రాహ్మణీయ పండితుల కంటే ఎక్కువ అభివృద్ధి చెయ్యలేదా? 'పండితులారా పంచెకట్టుకొనే' తిరగండి లాగు తొడిగితే తురకలైనట్లే ఊళ్ళల్లో పిల్లలు కూడా పాటలు పాడే దశ దూరం లేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో భాష, బతుకుదెరువు పోరాటం ఒక కొలిక్కి వస్తున్నది. తిరుపతి మహాసభల్లో పంచెకట్టుకొని పండుగ చేసుకున్న పండితులందరూ తమ పిల్లల్ని ఒక్క సబ్జెక్టు తెలుగు ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివిస్తే రాష్ట్రంలోని శ్రమజీవులంతా తమ పిల్లల్ని కూడా ఒక్క సబ్జెక్టు తెలుగు ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించే హక్కు ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఈ విధమైన ఇంగ్లీషు మీడియంలోకి మార్చాల్సిన బాధ్యత తెలుగు మంత్రిపైనా ఉంటుంది. సైన్ బోర్డులను, ప్రభుత్వ జీవోలను, విద్యార్థుల మార్కుల మెమోను తెలుగులో రాస్తే, ఉర్దూ సంగతేమిటనే ప్రశ్న మంత్రి ముందు ఉంటుంది. 

కేంద్రం నిర్ణయాత్మకంగా ఉన్న ఫెడరలిజంలో ప్రాంతీయ భాషల పిచ్చిని శృతిమించి రాగాన పడేస్తే భాష-అవకాశ సమానత్వాల పోరాటం రాష్ట్రమంతటా ప్రారంభం కావాలి. భాష సెంటిమెంటు సమస్య కాదని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. భాష ప్రజల బతుకుదెరువు సమస్య అని ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే తెలుగు మేధావి వర్గం అర్థం చేసుకోవాలి. తెలుగు ఎవరి సొత్తు కాదు. అలాగే ఇంగ్లీషు ఏ ఒక్కరి సొత్తు కావడానికి వీలులేదు. భాష, సిలబస్, టీచింగ్ స్థాయి, వసతులు సంపూర్ణ సమానత్వం రూపొందించగలిగే విద్యావిధానం ఇక్కడ ఏర్పడితే ఇదొక మోడల్ రాష్ట్రంగా రూపుదిద్దుకొనే అవకాశముంది. ముఖ్యమంత్రి, రాబోయే తెలుగు మంత్రి, ప్రభుత్వాన్ని భాషా వివాదంలోకి లాగే పండిత వర్గం అర్థం చేసుకుంటే మంచిది.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi News Paper Dated: 4/1/2013

No comments:

Post a Comment