Thursday, July 3, 2014

రాజ్యంతోనే కుల నిర్మూలన! - డాక్టర్‌ కదిరె కృష్ణ


Published at: 04-07-2014 01:02 AM
‘కుల నిర్మూలన ఎలా సాధ్యం?’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 24) ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ రాసిన వ్యాసం చాలా గందరగోళంగా ఉంది. వినోద్‌ రాసిన ఈ వ్యాసం ‘కులనిర్మూలనతోనే న్యాయం’ శీర్షికన (ఆంధ్రజ్యోతి, జూన్‌ 13) కల్పనా కన్నభిరాన్‌ రాసిన వ్యాసానికి స్పందన. ఈ వ్యాసం ద్వారా వినోద్‌కుమార్‌ సైద్ధాంతిక గందరగోళాన్ని సృష్టించడంతో పాటు, సామాజిక అవగాహనాలోపాన్ని మరింత పెంచిపోషించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే కులనిర్మూలన జరిగి తీరాలన్న కల్పనా కన్నభిరాన్‌ ప్రతిపాదనను స్వాగతించాలంటాడు వినోద్‌. ఆ వెంటనే తిరిగి కుల నిర్మూలన జరుగనే జరుగదు అని ధ్రువీకరణ పత్రాన్ని జారవిడుస్తాడు. కులనిర్మూలనే జరుగదు అనుకున్నప్పుడు ప్రొ. కల్పనా కన్నభిరాన్‌ కుల నిర్మూలనా ప్రతిపాదనను తిరస్కరించాలి గానీ, స్వాగతించడమేమిటి? ‘కల్పనా కన్నభిరాన్‌ మంచి ఉద్దేశంతోనే కులనిర్మూలన జరగాలని కోరుకోవచ్చు కానీ, అది సాధ్యం కాదు... ప్రొఫెసర్‌ కల్పనా కన్నభిరాన్‌ అమాయకంగా, నిజాయితీతోనే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలంటే కుల నిర్మూలనతోనే అది సాధ్యం అని రాశారు, కానీ తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కులాన్ని నిర్మూలించడం ఎవరి వల్లా కాదు’ అంటారు. ఆమె అమాయకత్వం ఏమో గానీ వినోద్‌ ఆ వెనువెంటనే కులం ముల్లును కులంతోనే తొలగించాలి అని ప్రతిపాదించి తన అమాయకత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నారు. కుల నిర్మూలన పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదని తెగ వాపోతారు సదరు వ్యాసకర్త. కుల నిర్మూలన ఎవరి వల్లా కాదని సూత్రీకరించి, వల్లకాని విషయానికి పాలకులకు చిత్తశుద్ధి లేదని చెప్పడం దేనికి నిదర్శనం? ‘పాలకులకు కులాన్ని నిర్మూలించడం అసలే ఇష్టం లేదని మరింత ఆవేదనను వెల్లగక్కారు’. సాధ్యం కాని దానికి ఇష్టంతో చేస్తే మాత్రం సాధ్యం అవుతుందా? కులనిర్మూలన జరగదు లేదా సాధ్యం కాదు. వినోద్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఎవరి వల్లా కాదు’. ఇదే నిజమైతే డా. అంబేద్కర్‌ ‘కుల నిర్మూలన’ను ఎందుకు ప్రతిపాదించినట్టు? తన జీవితాంతం కుల నిర్మూలన కోసమే ఎందుకు పరితపించినట్టు? ఇక గాలి వినోద్‌ కుమార్‌ వాక్రుచ్చినట్టు ‘కులాధారిత రిజర్వేషన్లు ఉన్నంతకాలం కుల నిర్మూలన జరగదు’ ఇది పాక్షిక సత్యమే కానీ పూర్తిగా వాస్తవం కాదు. రిజర్వేషన్లు కూడా కులనిర్మూలనలో భాగమే! వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ చేత విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ఎడంగా ఉంచబడడం చేతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయి. అందుచేత భూమి, పరిశ్రమలు, ఇతర అన్ని రంగాలలో వేల ఏళ్ల ముందున్న ఆధిపత్య కులాలతో పోటీ పడలేరు కనుకనే ఈ వర్గాలకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. అంటే Equa lity among the inequalsజూటను సాధించడమన్నమాట. ఇది రాజ్యాంగస్ఫూర్తి కూడా. ఈ రిజర్వేషన్లు లేకపోతే ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. రిజర్వేషన్లు ఉన్నందుకే విద్య, తద్వారా ఉద్యోగం, ఉపాధి ఫలితంగా ఆర్థిక వెసులుబాటు సాధ్యమైంది. ఆ వెసులుబాటు మరింత వెసులుబాటును కల్పించి అన్ని రంగాలలో సాధ్యమైనంత మేరకు ప్రాతినిధ్యం కల్పించింది. ఆ ప్రాతినిధ్యమే తన జాతి ప్రజలకు తిరిగి వెసులుబాటును కల్పించాలి. ఇదే రిజర్వేషన్ల పరమావధి. వెసులుబాటు పొందినవారు ఆ సౌకర్యం లేని వారికి ప్రతినిధి. అతని కర్తవ్యం ఏ కులానికి ప్రతినిధిగా వచ్చాడో, ఆ కులాల ప్రజల అభివృద్ధికి కృషి చేయడంగా భావించవచ్చు. మహాపురుషుల పరిభాషలో చెప్పాలంటేPay back to the Society. ఈ సూత్రం మొత్తం అణగారిన వర్గాలకు వెలుగుగా నిలవాలి. అప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు శాతం విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థికవెసులుబాటు కలుగుతుంది. ఈ వెసులుబాటే సాధికారతకు దారితీస్తుంది. ఈ సాధికారతే ఆత్మగౌరవాన్ని తద్వారా రాజకీయ అధికారాన్ని సమకూరుస్తుంది. తద్వారా సామాజిక సమానత్వం అనగా కుల నిర్మూలన సాధించబడుతుంది. కానీPay back to the Society దగ్గరే ఈ సమాజం ఆగిపోయింది. ఇది ఎవరి బాధ్యత? ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రిజర్వేషన్లు ఖచ్చితంగా కుల నిర్మూలనలో భాగంగా కల్పించబడినవే. రిజర్వేషన్లు సమాజగతమే కానీ వైయక్తికం కాదు.
డాక్టర్‌ కదిరె కృష్ణ

Andhra Jyothi Telugu News Paper Dated: 04/07/2014 

No comments:

Post a Comment