Thursday, July 10, 2014

గురుకులంలో కలకలం..! By ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి


Updated : 7/10/2014 11:32:10 PM
Views : 188
మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్తారు. కానీ ప్రవీణ్‌కుమార్ లాంటి వాళ్ళు ఆ పనిచేస్తే భరించలేరు. మనదేశంలో ప్రతిచర్యకూ ఒక సామాజిక కోణం ఉంటుంది! మా వూరు కరీంనగర్ జిల్లా యాస్వాడలో దాదాపు మూడు నాలు గు దశాబ్దాల కిందట ఉస్మాన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన పూర్తిపేరు ఏమి టో చాలామందికి తెలియదు. ఆయన మా వూరి బడిలో చెప్రాసీ. రోజూ పొద్దున్నే వచ్చి స్కూలు ఆవరణ శుభ్రంచేసి గంట కొట్టడం ఆయన పని. కానీ ఆయన ఆ పనితో పాటు ఒక కొత్త సామాజిక బాధ్యతను కూడా తలకెత్తుకున్నాడు. మా వూరి లో పిల్లలందరినీ బడిలో చేర్పించడం, చేరినవాళ్ళు మధ్యలో బడి మానేయకుండా చూడడం ఒక ఆదర్శంగా పెటుకున్నాడు. పొద్దున్నే స్కూల్ పని ముగించుకుని ఆయన వూరి మీద పడే వాడు. ముఖ్యంగా దళితులు, బడుగువర్గాలు ఉండే వాడలకు వెళ్ళేవాడు. కనిపించిన ప్రతి పిల్లవాన్ని తీసుకొచ్చి బడిలో చేర్చేవాడు. పిల్లలు ఏడ్చి గోల చేసినా, తల్లిదండ్రులు అడ్డుకుని గొడవ చేసినా వినకుండా ఈడ్చుకెళ్ళి బడిలో పడేసేవాడు.

మళ్ళీ ఏ సాయంకాలమో వచ్చి తల్లిదండ్రులకు నచ్చజెప్పేవాడు. చదువు ప్రాముఖ్యా న్ని వివరించేవాడు. ఉస్మాన్ అంటే ఆ కాలంలో బడిపిల్లలకు టెర్రర్. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎవరో తెలియకపోయేది, కానీ ఉస్మాన్ మాత్రం ప్రతి ఇంట్లో తెలుసు. కొద్దికాలం తరువాత ఉదయం ఉస్మాన్ వాడవాడా తిరుగుతూ సైకిల్ గంట మోగిస్తే చాలు పిల్లలంతా ఆయన వెంట పొలోమని వెళ్ళేవారు. ఆయన కషి వల్ల యాస్వాడలో 1980 నాటికి ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా చదువుకున్నవాళ్ళో, ఉద్యోగస్తులో ఉండేవాళ్ళు. 1982లో ఆ వూరు మానే రు డ్యాంలో మునిగిపోయింది. గ్రామస్తులు ఎవరికీ తోచిన వూరికి వాళ్ళు వెళ్ళిపోయి స్థిరపడారు. కొద్దికాలానికి ఉస్మాన్ చనిపోయారు. ఆ తరువాత ఎంద రు చదువుకుని ఉద్యోగాల్లో చేరారో తెలియదు. అట్లాంటి వారెవరూ నాకు తారసపడలేదు. కానీ ఒక్క ఉస్మాన్ వల్ల ఊరు బాగుపడిందని మాత్రం పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు. 

ఊరును బాగు చేయడం ఉస్మాన్ పనికాదు. ఉద్యో గ బాధ్యత అసలే కాదు. అలాగే ఆయన పెద్దగా చదువుకోలేదు. కానీ చదువు విలువ, అందునా కింది కులాల్లో చదువుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించినవ్యక్తి. ఆయన ఒక వ్యక్తిగా కనబరచిన చిత్తశుద్ధి, కార్యదక్షత, సామాజికస్ఫూర్తి వందలాది కుటుంబాలకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది.

బహుశా వాళ్ళంతా ఆయనను ఎన్నటికీ మరిచిపోరు. అలాగే ఎస్.ఆర్. శంకరన్ కూడా. శంకరన్ గారు జీతం కోసం కాక ప్రజల జీవితాలను మార్చడం కోసం పనిచేసిన ఐఏఎస్ అధికా రి. జీవితాంతం దళితుల, ఆదివాసుల కోసం పనిచేసిన వ్యక్తి. వారి బతుకులు మార్చాలంటే చదువును అందుబాటులోకి తేవాలని తపించినవ్యక్తి. చదువం బడి మాత్రమే కాదని, చదువుకోవడానికి కావాల్సి న పరిస్థితులు, పరిసరాలు కూడా అని నమ్మిన వ్యక్తి. ఇవన్నీ వెలివాడల్లో ఉండే దళితులకు, గూడేల్లో, గుడిసెల్లో ఉండే ఆదివాసులకు ఉండవు. కాబట్ట్టి వారికి అన్ని వసతులతో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేసి చదివించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన సూచన మేరకు 1987లో ప్రభుత్వం సాంఘిక సంక్షే మ ఆశ్రమ పాఠశాలాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్నప్పుడే కాదు ఆ తరువాత కూడా ఆయన స్వయంగా ఆ పాఠశాలలను సందర్శించేవారు.విద్యార్థులకు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పేవారు. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, ఆయన పట్ల ఇప్పటికీ ఆ వర్గాల్లో ఎనలేని గౌరవాన్ని కలిగించాయి. ఆ గౌరవ భావానికి సూచికగానే ఆయన చిత్రపటాన్ని సంక్షేమ ఆశ్రమ విద్యార్థులు ఎవరెస్టు మీద నిలబెట్టారు. 

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ కూడా అదే తరహాలో పనిచేయాలనుకున్నాడు. ప్రవీణ్ కుమార్‌తో నాకు ఉస్మాన్‌తో, శంకరన్ గారితో ఉన్నం త పరిచయం కూడా లేదు. పోలీసు కాబట్టి పరిచ యం చేసుకునేంత చనువు కూడా లేదు. తెలంగాణ దళితుల్లో నుంచి వచ్చిన మొదటి తరం ఐపీఎస్ అధికారి అని తెలుసు. తెలంగాణ నుంచి ఇప్పటికీ పోలీసుశాఖలో ఆయన స్థాయిలో ఒకరిద్దరే దళిత ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా వత్తి నిబద్ధతకు మారుపేరుగా ఉన్నారు. ప్రవీణ్ కూడా చాలామంది దళితుల్లాగే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో ఉండి అక్కడి చీదరింపులు భరించిన వ్యక్తి.

సమాజం దళితులను ఎలా చూస్తుందో అనుభవంలో తెలుసుకున్న వ్యక్తి. ఎన్నో ప్రయాసలు పడి చదువుకున్న వ్యక్తి. విద్యార్థి దశలోఅందరు దళితుల్లాగే ప్రగతిశీల రాజకీయాల్లో చురుకైన నాయకుడుగా ఉండేవాడు. తరువాత పోలీసుగా మారిపోయాడు. ఆయన కూడా ప్రజల పట్ల ఉద్యమాలపట్ల అందరు పోలీసు అధికారుల్లాగే వ్యవహరించాడు. కొన్నిసందర్భాల్లో కఠినంగా కూడా ఉన్నా డు. అది వేరే చర్చ. పోలీసుల్లో మంచి వారిని ఎంచ డం కష్టం. కానీ చాలామంది కంటే ముందుగానే అందులో ఇమిడిఉన్న ఘర్షణను అర్థం చేసుకున్నా డు. తనంతట తానుగా పోలీసు విధుల నుంచి బయటకువచ్చి సాంఘిక సంక్షేమ శాఖను ఎన్నుకున్నాడు. ఎస్ .ఆర్. శంకరన్‌ను ఒక ఆదర్శంగా పెట్టుకుని ఆయన సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నేరుగా ఇంతకాలం వివక్షకు గురవుతూ వస్తున్న తన వర్గానికి సేవ చేయాలని, వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపాలని అనుకుని ఉండవచ్చు.

గడిచిన రెండేళ్ళ కాలంలో నిజంగానే ఆ సంస్థ రూపురేఖలు మారిపోయాయి. బోధన, ఫలితాలతో పాటు అనేక కొత్త ప్రయోగాలు, ప్రణాళికల ద్వారా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ముఖ్యం గా దళితవర్గాల్లో ఒక విశ్వాసాన్ని నింపారు. అన్నీ సజావుగా ఉన్నాయనుకున్న తరుణంలో ఒక చిన్న సర్క్యులర్ ద్వారా ఆయన ఇప్పుడు దోషిగా నిలబడిపోయారు. నిజానికి ఆయన ఒక ఉస్మాన్‌లాగే ఆలోచించారు. పాఠశాలలు మొదలైన తరువాత పదిరోజులు గడిచినా పిల్లలు రాకపోవడం, హాజరు లేకపోవడం ఏమిటని నిలదీశారు. గురుకుల విద్యాసంస్థల్లో పనిచేసే అధ్యాపకుల వత్తిధర్మాల్లో అదొకటి.

పిల్లలకు, తల్లిదండ్రులకు వారొక కౌన్సిలర్‌గా ఉండాలి. వారి బాగోగులు కూడా చూసుకోవాలి. వాళ్ళను ప్రోత్సహించి ఎదుగుదలకు కషి చేయాలి. అందుకే అక్కడి టీచర్ విద్యార్హతలు జీతభత్యాలు, పని నిబంధనలు వేరుగా ఉంటాయి. సాధారణ స్కూల్ టీచర్ల కంటే వీళ్ళ విధులు వేరుగా ఉంటాయి. వాళ్ళు కేవ లం టీచర్లు మాత్రమే కాదని హౌస్ పేరెంట్స్‌గా విద్యార్థులకు తల్లిదండ్రుల లోటును తీర్చేవారిగా ఉండాల ని నిబంధనలు చెపుతున్నాయి. సొంత పిల్లలను జూన్ 12న బడికి పంపే ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలెవరూ బడికి రాకపోతే ఏమయ్యిందో వాకబు చెయ్యలేకపోయారు. వేసవి సెలవులకు వెళ్ళిన 77 వేల మంది విద్యార్థుల్లో కేవలం 11 వేలమంది మాత్రమే వచ్చారు. సగానికి సగం పాఠశాలల్లో సగం మంది కూడా తిరిగి రాలేదు. దాదాపు ఇరవై స్కూల్‌లలో ఒక్కరు కూడా రాలేదు. సహజంగానే ఈ తరంలో కొందరైనా తనలాగే చదువుకుని ఎదగాలనుకునే వాడికి ఇది ఆందోళన కలిగిస్తుంది.

ఒక అధికారిగా నెల తిరిగేసరికి జీతం తీసుకునే ముందు అది గుర్తు చేయడమే ప్రవీణ్ చేసిన తప్పు అయింది. అలా గుర్తుచేసి వారం రోజులు జీతం ఆగిపోతే జీవితమే ఆగిపోయినంత ఆందోళన వ్యక్తమైంది. ఆయన పోలీ సు అధికారి అని అందరికీ హటాత్తుగా గుర్తొచ్చింది. తుపాకీ నీడన పాఠాలు చెప్పలేం అని పంతుల్లంతా వాపోతున్నారు. అలా వాపోయిన వారికి మద్దతునీయడం ప్రజాస్వామ్యవాదుల ధర్మం. నిజంగానే ఆయన అధ్యాపకుల మీద తుపాకీ ఎక్కుపెట్టి పాఠలు చెప్పమని అంటే ఆయనను కచ్చితంగా శిక్షించాలి. అలా జరిగిందా అనేది కూడా విచారించాలి. ఆయన తుపాకీ ఎక్కుపెట్టాడో లేదో కానీ మన విద్యార్థులు, మేధావులు, బుద్ధిజీవులు మాత్రం ఆయన మీద తూటాలు పేల్చుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రవీణ్ పని విధానాన్ని, వత్తి నేపథ్యాన్ని సిద్ధాంతీకరించే పనిలో పడిపోయారు. పనిలో పనిగా ఒక ఐఏఎస్ తరగతి గదిలోకి రావొచ్చు, తనిఖీ చేయవచ్చు కానీ ఐపీఎస్ ఎలా తనిఖీ చేస్తాడు అంటూ అక్కడ కూడా కులవ్యవస్థ మాదిరి నిచ్చెన మెట్లు నిర్మించే పనికి పూనుకున్నారు. అంతే తప్ప బడికి రాకుండా ఆగిపోయిన వేలాదిమంది జీవితాల సంగతి ఏమిటనిఏ ఒక్కరూ అడగడం లేదు. వారిని పాఠశాలకు రప్పించే బాధ్యత సంస్థకు ఉన్నదో లేదో చెప్పడం లేదు. 

ఇది ఒక్క గురుకులాలకే పరిమితం అయిన సమ స్య కాదు. మొత్తంగా విద్యావ్యవస్థలో ఈ నవీన కులవ్యవస్థ రాజ్యం ఏలుతోంది. స్థాయిని బట్టి, మనుషుల సంపదను, హోదాను బట్టి పాఠశాలలు ఉన్నా యి. ఇప్పటికే సంపన్నులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లల్ని చదివిస్తున్నారు. సగానికంటే ఎక్కువమంది బడిపిల్లలు ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉన్నారు. ప్రభుత్వరంగంలోనూ ఇటువంటి అసమాన అంతస్తులున్న విద్యావ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు దళిత వాడలుగా మారిపోయాయి. వాటిల్లో చదువుతున్నవాళ్ళు ఎక్కువగా దళిత బహుజనులు, నిరుపేదలే ఉంటున్నారు. ఇటువంటి అంతరాలులేని కామన్ స్కూలింగ్ రావాలని విద్యావేత్తలు చాలాకాలంగా కోరుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య ఉంటుందని అదే పనిగా చెపుతున్నారు. ఇది కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా ఉంటుందని, తెలంగాణలో భవిష్యత్తులో కేవలం ఆశ్రమ పాఠశాలలే ఉంటాయని అందులో భోజన వసతితో పాటు అధునాతన వసతి సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెపుతున్నారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందిస్తామని అంటున్నారు.

అది పునర్నిర్మాణానికి మొదటిమెట్టు అని ఆయన అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఇటువంటి అసమానతలులేని విద్యావిధానాన్ని హామీ ఇచ్చింది. సీమాంధ్ర దోపిడీదారుల చేతుల్లో మన విద్యావ్యవస్థ దెబ్బతిన్నది కాబట్టి, కార్పొరేటు దోపిడీ పెరిగిపోతున్నది. కాబట్టి తెలంగాణ కావాలని ఈ ఉపాధ్యాయులే ఊరూరా తిరిగి ఉద్బోధించారు. ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ సాధనకు కషి చేశారు. పునర్నిర్మాణానికి కూడా పునరంకితమవుతామని చెపుతున్నారు.

విద్య ద్వారా నే వికాసం అనేది ఇప్పటికే రుజువైంది. తెలంగాణ పునర్వికాసం కూడా తరగతి గదిలో మొదలవ్వాలి. దానికి తెలంగాణ మొత్తాన్ని ఒక గురుకులంగా మార్చాలి. ఇక్కడి వరకు టీచర్లకు పెద్దగా పేచీ లేకపోవచ్చు. కానీ అది నెరవేరాలంటే ముందుగా బడిలో పిల్లలుండాలి. ప్రవీణ్ కుమార్ చెప్పింది కూడా అదే. పోలీసు కదా పాపం ఆయనకు భారతీయ సమాజం గురించి, అందులో నిచ్చెనమెట్ల గురించి పెద్దగా తెలియక పోవచ్చు. మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్తా రు. కానీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఆ పనిచేస్తే భరించలేరు. మనదేశంలో ప్రతి చర్యకూ ఒక సామాజిక కోణం ఉంటుంది! 

Namasete Telangana Telugu News Paper Dated:11/07/2014 

No comments:

Post a Comment