Monday, July 14, 2014

సాహిత్యంలో దళిత ప్రస్థానం By - భూతం ముత్యాలు


  తెలుగునాట దళిత సాహిత్యం ఒక ప్రత్యేక పాయగా భాసిల్లుతోంది. కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ ప్రక్రియల్లో తనదయిన రీతిన ప్రయాణిస్తోంది. ఎక్కడా ఆగిపోకుండా కొనసాగుతోంది దళిత సాహిత్య ప్రవాహం. ఆ ప్రవాహపు నడకకు చిత్రిక పట్టే వ్యాసమిది.
   భారతీయ సమాజంలో అందునా తెలుగు మాట్లాడే నేటి తెలంగాణ రాష్ట్రమైనా, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనైనా ముఖ్యంగా దళిత సాహిత్యాన్ని సునిశితంగా పరిశీలిస్తే స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగు నేలన దళిత సాహిత్యం పురుడు పోసుకుందని తెలుస్తుంది. దాని పూర్వాపరాలను విశదీకరించే ముందు అసలు దళితులంటే ఎవరు, ఏది దళిత సాహిత్యం అనే ప్రశ్నలు ఉదయించక మానవు. ఐతే దళిత శబ్దానికి నిఘంటుకారులు ఇచ్చిన అర్థం ఏమిటంటే దళితం అంటే ఖండింపబడిన, చేదించబడిన, చీల్చబడినా, సగంగా చేయబడినా. అర్ధం ఇలా ఉన్నా తరతరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా దళితులు అస్పృశులుగా (అంటరానివారిగా) జీవిస్తున్నారు. ప్రపంచంలోని బానిస వ్యవస్థ కంటే దుర్మార్గంగా భారతీయ సమాజంలో దళితులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పూర్వం దళితుడి నోటికి ముంత కట్టి ఉంచెవారని, అతని జననం కర్మ పలమని కర్మ సిద్ధాంతాన్ని దళితులపై రుద్ది అగ్రవర్ణాల వారు దళితుల్ని ఊరికి దూరం చేసినారు. అసలు వారిని మనుషులుగా గుర్తించనేలేదు. వారెక్కడ తిరిగినా వీధులు మలిన పడతాయని దారిలో వారి పాదముద్రల ఆనవాళ్లు లేకుండా చేసిన దుష్ట సంస్కృతి హిందూ సమాజానిది. అట్లా దళితుల ఉనికిని లేకుండా చేసేందుకు ప్రయత్నించింది భారతీయ సమాజం. తెలుగు నేలలోనూ అదే తీరు కనబడుతుంది. ఐతే దళితుల ఉనికిని ఎంతగా శాసించినా ఇరవయ్యె శతాబ్ది నాటికి దళితవాదం, దళిత సాహిత్యం తన అస్తిత్వాన్ని నిల్పుకోగల్గింది! మనకున్న ప్రాచీన ఆధారాలను చూస్తే దళితుణ్ణి చండాలుడుగ, చండాల స్త్రీగా పురాణేతిహాసాలలో దళిత ప్రస్తావన కానవస్తుంది. అయినప్పటికీ సత్యానికి మారుపేరుగా నిల్చిన సత్య హరిశ్చంధ్రుణ్ణి ఆపత్కాలంలో ఆదరించిన దళిత జాతి, మోసాలకు మారు పేరైన ఆర్య సంస్కృతిలో 'వీరబాహు'ని పాత్ర మకుటాయమాయమైనదీ, అజరామరమైనదీ. అది దళిత గుణం అయినా దళితులకు నిరాదరణే మిగిలింది. 
మధ్యయుగాల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు విరచితమైన 'ఆముక్తమాల్యద'లో 'మాలదాసరి' (గోసంగి) వృత్తాంతం, అతని గాన మాధుర్యం, అతని గానానికి పరవశించి ముగ్ధుడైన విష్ణుమూర్తి మంగాళకైశికి రాగాన్ని ఆదరించారే గాని దళితుల ఉన్నతికి బాటలు పరచలేదు రాయలవారు. అదీ హైందవ సంస్కృతి, పండితారాధ్య చరిత్రలో సురసాని కథలో పాల్కూరికి సోమనాథుడు 'మాదింగులే తొల్లి' అని ప్రస్తావించినా ఈ సృష్టి మొదలు దళితులదే. ఆదివాసులు, ఈ దేశమూలవాసులు దళితులే అని తేటతెల్లమైంది. అట్లే కాటమరాజుకథలో 'బీరినీడు' పల్నాటి వీరచరిత్రలో మాలకన్నమనీడు దళిత బిందువులే. అయినా చరిత్రకారులు, మతమౌఢ్యులు, కులపిశాచులు దళితుల చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. 
అయితే ఆధునిక కాలంలో దళితులదే రాజ్యాధికారం, ఈ శతాబ్ది దళిత సాహిత్యానికే స్వర్ణయుగంగా భాసిల్లుతుందని గ్రహించకపోయినా తరతరాల కులదోపిడినీ, అంటరానితనాన్ని ప్రపంచ విఫ్లవాల పర్యవసానంగా భారతావనిలో పూలే, అంబేద్కర్‌ పుట్టుక మూలంగా దళిత జాతి చైతన్యమై తమ అస్తిత్వాన్ని తాము నిలుపుకునే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. ఈ పరంపరలో మొదటి దళిత కవి, తాత్వికుడు, దున్న ఇద్దాసు 'తత్వాలు' మొదటి దళిత సాహిత్య సృజనగా పేర్కొనవచ్చు. జనపదుల నాల్కెలపై నడయాడే తత్వాలు అశువుగా అల్లి చెప్పాడు ఇద్దాసు. ఇతన్ని చరిత్రకారులు మరచినా దళితజాతి ఎట్ల మర్సుతది. పదమూడేళ్ల తెలంగాణ మహోద్యమ విజయోత్సవాలలో దళిత సాహిత్యాన్ని టపాకుల్లో పేలిన తోకపటాకిని చూసినట్లు చూసింది తెలంగాణ సాహిత్యం. ముఖ్యమంత్రి ముచ్చటేందీ గని వెంటాడే కవులకు తొంట భుజం ఊగి బాగైందని ఎకిరింతైయ్యింది. మీకు ఉప ముఖ్యమంత్రి, మాకు ఉప ముఖ్యమంత్రి బలం బల్గం ఉన్న మేమే ముఖ్యమంత్రి అనే నినాదాన్ని మరిసి దళితోద్యమాన్ని బిపోర్‌ క్రైస్ట్‌ నుంచి ఎ.డి.కి నడిపించే దళిత సహృదయం. వెంటాడే కలాలకు ఎచ్చిడి అయ్యింది. అగ్రకులాధిపత్య భావజాలాన్ని, అంటరానితనాన్ని అవలంబిస్తూ కులాధిపత్యానికి ఆరాటపడుతున్నారు. దళిత సాహిత్య చీలిక కుట్రకు పూనుకొని వెనుకబడిన కులాలని వెంటాడే కత్తులు విసిరారు. పీకలు తెంపారు. వేదికలు నిర్మించారు. దళిత సాహిత్యాన్ని విస్మరించారు. ''మిత్ర భేదం చేత శత్రువు చేతిలో చిక్కిన'' సందంగా కోవర్టు పద్ధతులు పాటించారు సాహిత్యంలో. ఈ సందర్భంలోనే కావడి కుండలై విడిపోదాం అన్నారు, కానీ ఎస్సీ వర్గీకరణకు మద్దతియ్యని మా కవులున్నారు. తప్పిదాలు ప్రక్షాళన అయ్యిందెప్పుడు ఉప కులాల ఊసును పట్టించుకునే ఊగిసలాటలో చర్చను పంచుకోలేక సాహిత్యం పండ్లమ్ముకుంది. ఐక్యతే లేని సందర్భంలోనే ఘర్షణ అనివార్యమై ఘర్షణే దళితోద్యమమయ్యింది. ఇతర కవులకు మల్లే వెంటాడే కవులు దళిత కవిత్వంలో గొంతు కల్పిన బీసీ సూర్యోదయాన్ని ఊహించారు. కానీ దళితోదయాన్ని కల కనకనే వెంటాడే కలాలను ఎక్కుపెట్టారు. అంటరాని తనం ఆత్మగౌరవమే అనుకొనే దళిత సాహిత్య దళారి కారులకు నాయకత్వం వహించిందెవరు?
దళిత సాహిత్యంలో అశువుగా అల్లిన గద్దర్‌ పాటలు, అట్లే గోరటి ఎంకన్న పాటలు, అందెశ్రీ పాటలు, పైలం సంతోష్‌ పాటల ఊటలు, ఏపూరి సోమన్న (బహుజనం పాట), రసమయి బాలకిషన్‌, దరువుఎల్లన్న. ''మాకొద్ది నల్ల దొరతనము'' కుసుమ ధర్మన్న నుంచి అందెశ్రీ ''జయజయహే తెలంగాణ'' గీతం వరకు దళిత గొంతుక పరిమళిస్తూనే ఉండే. అశుకవిగాయకులుగా దళితులు వెలుగొందుతూనే ఉండ్రు. నాడు దళితులు నిషిద్ధమైనా నేడు సాహిత్యంలో దళిత స్వర్ణయుగం అనక తప్పదు. 
20వ శతాబ్దపు ఆరంభంలో దళిత సాహిత్య పొద్దుపొడ కనిపించడం మొదలైంది. ఆనాటి సంఘ సంస్కరణ ఉద్యమానికి ముందే తెలుగులో అస్పృశ్యతా నిరసన కవిత్వం పురుడు పోసుకుంది. గాంధీగారు అంటరాని తనాన్ని రూపుమాపాలని పిలుపు ఇవ్వకముందే 1909లో భాద్రపదమాసపు 'ఆంధ్రభారతి' పత్రికలో మాలవాండ్రపాట అన్న గేయం ప్రచురితమై సంచలనం రేపింది. కాని దాని రచయిత ఎవరో నేటికీ తెలియదు. 1910లో గురజాడ లవణరాజుకల అనే గేయంలో అస్పృశ్యత నిరసన కనిపిస్తుంది. అట్లె ముత్యాలసరాలు లోను కనిపిస్తుంది.
''మంచి చెడ్డలు మనుజులందున - యెంచి చూడగ రెండె కులములు మంచియున్నది మాలయైతే - మాలనేనగుదున్‌'' అని ప్రకటించాడు. అంతకుముందే విశ్వనాథ వారు ''వీర వల్లుడు'' అనె నవల రాసినాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 'మాలపల్లి' నవల రాశారు. 
1915లో మంగినపూడి వెంకటశర్మగారు 'నిరుద్ధ భారతం' అనే పద్యకావ్యం రాశారు. అదే సమయంలో ఆ కాలంలోనే గాంధీజీ ప్రచారంతో ఎన్నో అస్పృశ్యతా నిరసన గళాలు వినిపించినా, కలాలు ఝుళిపించినా అవి సానుభూతి రచనలుగానే మిగిలాయి.
అదే సమయంలో భాగ్యరెడ్డి వర్మ (మేదరి భాగయ్య, హైద్రాబాద్‌) కుల సంస్కరణ ఉద్యమం చేపట్టారు. కుసుమ ధర్మన్నకవి, జాల రంగస్వామి, నక్క చినవెంకయ్య గుర్రం జాషువా, బోయి భీమన్న కొలకలూరి ఇనాక్‌ మున్నగువారు తమ పదునైన భావజాలంతో, దళిత చైతన్యంతో రచనలు కొనసాగించి అంటరానితనాన్ని చీల్చిచెండాడారు. అట్లె గాంధీజీ దళితులకు 'హరిజనులు' అని నామకరణం చేయగా దళిత కవులు నిరసించారు. 'పంచములు' అని పేరు పెట్టినా దానిని తిరస్కరించారు. 1930 నాటికి పై పదాలను పూర్తిగా తిరస్కరించారు. తమని తాము 'ఆదిఆంధ్రులు'గా పిలుచుకోసాగినారు. (నేడది ఎస్సీలో ఓ ఉపకులంగా రూపాంతరం చెందినది). ఆ ఉప కులాలకు హక్కులు అందలేదని దునుమాడారు. 
అప్పటికే వేళ్ళూనుకున్న అభ్యుదు సాహిత్యం దళితుల్ని విముక్తుల్ని చేయలేకపోయింది. మార్క్సిస్టు సాహిత్యం వర్గదృష్టితో ఆలోచించి వర్గపోరాటంతోనే దేశంలో సమసమాజ స్థాపన జరిగి కులాలు వాటంతట అవే రూపుమాసిపోతాయని విశ్వసించింది. అది నేటికీ భ్రమగానే మిగిలిపోయింది. ఈ సందర్భంలోనే తెలుగు సాహిత్యానికి మహారాష్ట్ర దళిత సాహిత్యం దిక్సూచిగా నిలచింది. అప్పటికే 'గులాంగిరి' రచనతో తనదైన ముద్రవేసిన జ్యోతిరావ్‌ పూలే దళిత బహుజనులకోసం పాటుపడటం ప్రారంభించాడు. అతని స్ఫూర్తితోనే అంబేద్కర్‌ హిందూ సంస్కృతి, సమాజంపై తనకలాన్ని ఎక్కుపెట్టి కుల నిర్మూలన, రామునికృష్ణుని రహస్యాలు, రచనలతో దళితుల్ని చైతన్యం చేశాడు. తన రచనల ద్వారా దళితులలో గొప్ప ఆలోచన కలిగించాడు. మనువాదం గుట్టువిప్పి నట్టనడివీధులలో దాన్ని తగులబెట్టాడు. ఈ ఒరవడిని అందిపుచ్చుకొని '1972లో మహారాష్ట్రలో దళిత పాంథర్స్‌' ఆవిర్భవించింది. దళిత సాహిత్యం కొత్తపుంతలు తొక్కడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఈ క్రమంలో 'ఎవరు దళితులు?'' నిర్వచించింది దళిత పాంథర్స్‌. మనిషి జీవించడానికి కనీస అవసరాలైన కుడూ, గూడు, గుడ్డ (రోటి, కపడా, మకాన్‌) లేని నిర్భాగ్యులు దళితులు వీరు. ఊరికి దూరంగా నెట్టబడి తరాలుగా అంటరానితనపు బానిస ఊబిలో కూరుకుపోయినవారు. సంప్రదాయక సమాజంలో సంబంధాలు లేకుండా, నిత్యం పీడనకు గురై అవమానాలకు అత్యాచారాలకు గురైనవారు దళితులు అని దళిత పాంథర్స్‌ తన ప్రణాళికలో పొందు పరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులు అణగదొక్కబడినవారు, అంటరానివారు. ఈ క్రమంలో 1985లో ఏది దళిత సాహిత్యం అనే మీమాంస కల్గినా దళితేతరులు సానుభూతి రచనలు చేసినా అది దళిత సాహిత్యం కాలేకపోయింది. 
దళితులు తమ వేదనను తరతరాలుగా అనుభవించిన వివక్షలను దళితులే స్వానుభవంతో తమ అనుభవాలను అక్షరీకరించడం దళిత సాహిత్యం అవుతుంది.
దళిత సాహిత్యంలో 1. కథ, 2. నవల, 3. నాటకం, 4. కవిత్వం పాయలుగా బయలుదేరింది. బోయిభీమన్న 'పాలేరు' నాటకం ఎందరికో స్ఫూర్తినిచ్చి దళితుల జీవితాలనే మార్చినది. అట్లే జాషువా పద్యకవిత్వం దళితులనే మార్చి దళితులలో సాహితీ తృష్ణను రగిల్చింది. దళితుల గూర్చి దళితులు రాసిన మొదటి కథ గొట్టిముక్కల మంగాయమ్మ గారి ''అయ్యోపాపం'' (1935), కొలూకలూరి ఇనాక్‌ ''కట్టడి'', ఎండ్లూరి సుధాకర్‌'', '''మల్లె మొగ్గ గొడుగు'', నాగప్పగారి సుందరరాజు ''మాదిగోడు'', మావూరీ మైసమ్మ, పి కనకయ్య ''ఎదురుచూపు'', బోయ జంగయ్య ''చీమలు'' వేముల ఎల్లయ్య ''కుష్టాది కిష్టయ్య''. ''మైల కుంకుమ'' కథ, భూతం ముత్యాలు ''బేగరికథలు (2010)'', ''బుగాడ కథలు(2014)''కథా ప్రక్రియలో దళితవాదం పరిపుష్టమైంది. 
ప్రారంభంలో అభ్యుదయ కవిత్వం తన ఉనికిని చాటుకున్న అడపాదడపా దళిత సాహిత్యం తన ఉనికిని కోల్పోకుండా నివురుగప్పిన నిప్పులా కాలుతూనే ఉంది. తర్వాతి కాలంలో విఫ్లవ, సోషలిస్టు భావజాలాలతో, దళిత సాహిత్యంలో కొంత స్తబ్దత ఏర్పడింది. అణిచే ప్రయత్నం చేసింది. 1950 ప్రాంతంలో ఆంధ్రలో భూస్వాముల దౌర్జన్యానికి గురైన ఓ దళిత రైతు దాడిలో మరణించాడు. అతనిపై జంగం కైగట్టిన పాటని జీర్ణించుకోలేని భూస్వాములు ఆప్రాంతంలో ఆపాటని నిషేధించారు. ఓ దశాబ్దం పాటు వెలిగిన ఆ పాట వారి దౌర్జన్యం ముందు నిలువలేక పోయింది. కాలక్రమేణా ఆ పాట అతనితోపాటే కాలగర్భంలో కలిసిపోయింది. అయితే 1968లో జరిగిన కంచికచర్ల కోటేశు సజీవ దహనం నేటికీ దళిత సాహిత్యానికి దివిటీలా తన వెలుగు ప్రసరిస్తనే ఉన్నాడు. అట్లా దళిత సాహిత్య, అరసం, విరసంలను తోసి రాజని నూతన పంథాతో కొత్తపుంతలు తొక్కుతూ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ అస్థిత్వ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది దళిత సాహిత్యం. 
ఇక నవలా ప్రక్రియలో ఇనాక్‌ ''అస్పృశ్యగంగ, అనంత జీవనం'' (నవలలు) మోహన్‌రావు ''ఖాకీ బతుకులు'' చిలుకూరి దేవపుత్ర ''పంచమం'', బోయజంగయ్య ''జాతర, జగడం'', వేముల ఎల్లయ్య ''కక్క (2000), సిద్ధి (2006)'', భూతం ముత్యాలు ''సూర'' (2004), ''పురుడు'' 2007, ''ఇగురం'' 2013, కళ్యాణ్‌రావు ''అంటరాని వసంతం'', వర కుమార్‌ గుండెపంగు ''మైల, నేను బానిసనా! (పోలీసు దుఖం)'', కదిరెకృష్ణ ''పొద'' దళిత జీవితాలను ఆవిష్కరిస్తూ వచ్చిన నవలలు. 1968లో కంచికచెర్ల కోటేశు సజీవదహనం, 1985 చుండూరు, కారంచేడు ఘటనలు మొన్నటి లక్షింపేట సంఘటనపై ''నిమాషి కవుల ఇమ్మతి'' తిరుగుబాటు కవిత్వం దళిత అస్తిత్వానికి, దళిత చైతన్యాన్ని రగిల్చి ఆ కసితో దళిత సాహిత్యం మరింత పదును దేలి అర్థవంతమై, శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి. కలెకూరి ప్రసాద్‌ ''పిడికెడు ఆత్మగౌరవం కోసం'', ఎండ్లూరి సుధాకర్‌ ''నల్లద్రాక్షా పందిరి, గోసంగి దీర్ఘకవిత'', శిఖామణి ''నల్లగేటు, నందివర్ధనం చెట్టు, దిసమొల'', గోసంగి కవులు ''మేమే, మొగి'' చెప్పుకోదగినవి.
శివసాగర్‌ కవిత్వం రాసినా, పాటలు రాసినా విప్లవ భావజాలంతో మమేకమై రచనలు చేశాడు. అయితే 90వ దశకం నుండి దళిత సాహిత్యంవైపు తన ప్రస్థానం కొనసాగించాడు. 'అంబేద్కర్‌ సూరీడు' రచన ఆ కోవలోనిదే. మూడు దశాబ్దాల కాలంగా దళిత సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ దళిత మాండలిక భాషని, పలుకుబడిని, నుడి కారాలను కవిత్వంలో జూపించి మాండలిక భాష ప్రయోగంతో కవిత్వాన్ని, సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించి దళిత సాహిత్యానికి చిరునామాగా, దళిత సాహితీ దిక్సూచిగా నిలిచాడు వేముల ఎల్లయ్య. అతని కలం నుండి జాలువారి పురుడు పోసుకున్న నవల ''కక్క'' దళిత సాహిత్యంలో మైలురాయిగా నిలిచింది. సాహితీ విమర్శకులకు సైతం చిక్కని నాడి అతనిది. అతని ఒరవడిని అందిపుచ్చుకున్న మరో రచయిత భూతం ముత్యాలు 'సూర' దళిత నవల ద్వారా తన ఉనికిని చాటుకున్నాడు.
జాషువా ''గబ్బిలం'', వేముల ఎల్లయ్య ''ముల్కి'', ముత్యాలు ''దుగిలి'', సతీష్‌ చందర్‌ 'పంచమవేదం', పైడి తెరెష్‌బాబు ''అల్పపీడనం'', మద్దూరి నగేష్‌బాబు ''వెలివాడ, రచ్చబండ'', బన్న ఐలయ్య ''నిప్పుకణిక'', సంపతి సోమయ్య ''ఏశకాంత'', జి.వి. రత్నాకర్‌ ''అట్లేటి అల'', దార్ల వెంకటేశ్వర రావు ''నెమలి కన్నులు, దళిత తాత్వికుడు'', కొమ్ము సుధాకర్‌ ''ఉగ్గం'', పిట్టల శ్రీనివాస్‌ ''అలుగు'' గ్యార యాదయ్య 'ఎర్కోషి (దీర్ఘకవిత)' విశిష్టమైనవి. 
దళిత కవయిత్రులు : చల్లపల్లి స్వరూపరాణి, హేమలత, మద్దూరి విజయశ్రీ, జి విజయలకిë, దరిశె శశి నిర్మల జూపాక సుభద్ర ''అయ్యయ్యో దమ్మక్క, రాయక్క మాన్యం'' కథలు, గోగుశ్యామల ''ఎనుగంత తండ్రి కంటే ఏకులబుట్టంత తల్లి నయం'' కథలు, జాజుల గౌరి ''మన్ను బువ్వ'' విలక్షణమైనవి. 
అనేకమంది దళిత కవులు, రచయితలు తమవంతు కృషి సల్పుతూ దళిత సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ దళిత సాహితీ స్వర్ణయుగంగా భాసిల్లేందుకు బాటలు వేస్తున్నారు. పాఠకుల్లారా మీకో మనవి మా చరిత్రను మింగుతున్నవాళ్ల ముందు మా చరిత్ర మేమే చెప్పదలిచాం. 
ఆదరించండి, అక్కున చేర్చుకోండి, దళిత సాహిత్యంలో మీరు భాగస్వాములు కండి!
- భూతం ముత్యాలు, సెల్‌ : 9490437978

Prajashakti Telugu News Paper Dated: 14/07/2014 

No comments:

Post a Comment