Monday, July 21, 2014

ఈ వెట్టి నుంచి విముక్తి ఎప్పుడు ? By రమేష్‌ బుద్దారం




                భారతీయ సమాజంలో పుట్టుక కారణంగా, వృత్తి కారణంగా కొందరికి దైవత్వాన్ని ఆపాదించి, మరికొందరికి హీనమైన స్థానాన్ని ఇచ్చింది. హెచ్చుతగ్గుల హోదానిచ్చే దారుణమైన కులవ్యవస్థ పునాదిగా, మను ధర్మ, పురుషాధిపత్య సమాజం కొందరిని నిచ్చెన మెట్ల వ్యవస్థలో అగ్రభాగాన ఉంచి అన్ని సౌఖ్యాలూ పొందుటకు వారు అర్హులని సూచిస్తూ మరికొందరిని వారి సేవకులని, వీరు వారి సేవలో ఉంటేనే వీరికి మోక్షం అనే కపట నీతిని బోధిస్తోంది. ఈ క్రమంలో ఎన్నో దళిత, బహుజన బడుగు జీవుల జీవితాలు ఒక వర్గం వారి సేవకే బలి చేయబడ్డాయి. అలాంటి ఒక కులమే పాకి పని వారు (పారిశుధ్య కార్మికులు). మేహతర్‌, బంగి, తోటి, వాల్మీకి అని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా పిలువబడినప్పటికీ వీరు చేసేది మాత్రం పాకీ పని. తరతరాలుగా విద్యకు, అభివృద్ధికి దూరంగా ఉంటూ, 66 సంవత్సరాల స్వతంత్ర దేశంలో, సాంకేతికంగా ఎన్నో శిఖరాలు అధిరోహించినప్పటికీ అనాదిగా చేపట్టిన పాకీ పనిని ఇంకా వీరితో చేయించడం దేశం, నాగరిక ప్రపంచ పౌరులందరూ సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. మన దేశ ప్రభుత్వ, పౌరుల అమానవీయ మనుగడకు నిదర్శనం. భారత రాజ్యాంగం దేశ పౌరులందరూ సమానమని, కుల, లింగ, మత, వర్ణ భేదం, అంటరానితనం, వివక్ష మొదలైనవి ఎవరు పాటించినా ఆర్టికల్‌ 15, 17 ప్రకారం శిక్షింపబడతారని పేర్కొన్నప్పటికీ కులం పేరుతో వారు చేసే వృత్తి చేత ఈ కులం వారు నాగరిక సమాజంలో ఇంకా వివక్షను ఎదుర్కోవడం చాల హేయమైన విషయం.
                 చిన్న చీపురు కట్ట, ఒక రేకు, ఒక బుట్ట, సాధనాలుగా ప్రభుత్వం నడిపే డ్రై లెట్రిన్‌లు, ప్రైవేటు వ్యక్తుల మరుగుదొడ్ల నుంచి మనిషి మలాన్ని గంపలో ఎత్తుకుని మోసుకుంటూ ఊరి అవతల పెంట దిబ్బలలో వేయించడం ఎన్నో తరాలుగా మనం చూస్తున్న అణచివేత ప్రక్రియ. ఈ హేయమైన దురాచారం మన రాష్ట్రంలో అంత ప్రాచుర్యంలో లేకున్నా అభివృద్ధికి చిరునామాగా చెప్పుకునే గుజరాత్‌లో, ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదే కాకుండా అనునిత్యం మన కళ్ళ ముందు రైల్వే పట్టాలపై, సెప్టిక్‌ ట్యాంక్‌లు, మురుగు కాలవలు, మొదలగు చోట్ల వీరిని చూస్తుంటాం. ఈ వృత్తిలో ముఖ్యంగా పురుషుల కంటే దళిత మహిళలు ఎక్కువగా ఉన్నారు.
                    1992లో వివిధ సామాజిక సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం భారతదేశంలో 13 లక్షల మంది చేతులతో మానవ మలాన్ని ఎత్తివేసే వృత్తిలో కొనసాగుతున్నట్లుగా నిర్ధారించుకొని ఈ పద్ధతిని నిర్మూలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. అయితే వాద ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు ఈ పద్ధతిని ఒక మానవీయ దృక్పథంతో పరిశీలించి ఒక ప్రత్యేక తీర్పు ద్వారా డ్రై లెట్రిన్‌ల నిర్మాణ నిషేధిత చట్టం 1993 ఆఫ్‌ 46 ప్రకారం నేరంగా పరిగణిస్తూ శిక్షలు, జరిమానాలతో కూడిన ఒక చట్టం చేయడం జరిగింది. పాకీ పనిని నిషేధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంప్లారుమెంట్‌ ఆఫ్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ డ్రై లెట్రిన్స్‌ ప్రొహిబిషన్‌ ఆక్ట్‌ 1993 తెచ్చారు, కానీ వివిధ కారణాల రీత్యా 1997 వరకు ఆ చట్టం అమలుకు నోచుకోలేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాకీ పని వారందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్‌ స్కీం ఆఫ్‌ లిబరేషన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయినప్పటికీ ఇది నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేకపోయింది. ఆ తర్వాత క్రమంలో ఈ చట్టం అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం, పౌర సమాజం ముఖ్యంగా సఫాయి కర్మచారీ ఆందోళన్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల ఒత్తిడి మూలంగా ఈ మధ్య కాలంలో ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఎంప్లారుమెంట్‌ యాజ్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ దెయిర్‌ రిహాబిలిటేషన్‌ ఆక్ట్‌, 2013 తెచ్చింది. పూర్వం గల చట్టానికి ఇది పూర్తిగా భిన్నమైనది. వారి పునరావాసం, ఆర్థిక, సామాజిక అభివృద్ధి మొదలగు అంశాలు ఈ చట్టంలో చాలా సూటిగా వివరించారు. ఇది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవాల్సి ఉంది.
                     2001లో మన రాష్ట్రంలో సర్వే చేయగా 8,402 మంది సఫాయి కర్మచారులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరి చేత నిషేధింపబడిన 25,672 కమ్యూనిటీ డ్రై లెట్రిన్లనందు పాకీ పనిని చేయిస్తున్నారు. వీరు నూటికి నూరు శాతం షెడ్యూల్డు కులాలకు చెందిన దళితులు. వీరు దీనిని వంశపారంపర్యంగా చేస్తున్న పనే అని గుర్తించారు. కచ్చితమైన లెక్కలు లేకపోయినప్పటికీ మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎమ్‌పవర్‌మెంట్‌ 2002-03 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వీరి జనాభా దాదాపు 6,76,009. ఇందులో దాదాపు 95 శాతం మంది దళిత కులం వారని నిర్ధారించింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెబుతున్న మన దేశంలో పాకీ పని చేసేవారు ఉండటం సిగ్గుపడాల్సిన విషయం. ఒక మనిషి విసర్జించిన దాన్ని మరొక మనిషి తన చేతులతో తీసి శుభ్రపరచాల్సిన అవసరం సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి సమాజంలో ఎంత మాత్రం కూడనిది. పాలకులు ఒక వైపు సామాజిక అభివృద్ధి, సమానత్వం గురించి మాట్లాడుతూ మరొక వైపు ఇలాంటి హేయమైన దురాచార నిర్మూలనకు కృషి చేయకపోవడం విడ్డూరం.
                     ఈ కార్మికులు సాంఘిక దురాచారాన్నే గాక తీవ్రమైన అనారోగ్య పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. వారు ప్రతిరోజూ డ్రైయిన్ల (మురుగు కాల్వలు, గొట్టాలు) లోకి ఎలాంటి భద్రత, ముందు జాగ్రత్త చర్యలు, పర్యవేక్షణ, ఎలాంటి తక్షణ వైద్య సహాయం లేకుండా దిగి, మిథేన్‌, హైడ్రోజన్‌సల్ఫైడ్‌ వంటి హానికరమైన వాయువులను పీల్చి కాలేయ వ్యాధులు, చర్మ, శ్వాసకోశ వ్యాధుల భారీనపడి ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. అందులో ముఖ్యంగా బలవుతుంది పొట్టకూటి కోసం ఈ వృత్తి చేపట్టిన దళితులే. అంతర్జాతీయ సంస్థలైన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన , జాతి తారతమ్య నిర్మూలన సదస్సు, స్త్రీల పట్ల అన్ని రకాల వివక్ష నిర్మూలన సదస్సు. మొదలగునవి కూడా ఈ విషయాన్ని చాల తీవ్రంగా పరిగణించాయి. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుందని పేర్కొన్నాయి . ఇక వీరి సంక్షేమానికి చేపట్టిన చర్యలు అరకొరగానే ఉన్నాయి.
                         ఇక వీరి అభివృద్దికి జాతీయ షెడ్యూల్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ షెడ్యూల్‌ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థల నుంచి రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టి, తరతరాలుగా పేదరికం, నిరక్షరాస్యత , అంటరాని తనం, మొదలగు సామాజిక సమస్యలతో సతమతమవుతున్న ఈ పారిశుధ్య కార్మికుల పిల్లలకు స్కూల్‌ నుంచి ఉన్నత విద్య అందించాలి అప్పుడే రాబోయే తరాలు ఈ వెట్టి చాకిరి నుంచి బయట పడగలుగుతాయి. ఇవేమీ కాకుండా వీరి సర్వతోముఖాభివృద్ధికి అందుబాటులో ఉన్న వనరులు వినియోగించి వీరి సంక్షేమానికి రాజ్యం ఈ దిశగా చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనితో పాటు సభ్య సమాజ పౌరులు, ఆలోచన విధానం లో మార్పు రావాలి, అప్పుడే రాజ్యాంగంలో పౌరులకు ఉద్దేశించిన కనీస హక్కులు సాకారమౌతాయి.

- Prajashakti Telugu News Paper Dated : 17/07/2014 

No comments:

Post a Comment