Monday, July 14, 2014

మాదిగలతోనే పునరుజ్జీవనం By పిడమర్తి రవి


ఏ రోజైతే బుద్ధుడు, మహాత్మాపూలే, సంత్ రవిదాస్, సంత్ కబీర్‌దాస్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం మన జ్ఞానేంద్రియాలు అని మాదిగలు భావిస్తారో ఆరోజు అంబేద్కరిజం ఇంద్రధనస్సు అయి మనకు అద్భుతాలను
ఆవిష్కరింపజేస్తుంది.

మానవత్వం, హేతువాదం, శాస్త్రీయత, ప్రేమ, శాంతి బుద్ధుడు కోరుకున్న భారతదేశం, సామ్రాట్ అశోకుడి పాలనలో ఎలా ఉండెనో అలా ఉండాలన్నాడు అంబేద్కర్. ఆయన ప్రబుద్ధ భారత నిర్మాణం జరగాలని కాంక్షించాడు. ఈ రోజు అంద రూ ఆలోచిస్తున్నదిఅంబేద్కర్ రివైవల్ ఇన్ సోత్ ఇండియా అన్న దాని గురించి. మరి ఉత్తర భారతంలో అంబేద్కరిజం వ్యాప్తి చెందడానికి నిస్సందేహంగా అందరూ చెప్పే మాట కాన్షీరాం ఉద్యమం. మరి ఉత్తరభారత్‌లో విజయం సాధించగలిగిన కాన్షీరాం దక్షిణాదిలో వెనకబడిపోయారెందుకు? దీనికి కారణం ఉత్తర భారతదేశంలో జరిగిన భక్తి ఉద్యమాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడ్డాయి.

ఒక Dedicated character గలిగిన లక్షలాది మంది సమీకృతమయ్యారు. సంత్ రవిదాస్ భక్తిఉద్యమం మెజార్టీగా ఉన్న చమార్లను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లగలిగింది. ఒక సమావేశానికి 1000 కార్లతో చమార్ ఇండస్ట్రియలిస్ట్‌లు వచ్చారు. ఇందులో బహెన్‌జీ మాయావతి ప్రభుత్వం ఏర్పడ్డానికి ముందే చాలామంది కోటీశ్వరులు. ఒక జ్ఞానవంతమైన, నిజాయితీ, కలిగిన వ్యక్తిత్వంతో లెదర్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి కష్టపడిన వాళ్లు. ప్రపంచం ఎటు వెళ్తుందో ఆ దిశ లో గమనాన్ని నిర్దేశించుకున్నవాళ్లు. 

వీరంతా కాన్షీరాం ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంబేద్కర్ సిద్ధాంత పునాదిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీకి ప్రాణం పోసి వేల సంవత్సరాలుగా వివక్షకు గురైన మెజార్టీ ఎంబీసీ, ఎస్సీ, మైనార్టీలను సమీకరించి రాజకీయ అధికారం అనే మాస్టర్ కీ ని సాధించారు. అంబేద్కర్ స్మారక స్థల్ నిర్మించగలిగారు. ఒక బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగగలిగారు. దీనంతటికి కారణం అక్కడ మహా నాయకుడికి తోడైన మహారాజులను సైతం తన కాళ్ల దగ్గరికి రప్పించుకున్న సంత్ రవిదాస్, సంత్ కబీర్‌దాస్, ఇంకా ఎంతోమంది సంత్‌ల వ్యక్తిత్వ వికాస ఉద్యమాలే. అంబేద్కర్ కూడా ఇదే మాట చెబుతాడు. నేనీ స్థాయి కి రావడానికి బుద్ధుడు, పూలే, కబీర్‌లే నా గురువులు. రవిదాస్‌జీకే నా రచనలు అంకితం అంటాడు.

అయితే దక్షిణ భారతదేశంలో అయ్యంకాళి చేసిన పోరాటం కావొచ్చు, పెరియార్, నారాయణ్ గురు, ఉద్యమం, భాగ్యరెడ్డి వర్మ ఆదిహిందూ ఉద్యమం కొంత వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసినా దాన్ని కొననసాగించలేకపోయారు. కానీ మనువాదాన్ని వ్యతిరేకించే డీఎంకే, వామపక్ష పార్టీలు, వాటిని నాయకులు అందిపుచ్చుకున్నారు. అందుకే కేరళ వామపక్షాలు, తమిళనాడు పెరియార్ వారసుల పరమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దశాబ్ద క్రితం వరకు వామపక్ష భావజాలం, మావోయిజం వైపు ఆకర్షితులయ్యారు. 

ఉత్తర భారతంలోని చదువులేని , తిండిలేని, నిరాశ్రయులైన జాతులనే సమీకరించగలిగిన కాన్షీరాం ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యవంతమైన బహుజనులను తనవైపుకు సులభంగా తిప్పుకోగలను అనుకున్నారు. కానీ కాన్షీరాం దీనిలో సఫలం కాలేక పదేళ్లల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. మహారాష్ట్రంలో అంబేద్కర్ వారసులు 1960-70 కాలం లో చేసిన మూర్ఖమైన పనులు ఎన్నో చూసి కాన్షీరాం విసిగిపోయారు. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని చమార్లతో కలిసి పనిచేయగలిగారు. అలసట ఉన్నమాటలేదు. మహ ర్లు- బుద్ధిజం, అంబేద్కరిజం, అంబేద్కరిజం-మార్క్సిజం, బుద్ధిజం-మార్క్సిజం అంటూ సెమినార్లు పెడుతూ ఉంటే కాన్షీరాం వాళ్లను చేతగాని వాళ్లు అన్నాడు.

అందుకే ప్రతిసందర్భంలోను ఆయన చెప్పిన మాటలు ఎందరికో స్ఫూర్తి. అంబేద్కర్ ఉద్యమం నుంచి ఏం చేయాలో నేర్చుకోవాలి. అలాగే మహారాష్ట్ర మహార్‌ల నుంచి ఎలా చేయగూడదో నేర్చుకోవాలి. ఈ రాష్ట్రంలోని కుహనా అంబేద్కరిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మహారాష్ట్ర మహర్‌ల కంటే మూర్ఖులుగా కనిపిస్తున్నారు. అందుకే దక్షిణాదిన అందునా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని అంబేద్కరిస్టులు అంబేద్కర్ ప్రతీ సందర్భంలో వాడుతున్న చమార్ అదే పదాన్ని ఒప్పుకోలేకపోయారు. వీరి ప్రవర్తన చూసి కాన్షీరాం కోపోద్రిక్తుడవ్వడం భరించలేకపోయారు. అప్పటికే దళితుల్లోని రెండు ప్రధానమైన కులాలు వారిలో ఉన్న అన్యాయమైన విషయాలను ఒక కులం మొత్తం అవకాశాలను విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో ఇంకో కులమే అందిపుచ్చుకోవడం అనే అంశాన్ని అప్పటికీ ముఖ్యవిషయంగా ఆందోళన చేస్తున్న వారు ఈ మనువాద ప్రభుత్వాలకు ఆయుధాలుగా కనిపించారు. 

అంబేద్కరిజం పునాదిగా, చమార్ నాయకత్వంలో ప్రబుద్ధ భారతం కోసం ఒకవైపు కాన్షీరాం ఉద్యమిస్తుండగా, బాబు జగ్జీవన్‌రామ్ పునాదిగా, మాదిగ నాయకత్వం మనల్ని మరో మనువాద భారత నిర్మాణానికి పావులుగా ఈ అగ్రవర్ణ నాయకులు వాడుకుంటున్నారు. ఈ రోజు కూడా దీనికి ఒక్క మాదిగ నాయకులే కారణం కాదు. ఇంతకు ముందు చెప్పిన కుహనా అంబేద్కరిస్టులు కూడా కారణం.వెలుగైనటువంటి అంబే ద్కర్‌ను వారు సొంతం చేసుకున్నారు. బాబూజీని అమాయకులైన మాదిగ నాయకత్వం భుజాన మోస్తున్నది.

ఏ మాదిగ ఉద్యోగస్తుడిని పలకరించినా మాలలు అంబేద్కర్ వారసులు. మనం జగ్జీవన్‌రామ్ వారసులం అం టూ ఉంటారు. సంప్రదాయ రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లు దళితులకు రెండు కళ్లు అనడమే అంబేద్కరిజం పతనానికి నాంది అయ్యింది. ఏ రోజైతే బుద్ధుడు, మహాత్మాపూలే, సంత్ రవిదాస్, సంత్ కబీర్‌దాస్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం మన జ్ఞానేంద్రియాలు అని మాదిగలు భావిస్తారో ఆ రోజు అంబేద్కరిజం ఇంద్రధనస్సు అయి మనకు అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. ఆ అంబేద్కరిజం అనే నీటి బిందువులోకి సూర్యకిరణాలు ప్రవేశించినట్టు మాదిగ గుండెలోకి అంబేద్కర్, కాన్షీరాం, కిరణాలు చేరినప్పుడే నిజమైన విముక్తి మార్గం సాధ్యమవుతుంది.

Namasete Telangana Telugu News Paper Dated: 13/7/2014 

No comments:

Post a Comment