July 9, 2014
అరవై ఏండ్ల ఆకాంక్షగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిగా ఉన్న బోనాల పండుగను రాష్ట్ర అధికార పండుగగా ప్రకటించడం, ఉత్సవాలు జరపడం ఆనందమే! కాని, ఆ బోనాల పేరుతో బోనాల పండుగ చుట్టూతా నెలకొని ఉన్న సామాజిక దురాచారమైన జోగినీ, మాతమ్మ, శివసత్తి వ్యవస్థ కొనసాగింపు పట్లనే మా భిన్నాభిప్రాయము తెలియపరుస్తున్నాము. జోగినీ లంటే దేవరకు ఎస్సీ, బీసీ ఆడపిల్లల్ని ముఖ్యంగా మాదిగ అనుబంధ కులాల ఆడపిల్లలను అంకితం చేస్తారు. తర్వాత ఆ ఆడపిల్లను- జోగినిగా ఎవరినీ పెండ్లి చేసుకోకుండా దేవుడి భార్య పేరుతో ఊరంతటికీ లైంగిక ఆస్తిగా పరిగణిస్తారు. ఇది తెలంగాణలో దురాచారంగా కొనసాగుతున్నది. గతంలో జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం చట్టాలు వచ్చినా, కమిషన్లు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పాలి.
బోనాల పండుగ సందర్భంగా వేలాదిగా జోగమ్మలు, మాతమ్మలు, శివసత్తులను వినియోగించడం జరుగుతుంది. బోనాల ఉత్సవాల్లో రంగమెక్కి భవిష్య వాణి చెప్పేదంతా జోగినీలే. ఈ జోగినీలంతా సామాజికంగా అంటరాని మహిళలే. ఈ మధ్య బల్కంపేట ఉత్సవాలకు లక్ష మంది శివసత్తులు హాజరైనారంటే ఈ దురాచారం ఎంత విస్తృతంగా ఉందో అర్ధం చేసుకోవాలి. ఒక్క జంట నగరాల్లోనే దాదాపు రెండున్నర వేల గుళ్ళల్లో వాటిని ఆశ్రయించిన జోగినీ వ్యవస్థ ఉంది. తెలంగాణ రాషా్టన్రికే సంస్కృతిగా ఉన్న బోనాల పండుగ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల ఉత్సవాల్ని జరుపుతున్న ఈ తరుణంలో జోగినీలు, మాతమ్మలు, శివసత్తులు, మాతంగుల పాత్ర లేకుండా అంగరంగ వైభవంగా బోనాల పండుగను జరపాలని, తెలంగాణ ప్రాంత వైభవం ప్రపంచానికి తెలియపరచాలని జోగినీ నిషేధ చట్టాల్ని అమలు జరపాలని మనవి చేస్తున్నాము. అరవై ఏండ్ల ఆశలు ఫలించి కొత్త రాష్ట్రంగా తెలంగాణను పునర్నిర్మాణం చేసుకుంటున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలంతా ఎలాంటి వివక్షలు లేని, సంస్కరణాభిలాషలతో కూడిన మానవతా విలువల వ్యవస్థలు కోరుకుంటున్న ఈ తరుణాన ఆడవాళ్ళను అవమానపరిచే దుర్మార్గమైన ఈ జోగిని, మాత…మ్మ, మాతంగి, శివసత్తి దురాచారాలను రద్దు చేయాలని కోరుతున్నాము.
- తెలంగాణ మహిళా ఉద్యోగ సంఘం
జూపాక సుభద్ర, మల్లీశ్వరి,
డా సత్యలక్షి, వాణి, డా సంధ్య,
అరుణశ్రీ, డా అనితా రెడ్డి
Surya Telugu News Paper Dated: 09/07/2014
No comments:
Post a Comment