Monday, July 21, 2014

కర్కశ రాజకీయమే పోలవరం By గుర్రం సీతారాములు


Published at: 19-07-2014 13:15 PM
ఇప్పుడు తెలంగాణలో అందరూ పండగ వాతావరణంలో ఉన్నారు. కానీ కొన్ని వందల ఊళ్లు స్మశానాల దిబ్బలుగా, లక్షలాది మంది వందల ఏళ్లుగా పెనవేసుకున్న బొడ్డు పేగు కసితో తెంపిన కమురు వాసన చూస్తున్నారు. ఈ గోస ఎవరికీ పట్టలేదు. అందరూ కొత్త రాష్ట్రంలో స్వీయ రాజకీయ నిర్మాణం పేరుతో ఆదివాసుల సమాధుల మీద తమ రాజకీయ పునాదులు, భవనాలు నిర్మించే పనిలో ఉన్నారు.... మూడు లక్షల మందికి పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న పోలవరం నిర్మించడం అంటే ఈ దేశంలో ఆదివాసీల ప్రాణానికి ఇచ్చే విలువేంటో అర్థం అవుతుంది.
గతం జ్ఞాపకం కాదు అన్నారు కళ్యాణరావు గారు. పోలవరం డ్యాం నిర్మాణం ద్వారా నిర్వాసితులవుతున్న మూడు లక్షల మంది ఆదివాసుల జ్ఞాపకాలు నేడు శిథిలమవబోతున్నాయి. పైగా రెండు వందల ముప్ఫై రెండు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయింపు బిల్లు ఆమోదం పొందడంతో పార్లమెంట్‌ సాక్షిగా మూడు లక్షల మంది జల సమాధి జరిగింది. వందల ఏళ్ళుగా భూమితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు, దానికి జరిగిన రక్తపాతం ఆ గాయాల సలపరం మరోసారి పోలవరం నిర్వాసితుల నెత్తిన పిడుగులా పడ్డది. ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అన్నారు నెహ్రూ. ఆయన వారసులు ఆ ఆనకట్టలను శవాల దిబ్బలకు నిలయాలు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో కట్టిన ఆనకట్టల వలన కొన్ని వేల గ్రామాలు కనుమరుగయ్యాయి. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మెసపుటేమియాలో మొదలయిన ఈ నిర్మాణాల వలన కోట్లాది మంది అభివృద్ధి చేదుఫలం చవి చూశారు. సూయజ్‌ కాలువ తవ్వకాల సందర్భంలో కోల్పోయిన భూముల కోసం నిర్వాసితులు కొందరు కోర్టుకు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న వాదనలను విన్న ఒక నిర్వాసితుడు కోర్టు బోనులో నిలబడి జడ్జి గారితో ‘అయ్యా నాకు ప్రభుత్వం అనే దాయాది ఒకడు ఉండని వాడు ఎప్పటికయినా మా భూముల మీదకు వస్తాడని నా తండ్రి నాకో మాట మాత్రం చెప్పలేదే’ అని అమాయకంగా అన్నాడట. ఇప్పుడు పోలవరం కట్టడం వలన లక్షా పదివేల ఎకరాలకు పైగా సాగుభూమి, మూడువందల గ్రామాలు మునిగిపోయి, మూడు రాష్ర్టాల్లో మూడు లక్షలకు పైగా నిర్వాసితులు అవుతున్నారు. వారు అమాయకంగా మేము ఇక్కడే పుట్టాం ఈ కట్టే ఇక్కడే కాలి ఈ మట్టిలో కలిసిపోవాలి అంటున్నారు. కోర్టుల్లో కేసులు వేద్దాం అనుకుంటే వేలాది ఎకరాలు ఆదివాసేతర కబ్జాలో ఉన్నాయి. పైగా ముంపుప్రాంతాలు ఆంధ్రలో కలపడం మూలాన ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లే అని ఒక మంత్రి సెలవిచ్చారు. ఆదివాసీలను సర్వనాశనం చేసే ఈ ప్రాజెక్టు నిర్మించడం అంటే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో అంతర్భాగమైన వాళ్ళ నివాస ప్రాంతాన్ని ముంచేసి, రాజ్యాంగ బద్ధంగా జీవించే హక్కును కాలరాస్తున్నారు. పైగా వాళ్ళు నేడు రాష్ట్ర విభజన వైకుంఠపాళీలో పాము నోటిలో చిక్కారు.
ఒక ప్రాజెక్టు నిర్మాణ ం కోసం ఒక రాష్ట్ర ప్రాదేశిక ప్రాంతాన్ని ఇంకో రాష్ట్రంలో కలపడం ఏంటో అర్థం కాని అమాయకులు ఆదివాసీలు. వాళ్ళు ఆంధ్రలో ఉన్నా తెలంగాణలో ఉన్నా గుండె పగిలి గూడు చెదిరి విభజన రాజకీయాల్లో బలిపశువులు కావడం వింతల్లో వింత. రాష్ట్ర విభజన తదనంతరం మోదీ నాయకత్వం కనీస రాజ్యాంగ సూత్రాలను గౌరవించకుండా తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపి ఆర్డినెన్సు తెచ్చి ఆంధ్ర రాష్ర్టానికి మూడు లక్షల ఆదివాసీలను బలవంతపు బట్వాడా చేసి రాజ్య కసాయితనాన్ని చూపించింది. ఇప్పుడు బాధితులు ఒక త్రిశంకు స్వర్గంలో అలమటిస్తున్నారు. అసందర్భం కాకున్నప్పటికీ వందల ఏళ్ళ కింద మహాభారతంలో పాండవుల అర్ధాంగిని ఆమె అనుమతి లేకుండా మాయాజూదంలో అమ్మకపు సరుకు చేసిన వైనం... తన ఇష్టం లేకున్నా కౌరవుల పంచన పడి ఉండాల్సిన దుస్థితి. పాపం ఆమెకు తెలియదు భర్తలు ఇలా జూదంలో కట్టుకున్న దాన్ని తాకట్టు పెడతారని. ఆమె ఆనాడు జూదంలో తనను కట్టుకున్న వాళ్ళు ఓడిపోయి తనను జూదంలో పావును చేసినప్పుడు ఒక ధర్మ సందేహం వ్యక్తం చేసింది. తనను కట్టుకున్న వాళ్ళను ‘నన్నోడి తానోడెనా తానోడి నన్నోడెనా’ అని అడిగింది! ఏమయినప్పటికీ మొదట పాండవులు ఓడిపోయాకే ద్రౌపదిని జూదంలో పెట్టినప్పటికీ తాకట్టులో పెట్టే అర్హత ఎవరికీ లేదని ద్రౌపది నిలదీసి ఉంటే భారతం ఇంకో మలుపు తిరిగేది. నేడు భువన భవనాలు పగిలాయి విభజనతో అధికార మార్పిడీ జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో స్వీయ రాజకీయం పురుడు పోసుకుంది. స్వరాష్ట్రంలో స్వీయ పాలనలో బ్రతుకులు మారతాయి అని కోటి ఆశలతో ఉన్న ఆదివాసీలకు ఏం మిగిలింది? నూతన రాష్ట్రంలో నిర్వాసితుల తలరాత మారుద్ది అనుకుంటే వాళ్ళ ఇంటి అడ్రస్‌ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి బలవంతపు బదిలీ జరిగింది. ఇప్పుడు వందల ఏళ్ళుగా వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న నేలనుంచి వాళ్ళను విడదీస్తున్నారు. ఇలా దాదాపు మూడు లక్షల మంది వాళ్ళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆంధ్రలో కలపబడ్డారు. పాపం వాళ్ళు ఆదివాసీలు. అడవుల్లో కందమూలాలు తిని బ్రతికారు.
ఒకప్పుడు గొండ్వానా రాజ్యానికి అధిపతులు వాళ్ళు. నేడు నాగరికం అని చెప్పుకుంటున్న సమాజానికి దూరంగా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు. వాళ్ళెప్పుడూ ఈ నాగరిక సమాజంతో స్నేహం చేయలేదు. సంతాల్‌, కోయ గోండు, నాగాలు నివసించిన ప్రాదేశిక
ప్రాంతం నేడు కుక్కలు చించిన విస్తరిలా బెంగాల్‌, బంగ్లాదేశ్‌, నాగాలాండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలోకి విభజించబడ్డారు. ఇప్పుడు విభజన తెచ్చిన చిక్కు పోలవరం పుణ్యాన లక్షలాదిమంది ఆదివాసులను తెలంగాణకే పరాయివాళ్ళుగా మార్చింది. కానీ ఈ దేశ అంతర్గత సమగ్రతకు ముప్పు వాటిల్లిన ప్రతి సంక్షోభంలోనూ శత్రు దేశాల నుంచి మనల్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు సమ్మక్క సారలక్క వారసత్వం ఉంది. సంతాల్‌, రంప, మన్యం, భూంకాల్‌ అనుభవాలతో పొందిన స్ఫూర్తి ఉంది. ఎన్ని పోరాటాలు చేసుంటాడు తను. ఎంత చరిత్ర ఈ మట్టిపొరల్లో నిక్షిప్తమయి ఉండొచ్చు. ఈ పోరాటాల కొనసాగింపుగా వాళ్ళ తాత బిర్సాముండా తెల్లదొరలతో కొట్లాడాడు. వారి వారసుడు రాంజీగోండ్‌, వారి మరో వారసుడు కొమురం భీం నిజాంను ఎదిరించారు. వారు ఏం ఆశించి ఈ త్యాగానికి సిద్ధం అయ్యారు. కేవలం జల్‌ జంగిల్‌ జమీన్‌ చిన్న నినాదం. ఆ నినాదం కోసం కుత్తుకలు తెగినాయ్‌. ఆ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అది కేవలం అధికార మార్పిడీ మాత్రమే అని బుద్ధిజీవులు అనుకున్నారు. అరవై ఏడేళ్ళ తర్వాత మరో అధికార మార్పిడీ జరిగింది. అదే తెలంగాణ. అరవై ఏళ్ళ సీమాంధ్ర పాలన మీద వేలాది మంది చేసిన త్యాగాలతో తెలంగాణ వచ్చింది. వందలాది మంది బలిదానాల పునాదిగా సాధించుకున్న తెలంగాణ లక్ష్యం వనరుల దోపిడీ లేని బంగారు తెలంగాణ. కోస్తా కారిడార్‌కు నీళ్ళు అందించే లక్ష్యంతో పాటు బహుళజాతి కంపెనీల కడుపు నింపడానికి లక్షలాది మంది ఆదివాసీల గూడు చెదరగొడుతున్న సందర్భం ఇది. కోస్తాంధ్ర వలస దోపిడీ కులానికి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడే క్రమంలోనే అక్రమ ఆనకట్టలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆదివాసీలకు కొంచెం నేల అడుగుతున్నారు వాళ్ళు. వందల ఏళ్ళుగా పాలించిన చంద్రాపూర్‌, గొండ్వానా లాంటి పూర్వ వైభవాన్ని అడగడం లేదు. కేవలం వాళ్ళు ఇంతకాలం నమ్ముకున్న నేలను రాష్ట్ర విభజన పేరుతో, అభివృద్ధి పేరుతో కొల్లగొట్టవద్దు అని అభ్యర్థిస్తున్నారు. వాళ్ళకు తెలియదు వాళ్ళు ఉన్న నేలకింద లక్షల కోట్ల విలువయిన సంపద వాళ్ళకు నిలువ నీడ లేకుండా చేస్తోంది. ఏ పోరాటాల స్ఫూర్తితో ఆదివాసీలు, దళితులు, బహుజనులు త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న తెలంగాణ కేవలం అధికార మార్పిడీ కోసమే కాదు గదా. మొదటి నుంచి వనరులతో కూడుకున్న బంగారు తెలంగాణ కోసం కోట్లాదిమంది కొట్లాడి తెచ్చుకున్నది జలసమాధి కావడం కోసం మాత్రమే కాదు. ఆత్మగౌరవంతో బ్రతకడం కోసం ఇక్కడి నీళ్ళు, నిధులు, నేల కోసం. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని వచ్చినా కాళ్ళకింద నేల కుంగిపోతుంటే వచ్చిన తెలంగాణకు అర్థమే లేదు. ఇప్పుడు తెలంగాణలో అందరూ పండగ వాతావరణంలో ఉన్నారు. కానీ కొన్ని వందల ఊళ్లు స్మశానాల దిబ్బలుగా, లక్షలాది మంది వందల ఏళ్లుగా పెనవేసుకున్న బొడ్డు పేగు కసితో తెంపిన కమురు వాసన చూస్తున్నారు. ఈ గోస ఎవరికీ పట్టలేదు. అందరూ కొత్త రాష్ట్రంలో స్వీయ రాజకీయ నిర్మాణం పేరుతో ఆదివాసుల సమాధుల మీద తమ రాజకీయ పునాదులు, భవనాలు నిర్మించే పనిలో ఉన్నారు.

మొదటి నుంచి తెరాసతో సహా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల స్వలాభాలు ఈ నిర్మాణంతో ముడిపడి ఉన్నవి అనేది దాచేస్తే దాగని సత్యం. ఒక్కటా రెండా మూడు వందల పైగా గ్రామాలు. కనీసం యాభై వేల మంది ఆవాసానికి భంగం కలిగించే ఏ ప్రాజెక్టు నిర్మాణం అయునా చట్టవిరుద్ధం అని అంతర్జాతీయ ప్రమాణాలు ఘోషిస్తున్నాయ్‌. మూడు లక్షల మందికి పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న పోలవరం నిర్మించడం అంటే ఈ దేశంలో ఆదివాసీల ప్రాణానికి ఇచ్చే విలువేంటో అర్థం అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ ప్రాజెక్టు నిర్మించినా ఏ కొద్దిపాటి ప్రకృతి విపత్తు సంభవించినా ఆంధ్రలో దాదాపు రెండు మూడు జిల్లాల్లో ఉన్న నలభై లక్షల మంది పైగా సముద్రంలో కలిసే ప్రమాదం ఉంది అని దేశంలో పేరుమోసిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు నిర్మించడం అంటే పాలకులకు ఇక్కడ సాధారణ ప్రజలకు భద్రత మీద కనీస సానుభూతి లేదని తెలుస్తోంది. వాళ్ళ తాతలు, తండ్రులు, ఆడుకున్న జ్ఞాపకాలు, శిథిలం కాబోతున్న బాధాకరమైన సందర్భం ఇది. పోలవరం వాళ్ళ బొందలగడ్డలు కూడా మిగల్చడం లేదు. ఎన్ని తరాలు ఆ నేల మీద ఆకలి, కష్టం, సుఖం, దుఖం కలబోసుకొని ఉండొచ్చు. నాలుగేళ్ళు చదివిన బడి చదువు అయిపోయాక వదిలి పోతుంటేనే వలపోత ఆగదు. తాతలు, తండ్రులు, అయ్యలు, పురుళ్ళు పుణ్యాలు, దినాలు, కొత్తగా పెళ్ళయిన పెళ్లి కూతురు ఊరొదిలి పొలిమేర దాటి ఓ సారి ఊరికి దండం పెట్టి అవ్వా అయ్యలను వదలలేక, పొలిమేర గుండుమీద పెట్టిన వెతలు, కథలు ఒక్కటా రెండా. ఊరి పొలిమేరలోకి రాగానే కాళ్ళకు రెక్కలొస్తాయి. ఇప్పుడు మన్యంలో ఒక్కో రెక్కా విరిసి మంటల్లో మాడుస్తున్నారు. చరిత్రకు మూలవాసులు ఆనవాళ్ళు కోల్పోయి అనాథలు కాబోతున్నారు. ఇప్పుడు ఊళ్లు ఊళ్లే మా యం అవుతుంటే ఎక్కడ బొడ్రాయి? ఎక్కడి పొలిమేర గుండు? ఒక్కో ఊరు జ్ఞాపకాల గుండె గనుల్ని తవ్వుకుంటున్నాయి. వాళ్ళకు మార్కెట్‌ తెలవదు, రాజకీయం తెలవదు, తెలంగాణ తెలవదు. వాళ్ళకు అది అవసరమే లేదు. ఏ రంగయినా ప్రకృతిలో భాగమే అనుకునే స్వచ్ఛమయిన జాతి కదా వాళ్ళది. ఏ లెక్కలు వాడి కుండను పగల గొట్టినవో, పోలవరం ఎవడికి కన్నీరో ఎవడికి పన్నీరో కానీ, వాడికి ఒక్కటి మాత్రం తెలుసు. అదే ‘నమ్మకం’. ఆ నమ్మకమే క్రూరమృగాలను మచ్చిక చేసుకొనేలా చేసింది. వాడికి నాగరికుడు ఎంతవిషపూరితుడో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది, వాడిది విశాల ప్రపంచం. అవధుల్లేని నేల. ఆ నేలతో ముడేసుకున్న పేగు బంధం తెంపేస్తే తెగేది కాదు.
ఐదు వందల ఏళ్ల క్రింద తెల్లవాడు చేసిన ద్రోహానికీ, మొన్న జరిగిన రాష్ట్ర విభజన జూన్‌ రెండు తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రలో కలపడానికీ తేడా ఏమాత్రం లేదు. వాళ్ళు వందల ఏళ్ళుగా నమ్ముకున్న నేల జలసమాధి అవుతుంటే నిస్స హాయ స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు మీద మినుక్కు మినుక్కు ఆశతో ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో ఒక్కో ఇంటిది ఒక్కో కన్నీటి గాథ. ఒక్కో జ్ఞాపకం కాలం చెక్కిళ్ళ మీద కన్నీటి బొట్లుగా రాలుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఆధునికత తెచ్చిన విధ్వంసంకు ఇప్పుడు ఆదివాసుల నరబలి కావాల్సి వచ్చింది. ఇంతమంది ప్రాణాలను బలిపెట్టి ఎవరి ప్రయోజనాలు కాపాడుతుందో అర్థం చేసుకోలేని అమాయకులు కాదు కానీ ఆ మట్టితో వాళ్ళకు తాతల తండ్రుల పురా స్మృతి జ్ఞాపకాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఒక నాగరికత ఉండేది. వాళ్ళు తాతల తండ్రుల నుంచి పోరాటాలకు చిరునామా అయిన నేలతో తెగదెంపు అంత తేలిక కాదు. ఇప్పుడు వాడి నిట్టాడి కూలింది వాణ్ణి ఎక్కిరిస్తూ జై తెలంగాణ నినాదం. ఇప్పుడు చెప్పండి ఇంతకాలం మనం మాట్లాడుకుంటున్న అధి కార మార్పిడీ ఎవరికి మేలు చేసిందో. ఇన్ని పోరాటాలకు సజీవ సాక్షి అయిన ఆదివాసీ చైతన్యం ముందు ఈ అబద్ధపు లెక్కలు ఎంతోకాలం నిలవవు. వాడి కాళ్ళకింద భూమి కాపాడుకోవడం కష్టం కాదు. చేతిలో సత్తువ ఉంది విషం పూసిన విల్లు నారి బిగించి ఈ భూమి నాది అంటుంది. ఇప్పుడు వాడికి కావాల్సింది ఓదార్పు కాదు ఒంట్లో సత్తువ ఉన్నదాకా పోరాడే ధైర్యం ఉంది. తెలంగాణ, ఆంధ్ర రాజకీయ కొట్లాటలో వాళ్ళను పావులను చేయెద్దు. ఇప్పుడు వాడికి కాస్త భరోసా ఇద్దాం.
- గుర్రం సీతారాములు
డాక్టోరల్‌ స్టూడెంట్‌, ఇఫ్లూ
Andhra Jyothi Telugu News Paper Dated: 19/07/2014 
 

No comments:

Post a Comment