Saturday, April 27, 2013

దిగజారుతున్న గిరిజన విద్య కె విజయగౌరి


   Sat, 27 Apr 2013, IST  

మేము ఇటీవల కేశాయివలస అనే గిరిజన గ్రామానికి వెళ్లాము. 2012, జులైలో 32 గిరిజన గూడలకు వెళ్లినప్పుడు ఆ గూడల్లో గిరిజనుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మేము వెళ్లే గూడలు కూడా అలాగే ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల పరిస్థితీ అలాగే ఉంది. అక్కడ పిల్లల చదువు మాట ఎలా ఉన్నా ఆరోగ్య పరిస్థితి మాత్రం భయంకరంగానే ఉంది. అయితే విద్యలో పిల్లల స్థితిని వాకబు చేయడానికే వెళ్లాము. దృష్టి మాత్రం వారి స్థితిగతులపైకి వెళ్లింది. ఆహార సమస్య, ఇంటి సమస్య, సామాజిక సమస్య, ఆదాయ సమస్య, సాంస్కృతిక వెనుకబాటుతనంపై ప్రత్యేకంగా దృష్టి సారించకుండా బడిగంట కొట్టగానే బడికి వస్తారనుకోవడం భ్రమే అవుతుందని భావించాము.
గిరిజన విద్య
2011 జనాభా లెక్కల ప్రకారం ఏడాదికేడాది నిరక్షరాస్యత స్థానం మాత్రం బాగా పెరుగుతోంది. 18వ స్థానం నుంచి 22వ స్థానానికి చేరింది. ప్రస్తుత గణాంకాలు చూస్తే అనుకున్న విధంగా అక్షరాస్యత 49 శాతానికి పెరగలేదు. 2001 లెక్కల ప్రకారం చూస్తే 37 శాతంగా ఉంటే 12 ఏళ్ల కాలంలో కేవలం 7 శాతం మాత్రమే పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు స్కీములో భాగంగా 2,090 ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. ఇంకా అవసరం రీత్యా, అనేక రకాల ఒత్తిడుల రీత్యా 2003 నాటికి 4,317 పాఠశాలలు ఏర్పాటైనాయి. మరలా 2008 నాటికి ఈ సంఖ్య 3,153కు పడిపోయింది. అంటే 1,258 పాఠశాలలు మూతబడ్డాయి. 55 లక్షల మందికిగాను కేవలం 12 లక్షల మంది మాత్రమే చదువుకుంటున్నారంటే విద్యలో వెనుకబాటుతనం స్పష్టంగా కనబడుతుంది. గిరిజన వికాస కేంద్రాలలో నియామకాలు ఈ దశలోనే జరిగాయి. దీనికంటే ముందే ఆయా గ్రామాలలో 'మా బడులు' గిరిజనులే నిర్వహించుకున్నారు. గ్రామాల్లో ఎక్కడో కొద్దిపాటి చైతన్యం ఉన్న వ్యక్తులు చదువు కోసం తపన పడిన దాని నుంచి ఈ మా బడులు వచ్చాయి. ఆ సందర్భంలో అక్షరాల దేవుళ్లను ఏర్పాటు చేసుకున్నారు. అక్షర బ్రహ్మ వంటి ఆలయాలను కట్టుకుని ఐక్యమత్యంతో మెలగాలని ప్రతిజ్ఞలు చేశారు. సవర పెద్దలందరూ ఒకచోటకు చేరి అక్షరబ్రహ్మ అనే రూపాన్ని ప్రతిష్టించుకుని, మూఢ నమ్మకాలను విడనాడాలని ప్రచారం చేశారు. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ పాఠశాలలు వెలిశాయి. వారి ప్రాంతీయ భాషల రక్షణ కోసం, ఆ భాషలో బోధించేందుకు స్థానిక గిరిజనులు కృషి చేశారు. 1986 నుంచి 1990 వరకూ విద్య కోసం గిరిజనుల పడ్డ తాపత్రయం పరిశీలించదగ్గవే. చాలా ఆలయాల్లో రాతి విగ్రహాలు కన్పిస్తాయి, కానీ ఆ ప్రాంతాలలో లిపినే పూజిస్తారు. రాష్ట్రమంతా గిరిజన ప్రాంతాలలో ఆయా తెగల లిపి, భాష, సంస్కృతులకు రక్షణ కల్పించాల్సి ఉంది.
గిరిజన విద్యలో పరిణామాలు
పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ పంటలు వంటి వాటిపై స్వతంత్రత గిరిజనులకు ఉండేవి. కానీ గత 15 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితంగా గిరిజనుల జీవన సరళిపై తీవ్ర ప్రభావం పడింది. వేగవంతమైన సంస్కరణలు వారి వృత్తులను మింగేస్తున్నాయి. ఇప్పటికీ చాలా గూడల్లో అంగన్‌వాడీ సెంటర్లు, బడులు లేవు. చదువుకోవాలనే తపన ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్కరణలు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడడం లేదు.
స్కూళ్ళ కేంద్రీకరణకు యత్నాలు
గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి పర్యవేక్షణ చేయలేమంటూ కొన్ని పాఠశాలలను ఒక ప్రాంతానికి తేవాలని నిర్ణయించారు. అమలుకు ఉత్తర్వులు తయారుచేశారు. అధికారులతో పాలకులు, పాలకులతో అధికారులు కుమ్మక్కై భేష్‌ భేష్‌ అనుకుంటున్నారు. 15 కుటుంబాలున్న గూడలోనైనా పాఠశాల అవసరమని నేషనల్‌ స్కీం విశాల దృక్పథంతో పెడితే, ఇప్పుడవి మూసేస్తామంటున్నారు. ఐదుగురు పిల్లలున్నా ఆ గూడల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పాఠశాల నడపాలనే లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 పై చిలుకు గిరిజన ప్రాథమిక పాఠశాలలు మూతబడనున్నాయి. ఇంతేకాక ఆశ్రమ యుపి పాఠశాలలను ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనేది గిరిజన విద్యాశాఖ ఆలోచన. ఇదే జరిగితే మరింత డ్రాపౌట్స్‌ పెరుగుతారు. గిరిజన విద్య మరింత విస్తరించాలనే నిజమైన తాపత్రయం ఉంటే విద్యాహక్కు చట్టం ప్రకారం వికేంద్రీకరణ చేయాలే తప్ప ఇటువంటి విధానాలు గిరిజనులకు నష్టదాయకంగా మారాయి.
గిరిజన విద్యకు ఆటంకాలు
పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం, ఉన్న టీచర్లను కుదించే ఏర్పాట్లు చేయడం, నియామకాలలో అనేక నిబంధనలు విధించడం, ఆయా ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత వెంటాడుతోంది. మరో అంశం ఏమంటే 'రూపాంతరం' వచ్చిన పథకంలో గ్రాంట్లు కొన్ని పాఠశాలలకే వినియోగించి గ్రేడ్‌ 'ఎ' పాఠశాలలుగా మారుస్తారట. మిగిలిన పాఠశాలల రూపాలు మాత్రం మార్చరట. పాఠశాలల్లో వైద్య సౌకర్యాలు దీనస్థితిలో ఉన్నాయి. శాశ్వతంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రతిరోజూ తనిఖీ చేసేందుకు కనీసం ఒక ఎఎన్‌ఎంను కూడా నియమించలేదు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా విద్యార్థులు జబ్బుల బారినపడి మృతి చెందారు. కేవలం 20 శాతం మాత్రమే పై చదువులకు పోవడం, మిగిలినవారు ఏ పనీ లేకుండా ఉండటం వంటివి గిరిజన విద్యకు ఆటంకంగా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఆశ్రమ పాఠశాలలు 500 ఉంటే ఇప్పటికీ 599 మాత్రమే హాస్టల్స్‌లో కలిపి ఉండటం వెనుకబాటుతనానికి ఒక నిదర్శనం. సీట్ల సంఖ్య కూడా పెరగలేదు. రూ.6 వేల కోట్లలో రూ.1,000 కోట్లు మాత్రమే ఐటిడిఎలకు ఖర్చు చేస్తున్నారు. తీవ్రవాద కార్యక్రమాలలో, అసాంఘిక శక్తులుగా మారే దానిలో దేశవ్యాప్తంగా గిరిజన యువజనులు ఆకర్షించబడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయంటే సమాజంలో వారిపట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో, వారి చైతన్యస్థాయి ఏపాటిదో అర్థమవుతుంది.
ప్రత్యామ్నాయాలు
వీటిని సరిచేసే ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. ఉన్న నిధులలో రెండు రెట్లు నిధులు పెంచడం, విద్యా కమిషన్‌ను వేయడం, ఐటిడిఎలకు శాశ్వత ఐఎఎస్‌ అధికారులను నియమించడం, స్థానిక టీచర్లను నియమించడం, జీవో నెం. 3ను అమలు చేయడం, గురుకుల పాఠశాలల గణాత్మకతను అన్నింటా పెంచడం, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను అమలు చేయడం, ప్రాంతీయ భాష, లిపి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా కోర్సులను ప్రవేశపెట్టడం, అవినీతిని అరికట్టడం, గిరిజనులకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం, 1/70 యాక్టును అమలు చేయడం వంటివి చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు నిజమైన గిరిజన అభివృద్ధి కనిపిస్తుంది. పీసా చట్టాలు, 1/70 వంటివి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారే తప్ప, కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారే తప్ప అమలుకు నోచుకోవడం లేదని, అడవులపై హక్కులు గిరిజనులకు లేవని అయిదేళ్ల కాలంలో జరిగిన మైనింగ్‌, గనులు, విద్యుత్‌ వంటి పోరాటాలు రుజువు చేస్తున్నాయి. గిరిజనుల చైతన్య స్థాయి పెరగాలంటే విద్య అందుబాటులో ఉండాలి. అదే విద్య ఉపాధిని చూపాలి. ఆ దిశగా చైతన్యపరచాలి. వారి అమాయకత్వం వలన ఒకవైపు పాలకులు, మరోవైపు మతతత్వ శక్తులు గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.
ఇప్పటి వరకూ జరిగుతున్న అన్యాయంపై పోరు చేయడం, రాజ్యాంగపరమైన హక్కులను సాధించుకోవడం, పోరాడి తెచ్చుకున్న ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధుల అమలుకై చైతన్యవంతులు కావడం ఒక కర్తవ్యంగా భావించాలి. అనేక రూపాల్లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు, వారి కోసం మనం ఐక్యంగా సాధించుకోవడం మన లక్ష్యం.
అందుకే మార్క్స్‌ ఒక సందర్భంలో అంటాడు. సోషలిస్టు దేశాలలో బడి నడవాలంటే ఆరోగ్యమైన శిశువు కావాలి. ప్రజల ఆరోగ్యంపై కేంద్రీకరించింది. తల్లి కడుపులో బిడ్డ ఉండగానే సంరక్షణ బాధ్యత చేపట్టింది. హెల్త్‌కేర్‌ పథకాలను అమలు చేసింది. సామాజిక చైతన్యం, ఆరోగ్య పెట్టుబడి, ఆర్థిక వనరుల అభివృద్ధి వంటివన్నీ విద్యాహక్కుల అమలు సక్రమంగా సాగిపోవడానికి దారి తీశాయి.
(వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి) 
-కె విజయగౌరి

Prajashakti Telugu News Paper Dated : 27/4/2013

No comments:

Post a Comment