Wednesday, May 1, 2013

అభివృద్ధి అవస్థల్లో ఆదివాసీలు - కొట్టెం వెంకటేశ్వర్లు



గత 64 సంవత్సరాల్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఖనిజాలను వెలికితీసిన పారిశ్రామికీకరణ ఆదివాసులకు ఏం అనుభవాల్ని మిగిల్చింది? భూమిని, ఆస్తులను, ఉనికిని, గుర్తింపును కోల్పోయి లక్షలాది మంది ఆదివాసులు బిచ్చగాళ్ళుగా, అనాథలుగా మార్చబడ్డారు. నాగరికులకు అభివృద్ధి, ఆదివాసులకు పీడన మిగిలింది.. తెలంగాణ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడి వారి జీవితాలు బాగుపడాలనీ కోరుకుందాం! 

భారతాంధ్రలో నేడు గనుల రాజకీయం నడుస్తున్నది. బొగ్గు గనుల కుంభకోణంతో కేంద్రంలో యూపీఏ-2 ప్రభుత్వం ప్రతిష్ఠ మసక బారుతోంది. దేశవ్యాప్తంగా 'గాలి' ఘనుల లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేశ సహజ సంపదను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటి తీర్పులు వెలువరించాయి. అయినా మన పాలకులు తమ బుద్ధిలో ఏమాత్రం మార్పు తెచ్చుకోకుండా ప్రవర్తిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్‌కు బయ్యారం గనులు కేటాయించింది ప్రభుత్వం. ఇది రాష్ట్ర గనుల చరిత్రలో కొత్త అధ్యాయం అని ప్రభుత్వం చెబుతోంది. వరంగల్ జిల్లా గూడురులో 2,500 హెక్టార్లు, ఖమ్మం జిల్లా బయ్యారంలో 2,500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లిలో 342 హెక్టార్లు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక స్టీల్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తామని పాలకులు చెబుతున్నారు. అయినప్పటికీ అక్కడి స్థానిక ఆదివాసీలు అభివృద్ధి రథచక్రాల కింద ఎలా నలిగిపోతున్నారో, ఎలా వారి భూములు అన్యాక్రాంతమవుతున్నాయో, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి. అభివృద్ధి నీడన జరిగే పరిణామాలు వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలకు, పాలకవర్గాలకు తాము చేస్తున్న తప్పిదాలు గుర్తొస్తున్నాయి కాబోలు. అందుకే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టాన్ని శాసనసభ ఆమోదం పొందిన తర్వాత ప్రప్రథమంగా విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధిలో సమగ్ర గిరి ప్రగతి సదస్సును నిర్వహించారు. దానిలో నాతవరం, గూడెం కొత్తవీధి మండలాలకు చెందిన రెండు వన సంరక్షణ సమితి సభ్యులకు అటవీ ఉత్పత్తులపై హక్కు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ 'రాజ్యాంగంలోని 244 షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలలో ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వమని, రాజ్యాంగ విరుద్ధంగా, అటవీ చట్టాలను ఉల్లంఘించి బాక్సైట్ తవ్వకాల కోసం కుదుర్చుకొన్న ఒప్పందాల్ని రద్దు చేస్తామని, మైనింగ్ కార్యక్రమాల్ని నిలిపివేస్తూ విశాఖ ఏజెన్సీలో మారటోరియం విధిస్తామనీ, తీవ్రవాద నిర్మూలనకు ఇదే మందనీ' ఇద్దరు కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, జైరాం రమేష్ సమక్షంలో ప్రకటించారు. పాలకవర్గాల ప్రవర్తన రీత్యా సంభవించే ధోరణుల వల్ల ఆదివాసుల అనుమానాలు పెను భూతాలై మదిలో కలవరపెడుతున్నాయి. 

అందుకు చాలా ఉదాహరణలున్నాయి. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో బ్రిటీష్ వారు గతంలో ఏజెన్సీ ప్రాంతాలుగా పిలిచిన ప్రాంతాలను రాజ్యాంగ 5వ షెడ్యూల్‌లోని 244వ అధికరణ కిందకు తీసుకువచ్చారు. వాటిని షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పిలుస్తున్నారు. భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ జాతుల జీవన విధానాన్ని, పరిరక్షణను, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించటానికి కొన్ని రక్షణ కవచాల్ని ఏర్పాటు చేసింది. 244వ అధికరణ ప్రకారం 5వ షెడ్యూల్‌లో పొందుపరచబడిన నిబంధనలన్నీ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, నియంత్రణకు సంబంధించినవి. ప్రతి ఏడాది లేదా రాష్ట్రపతి కోరినప్పుడు షెడ్యూల్డ్ ప్రాంత పరిపాలన గురించి గవర్నర్ నివేదిక పంపాల్సి ఉంటుంది. కానీ గవర్నర్ పదవి కీలు బొమ్మగా మారటంతో ఇప్పటివరకు ఏ గవర్నరూ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణ గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఎలాంటి అభివృద్ధి నివేదికలు, సిఫార్సులు లేకపోవడంతో ఆదివాసుల బతుకులు గాలిలో పెట్టిన దీపంగా అగమ్యగోచరంగా తయారయ్యాయి.

రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం, వారి పురోభివృద్ధికి సంబంధించి సలహాలు ఇచ్చేందుకు రాష్ట్ర గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ) ఏర్పడాలి. కానీ రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, రాజకీయ పరిపక్వత లేమి కారణంగా ఇరవై మందికి పై చిలుకు గిరిజన ఎమ్మెల్యేలున్నా మండలి సమావేశం ఏనాడూ సఫలం కాలేదు.

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూముల బదలాయింపును నిషేధించటానికి లేదా నిరోధించటానికి, వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనల్ని గవర్నర్ ప్రవేశపెట్టవచ్చు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మంచి పాలన, శాంతి ఒనగూర్చేందుకు తగిన నిబంధనల్ని చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపజేయడానికి పార్లమెంట్ లేదా శాసనసభ చేసిన చట్టాలను గవర్నర్ సవరించవచ్చును లేదా రద్దు చేయవచ్చును. ఇటువంటి చర్యలకు పూనుకొన్నప్పటికీ గిరిజన సలహా మండలి సలహా పొందాలి. గవర్నర్ రూపొందించిన నిబంధనలు రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలుగా అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం 244వ అధికరణ కింద రాష్ట్రపతికి ఉంటుంది. కానీ భారతాంధ్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వలన మన రాష్ట్రంలో 828 గ్రామాలు షెడ్యూల్డ్ హోదాకు నోచుకోలేక అభివృద్ధిలో కుంటుపడిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కొత్తగా షెడ్యూల్డ్ గ్రామాల జాబితా వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ అమలుకు నోచుకోకపోవడం దారుణం.

ఒకవైపు రాజ్యాంగ 5వ షెడ్యూల్డ్ సవరణకు ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన భూమి హక్కుల పరిరక్షణకు రూపొందించబడిన నిబంధనల్ని రద్దు చేయాలని, గిరిజనేతర భూస్వాముల ఒత్తిడితో ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తోంది. వాటిని ఆదివాసులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. అయితే ప్రపంచీకరణ, నూతన సరళీకరణ విధానాలు బలంగా అమలు చేయడంతో విదేశీ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయాలని పాలకులు చూస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఆదివాసులకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరులుగా భావించడంతో ప్రభుత్వాల షెడ్యూల్డ్ ప్రాంత వనరుల అన్యాక్రాంత ప్రయత్నాలకు విఘాతం ఏర్పడింది. నాల్కో, బాల్కో, బిలాయి, రూర్కెలా, ధన్‌బాద్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఆదివాసుల జీవితాలు అణగారిపోయాయి. దీన్నిబట్టి తేలేదేమిటంటే 5వ షెడ్యూల్ సవరణ ప్రతిపాదన బహుళజాతి కంపెనీలకు ఆదివాసీ ప్రాంతాల్ని కట్టబెట్టే ప్రయత్నమే. 5వ షెడ్యూల్డ్ చట్టం సవరించబోమని ఒకముఖ్యమంత్రి ప్రకటిస్తారు. మరొకవైపు దేశ క్యాబినెట్ ముందు అదే ముఖ్యమంత్రి 5వ షెడ్యూల్ సవరణకు కావలసిన సిఫార్సులను కేంద్రానికి అధికారికంగా అందజేస్తారు. దీని పరమార్థం పాలకవర్గాలకు తెలుసు.

గత 64 సంవత్సరాల్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో ఖనిజాలను వెలికితీసిన పారిశ్రామికీకరణ ఆదివాసులకు ఏం అనుభవాల్ని మిగిల్చింది? భూమిని, ఆస్తులను, ఉనికిని, గుర్తింపును కోల్పోయి లక్షలాది మంది ఆదివాసులు బిచ్చగాళ్ళుగా, అనాథలుగా మార్చబడ్డారు. నాగరికులకు అభివృద్ధి, ఆదివాసులకు పీడన మిగిలింది. ఉద్యోగాలు మైదాన ప్రాంతం వారికి లభిస్తే ఆదివాసులకు నిరాశే మిగిలింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ స్థానిక ప్రజలను విస్మరించే చర్యలను చేపట్టడం తక్షణం విరమించుకోవాలి. ఆదివాసులకు ఆధునిక సామాజిక స్థాయి వచ్చేదాకా ప్రభుత్వమే 5వ షెడ్యూల్డ్ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. తెలంగాణ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడి వారి జీవితాలు బాగుపడాలనీ కోరుకుందాం!

- కొట్టెం వెంకటేశ్వర్లు
ఆదివాసీ రచయితల సంఘం


Andhra Jyothi Telugu News Paper Dated : 1/5/2013 

No comments:

Post a Comment