నాటి ఆదిమ రాజపుత్రులే నేటి లంబాడీలు.
ప్రాచీన భారతదేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడడంలో విశేష పాత్ర వహించిన ఈ రాజపుత్రులు తమ వైభవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయారు. తొలుత తురుష్కుల చేతిలో ఊచకోతకు గురయ్యారు; ఆ తరువాత మొగలాయీల ఆధిపత్యంలో నలిగిపోయారు. ప్రాణాలనైనా కాపాడుకోవడానికి అడవులకు పారిపోవాల్సిన అగత్య మేర్పడింది. శత్రు సైన్యాలు గుర్తించకుండా రాజపుత్రులకు సహజమైన వేష ధారణను సైతం త్యజించవలసివచ్చింది. ఆకులు అలములు తింటూ బతికారు. తమ రాజపుత్ర అస్తిత్వాన్ని మరచిపోలేక ఆ గతించిన జీవన శైలి స్ఫూర్తితో ఒక విచిత్ర వేషధారణకు అలవాటు పడ్డారు. తొలుత వీరిని చూసినప్పుడు బ్రిటిష్ వారు విస్మయానికి లోనయ్యారు. వారి దృఢకాయాలకు అబ్బురపడ్డారు. అయితే తమకు వ్యతిరేకంగా పోరాడడంలో మరెవ్వరికంటే ముందుండడంతో ఈ ఆదిమ రాజపుత్రుల పట్ల తీవ్ర వ్యతరేకతను పెంచుకున్నారు. దేశ పాలనాధికారాలు పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చిన తరువాత వారిని నేరస్థుల తెగగా ముద్రవేశారు. వారిని అదుపుచేయడానికి, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడానికి కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. ఈ విషాద క్రమంలో ఆదిమ రాజపుత్రులు లంబాడీలుగా మారిపోయారు.
నిజాం నవాబుల ఏలుబడిలో కూడా వారి కష్టాలు తీరలేదు. నిరంకుశ రాజరికానికి, పెత్తందారీ భూస్వామ్యానికి భూములు కోల్పోయారు. భుక్తి కరువయింది. ఆత్మాభిమానులైన లంబాడీలు ఎదురు తిరిగారు. వీరోచిత పోరాటాలు చేశారు. చరిత్రలో గుణాత్మక మార్పుకు విశేషంగా దోహదం చేశారు. అయితే వారి త్యాగాలు నిష్ఫలమయ్యాయి. మళ్ళీ నిర్లక్ష్యానికి గురయ్యారు. దోపిడీకి, అణచివేతకు గురయ్యారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వారి కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత మరింతగా అన్యాయాలకు గురయ్యారు. కొత్త పాలకులు తెలంగాణ పట్ల చూపిన నిర్లక్ష్యంలో భాగంగా లంబాడీలూ నానా ఇక్కట్లకు గురయ్యారు.
వివక్ష పెరిగింది. తెలంగాణ ప్రాంత ఆదిమవాసీ లంబాడీలు ప్రాంతీయ వివక్షకు గురయ్యారు. ఒకే వంశం, ఒకే వర్ణం నుంచి ఉద్భవించి వ్యవసాయం, పశుపోషణ ఆధారంగా జీవిస్తున్న వారే అందరూ. అయితే జన ఆవాసానికి సమీపంలో నివశిస్తున్నారనే అసత్యాన్ని జోడించి మైదాన ప్రాంతం పేర వలస గిరిజనులనే ముద్ర వేశారు. తద్వారా మరిన్ని అన్యాయాలకు గురిచేస్తున్నారు. తెలంగాణ ప్రాంత అదిమవాసీ లంబాడీలు పూర్వం మొగలాయీలు, బ్రిటిష్ పాలకులు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పాలకులకు వ్యతిరేకంగా వారు ఏనాడూ వ్యవహరించలేదు. పెట్టుబడిదారులను వ్యతిరేకించే రాజకీయ నైపుణ్యం వారికి లేదు. తమకు ఏమాత్రం వ్యతిరేకం కానప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణ ఆదివాసీ లంబాడీలకు అన్యాయమే చేశారు. వీరిని ఆదిమవాసీ గిరిజనులుగా గుర్తించలేదు, గిరిజన సమానత్వం కల్పించలేదు. గెజిట్‌లో వారిని చేర్చలేదు. కేవలం తెలంగాణ ప్రాంత ఆదిమవాసీ లంబాడీ బంజారాలను వలస గిరిజనులుగా గుర్తించారు! ఎందుకీ పక్షపాతం? ఇది సవతితల్లి వైఖరి కాదా? సీమాంధ్ర ప్రాంత పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ప్రత్యేక తెలంగాణతోనే తమ కష్టనష్టాలు తొలగిపోతాయని తెలంగాణ ఆదిమవాసీ గిరిజనులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించనున్నది. వెయ్యిమంది యువతీయువకులు ఇందుకు బలిదానం చేశారన్న విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక కొత్త చరిత్రకు నాంది కాబోతుంది. చిన్న రాష్ట్రాలతో పరిపాలనా సౌలభ్యం కలగనున్నది. ప్రజలందరికీ సుపరిపాలన సాధ్యమవనున్నది. గ్రామ స్వరాజ్యభావన సార్థకమవనున్నది. ఈ కొత్త తరుణంలో రాబోయే పాలకులు ఆదిమవాసీ లంబాడీలకు తప్పకన్యాయం చేయాలి. వారిని పూర్వ మూల ఆదిమవాసీ గిరిజనులుగా గుర్తించాలి. గిరిజన సమానత్వం కల్పించాలి. గెజిట్‌లో చేర్చాలి. ఐటీడీఏ ప్రాజెక్టును వర్తింప చేయాలి. మౌలిక వసతులు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేయాలి. ప్రస్తుత రిజర్వేషన్‌ను 15 శాతానికి పెంచాలి. ధేబర్ కమిషన్ నివేదికను అమలు పరచాలి. బ్రిటిష్ పాలకులు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన భంగీ-జంగీ, విలాటూ భూక్యా, రెడ్డి నాయక్ రాథోడ్, ధానూనాయక్ జాట్రోట్‌ల విగ్రహాలను తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పాలి. ఈ వీరుల జీవితచరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చి రేపటి పౌరులకు స్ఫూర్తి కల్గించాలి. ప్రభుత్వమే వారి జయంతి, వర్ధంతులను నిర్వహించాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలి. వారి చరిత్రను గౌరవించాలి.
- దేవసోత్ టీకం రాథోడ్
తెలంగాణ గిరిజన మహాసభ రాష్ట్ర అధ్యక్షులు
Andhra Jyothi Telugu News Paper Dated : 13/11/2013
No comments:
Post a Comment