Thursday, January 17, 2013

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో జెండర్‌ కోటాలేవి? ---జూపాక సుభద్రఆచరణకు నోచని మహిళా సాధికారత
చట్టంలో లోపించిన మహిళా కోణం 
సంక్షేమ ప్రాధాన్యతకు తొలి అర్హులు 
ఇంకా దోపిడీ, పీడన, అణచివేతలే! 
అన్ని కార్పొరేషన్లలో మగవాళ్ళే లబ్ధిదారులు 

యునైటెడ్‌ నేషన్స్‌నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాకా మహిళా సాధికారత గురించి, జెండర్‌ బడ్డెట్‌ గురించి మాట్లాడుతున్నాయి. అలాగే రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఎన్‌జిఒలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవన్నీ వింటూ ఉంటే చాలా మంచి ఆలోచన అని సంబర పడతాము. కానీ ప్రభుత్వాలు చేతల్లో జెండర్‌ బడ్జెటింగుకు, అందులో అణగారిన సమూహాల జెండర్‌ సాధికారతకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అమలు చేయడానికి ప్రయత్నాలు చేయకపోవడం, ప్రత్యేక రూపకల్పనలకు పూనుకోక పోవడం వంటివాటికి నిలువెత్తు నిదర్శనం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం. ఈ చట్టాన్ని దళిత కులాలు, ఆదివాసీ కులాలు ఎంతో పోరాడి సాధించుకున్నాయి. దీనిని స్వాగతించాల్సిందే. ఇది ఈ మధ్యనే రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలో ఆమోదం పొంది చట్టంగా రూపు దిద్దుకుంది. 

కాని ఈ చట్టంలో దళిత, ఆదివాసీ మహిళల కోసం నిర్దిష్ఠ వాటా కేటాయింపులు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందనీ, అందువల్ల ఈ మహిళలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అంచునే ఉండే పరిస్థితులే ఉంటాయనేది దళిత, ఆదివాసీ మహిళల ఆందోళన.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు మొత్తం (61+35) కలిపి 96 కులాలు, జాతులు ఉన్నాయి. వీరి జనాభా మొత్తం సుమారు 2 కోట్ల 20 లక్షలదాకా ఉంది. కుల సమాజ జనాభాలోనే అత్యంత దోపిడీ, పీడనలకు గురవుతూ అవకాశాల చట్రంనుంచి నిరంతరం మినహాయింపు పొందుతూ అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ సమూహాల్లోని ఆడవాళ్ళు ఇంకా నిర్లక్ష్య సమూహాలే! సంక్షేమ రాజ్యంగా, సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సంక్షేమ ప్రాధాన్యతలు ఈ కులాల, తెగల ఆడవారికే ఇవ్వాల్సి ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చేయవలసి ఉంది. 

కాని అలా కాక వారి నిధుల్ని దారి మళ్ళించి పైలాపచ్చీసు చేసింది ప్రభుత్వం. రింగు రోడ్లకు, హుసేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు, పర్యావరణ పరిరక్షణకు, మంత్రుల కార్ల కొనుగోళ్ళకు, కార్యాలయాల సింగారాలకు, విలాసాలకు ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని తాకట్టు పెట్టింది. గత 30 ఏళ్ళనుంచి దాదాపు రూ. 30 వేల కోట్లకు పైగా ఎస్సీ, ఎస్టీ నిధుల్ని ప్రభుత్వాలు పక్కదారి పట్టించి వారిని ఎదగనీయకుండా పేదరికంలోనే ఉంచాయని దళిత ఉద్యమకారులు తేల్చారు. 1970 ఆ ప్రాంతంలో, స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల కాలంలో దళిత, ఆదివాసీ సమూహాల అభివృద్ధి మీద ఒక సమీక్ష జరగడం రాజకీయ అవసరం అయింది. గుండుగుత్తగా ఈ సమూహాల్ని ఓటు బ్యాంకుగా డిపాజిట్‌ చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రూపొందించారు. వీరికి కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాక ఇంకా అదనపు సంక్షేమాలు రూపొందిస్తున్నామని ఈ ప్లాన్‌ తీసుకు వచ్చాయి పాలక వర్గాలు. కాని అమలు చేయడంలో విఫలమయ్యాయి. ఎనభైనాడు రూపొందించిన ఈ ప్లాన్‌లో కూడా జెండర్‌ భాగస్వామ్య కేటాయింపులు జరగలేదు. అదే నేటి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో కూడా కొనసాగింది. 

రాష్ట్రంలో కోటి మందికి పైగా దళిత, ఆదివాసీ మహిళా జనాభా ఉంది. కాని ఈ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో వీరికి ఎలాంటి ప్రాతినిధ్యాలు, రూపకల్పనలు జరగలేదు. ఈ మహిళల్లో చెప్పులు కుట్టే వాళ్ళు, చర్మాలు వలిచేవాళ్ళు, రోడ్లు ఊడిచేవారు, వృత్తికళాకారులు, సంచార జీవనం చేసేవారు, బహిరంగ మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు, పాకీ పని చేసేవాళ్ళు, జోగినిలు, కొండ కోనల్లో నివసించేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, వెట్టిచాకిరీలో ఉన్నవాళ్ళు, అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నవాళ్ళు, వికలాంగ మహిళలు వివిధ శ్రమల్లో నలిగిపోతున్న, అశక్తతకు గురవుతున్న ప్రత్యేక సెక్షన్లుగా ఉన్న ఈ ఎస్సీ, ఎస్టీ స్ర్తీలకు ఈ చట్టంలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించకపోవడం, సంక్షేమ, సంరక్షణ చర్యలు రూపొందించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ చట్టం ఈ మహిళలను గుర్తించి వారికి హామీ కల్పిస్తే మహిళా సాధికారతకు తోడ్పడినట్టయ్యేది. ఇప్పుడు మనం చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారుల్లో కనీసం ఒక శాతం కూడా ఎస్సీ మహిళలు ఉండరు.

అలాగే ఎస్టీ కార్పొరేషన్‌లో గిరిజన మగవాళ్ళే లబ్ధిదారులు. బీసీ కార్పొరేషన్‌లో బీసీ మగవాళ్ళే లబ్ధిదారులు. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో లబ్ధిదారులంతా అగ్రకులాల మగవాళ్ళే ఉంటారు. నిజానికి ఈ కార్పొరేష్‌ అందరిదీ. మగ, ఆడ, అగ్రకుల ఆడవాళ్ళు కూడా ఈ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో లబ్ధిదారులైన దాఖలాలు చూడబోము. అలాగే మహిళా కార్పొరేషన్‌. పేరుకు ఇది అందరు మహిళలకు సంబంధించిన కార్పొరేషన్‌. కాని దీనిద్వారా రుణాలు, ప్రయోజనాలు పొందే లబ్ధిదారులందరూ అగ్రవర్ణ మహిళలే. ఒకటి అర బీసీల ఆడవాళ్ళు కనిపించినా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు కానరారు. కార్పొరేషన్లు ఇలా కుల, జెండర్‌ పేరుతో ఆధిపత్యాలు, ఆక్రమించుకున్న విధానాలు ఉన్నాయి. అటు కులం పేరు మీద జరిగే సంక్షేమాలను మగవాళ్ళు పొందుతున్నారు. ఇటు జెండర్‌ పేరు మీద జరిగే సంక్షేమాలను అగ్రకుల ఆడవాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. 

మరి దళిత, ఆదివాసీ మహిళల పరిస్థితి ఏమిటి? మహిళా కార్పొరేషన్‌ మహిళా సాధికారత కోసం, సంక్షేమం కోసం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయ రుణాల కోసం ఏర్పాటైంది. కాని ఈ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకుని లబ్ధి పొందుతున్నదంతా అగ్రకుల ఆడవాళ్ళు. అవి గూడెం, తండా ఆడవాళ్ళ దాకా రావు. అసలు ఈ కార్పొరేషన్‌ ఉందనే సంగతి కూడా ఎస్సీ, ఎస్టీ మగవాళ్ళకు, ఆడవాళ్ళకు తెలియనీయకుండా ఉంచారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇదీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ మహిళల పరిస్థితి. ఈ పరిస్థితుల కారణంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు గంపగుత్తలు, గుండగుత్తలు కాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో ప్రత్యేక జెండర్‌ బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని దళిత సంఘాలు, మేధావులు ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీలను కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో చేయాల్సిన సవరణలు: 1. జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళా జనాభాను ఒక యూనిట్‌గా గుర్తించాలి. 

jupa
2. ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాలు, పేదరిక నిర్మూలన పథకాలు, వ్యవసాయ భూములు, రుణాలు, ఇతర సంక్షేమ పథకాలను అందించాలి. 3. జోగిని, మాన్యువల్‌ స్కావెంజర్స్‌, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగ ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. 4. కులం- జెండర్‌ ప్రాతిపదికగా నిధుల కేటాయింపు జరగాలి. 5. ఉప ప్రణాళిక నిధుల్లో 50 శాతం మహిళలకు అందించాలి. 6. నిధుల్ని ఖర్చుచేయకుండా దారి మళ్ళించిన అధికారులను శిక్షించే ఏర్పాటు ఈ చట్టంలో చేయాలి. దళిత, ఆదివాసీ మహిళలకు ఈ చట్టంలో కేటాయింపులు నిర్దిష్ఠంగా జరగకపోతే, పైన పేర్కొన్న కార్పొరేషన్లలో జరుగుతున్న విధంగానే దళిత, ఆదివాసీ మహిళలకు నష్టం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో మహిళలకు జెండర్‌ కేటాయింపులు జరగకపోతే వారు అభివృద్ధికి ఆమడ దూరంలోనే మిగిలిపోతారు.

Surya Telugu News Paper Dated : 18/1/2013

No comments:

Post a Comment