Saturday, February 25, 2012

అస్సోయిదూలాతో ఆడే నా రోజెన్నడో--- జూపాక సుభద్ర

అస్సోయిదూలాతో ఆడే నా రోజెన్నడో

ఓ పెద్దమనిషన్నట్లు
నేను 'కోటి రతనాల వీణ' నేమోగాని
కోటి గాయాల గడ్డను అనేది నిజం
యింకా సబ్బండ సమ్మక్క సారక్కలకు అడ్డానని
పోరాటాల సాల్లు బోసిన
పోషమ్మ మైసమ్మ వుప్పలమ్మ వూరడమ్మల
బిడ్డనని మాత్రమే తెలుసు
నా ఆడిబిడ్డెలు ఎండ కన్నెరగనోల్లు గాదు
ఏడు ముట్టెల్ల కాలం పిల్లాదిమారకాంచి
పోరుల పొర్లాడుతున్నోల్లు
గానాడెన్నడో సాయుధ పోరాటంల
తుపాకులు బట్టి తూటాలు తొడుక్కొని
గడీలల్ల బరిబాతల బత్కమ్మ లాడిచ్చిన
దొరల కోరల్ని వొలిచినోల్లు
మిలట్రీ మిడతల దండు కండ్లల్ల కారం ఫిరంగులు జల్లి
వూరావలికి వురికిచ్చినోల్లు
గియ్యాల పొట్ట తట్టల వెట్టుకొని పట్నం బోతుండ్రు
రోడ్లకు కంకెరై బవంతులకు సిమిటై యిటికై
యిండ్లల్ల పాసి పనై
బిడ్డలకు బుక్కెడు బువ్వ బెట్టలేక
అడ్డాల్నాడే అమ్ముకుంటుండ్రు
అడ్డాల మీద కుప్పబోసిన కూలి సరుకైతుండ్రు
బతుకే సావైన కాడ అక్షరాల మెతుకులకు యాడికి బోదును
యెన్నెలై పారిన నా యేటి యెదలు సీకటి డొక్కలైనయి
సింగిడై పొంగిన నా గొలుసుకట్టు కలలు
సెద పురుగులు దిన్నయి
నా పల్లె సెట్టుకు ఆకు అంటుతలేదు
సిన్నబొయి కూకుండనీకి సిరిమల్లె పందిర్లు పాడైనయి
అదేందో నా పుట్కే మంచిది గాదు! బేకార్ పుట్క
నన్నెవరు బుట్టించిండ్రో ఏమో గాని
ఏనాడు కడుపు నిండ దిని కండ్లార కునుకు దీయలే
నా గడ్డ మీదికొచ్చినోడు సచ్చినా బోడెందుకో
యేడ లేని బెల్లంగడ్డలు నా తాన్నే వున్నయా
అగెపాయె బత్కనియ్యంటే
నన్నే అంగట్ల అమ్ముతుండ్రు తక్కెట్ల జోకుతుండ్రు
నా రూపురేకల్ని నామ రూపాలు లేకుంట నమిలిమింగుతుండ్రు
నా మట్టిల బతికి బట్టగట్టి కోట్లకు కోటలు గడుతుండ్రు
నా జాగ నాగ్గావాలంటె
'ఛత్' నీ యయ్య 'విడదీస్తున్నరు' అని
సమైక్య రాగాలు రాజేస్తుండ్రు
గీల్లందర్ని మోసి మోసి మాడంత కాయగాసిందిరా బిడ్డా!
నా కడుపు నిండ నీళ్లున్నయి,
నా గుండె నిండ గనుల గరిశెలున్నయి
నా నెత్తి నిండ పోరాటాల పొక్కిల్ల తొక్కిడున్నది
అయినా నా వూర్లన్ని వుపాసాలై వుంటన్నయి
గా పెద్ద మనుసులు సావ వాల్ల నెత్క కట్క పోను
బలిమీటికి బాసింగం గట్టి అడివిల ఆగం జేసిండ్రు
'కలిసుంటే కలదు సుకమని' నన్ను కల్లోలం జేసిండ్రు
నా బిడ్డెలు పిడికెడు బువ్వకు అడివిల అన్నలైతుండ్రు
మస్కట్ తొవ్వల్ల మరిగిపోతుండ్రు
గా పొద్దు నీ సెరని యిడిపించనీకి కొట్లాడిన నా పోరగాండ్లని
పిట్టలోలె కాల్చి సంపితే
గీనాడు కనిపించని కుట్రలు పెట్రోలై హత్యలు జేస్తూ..
నన్ను సావుల రేవు జేస్తున్నరు
ఎన్నేండ్లున్నా వేరు దప్పది.. ఎప్పటికైనా వలస పక్కల బల్లెమై
మేలుకొనే వుంట
వాడెన్నిసార్ల ధోక జేసినా సల్లారని బూడిదిని
వానికి నాలుగు గాదు నలబై తల్కాయలుండొచ్చు
నేను వూరూరికి నినాదమై వురుముతూ
ధూంధాంతో దిక్కుల్ని దుక్కు దున్నినా
వాని కమిటీ తంత్రాల తాయత్తుల్ల కాటగల్సిన
సూరుకు సెక్కిన సుట్టాకునైన పులి నోట్లె జిక్కిన పాలపిట్టనైన
నేను నేనుగ నిలబడందే
ఎల్లి ఎల్లమ్మ.. నర్సిగాడు నర్సయ్యలు కారురా బిడ్డలారా
నా పీడలకు పాడెగట్టి నా గడ్డ మీద నాకు
బొట్టువెట్టి బోనమండి అస్సోయిదూలాతో
డప్పు సప్పుల్లతో దండోరేసే నా రోజెన్నడో.....

- జూపాక సుభద్ర
Andhra Jyothi News Paper Dated : 24/05/2010

No comments:

Post a Comment