గురజాడ 150వ జయంతి ఉత్సవాలకై ఆయన పునాదులున్న విజయనగరం చూడటానికి ఉత్సాహంగా కదిలిన కవులు, రచయితలు, రచయిత్రులు గురజాడ మానవీయతని సంస్కరణ భావాల్ని, స్ఫూర్తిని నింపుకోలేకపోవడం విచారకరం. దాదాపు 150 ఏళ్ల నాడే గురజాడ అసిరిగాన్ని తన అక్షరాల్లో పొదువుకున్నాడు. ఈ కవులకు, హత్యలకు గురైన అసిరిగాళ్లు, వేటాడిన అసిరిగాళ్లు, గాయపడిన అసిరిగాళ్లు నెత్తుటి దు:ఖాల దళిత మహిళలు కంటికి కనబడలేదు. గురజాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గురజాడ ఎలుగెత్తి చాటిన మానవత సామాజిక బాధ్యతను కరబర్చకపోవడం విషాదమే.
చరిత్రలు దళిత ఆడవాళ్ల గొంతుల్ని, స్పందనల్ని, అనుభవాల్ని, శోకాల్ని, పోరాటాల్ని నిశ్శబ్దంలోకి నెట్టివేశాయి. లక్షింపేట మాల ఆడవాళ్ల నెత్తుటి దు:ఖాల్ని పంచుకోవడానికి 'మట్టిపూలు' రచయిత్రులం సెప్టెంబర్ 19, 2012న లక్షింపేటకు వెళ్లాము. వాళ్లు చెప్పిన విషయాలు ఈ సమాజం పట్టించుకోని, కప్పివుంచిన పచ్చి నిజాలు.
దళితుల్ని ఊచకోత కోసి వందరోజులైనా తమ కళ్ల ముందే తండ్రులు, భర్తలు, అన్నలు, తమ్ముళ్లు, కొడుకులు.. చంపబడుతూంటే అడ్డంవెళ్లి కాళ్లు చేతులు, నడుములు విరగ్గొట్టుకున్న ఆడవాళ్లు, అసహాయంగా కొట్టుకులాడిన పిల్లలు, తల్లులు గూడెమంతా భయంగా, ఆందోళనగా ఉలిక్కిపడుతూ ఆదుర్దాగా మంచంబట్టి ఉన్నారు. లక్షింపేట మారణకాండలో చంపబడ్డవాళ్లు నివర్తి వెంకటి, బూరాడ సుందర్రావ్, నివర్తి సంగమేశు, చిత్తిరి అప్పడు, బొద్దూరి పాపయ్యలు మాత్రమే బయటి సమాజానికి తెలిసింది, గుర్తించింది.
కానీ అంతకంటే ముందే ఇదే భూమి కోసమే ముందుబడిన మాల మహిళలైన బవిరి రాముడమ్మ (గ్రామ సంఘం అధ్యక్షురాలు), కలమటి చిన్నమ్మి, దండాసు లతమ్మలను కాపు భూస్వాములు ఆడవాళ్లని కూడా చూడకుండా 'మీకెందుకే భూమి' అని చెప్పరాని బూతులు తిడుతూ కర్రలతో కడుపులో పోట్లు పొడిసి చావబాదితే ఆ దెబ్బలకు ఆ గాయాలకు ఆస్పత్రి పాలయ్యారు. బవిరి రాముడమ్మ ఆస్పత్రిలో నెలరోజులు కొట్టుమిట్టాడుతూ చనిపోయింది. మిగతా ఆడవాళ్లు దెబ్బల గాయాలు గెర్లుతుంటే చస్తూ బతుకుతున్నారు.
'మా ఆడవాళ్లను చావుదెబ్బలు కొట్టారు. మా గ్రామ సంఘం అధ్యక్షురాలు బవిరి రాముడమ్మను చంపేశారు అని దళితులు కేసుపెడితే పోలీస్‌స్టేషన్లో కేసే తీసుకోలేదు. రెండేళ్లలో మూడు నాలుగు సార్లు కొట్టారు. కేసులు పెట్టలేదు. ఇప్పుడేమో బవిరి రాముడమ్మతో కలిపి ఆరుగురిని చీరుకొని చంపారు. ఇరవై మందికి కాళ్లూ చేతులు, నడుములు విరిగాయి, పళ్లూడిపోయాయి, తలకాయలు పగిలిపోయాయి. పనిపాట చేసుకొని బతికేటోళ్లము. తనువులన్నీ కూలిన కుప్పలయ్యాయి. ఎట్లా బతికేది యేటి చేసేది' అని బూరాడ లక్ష్మమ్మ (బూరాడ సుందర్రావు తల్లి) చెప్పింది. ఇది ఈ దేశంలో దళిత మహిళల బతుకు చిత్రం.
ఈ కుల సమాజంలో అంటబడని దళిత మగ బానిసల ప్రాణాలకే రక్షణ లేనప్పుడు ఇక ఆ బానిసలకు బానిసలుగా ఉన్న దళిత మహిళల ప్రాణాలకు రక్షణ ఉంటుందని చెప్పగలమా! ఆ కుల, మగ అలుసుతోనే కాపు మగవాళ్లు మాల ఆడవాళ్లను కొట్టినా, చంపినా, ఫిర్యాదుకాలే, అసలు కేసే రాయలేదు. అదే పని దళిత మగవాళ్లు కాపు ఆడవాళ్ల మీద చేస్తే మిన్ను విరిగి మీద బడేది, భూమి బద్దలయ్యేది.
ఈ మారణకాండలో కత్తులు, బరిసెలు, బల్లేలతో చంపింది కేవలం కాపు మగవాళ్లే కాదు వాళ్ల పిల్లలు, ఆడవాళ్లు కూడా ఉన్నారని లక్షింపేట బాధితులు చెబుతున్నారు. కాపు మగవాళ్లు బరిసెలతో, బల్లేలతో ఎడాపెడా పొడుచుకుంటూ నీరుక్కుంటూ పోతుంటే వాళ్ల ఆడవాళ్లు ప్రాణం ఉందా లేదా అని కాళ్లతో తన్నుకుంటూ చూసి ప్రాణంపోయేదాకా కర్రల్తో, రాళ్లతో చంపారని బాధితులు మూకుమ్మడిగా రోదించారు. దళిత సంఘాలు ఢిల్లీ దాకా వెళ్లి లొల్లిజేసినా అసెంబ్లీలో పార్లమెంట్‌లో చర్చ జరగలేదు.
'మహిళా సంఘం నాయకురాలు మా అమ్మ బవిరి రాముడమ్మ మా అందరికి తెలివి గుండమని సుద్దులు సెప్పేది. మాల నాయకురాలా నీకు భూమెందుకే నువ్వొక నాయకురాలివే అని కర్రలతో కొట్టి పొడిచి గాయాలు చేశారు. నెల రోజులు అవస్థ పడి చచ్చిపోయింది. ఇప్పుడు మా నాయిన నివర్తి వెంకటిని చంపారు. అంతుకు మునుపు మా ఆయన్ను పొలంలో కొట్టి చచ్చాడనుకొని వదిలేసి ఇప్పుడు చంపేశారు. నా భర్తని, తల్లిని, తండ్రిని చంపేశారు. వాళ్లు వాళ్ల భార్యలు బైటికి రావొద్దు. జైళ్లోనే కుళ్ళి కుళ్ళి చావాలి' అని చిత్ర శ్రీదేవి తెలిపింది.
'మేము ఊడుపులు - గాబులకు వేరే ఊర్లకు వెళ్లి పనులు చేసుకుంటున్నాము. మద్రాసు, హైదర్రాబాద్ దేశాలు బోయి బిల్డింగ్ పనుల్లో ఎమ్ములు దుమ్ములు చేసుకొని బతికాం' అని నివర్తి రాముడమ్మ (నివర్తి సంగమేశు భార్య) తెలిపింది.
'గొడ్డు మాంసం తిన్న మదాలు మీయి ఉల్లిగడ్డ మిరపకాయ తిన్న రోషాలు మావి అని మా మీద గొడ్లు బడ్డట్టే పడ్డారు. వాళ్లు మనుషులు కాదు మృగాలు. మా రాముడమ్మతో కలిసి ఆరు మందిని చంపారు. అవే గుర్తుకొస్తున్నాయి. భోజనం కూడా తినేది లేదు, ఏమి సేత్తం' అని దండు సెల్లెమ్మ తెలిపింది.
'తెల్లారి ఏడుగంటల నుంచి పదకొండు కొట్టేదాకా సాగింది. ఒక్కో ఇంటికి ఇరవైమంది వాకిలిముందు పదుగురు ఎనక వాకిలికాడ పదుగురు మంచాలపైన పడుకున్నోళ్లను గుంజి కొట్టారు, గంజి తాగేటోళ్లను కంచాల దగ్గర నుంచి గుంజి కొట్టారు, కుళ్లపొడిచారు. నడుం మీద కాళ్లమీద ఏటని సెప్పను ఒళ్లంతా కుళ్లబొడిచారు. ప్రాణం పోయిందని వదిలేసి వెళ్లారు' అని బొద్దూరి బోగేసు తెలిపాడు.
'మా కులం పోలీసులే, వాళ్లు చిన్న చిన్న దాడులు చేసినపుడు, కొట్టినపుడు పట్టించుకోలేదు. వాళ్ల మీద కేసులు పెట్టకపోగా కలిసుండాలని, ఒకసారి మమ్మల్నే తిట్టి కాయితాలు చింపేసారు. వాళ్ల డబ్బు తీసుకొని మాకు అన్యాయం చేశారు. నన్ను కూడా చంపేద్దురు, తప్పించుకొని పారిపోయాను' అని హతుని కొడుకు తెలిపారు. 'వాళ్లకు రెండు మాకు రెండు బోర్లు వేశారు. మా వైపు బోరొకదాన్ని పోలీసులు పీకేశారు. ఇదిక్కడుంటే గొడవలవుతాయన్నారు. మాకు నీళ్లకు కష్టమవుతుంది. వాళ్లను రావద్దని చెప్పలేక బోరు పీకేశారు' అని నివర్తి స్వాతి (హతుని కుమార్తె) తెలిపింది.
'ప్రాజెక్టు కింద మునిగిన ఊరు మాది వాళ్లది (కాపు) ఒక్కటే. వాళ్లు ఊరు పోగొట్టుకున్నరు మేం పోగొట్టుకున్నం. వాళ్లకు లక్షల పైసలొచ్చాయి, పెద్ద ఇళ్లు వాకిళ్లొచ్చాయి, కొలువులొచ్చాయి మళ్లీ భూములొచ్చాయి. మాకు ఇవేమీ రాలేదు. ఇవేమీ రాకున్నా గవర్నమెంట్ భూమిని సెంట్లు సెంట్లు దున్నితే మమ్ములను చంపారు. ఇదేమి న్యాయం, ఎవరికి చెప్పేది! పోలీసులు కూడా వాళ్ల తట్టే ఉన్నారు' అని దాడిలో గాయపడిన నివర్తి నర్సయ్య తెలిపాడు. 'కడుపు మంటలు సల్లారడానికి అంత భూమిసెక్కదున్నితే నెత్తురు పారిస్తారు. వాళ్లకైతే మాలాటోళ్లని చంపేబలం కోసమే వేల ఎకరాలు కావాలి.
ఆడోళ్లు, మగాళ్లు అని లేదూ అందరూ కొట్టారు. ఎవ్వరూ లెగవడం లేదు. నా కాలు విరిగిపోతే రాడ్డేశారు, నా చేయి లెగవనివ్వడం లేదు' అని కాళ్లకు, చేతులకు కుట్లుపడి మంచంలో ఉండి చూపించింది కలమటి సంగమ్మ. వీళ్లంతా కోరేదేమంటే... మా మీద దాడిచేసి కొట్టిన, చంపిన ఆడవాళ్లను మగాళ్లను విడిచిపెట్టొద్దు, మళ్లీ ఇంటి మొహం చూడకుండా శిక్షలు పడాలి. మళ్లీ ఇటువంటివి జరక్కుండా రక్షణ కల్పించాలి. వాళ్లు మళ్లీ ఊళ్లోకి రావొద్దు. వాళ్ల మొహాలు చూడొద్దు. ప్రాజెక్టు కిందున్న గవర్నమెంట్ భూమి మాకే ఇవ్వాలి. మా ఊళ్లో, మా గూడెంలోనే కోర్టు పెట్టాలి. నిర్వాసిత కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలి, ఉద్యోగాలివ్వాలి. దాడిలో గాయపడిన వాళ్లకు ప్రత్యేక ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి, ఉద్యోగాలివ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.
గురజాడ 150వ జయంతి ఉత్సవాలకై ఆయన పునాదులున్న విజయనగరం చూడటానికి ఉత్సాహంగా కదిలిన కవులు, రచయితలు, రచయిత్రులు గురజాడ మానవీయతని సంస్కరణ భావాల్ని, స్ఫూర్తిని నింపుకోలేకపోవడం విచారకరం. దాదాపు 150 ఏళ్ల నాడే గురజాడ అసిరిగాన్ని తన అక్షరాల్లో పొదువుకున్నాడు. కానీ ఈ కవులకు, హత్యలకు గురైన అసిరిగాళ్లు, వేటాడిన అసిరిగాళ్లు, గాయపడిన అసిరిగాళ్లు నెత్తుటి దు:ఖాల దళిత మహిళలు (విజయనగరానికి దరిదాపుల్లో ఉన్న లక్షింపేట) కంటికి కనబడలేదు. కలాలకు వినపడలేదు. గురజాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గురజాడ ఎలుగెత్తి చాటిన మానవత సామాజిక బాధ్యతను కరబర్చకపోవడం విషాదమే.
- జూపాక సుభద్ర, జ్వలిత, సులోచన
'మట్టిపూలు' రచయిత్రులు
Andhra Jyothi News Paper Dated : 17/10/2012
No comments:
Post a Comment