Saturday, February 25, 2012

అణగారి వర్గాలపై వివక్ష - జూపాక సుభద్ర


మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని పీటవేసి చెప్పినంతగా ఆచరణ లో కనిపించడం లేదు. మాఫియా యాజమాన్యాలు అనే పరిస్థితి ఉంది. ఆధిపత్య హిందూ సీమాంధ్ర మగ వ్యాపారుల పెట్టుబడుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా మీడియా పనిచేస్తున్నది. శ్రామిక కులాల మైనారిటీల, మహిళల ప్రాతిని ధ్యం మీడియాలో నామ మాత్రంగానే ఉంది.

ఈ వర్గాల పోరాటాలను, సమస్యలను పతాక శీర్షికన ప్రచురించడం మీడియాకు అప్రస్తుతం. అశేష పీడిత ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు వేదిక కావాల్సిన మీడియా యాజమాన్యాల స్వేచ్ఛకే పరిమితమవుతున్నది. జనాభాలో 85 శాతం ఉన్నది పీడిత కులాల వారు, మైనారిటీలు, మహిళలు. కానీ వారి చేతుల్లో మీడియా సంస్థలు లేవు. ఈ సంస్థలకు సామాజిక బాధ్యత ఉంటే పీడి త కులాల, మహిళల సమస్యలకు 85 శాతం కేటాయించాలి.

కానీ అలా జరగడం లేదు. ఏవో కొన్ని చిన్న వార్తలు, వ్యాసాలు ప్రచురించి సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి. కానీ దారిద్య్రం, ఆకలి, నిరక్షరాస్యత, అంటరానిత నం, దురాచారాలు, నిరుద్యోగం, దోపిడీ, ప్రాంతీయ అసమానతలు అన్నీ దళిత బహుజన ఆదివాసీ ,మైనారిటీలు, ఈ వర్గాల మహిళలే ఎదుర్కొంటున్నారు. వీరు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా మించిన వార్తలు ఏముంటాయి? 

మీడియాలో ఆంధ్ర ప్రాంత మగవారే ఎక్కువ. ఒకటి అరా శ్రామిక కులాల, ఆధిపత్య కులాల మహిళలు కనిపించినా దళితుల ప్రాతినిధ్యం కనిపించడం లేదు. అనేక ఉద్యమాల ఫలితంగా పత్రికలలో ఒక పేజీ, టీవీల్లో అరగంట కేటాయించినా దాని లో పెద్ద కులాలకు సంబంధించిన ఫ్యాషన్స్, వంటలు, ముగ్గులు ఉంటాయి. ఇవీ కాకపోతే పురాణాల్లోని ఆధిపత్య కులాల మహిళల వ్యక్తిత్వాలను ఆవిష్కరించి తరించిపోతారు! టీవీ చర్చల్లో నిత్యం ఒకే రకమైన అంశాలు పునరావృతమవుతూ ఉంటాయి.

ఆ చర్చల్లో మహిళలు ఉండరు. అందువల్ల మహిళా కోణం కనిపించడం లేదు. సమగ్రత లోపిస్తున్నది. అయితే వినోదానికి మాత్రం మహిళలనే ఉపయోగించుకుంటారు. ఈ విధంగా సమాజంలో జెండర్ అసమానతలను మీడియా తొలగించక పోగా పెంచి పోషిస్తున్నది. మీడియా సంస్థల్లో ఊడ్చేవాళ్ళు, ట్రాన్స్‌పోర్టు కార్మికులు బహుజన, దళిత, ఆదివాసీ, మైనారిటీల వారు కాగా పాత్రికేయులుగా, సాంకేతిక సిబ్బందిగా, ప్రాడక్షన్ మేనేజర్లుగా, యాంకర్లుగా, న్యూస్‌రీడర్లుగా ఆధిపత్య కులాలు, ప్రాంతాల వారే ఉంటున్నారు. 

రాజకీయ పార్టీల ప్రతినిధులు, సెలబ్రిటీలు, వ్యాపార, సినిమా, క్రీడా రంగాలే మీడియాకు ప్రధానం. ఇవన్నీ పీడిత కులాలకు సంబంధం లేని అంశాలు. పూర్వం శ్రామిక కులాలకు అక్షరాలను నిషేధించారు. ఇప్పుడు మీడియా గర్భగుడిలోకి కూడా రానివ్వడం లేదు. అణగారిన సామాజిక వర్గాల వార్తలపై కత్తిరింపులు, నిషేధాలు, వక్రీకరణలు మొదలైనవన్నీ వివక్షలో భాగమే. కుల, ప్రాంత, మత, జెండర్ వివక్షకు సంబంధించి మరింత చర్చ జరగాల్సి ఉంది. మీడియా ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నదనే విషయంపై కూడా విస్తృత చర్చ జరగాలి. మీడియా ప్రజాస్వామీకరించబడాలి. పెట్టుబడుల సంకెళ్ల నుంచి బయటపడాలి. 
- జూపాక సుభద్ర
Andhra Jyothi News Paper Dated 15/06/2010

No comments:

Post a Comment