Wednesday, October 31, 2012

ఆదివాసుల హక్కులు, చట్టాలకు కొరడిన రక్షణ ఎం సూర్యనారాయణ


  Tue, 30 Oct 2012, IST  

తూర్పు కనుమల్లో నిక్షిప్తమైన బాక్సైట్‌ను తవ్వేందుకిచ్చిన లీజులను రద్దు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వై కిశోర్‌చంద్రదేవ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. జిందాల్‌, రస్‌-ఆల్‌ఖైమా, తదితర ప్రయివేటు కంపెనీలతో రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌ ఒప్పందాలు చేసుకుంది. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ఆదివాసుల మనుగడకు, పర్యావరణానికి ప్రమాదం ఉందని వ్యతిరేకత వచ్చింది. ఆదివాసుల రాజ్యాంగబద్ధ హక్కులను, చట్టాలను, జీవోలను ప్రభుత్వమే తుంగలోతొక్కింది. ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో 1/70, పెసా, గిరిజన సలహా మండలి, తదితర అంశాలను పర్యవేక్షించే పెద్దదిక్కుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా జరగలేదు. గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి గిరిజనుల పక్షపాతిగా ఉండాలి. కానీ గడిచిన 60 ఏళ్లలో ఏ గవర్నరూ అలా వ్యవహరించలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా గవర్నర్‌ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌, లేటరైట్‌ అనుమతులు, విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీలో ఏనుగుల జోన్‌ కేటాయింపు, భద్రాచలం, పోలవరం గిరిజన ప్రాంతాల్లో లక్షలాది మంది గిరిజనులు పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురికావడం, శ్రీశైలం, ఉట్నూర్‌ అటవీ ప్రాంతాల్లో అభయారణ్యాల పేరుతో గిరిజనులను తరిమేయడం, తదితర అంశాలపై గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్‌ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ పోస్ట్‌మేన్‌లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ వాదనను బలపరుస్తూ కిశోర్‌చంద్రదేవ్‌ కూడా గవర్నర్‌ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ వారు షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా ఏజెన్సీ ప్రాంతాలనే ఎందుకు ప్రకటించారు? ఐదవ షెడ్యూల్డ్‌ అంటే ఏమిటి? రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఇచ్చిన హక్కులు, చట్టాలు ఏమిటి? 244(1) అధికరణం ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గవర్నర్లు కీలకం ఎందువల్ల? గవర్నర్ల తీరుపై జాతీయస్థాయిలో చర్చ జరగాలా? ఇటువంటి అనేక అంశాలు మనకు అర్థం కావాలంటే గతాన్ని పరిశీలించాలి.
స్వాతంత్య్రానికి ముందు ఆదివాసీ తిరుగుబాట్లు
దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో దోపిడీ తీవ్రంగా ఉండేది. అడవి మీద హక్కు కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం అనేక తిరుగుబాట్లు జరిగాయి. భారతదేశంలో స్వాతంత్య్రం కోసం తొలుత పోరాడింది ఆదివాసులే. 1778లో బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఛోటానాగపూర్‌ ప్రాంతంలోని తిరుగుబాటు మొదటిదిగా చెప్పవచ్చు. సుదీర్ఘ స్వాతంత్య్రోద్యమాల్లో గిరిజనుల పాత్రను చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు. సంతాల్‌ తిరుగుబాట్లు, బిర్సా ముండా తిరుగుబాట్లు, కోల్‌ తిరుగుబాట్లు జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు స్వేచ్ఛను కోరుకునేవారు. స్వయంపాలన కావాలని పోరాడారు. నాగా తిరుగుబాట్లు, మిజో తిరుగుబాట్లు జరిగాయి. మహారాష్ట్రలో గోదావరి పరులేకర్‌ నాయకత్వాన వర్లీ ఆదివాసీ పోరాటం జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ కేంద్రంగా జల్‌, జంగిల్‌, జమీన్‌ హక్కు కోసం కొమరం భీమ్‌ ఉద్యమించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, గాం గంటందొర, మల్లుదొర, మర్రి కామయ్య, తదితరులు అడవి మీద హక్కు ఆదివాసులకే ఉండాలని, బ్రిటీష్‌వారు మన్యాన్ని వదిలిపోవాలనీ పోరాడారు. భద్రాచలంలో కోయల తిరుగుబాటుకు ద్వారబందాల చంద్రయ్య నేతృత్వం వహించారు. ఈ విధంగా అనేక చోట్ల ఆదివాసీల తిరుగుబాట్లు పెరుగుతున్న నేపథ్యాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం గమనించింది. ఆదివాసీల అసంతృప్తిని దారి మళ్లించడానికి పథకం వేసింది. గిరిజనులకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించి వారి ప్రయోజనాలను కాపాడాలని ఎట్టకేలకు బ్రిటీష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యంతోనే గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్‌ జిల్లాలుగా 1847లో ప్రకటిస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వం చట్టం తెచ్చింది. భారతదేశంలో స్వాతంత్య్రోద్యమం విస్తరించిన సమయంలో ఉద్యమ ప్రభావం గిరిజనులపై పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది.
స్వాతంత్య్రానంతరం ఆదివాసుల అగచాట్లు
భారతదేశంలోని గిరిజనుల గురించి 'కారల్‌మార్క్స్‌' ఈ విధంగా పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ క్రమంలో గిరిజనులు తమ సొంత ప్రపంచాన్ని పోగొట్టుకున్నారని, కొత్త ప్రపంచం అందించిన ప్రయోజనాలను ఆదివాసులు అందుకోలేకపోయారని విశ్లేషించారు. ఆదివాసులు పేదవారు అయినప్పటికీ వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రకృతి ఎన్నో సంపదలను పోగుచేసి పెట్టింది. అపారమైన అటవీ సంపద, తరగని ఖనిజ సంపద, జలవనరులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, అటవీ ఫలసాయాలు, పర్యాటక ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. ఈ సంపద దేశానికి వరప్రసాదం వంటిది. అందుకోసం ఆదివాసులను బలిపశువులుగా మార్చడం సరైందికాదు. పారిశ్రామికీకరణ, ప్రాజెక్టులు, మైనింగ్‌, విధ్వంసకర అభివృద్ధి పేరుతో ఆదివాసులను అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారు. గిరిజన ప్రాంతాల పారిశ్రామికీకరణ వల్ల గిరిజనులు లబ్ధి పొందుతారన్నది భ్రమేనని తేలిపోయింది. గిరిజన ప్రాంతాల్లోనే పరిశ్రమలు రావడం వల్ల వారికి తగిన ఉపాధి దొరకలేదు సరికదా ఇళ్లు, వాకిళ్లు పొగొట్టుకున్నారు. బీహార్‌లోని మైధాన్‌, కోనార్‌, పంచట్‌లు, ఒడిశాలోని మందిరా, మాచ్‌ఖండ్‌, హీరాకుడ్‌ వంటి విద్యుత్‌ ప్రాజెక్టులు, ఒడిశా, మధ్యప్రదేశ్‌, బీహార్‌లోని రూర్కెలా, దుర్గాపూర్‌, భిలారు, రాంచీ ఉక్కు ప్యాక్టరీల వల్ల అధిక సంఖ్యలో గిరిజనులు నిరాశ్రయులయ్యారు. అప్పటి లెక్కల ప్రకారం 62,494 కుటుంబాలు నిరాశ్రయులు కాగా, కేవలం 14,560 కుటుంబాలకే ప్రత్యామ్నాయ ఉపాధి దొరికింది. ఈ కంపెనీలకు గనుల నిమిత్తం కేటాయించిన భూమి గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నది. మన రాష్ట్రంలో 49 వేల ఎకరాలు, గోవాలో 46 వేల ఎకరాలు, ఛత్తీస్‌గఢ్‌లో 68 వేల ఎకరాలు, ఒడిశాలో 46 వేల ఎకరాలు, కర్నాటకలో 28 వేల ఎకరాలను మైనింగ్‌ పేరుతో స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఖనిజ వనరుల తవ్వకాలు జరిగే ప్రధానమైన 50 జిల్లాలున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్న 5వ షెడ్యూల్‌ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతాల్లోని ఆదివాసులకు రక్షణ ఉంటుందని భావిస్తే అగచాట్లు తప్పడంలేదు.
గిరిజన ప్రాంతాలు - గవర్నర్ల పాత్ర
దేశ జనాభాలో ఎనిమిది శాతం మంది గిరిజనులున్నారు. వారికి రాజ్యాంగపరంగా కొన్ని రక్షణ చర్యలు పొందుపర్చారు. రాజ్యాంగంలోని 244 అధికరణ ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతాలను ప్రకటించారు. అత్యంత విలువైన సహజ వనరులున్న ప్రాంతాలైనప్పటికీ గిరిజనులు పేదరికంలోనే ఉన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారి హక్కులు, చట్టాలకు భంగం కల్గకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌, విద్య, వైద్యం, రోడ్డు, రవాణా, తదితర సదుపాయాలు ఆదివాసులకు నేటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. స్వాతంత్య్రనంతరం 1950, జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. షెడ్యూల్డ్‌ తెగల జాబితాను 342 అధికరణం ద్వారా రాష్ట్రపతి ప్రకటిస్తారు. రాజ్యాంగం తెగల గురించి స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల కొన్ని తెగలు ఏజెన్సీ ప్రాంతంలో అనాదిగా ఉన్నా గిరిజనులుగా ప్రకటించడంలో అవాంతరాలు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్‌తో సంప్రదించిన తరువాత, ఏదైనా తెగనుగాని, తెగల సమూహంగాని షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించవచ్చు. తెగలను కలిపేందుకు, తీసివేసేందుకు పార్లమెంటుకు ఆధికారం ఉన్నది.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత గిరిజనుల అభివృద్ధి, సంక్షేమ బాధ్యతలను ఎన్నికైన ప్రభుత్వాలతోపాటు రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా ఏజెన్సీలో పాలన సాగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ఆధారంగా షెడ్యూల్డ్‌ తెగల హక్కుల రక్షణకు గవర్నర్‌ కీలకపాత్ర పోషిస్తారు. నిజానికి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రకారం ఆదివాసుల భూములపై గల హక్కులకు గవర్నర్‌ గట్టి భరోసా ఇవ్వాలి. రాష్ట్రపతి నోటిఫై చేసిన ప్రాంతాలు, తెగలు మాత్రమే ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, తదితర గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్‌ ప్రాంతాలుగా నోటిఫై చేశారు. ఆయా ప్రాంతాల్లో గవర్నర్లు కీలకపాత్ర పోషిస్తారు. ఐదో షెడ్యుల్‌లో మూడు ప్రధాన అంశాలను గవర్నర్లు పర్యవేక్షిస్తారు. అవి గవర్నర్‌కు ప్రత్యేక శాసన అధికారాలు ఇవ్వబడ్డాయి. రాష్ట్రపతికి గవర్నర్‌ వార్షిక నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలి. గిరిజన సలహామండలి ఏర్పాట్లపై ముఖ్య పాత్ర పోషించాలి.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, ఇతర ప్రణాళికలు, ప్రాజెక్టులు, తదితరాలు నెలకొల్పాలంటే గిరిజన సలహామండలి నిర్ణయం మేరకు సాధ్యమవుతుంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనూ 1/70ని ధిక్కరించి గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయకుండా భూ బదలాయింపు చట్టం అమలు, గిరిజనేతరుల దోపిడీని అరికట్టడానికి వడ్డీ నియంత్రణ చట్టం వంటి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత వాసులకు న్యాయస్థానాలు అందుబాటులో లేని కారణంగా వారి ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులే వివాదాలను పరిష్కరించే అవకాశం కల్పించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ఉద్యోగాలు జీవో మూడు ప్రకారం స్థానిక గిరిజనులకే కేటాయించారు. ఐటిడిఎల ద్వారా ఆదివాసుల సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించి నిధులు ఖర్చుచేయాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గ్రామాలను తొలగించాలన్నా, కొత్త గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంత జాబితాలో చేర్చాలన్నా రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుంది. అదీ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో శాంతియుత పరిపాలన అందించేందుకు గవర్నర్లకు ప్రత్యేక శాసనాధికారాలను అప్పగించారు. ఐదవ షెడ్యూల్‌ రాష్ట్రాల్లోని గిరిజన శాసనసభ్యులు, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో కూడిన గిరిజన సలహామండలిని ఎప్పటికప్పుడు గవర్నర్‌ సంప్రదించాల్సి ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధిని, రాజ్యాంగబద్ధ నియమాల ద్వారా సంక్రమించిన చట్టాలను, హక్కులను, జీఓల అమలుతీరును పర్యవేక్షిస్తుండాలి. షెడ్యూల్‌లోని గిరిజన ప్రాంతాలకు ఏదైనా చట్టాన్ని వర్తింపజేసే లేదా మినహాయించే హక్కు రాష్ట్ర గవర్నర్‌కు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాన్ని గవర్నర్‌ తన విచక్షణాధికారంతో సవరణతోగానీ, యథావిధిగాగానీ షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తింపజేయవచ్చు. ఆదివాసుల అభివృద్ధి, వారి జీవన ప్రమాణాలకు సంబంధించి రాష్ట్రపతికి గవర్నర్లు తమ వార్షిక నివేదికలు సమర్పించాలి. ఈవిధమైన కృషిని ఈ 60 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క గవర్నరూ అమలుచేయలేదు.
మన రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల పరిధిలో సుమారు 805 గిరిజన గ్రామాలు నాన్‌షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. 1976లో రాజ్యాంగానికి సవరణ చేసి షెడ్యూల్డ్‌ ప్రాంతంలో లేని మిగిలిన గ్రామాల వివరాలను పంపాలని కేంద్రం కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. అదే సమయంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ సరైన శ్రద్ధ తీసుకున్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తింపు పొందాయి. దీనిపై గతంలో భద్రాచలం పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు రాష్ట్రపతిని, గవర్నర్‌ను పదేపదే కోరినా సరైన స్పందన రాలేదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ తన శాసనాధికారాలను ఉపయోగించి తక్షణమే ఈ 805 గ్రామాలను ఐదవ షెడ్యూల్‌లో కలపాల్సిన ఆవశ్యకత ఉంది.
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
-ఎం సూర్యనారాయణ
Prajashakti Telugu News Paper Dated : 30/10/2012 
  

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలు ఆర్‌ అరుణ్‌ కుమార్‌


   Wed, 31 Oct 2012, IST  

  • గత పది సంవత్సరాల్లో ఆసియాలోని దేశాలు సాధించిన వృద్ధి రేటులో సగం శాతం మాత్రమే లాటిన్‌ అమెరికా దేశాలు సాధించినప్పటికీ ఆ దేశాల్లో పేదరికం 30 శాతం తగ్గింది. ఆదాయ పంపిణీ మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికాలో ప్రగతిశీల ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరాదరణకు గురవుతున్న వర్గాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలపై ఎకానమిస్ట్‌ పత్రిక ఇటీవల ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచం రోజురోజుకూ అసమానంగా మారుతోందని ఇన్ని రోజులుగా మనం చెబుతున్న విషయానికి ఇది అనుగుణంగానే ఉంది. 'అనేక దేశాల్లో ఆదాయ అసమానతలు పెరిగాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది 1980 తరువాత ఆదాయ అసమానతలు పెరిగిన దేశాల్లో నివసిస్తున్నారు. ఆ దేశాల్లో అనేక సందర్భాల్లో ఈ అసమానతలు తీవ్ర ఆందోళన రేకెత్తించే స్థాయికి చేరుకున్నాయి' అని ఆ నివేదిక తెలిపింది. ఫలితాలపై ఆందోళన వ్యకం చేసిన నివేదిక ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ఆటంకం రాకుండా ఈ అసమానతలను తగ్గించే మార్గాలతో ముందుకొచ్చేందుకు 'ఆధునిక రాజకీయాలకు' పిలుపునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సర్వే చేసిన వివరాలతో ఈ నివేదికను రూపొందించింది. 'బ్రిటన్‌, కెనడా, చైనా, భారత్‌ వంటి దేశాలతోపాటు స్వీడన్‌లో అగ్ర స్థానంలో ఉన్న ఒక్క శాతం ప్రజల ఆదాయాలు పెరిగాయి. సంపన్నుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఫోర్బ్స్‌ పత్రిక ప్రచురించిన జాబితా ప్రకారం అమెరికాలో 421 మంది, రష్యాలో 96 మంది, చైనాలో 95 మంది, భారత్‌లో 48 మంది శత కోటీశ్వరులున్నారు. మెక్సికోకు చెందిన కార్లోస్‌ స్లిమ్‌ 6,900 కోట్ల డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే అత్యంత ధనికునిగా నిలిచాడు.
పెరుగుతున్న అసమానతల చరిత్రను ఎకానమిస్ట్‌ పత్రిక వివరిస్తూ, 'పారిశ్రామిక విప్లవానికి పూర్వం దేశాల సంపదల మధ్య అంతరాలు సాధారణ స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో పది సంపన్న దేశాల్లో తలసరి ఆదాయం పది నిరుపేద దేశాల్లోని ప్రజల తలసరి ఆదాయం కంటే ఆరు రెట్లు మాత్రమే అధికంగా ఉంది. పారిశ్రామిక విప్లవం దేశాల మధ్యనే కాకుండా, దేశాలలోని ప్రజల మధ్య అంతరాలను కూడా పెంచింది. పశ్చిమ ఐరోపా, అమెరికాలో ఆదాయాలు గణనీయంగా పెరగ్గా, ఈ దేశాలు, ఇతర దేశాల మధ్య తేడాలు కూడా పెరిగాయి. అలాగే అంతర్గతంగా ఆదాయాల్లో వ్యత్యాసాలు కూడా పెరిగాయి'.
వర్తమాన పరిస్థితులపై వివరిస్తూ, '1980 నుంచి ప్రపంచ ఆర్థికవ్యవస్థలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, నియంత్రణల ఎత్తివేత, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం, సంబంధిత వర్తకం, పెట్టుబడుల ప్రవా హాలు, ప్రపంచ సరఫరా సంబంధాలు దేశాల ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించాయి. అయితే, అదే సమయంలో దేశాల్లో అంతర్గతంగా ప్రజల ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని పెంచాయి'. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిణామానికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది. 'ఈ సాధారణ ధోరణికి లాటిన్‌ అమెరికాలో నెలకొన్న పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచంలో దీర్ఘకాలంగా అత్యంత అసమానమైందిగా పేరుగాంచిన ఈ ఖండంలో గత పదేళ్లుగా గినీ కోఎఫీషియంట్స్‌ భారీగా పతనమయ్యాయి'.
అసమానత్వ సమస్యను సత్వరం పరిష్కరించాల్సిన అవసరాన్ని ఉద్బోధిస్తూ ఐఎంఎఫ్‌, ఎడిబి, ప్రతి సంవత్సరంలో లావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక గురించి ఎకానమిస్ట్‌ ప్రస్తావించింది. అసమానత్వం వృద్ధికి అవరోధంగా నిలుస్తుందని, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుందని, డిమాండ్‌ను తగ్గిస్తుందని ఐఎంఎఫ్‌లో ఆర్థికవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ద్రవ్య అస్తవ్యస్థ పరిస్థితులతోపాటు రానున్న దశాబ్దం ఎదుర్కోనున్న అత్యంత తీవ్రమైన సమస్య అసమానత్వమని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక కోసం నిర్వహించిన సర్వే హెచ్చరించింది. ఈ ప్రపంచం రోజురోజుకూ అసమానంగా మారిపోతోందని, ఆ ఆసమానతలు, అవి చూపే ప్రభావాలు అత్యంత ప్రమాదకరమైనవనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది'.
ప్రపంచాన్ని నేడు పట్టిపీడిస్తున్న సమస్యను ఆ కథనం సమగ్రంగా అధ్యయనం చేసినట్లు పైన పేర్కొన్న వివరాల బట్టి స్పష్టమవుతోంది. అధ్యయన నివేదిక కూడా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేదిగా ఉంది. పెరుగుతున్న అసమానతలు డిమాండ్‌ తగ్గిపోవడానికి దోహదం చేస్తాయని కూడా అది గుర్తించింది. మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తి దెబ్బ తినడం ఇందుకు కారణం. ఉత్పత్తి చేసిన వస్తువులను ఎవరూ కొనుగోలు చేయకపోతే సంక్షోభం తలెత్తుతుంది. అసమానతలు తగ్గించడంలో కార్మిక సంఘాలు నిర్వహించే చారిత్రాత్మక పాత్రను ఈ కథనం వివరించింది. పారిశ్రామిక కార్మికుల సంఖ్య పెరగడం ఆదాయాల పునఃపంపిణీపై రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. కమ్యూనిజం అత్యంత నాటకీయమైన ఫలితమని పేర్కొంది. అయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో కూడా తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. కార్మిక సంఘాల ఏర్పాటు, సోషలిస్టు పార్టీల ఆవిర్భావానికి ప్రతిస్పందనగా అట్లాంటిక్‌కు ఇరువైపులా ఉన్న రాజకీయ నాయకులు పురోగామి పన్నులను విధించారు, ప్రభుత్వ నియంత్రణ ప్రవేశపెట్టారు. సామాజిక భద్రత కల్పించారు. అనేక దేశాల్లో ఆదాయంలో ఉన్నతస్థాయి ఒక శాతం వాటా 1920 దశకం నుంచి 1970 దశకం వరకూ క్రమంగా తగ్గుతూవచ్చింది. అమెరికాలో 1930,1940 దశకాల్లో అసమానతలు వేగంగా తగ్గాయి. రెండవ ప్రపంచయుద్ధం తరువాత యూరప్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో గినీ కోఎఫీషియంట్‌ 1970 దశకం మధ్యలో అత్యల్ప స్థాయి 0.3 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో స్వీడన్‌లో ఇది 0.2 శాతానికి తగ్గింది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 1970 దశకంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు 1920 దశకంలో ఉన్న అంతరాల కంటే తక్కువగా ఉన్నాయి. 1970 దశకం నాటికి పది అగ్రస్థాయి ధనిక దేశాల్లో తలసరి ఆదాయం 10 పేద దేశాల్లో తలసరి ఆదాయం కంటే సుమారు 40 రెట్లు అధికంగా ఉంది.
ఈ సరళికి లాటిన్‌ అమెరికా అడ్డుకట్ట
అసమానతలు తగ్గించడంలో ప్రభుత్వాలు, ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో ప్రభుత్వాలు నిర్వహించిన పాత్రను ప్రస్తావిస్తూ, 'తక్కువ ఆదాయాలు గల ప్రజల వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించేందుకు సామాజిక వ్యయ పథకాలను లాటిన్‌ అమెరికాలోని దేశాలు అమలుచేశాయి. మరింత ఉదారంగా పింఛన్ల మంజూరు, షరతులతో కూడిన నగదు బదిలీ పథకాల వంటి వాటిని అత్యంత నిరుపేద కుటుంబాలకు అమలుచేశాయి. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆ కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలకు పంపాలనే నిబంధనను విధించినట్లు ఆ పత్రిక కథనం వివరించింది. అర్జెంటీనా నుంచి బొలీవియా వరకూ గల దేశాలు కార్మికులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని పింఛను పథకాలను ప్రవేశపెట్టాయి. వృద్ధులకు ఊతం ఇస్తానని ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా ప్రకటించాయి. లాటిన్‌ అమెరికా ఖండం అంతటా కనీస వేతనాలను పెంచారు. బ్రెజిల్‌ ఈ వేతనాలను 2003 నుంచి 50 శాతానికి పైగా పెంచింది. పింఛను పథకాన్ని కనీస వేతనాలతో ముడిపెట్టడంతో రెండు అంశాలు పరస్పరం ఒకదానికొకటి అనుబంధంగా మారాయి. ఈ చర్యలు అసమానతలను ఎలా తగ్గించాయనే విషయంపై ప్రపంచబ్యాంకుకు చెందిన లస్టిగ్‌, లూయిస్‌ లోపెజ్‌-కాల్వా, యుఎన్‌డిపికి చెందిన ఎడ్వర్డో ఆరిట్జ్‌-జువారెజ్‌ విశ్లేషించారు. వేతనాల మధ్య వ్యత్యాసాలను తగ్గించడం ఈ ఖండం మొత్తంలో అసమాతలు తగ్గడానికి దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు.
గత దశాబ్దంలో పేద ప్రజల ఆదాయాలు పెరిగాయి. అందువల్ల అసమానత్వం గణనీయంగా తగ్గింది. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో గినీ కోఎఫీషియంట్‌ 2000 సంవత్సరంలో కంటే 2010లో తక్కువగా ఉంది. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి తగ్గింది. గత పది సంవత్సరాల్లో ఆసియాలోని దేశాలు సాధించిన వృద్ధి రేటులో సగం శాతం మాత్రమే లాటిన్‌ అమెరికా దేశాలు సాధించినప్పటికీ ఆ దేశాల్లో పేదరికం 30 శాతం తగ్గింది. ఆదాయ పంపిణీ మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికాలో ప్రగతిశీల ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరాదరణకు గురవుతున్న వర్గాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందాయి. అయితే పత్రికా కథనం ఛావెజ్‌ (వెనెజులా), మొరేల్స్‌ (బొలీవియా), కొర్రియా (ఈక్వెడార్‌), రౌసెఫ్‌ (బ్రెజిల్‌), తదితరులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కల్పించలేదు. అమెరికాలో అమలు జరుగుతున్న విధానాలను సమీక్షించింది. లాటిన్‌ అమెరికా దేశాలు తమ జిడిపిలో అత్యధిక వాటాను విద్యారంగంపై కేటాయిస్తున్నాయని కూడా కథనం వివరించింది. ముఖ్యంగా నిరుపేదలకు విద్యావసతులు కల్పించడంలో అమెరికా కంటే అత్యధిక మొత్తాన్ని ఈ దేశాలు ఖర్చుచేస్తున్నాయి.
అమెరికాలో వరుసగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంక్షేమ చర్యల గురించి ఆ కథనం విశ్లేషిస్తూ, సామాజిక సంక్షేమం కోసం అమెరికాలో పెడుతున్న ఖర్చు సంపన్నుల కోసం చేస్తున్న ఖర్చు కంటే ఎప్పుడూ తక్కువగానే ఉంది. సంపన్నులకు గృహ నిర్మాణానికిస్తున్న సబ్సిడీలు నిరుపేదలకు ఇస్తున్న సబ్సిడీల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
వాస్తవ ఫలితాలు
అమెరికాలో సంపన్నులైన ఒక్క శాతం ప్రజలు జాతీయాదాయంలో అనుభవిస్తున్న వాటా 1980 తరువాత రెట్టింపైంది. ఇది పది శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. 2.4 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం గల కుటుంబాలు నాలుగు రెట్లు పెరిగాయి. మొత్తం ప్రజల్లో వీరి సంఖ్య ఒకటి నుంచి ఐదు శాతానికి పెరిగింది. ధనికులు, అత్యధిక ధనవంతుల ఆదాయాలు గత 30 సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. స్థాయి పెరిగిన కొద్దీ వారి ఆదాయం కూడా పెరిగింది. ఫలితంగా ధనికులు, పేదల మధ్య అంతరాలు మరింతగా పెరిగాయి. ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా ఈ అంతరాలు పెరిగాయి. 1979-2007 మధ్య కాలంలో పన్నులు, బదిలీల తరువాత సమాజంలో ఒక శాతంగా గల ఈ వర్గాల నిజ ఆదాయం 300 శాతం పెరిగింది. అయితే అట్టడుగు స్థాయిలో ఉన్న వారి ఆదాయం కేవలం 40 శాతం మాత్రమే పెరిగింది. మధ్య తరగతి జనాభారీత్యానూ, భౌగోళికంగానూ తగ్గిపోయింది. జాతీయ సగటు ఆదాయంలో 20 శాతం ఆదాయం గల కుటుంబాల సంఖ్య 40 శాతం ఉంది. 1970 దశకంలో వీరి సంఖ్య 70 శాతం ఉండేది. 1970 దశకంలో ప్రారంభించిన నయా ఉదారవాద విధానాల ఫలితాలు ఇవి. ఇటీవల చోటుచేసుకున్న ఆర్థికమాంద్యం అమెరికాలో ధనికుల ప్రయోజనాలకు అంతగా హాని చేయలేదని కూడా ఎకానమిస్ట్‌ పత్రిక కథనం విశ్లేషించింది. మాంద్యం అనంతరం కోలుకున్న తరువాత కలిగిన ప్రయోజనాల్లో దాదాపు 90 శాతం ధనికుల పరమైనట్లు తెలిపింది.
అమెరికా ప్రభుత్వాలు నగంగా ప్రదర్శిస్తున్న వర్గ పక్షపాతాన్ని పరిశీలకులు ప్రత్యక్షంగా ఎత్తి చూపారు. అమెరికాలో పెరుగుతున్న అసమానతలకు రాజకీయ మూలాలున్నట్లు వారు విశ్లేషించారు. సంపన్నులు రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తూ దాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు నిర్ధారించారు. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల మొత్తంలో 80 శాతం దాదాపు రెండు వందల మంది దాతల నుంచే వస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. వర్గ శక్తుల పొందికలో మార్పులు లేకుండానే ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాలకవర్గాలు చేసిన పోరాటానికి ఎకానమిస్ట్‌ పత్రిక కథనం ఒక సూచిక. అసమానతలను తగ్గించడానికి చేసిన కృషిలో కూడా ఈ వర్గ పొందికల ప్రభావం కనిపిస్తుంది. పేదల పట్ల ఏమాత్రం కనికరం, ఆందోళన వ్యక్తం చేయకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడే ధ్యేయంతోనే ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకున్నాయనేది సుస్పష్టం. ఏ సంస్కరణలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడజాలవు. 
-ఆర్‌ అరుణ్‌ కుమార్‌
Prajashakti Telugu News Paper Dated : 31/10/2012

మహిళలకు రక్షణేదీ ?----కె విజయగౌరి


దేశమంటే మట్టికాదోరు, దేశమంటే మనుషులోరు అన్న గురజాడ మహిళలంటే మట్టి అనుకుంటున్నారా? అని పాలక వర్గాలను హెచ్చరించారు. ఆ బాటలోనే మహిళా చైతన్యం విరబూసింది. ఇలాంటి సంఘ సంస్కర్తలు మహిళాభివృద్ధి కోసం చేసిన త్యాగాలు, తెచ్చిన చట్టాలు స్త్రీలు మరిచిపోరు. వీరేశలింగం, జ్యోతిరావ్‌ పూలే, రాజారామ్మోహన్‌రారు వంటి వారి అడుగుజాడలు ఎప్పటికీ సజీవం.
స్త్రీలపై జరుగుతున్న హింసను రూపుమాపాలని, ఇది ఒక సామాజిక సమస్యగా ఉందని అనేక దశాబ్దాలుగా మహిళలు చేస్తున్న పోరాటాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వారు ఎదుర్కొనే సమస్యలు పేద, ధనిక, కుల, మత, వర్గం అనే తేడా లేకుండా ఉన్నాయి. పుట్టక ముందు ఆడపిండంగా, పుట్టిన తరువాత స్త్రీగా వివక్షకు, అణచివేతకు బలైపోతున్నారు. పని ప్రదేశాలలో, వ్యవసాయ భూముల్లో, చదువుకునేచోట, గృహాలలో నానాటికీ హింస పెరుగుతోందని చెప్పడానికి తాజాగా దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసాఘటనలు తార్కాణం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ నివేదిక ప్రకారం ప్రతి 100 మంది మహిళలలో 70 మంది ఏదో ఒక రూపంలో హింసకు గురవుతున్నారు.
ఆధునిక జీవనంలో పూర్వంకన్నా కొంత మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ పురుషాధిక్యతను, హింసను తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి విముక్తి కోసం మహిళలు, మహిళా సంఘాలు చేస్తున్న పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు సాధించినా అవి అమలుకు నోచుకోవడం లేదు. అటువంటి చట్టాలపైనా, హింసకు గల కారణాలపైనా పాలకులు విపరీతార్థాలు తీస్తున్నారు. వీటన్నింటికీ కారణం మహిళలే అని కొంతమంది పాలకులు, రాజకీయ నాయకులు నీతులు వల్లిస్తున్నారు. సమాజంలో అంతర్భాగంగా ఒకవైపు అందరిలాగానే అన్ని సమస్యలను, స్త్రీగా ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
తప్పులెన్నువారు తమ తెప్పులెరుగరు
తప్పులెన్నువారు తమ తెప్పులెరుగరు అని వేమన అన్నట్లు హర్యానాలో జరిగిన అత్యాచారాలు, హింసలపై చర్యలు తీసుకోలేక తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాంసం తినకండి, బాల్యవివాహాలు చేయండి, పెళ్ళి వయస్సు తగ్గించండి, వీటన్నింటికీ కారణం మహిళలే అని వ్యాఖ్యానించిన పాలపక్ష ముఖ్య నేతలు నలుగురూ మహిళల పట్ల తమ చిత్తశుద్ధి ఏపాటిదో నిరూపించుకున్నారు. మరో మహిళా ముఖ్యమంత్రిగారు స్వేచ్ఛ ఎక్కువైందని, అందువల్లనే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని సెలవిచ్చారు. ఇంకా చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు.
చట్టాలు చుట్టపు చూపుకా?
ఎంతో మంది మహనీయులు సమాజాభివృద్ధికి ఆటంకంగా ఉండే అనేక సాంఘిక దురాచారాలపైనా, బాల్య వివాహాలపైనా, వరకట్నంపైనా, హింసపైనా దేశ విదేశాలలో తీవ్రమైన చర్చలు జరిపి సమాజంలో మహిళలు ఉన్నతమైన స్థాయిలో ఉంటే తప్ప ఏ దేశం పురోగమించదని అనేక చట్టాల కోసం పోరాడి సాధించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘసంస్కర్తలు, మహిళా ఉద్యమాల చైతన్య స్ఫూర్తి భారత మహిళకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలిగాయి. 1990 తరువాత వచ్చిన సంస్కరణలు మహిళల జీవనశైలిపై ఏ రకమైన ప్రభావం చూపుతున్నాయో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
ఆందోళన కల్గించే గణాంకాలు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ 30 కోట్ల మంది మహిళలు హింస, అనారోగ్యం, భ్రూణ హత్యలు, అక్రమ రవాణా వంటి ప్రభావంతో అంతర్థానమయ్యారని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ప్రకటించారు. అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలలో 497 కేసులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఒక్క నెలలోనే హర్యానాలో 17 అత్యాచారాలు జరిగాయి. బాల్య వివాహాలలో ఆంధ్రప్రదేశ్‌ మూడవ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే హత్యలు 3 శాతం, అత్యాచారాలు 30 శాతం, కిడ్నాప్‌లు 43 శాతం, నిర్బంధించిన కేసులు 27 శాతం, భ్రూణ హత్యలు 19 శాతం పెరిగాయని యునెస్కో, ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. ఇవి అధికారిక లెక్కలు. దేశవ్యాప్తంగా అమ్మాయిలను అమ్మడం, కొనడంలో వరుసగా 65 శాతం, 13 శాతం పెరిగాయి. భ్రూణ హత్యలు కూడా 56 శాతం పెరిగాయి. అత్యాచారాలు సగటున 30 శాతంగా ఉందంటే మహిళలకు రక్షణ ఎక్కడ ఉందో పాలకులు గమనించాల్సి ఉంది.
ఆందోళన కల్గించే అక్రమ రవాణా
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రోజుకు 22 మంది మహిళలు అదృశ్యమవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. 2009 నుంచి 2012, జులై వరకూ 23,760 మంది అదృశ్యమయ్యారు. 2012, జులై నుంచి ఇప్పటి వరకూ మూడు వేల మంది వ్యభిచార గృహాలకు తరలించబడ్డారు. వీరంతా పూణె, నాగపూర్‌, ఢిల్లీ, ముంబయిలలోనే ఉన్నారని యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీస్‌లు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు తెలిపాయి. పేదరికం, కరువు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కూలి పనుల కోసం వెళ్లే మహిళలు, యువతులు నరక కూపంలోకి నెట్టబడుతున్నారు. రేవ్‌ పార్టీల పేరుతో బ్రోకర్లు హైటెక్‌ వ్యభిచారం చేస్తున్నారు.
నాటి సంఘ సంస్కర్తల అడుగుజాడలు సజీవం
దేశమంటే మట్టికాదోరు, దేశమంటే మనుషులోరు అన్న గురజాడ మహిళలంటే మట్టి అనుకుంటున్నారా? అని పాలక వర్గాలను హెచ్చరించారు. ఆ బాటలోనే మహిళా చైతన్యం విరబూసింది. ఇలాంటి సంఘ సంస్కర్తలు మహిళాభివృద్ధి కోసం చేసిన త్యాగాలు, తెచ్చిన చట్టాలు స్త్రీలు మరిచిపోరు. వీరేశలింగం, జ్యోతిరావ్‌ పూలే, రాజారామ్మోహన్‌రారు వంటి వారి అడుగుజాడలు ఎప్పటికీ సజీవం. 1872లో గురజాడ ఒక్క ప్రాంతంలో సర్వే చేస్తే 1,507 మందికి బాల్య వివాహాలు జరిగాయని, వీరందరినీ వృద్ధులకిచ్చి పెళ్లిచేశారని రూఢ అయింది. ప్రగతిశీల భావాలతో అనాగరిక చర్యలను త్రిప్పికొట్టిన సంఘ సంస్కర్తలు, మహనీయుల జయంతులు, వర్ధంతులను కూడా రాజకీయంగా వినియోగించుకుంటున్న పాలకులు, అటువంటి వారి ఆశయాలకు మాత్రం గోరీ కడుతున్నారు.
వికృత భాష్యాలు
వస్త్రధారణలే కారణమంటూ చేసిన వ్యాఖ్యలను చూస్తే వాకపల్లి గిరిపుత్రికలు ఏ వస్త్రధారణలో ఉన్నారు? ఏడు సంవత్సరాల చిన్నారులు ఏ వస్త్రధారణలో ఉన్నారు? వీధికో బెల్టుషాపుకు అనుమతిస్తూ బాగా తాగి అత్యాచారాలు చేయండని ప్రోత్సహిస్తున్నారు. పురుషునికి 21, స్త్రీకి 18 ఏళ్లు దాటాక పెళ్లి చేస్తే అన్ని విధాలా ఆరోగ్యం అని శాస్త్రాలు చెబుతుంటే పెండ్లీడు వయస్సును 15, 16 సంవత్సరాలకు తగ్గించేయాలని న్యాయ కమిషన్‌లు, రాజకీయ నాయకులు సెలవిస్తున్నారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రస్తావించినప్పుడు, నిజంగానే అదే కారణమైతే అటువంటి మీడియాకు ఎందుకు లైసెన్సులివ్వాలి? ఈజీగోయింగ్‌ అనే సంస్కృతికి మూల కారణమైన ప్రపంచీకరణకు ఎందుకు అడ్డుపడరు.
ప్రపంచీకరణ విష కౌగిలిలో మహిళలు
మద్యపానం, బెల్టుషాపులు, వినిమయ సంస్కృతి, అర్ధనగ చిత్రాల ప్రదర్శన, టీవీ సీరియళ్ళు, నేర ప్రవృత్తి సినిమాలు, డిస్కోథెక్‌ల సంస్కృతి, సాంకేతికత వీటన్నింటినీ కలబోసుకున్న ప్రపంచీకరణ మహిళల జీవితాలకు శాపంగా మారింది. పాలకులు సరిగ్గా ఇవే అంశాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచీకరణ స్త్రీలను అంగడి సరుకుగా నిలబెట్టింది. అటువంటి ప్రపంచీకరణ విధానాలపై తిరగబడక తప్పదు. స్త్రీలను వినియోగించి చేసే వ్యాపార ప్రకటనలు ఏ తప్పుచేసినా పర్వాలేదు అనే స్థాయికి తెచ్చాయి. పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారు. స్త్రీల అభివృద్ధే తమ ధ్యేయమని ఒకవైపు చెబుతూ, రెండోవైపు స్త్రీని రెండవశ్రేణి పౌరురాలిగా పరిగణిస్తున్నారు. ఆనాడు హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, ఓటు హక్కు కోసం పోరాటాలకు నాంది పలికిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా ఈనాడు అన్ని వర్గాల మహిళలు అదే స్ఫూర్తితో ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి.
(రచయిత యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి) 
-కె విజయగౌరి

Prajashakti Telugu News Paper Dated : 28/10/2012 

  

లక్షింపేట కుల -వర్గ సమస్యే - పాపని నాగరాజు



లక్షింపేటలో ఐదుగురు దళిత మాలల్ని తూర్పుకాపులు హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై రాష్ట్రంలో చాలా సీరియస్‌గా చర్చ జరుగుతుంది కూడా. లక్షింపేటలో మాలలు తూర్పు కాపుల కులదురహంకారానికి, దుర్మార్గానికి దాష్టీకానికి గురైనారు. ఈ కుల దుష్టలక్షణాల్ని అనుభవిస్తూనే ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ మిగులు భూములు దళితుల్లోని పేదలకు చెందాల్సిందేననే దృష్టితో మడ్డువలస ప్రాజెక్టు క్రింద ముంపునకు గురికాని భూమిని మాలలు సాగుచేసుకోవడం జరిగింది. 

అప్పటికే అనేక విధాలుగా తూర్పుకాపులు ఈ దళిత మాలల్ని కుల వివక్ష, దాడులు, దూషణలు చేసినా ఆ భూముల్ని మాలలు వదలకపోవడంతో ఈ హత్యాకాండకు పాల్పడ్డారన్నది స్పష్టం. అయితే ఈ అంశంపై వివిధ ప్రజా ఉద్యమ, విప్లవ శక్తులు వాస్తవాల్ని కప్పిపుచ్చి, శాస్త్రీయంగా విశ్లేషించకపోవడం జరుగుతోంది. దళితులపై దాడులు, వెలివేతలు, వివక్ష, అత్యాచారాలకు మూలం వారికి భూమిలేక పోవడమేనని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో దళిత బహుజనులు ముఖ్యంగా దళిత ప్రజలు ఆర్థికంగా మంచి స్థితిలో ఉండి కూడా అగ్రకుల దురహంకారానికి గురైన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. 

తాగునీరు కావాలన్నందుకు, పెళ్లి ఊరేగింపులు నిర్వహించినందుకు, ఓట్లు వేసినందుకు, అగ్రకులాల వారితో సమానంగా సినిమాలు చూసినందుకు, అగ్రకులాల వారి ఇళ్ల ముందు నుంచి గ్రామ చావిడి మీదుగా వెళ్లినందుకు పెత్తందారుల దాష్టీకానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భూమి కావాలన్నందుకు కాదు ఆత్మ గౌరవం కావాలని అన్నందుకు జరిగినవి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నత స్థానాలలో ఉన్న దళితులూ వివక్షకు గురవుతున్న వారే. లక్షింపేటలో దళిత మాలలు స్వయం గౌరవ సమన్యాయం ప్రాతిపదికన భూమి కావాలని దున్నుకోవడంతోనే హత్యాకాండ జరిగింది. ఒక్క మాటలో కులం-వర్గం జమిలియై మాలల్ని హత్య చేసింది. 

ఈ దాడి కుల-వర్గ దృక్కోణంలో జరిగిందనడానికి కులానికి వర్గానికి ఉన్న సంబంధ విషయాల్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. కులం-వర్గం ఒకటి కాకపోయినా అవి ప్రత్యేక అస్తిత్వాలను కలిగిఉంటూ రెండు పోగుల ట్వైన్ దారంలాగా కలగల్సి ఉన్నాయి. వర్గ ఉత్పత్తి సంబంధాలు ఇండియాలో నిచ్చెన మెట్ల కుల వర్గ ఉత్పత్తి సంబంధాలుగా విడగొట్టబడి ఉన్నాయి. కనుక నిచ్చెన మెట్ల కుల అసమానతల స్వయం పోషక గ్రామ వ్యవస్థే మన దేశంలో కుల భూస్వామ్య వ్యవస్థకు పునాదైంది. బ్రిటిష్ వారు ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశపెట్టిన సెటిల్‌మెంట్ విధానంలో కులాల్లో వర్గాలేర్పడి కుల-వర్గ ద్విముఖ వ్యవస్థ మొట్టమొదట ఆవిర్భవించింది. 

ఇక్కడే భూమి అగ్రకులాల ఉమ్మడి ఆస్తిగా కొనసాగడంతో బడుగు వర్గాల ప్రజలు ఊరుమ్మడి సేవకులుగా, బానిసలుగా, వ్యవసాయకూలీలుగా మార్చ బడ్డారు. మన దేశంలో బ్రాహ్మణీయ అగ్రకుల పాలక వర్గాలు వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర సకల సామాజిక రంగాలలో అవలంభించిన విధానాలన్నీ కూడా బ్రాహ్మణీయ కుల స్వభావాన్ని ఆధారం చేసుకొని అమలు పర్చ బడ్డాయి. వ్యవసాయ క్షేత్రాల్లో నూతన సాంకేతిక విధానాల అమలుతో అధిక దిగుబడి సాధించడం ప్రారంభమైన తర్వాత చిన్న సన్నకారు రైతాంగం ఈ అగ్రకుల బడా ఉన్నత వర్గాలలో పోటీపడలేక వ్యవసాయకూలీలుగా మార్చబడ్డారు. 

ఇలా లాభపడిన భూస్వాములు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతాంగంలోని పై అంతస్తులోని శూద్ర అగ్రకులాల వారే. భూమిలేని వారెవరూ అంటే దళిత బహుజన శ్రామిక ప్రజలే. దళిత ప్రజలే. ఈ అన్ని విషయాల్ని సామాజికవేత్తలైన ఫూలే, అంబేద్కర్‌లు, చరిత్రకారులు, వీరన్నలు ప్రకటించారు. మన రాష్ట్రంలో బ్రాహ్మణ, శూద్ర అగ్రకులాలైన కర్నాలు, కమ్మరెడ్డి, వెలమలు చారిత్రకంగా ఈ కుల-వర్గ వ్యవస్థలో లాభపడిన వాళ్లలో ఉన్నారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితంగా లేకపోయినా ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, కళింగులు ఉన్నారు. వీరే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని దళితులపై, బీసీలపై, బీసీల్లోని మైనార్టీ బీసీలపై, ఆదివాసీ గిరిజనులపై దాడులు, శిరోముండనలు, అత్యాచారాలు, కుల, గ్రామ సామూహిక బహిష్కరణలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే లక్షింపేటలో దళితులు స్వయం గౌరవ సమన్యాయంతోనే మాకు కూడా భూమి కావాలని అన్నందుకు ఈ హత్యాకాండను సృష్టించారు. ఒక్కమాటలో అగ్రకులాలుగా చెలామణి అవుతున్న తూర్పుకాపులు ఆధిపత్య, అహంకారంతోనే భూమిపై తమకు కూడా హక్కు ఉండాలని రాజ్యం అండదండలతో మారణహోమంకు పాల్పడుతున్నారు. అందుకే లక్షింపేట సంఘటనకు ద్వీముఖ కుల-వర్గ స్వభావం ఉంది. లక్షింపేట సంఘటనను వివిధ విప్లవ, ప్రజా ఉద్యమశక్తులు లక్షింపేటలో కులేతర భూ(వర్గపోరాట) సాధన పోరాటంలోనే దళిత సమస్యకు, కులసమస్యకు, స్పృశ్య-అస్పృశ్య, గ్రామ, కులవెలివేతలకు పరిష్కారం జరుగుతుందని ప్రకటిస్తున్నారు. 

అలా ప్రకటించడంలోనే బ్రాహ్మణీయ అగ్రకులతత్వాన్ని మరుగునపర్చడం అవుతుంది. వీరిసంస్థల్లో నేటికీ బ్రాహ్మణీయ అగ్రకులతత్వం ఇంకా కొనసాగుతుందని స్పష్టమైపోతుంది. పైగా ఈ శక్తులు సామాజిక (కుల) ప్రజాస్వామ్య పోరాటాలు కులతత్వాన్ని పెంచుతున్నవని నీలాపనిందల్ని వేస్తున్నారు. మరొకరేమో ఈ సమాజంలో కులం-వర్గం పునాదిగా ఉన్నవని ప్రకటిస్తూనే వర్గ విప్లవ పోరాటం విజయవంతంతో ఉపరితలమైన కులాన్ని అంతంచేయొచ్చని ప్రకటిస్తున్నారు. 

వాస్తవానికి వీరు బైటికి కులం పునాదంటూనే అంతర్గతంగా కులం ఉపరితలంగానే చూస్తున్నారు. మార్పుపేర 1987లో మద్రాస్‌లో ప్రకటించిన అవగాహననే నేటికీ కొనసాగిస్తున్నారని అర్థమవుతుంది. కొత్తసీసాలో పాత సారా లాంటిదే. కులం ప్రాతిపదికన స్వయంగౌరవంతో జరిగే సామాజిక న్యాయ పోరాటంతో దళిత బహుజనుల్లో బూర్జువాలు పుట్టుకొస్తారని ఈ దళిత బూర్జువాలు దళితమాలల పక్షాన ఉండరని లక్షింపేట రుజువుచేసిందని ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సామాజిక పోరాటాలు వర్గపోరాటానికి అడ్డంకిగా మారుతుందని అపవాదును అంటగట్టారు. 

నిజానికి కుల-వర్గ వ్యవస్థలు అస్పృశ్యతకి మూలం కులవ్యవస్థ. కులవ్యవస్థకు మూలం మతం(వర్ణాశ్రమ) సనాతన ధర్మం. వర్ణాశ్రమ ధర్మానికి మూలం బ్రాహ్మణీయ హిందూమతం. బ్రాహ్మణీయ హిందూమతానికి మూలం రాజ్యాధికారం. ఈ బ్రాహ్మరహస్య వ్యూహానికి బ్రాహ్మణిజం దోపిడీ వర్గ రాజ్యాధికారానికి పరిరక్షించేదిగా ఉంది కనుక బ్రాహ్మణీయ పద్మవ్యూహమైన విడగొట్టి పాలించే దానికి ప్రతివ్యూహమైన కూడగట్టి పాలించే దళితబహుజన 'ఐక్యత' పాలసీతో దళితులతో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆదివాసీ గిరిజనులు ఐక్యసంఘటన కట్టాలి. లేదా దళితులు బీసీతో, ఎస్టీతో, మైనార్టీతో, ఆదివాసీ గిరిజనులతో ఐక్యసంఘటన కట్టాలి. 

ఈ ఐక్యసంఘటన వేలసంవత్సరాలుగా విద్య, ఉద్యోగ, వైద్యం, రాజ్యాధికారానికి నోచుకోని ఈ బడుగులు స్వయంగౌరవ, సామాజికన్యాయం ప్రాతిపదికన రాజ్యాధికారాన్ని కైవసంచేసుకొని కుల-వర్గ వ్యవస్థల నిర్మూలన పోరాటంగా మలచవచ్చు. ఈ క్రమంలో అణగారిన కులాల్లో బూర్జువావర్గం వర్గరీత్యా ఉన్నత వర్గంగా ఉంది కనుక వారికి కుల రీత్యా అవమానాలకు గురౌతున్న మేరకు మనతో కలిసివచ్చే స్థాయి వరకు కులపుకోవాల్సి ఉంటుంది. 

అలా రానియెడల వారికి వారే బడుగు వర్గాల శత్రువులవుతారు. కనుక విప్లవ శక్తులు ఈ జమిలి పోరాటాల్ని చేపట్టకుండా ఏక వర్గ విప్లవం పేరిట, కుల-వర్గ నిర్మూలన లక్ష్యం గల కుల విప్లవ పోరాటాల్ని ఫూలే, అంబేద్కర్‌ల కులనిర్మూలన అంశాల్ని విమర్శనాత్మకంగా స్వీకరించకుండా దాటేయడం కులతత్వమే అవుతుంది. బడుగువర్గాల్ని నేటికీ కులవ్యతిరేకత పేరుతో మభ్యపెట్టి దగాచేయడమే అవుతుంది. ఇలా నూతన తరహా అవగాహనను స్వీకరించకుండా ఉంటే లక్షింపేటలు అనేకంగా జరిగే అవకాశం ఉంది. 

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ

Andhra Jyothi Telugu News Paper Dated : 1/11/2012 

Monday, October 29, 2012

ఉస్మానియా! ఇక పొయ్యొస్తా - కంచ ఐలయ్య



ఉస్మానియా క్యాచ్‌మెంట్ కింది విద్యార్థులలో చాలా క్రియేటివిటీ ఉంది. అది ఉద్యమాలు నడపడంలో కనబడింది. కానీ కొత్త జ్ఞాన సృష్టివైపు దాన్ని మరల్చలేదు... ముందు, ముందు ఉస్మానియాలో పుట్టి పెరిగే మేధావులు ప్రపంచ మార్పుకే కొత్త మార్పులు వెయ్యవచ్చు. ఏ మేధావి కూడా జ్ఞానానికుండే అంతిమ ప్రక్రియ గురించి చెప్పలేరు. జ్ఞానం ఎప్పుడు అంతం కాదు. జ్ఞానపు ప్రతి మెట్టుకూ అది ఆరంభాన్ని వెతుక్కుంటుంది. ఉస్మానియా నువ్వు నాకిచ్చిన నిండు అవకాశాలకు కృతజ్ఞతలతో, నువ్వెంతో మంది మేధావుల్ని కంటావనే ఆశతో పొయ్యొస్తా..

ఉస్మానియా! ఇక పొయ్యొస్తా
నీ ఒడిలోకి నేన్నొచ్చిన్నాడు,
కట్టు గుడ్డ ల్లేవు కాళ్ళకు చెప్పుల్లేవు
ఇప్పుడు ఒంటినిండా కోటు
కాలినిండా బూటుతో పొయ్యొస్తా
నేనొచ్చిన్నాడు కడుపుకు తిండిలేదు,
మెదడుకు మేత లేదు.
ఇప్పుడు కడుపు నిండా తిండి
మెదడుకు బోలెడు మేతతో పొయ్యొస్తా

నేనొచ్చినప్పటికి నీ కడుపులో పుట్టిన బెస్ట్ బ్రెయిన్ చంపబడ్డది
జార్జి రెడ్డి బతికుంటే
ఫిజిక్స్‌లో నీకో నోబెల్ ప్రైజొచ్చేది
అందించడం నా కసాధ్యం
కాని నా కలం కనిపెట్టిన
ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం
అనంతలోకాల్ని మార్చుతూంది
జార్జిని చంపిన ఆధ్యాత్మిక ఫాసిజాన్ని
ఈ గడ్డ మీద బొందపెట్టి పోతున్నా.

ఈ యూనివర్సిటీలో నేనడుగుపెట్టినప్పుడు జార్జి రెడ్డి బ్రెయిన్ పవర్ గురించి కథలు కథలుగా చెప్పేవాళ్ళు. ఆడపిల్లలను అవమానపర్చే దుండగులను నకల్ డస్టర్లతో బాది, బాది మరుక్షణమే సెల్లార్ లైబ్రరీలో పిచ్చి పిచ్చిగా ఫిజిక్స్ చదివే వాడన్న కథలెన్నో ఉండేవి. జార్జిరెడ్డి నక్సలైట్‌కాడు, సోషలిస్టు భావాలు ఉన్న యువకుడు. ఫిజిక్స్‌లో పిహెచ్.డి చేస్తున్న విద్యార్థి. ఆయన హత్య జరిగిన కొద్ది రోజులకే రాడికల్ విద్యార్థిశక్తులు అక్కడ బాగా పెరిగాయి. 'స్టడీ అండ్ స్ట్రగుల్' నినాదంతో గ్రామాలనుంచి వచ్చిన విద్యార్థులను బాగా ఆకర్షించాయి. చుట్టూ ఫ్యూడలిజం తాండవం ఆడుతున్న రోజుల్లో అంటే 1974 నాటికి నిజాం పాలన నుంచి విడిపోయి విశాలాంధ్రలో కలిసిన తెలంగాణలో ఇది ఏకైక యూనివర్సిటీ.

దాన్ని 1918లో ఉస్మాన్ అలీఖాన్ ఏర్పరిచాక సుదీర్ఘకాలం సీరియస్ చదువు అందులో ఎప్పుడూ సాగలేదు. స్వాతంత్య్ర పోరాటం, రజాకార్ల బెడద, కమ్యూనిస్టు విప్లవం, విలీనమైన మరుసటి రోజు నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1969నుంచి దాని ఉధృత రూపం, నక్సల్‌బరీ పోరాటం, మళ్ళీ తెలంగాణ పోరాటం ఒకటి తరువాత ఒకటిదాని చుట్టే ఉన్నాయి. అసలు యూనివర్సిటీ లక్ష్యం విద్యార్థులను నిత్యం వీధి పోరాటాల్లో ఉంచడం గాదు. విద్యార్థులను గంట, గంట, రోజు, రోజు నెలలు, నెలలు క్లాసు రూముల్లో, లైబ్రరీల్లో, లాబొరేటరీల్లో చదివించి విజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప సాహిత్య కారులను తయారు చెయ్యడం యూరివర్సిటీ అసలు కర్తవ్యం.

జార్జిరెడ్డిలా సీరియస్ స్టడీస్‌ను, పోరాటాన్ని మేళవించగల విద్యార్థి మేధావిని ఆ తరువాత మాత్రం నేను చూడలేదు. జీవితమంతా పోరాటం, సీరియస్ రచన ప్రపంచంలో మార్క్స్‌కు, అంబేడ్కర్‌కు మాత్రమే సాద్యమయ్యాయి. నా అనుభవంలో పోరాటాలను పొగిడి, చదువును అంటే, అంతంతమాత్రం చేసిన వాళ్ళంతా మీడియేకరు. వాళ్ళు పూర్తికాలం చదువు, రాయడంలో ఉన్నా అంతగా చేయగలిగే వాళ్ళేమీ కాదు. మీడియోక్రసి మార్పును తేదు. ఏ యూనివర్సిటీ అయినా సీరియస్ పాఠాలు చెప్పి, ప్రాక్టికల్స్ చేయించి బ్యాచ్‌ల తరువాత బ్యాచ్‌లను బయటికి పంపిస్తా ఉంటే అందులో కొందర్ని కొత్త జ్ఞానాన్ని సృష్టించే మేధావులుగా తయారు చేస్తుంది.

యూనివర్సిటీ కర్తవ్యం ప్రాంతీయ సమస్యల చుట్టూ ప్రతి నిత్యపు పోరాటాల చుట్టూ తిరగడం కాదు. అట్లని యూనివర్సిటీలో పనిచేసే మేధావులకు ప్రజా ఉద్యమాలతో సంబంధముండొద్దా అంటే ఉండాలి. అది సిద్ధాంత రంగాన్ని బలపర్చేదిగా ఉండాలి. మార్క్సిజం, పౌరహక్కులు ఆ లక్షణాన్ని కలిగి ఉండేవి. నిరంతరంగా కొంత సిద్ధాంత చర్చ ఉండేది. ప్రాంతీయవాదానికి ఏ సిద్ధాంతం ఉండదు. పాఠాలు చెప్పదల్చుకోని టీచరుకు అదొనక అదనిస్తుంది. నాయకత్వాన్నిస్తుంది. కానీ మౌలికంగా అది ప్రొఫెసర్ల రంగం, స్కాలర్ల రంగం కాదు. నాలా మొదటితరం ప్రొఫెసర్ అయిన వ్యక్తికి యూనివర్సిటీ ఊహించనన్ని అవకాశాలిస్తుంది. ఆ అవకాశాల్ని రోజు ఉద్యమాల్లోనే ఫలప్రదం చెయ్యలేం.

వేలాది సంవత్సరాలు విద్యతో సంబంధంలేని కులాలనుంచి, గ్రామాల నుంచి వచ్చిన మేధావులకు మొత్తం ప్రపంచానికే ఒక కొత్త జ్ఞానాన్ని అందించగల శక్తి యూనివర్సిటీ ద్వారా వస్తుంది. అక్కడి వాతావరణం మేధావి వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. కానీ యూనివర్సిటీ విద్య ఫలప్రదం కావాలంటే, అక్కడికొచ్చే విద్యార్థులు స్కూళ్ళలో కిందస్థాయి కాలేజీల్లో వేసిన విద్యా పునాదులు గట్టిగా ఉండాలి. 38 ఏండ్ల నా అనుభవంలో తేలింది ఎంట్రెన్స్ వడపోత మేధోశకి ్తకి గ్యారెంటీ కాదు. పంట పండించడానికి నిరంతర ం భూమితో సంఘర్షణ పడినట్లు, యూనివర్సిటీలో జ్ఞానం పండించడానికి నిరంతరం చదవడం, రాయడంతో సంఘర్షణ పడాలి. కనీసం నెలకొకటైనా కొత్త పుస్తకాన్ని సంపూర్ణంగా చదవని టీచర్ విద్యార్థుల్ని ఇన్‌స్పైర్ చెయ్యలేడు/లేదు.

ఉస్మానియా క్యాచ్‌మెంట్ కింది విద్యార్థులలో చాలా క్రియేటివిటీ ఉంది. అది ఉద్యమాలు నడపడంలో కనబడింది. కానీ కొత్త జ్ఞాన సృష్టివైపు దాన్ని మరల్చలేదు. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలు రోజువారి ఉద్యమాలు నడి పించనందువల్ల ప్రపంచానికి కొత్త జ్ఞానాన్ని అందించలేదు. అందులో చదివినవారివి అద్భుత మెదళ్ళేమీ కావు. మనం వారికేం తీసిపోము. పోరాటాలు మాత్రమే జ్ఞానానికి మూలమనుకునే చోట కొత్త ఫిలాసఫీ పుట్టదు. కొత్త జ్ఞానం, స్టయిలు వాళ్ళ సొత్తేమీ కాదు. వారి జ్ఞానాన్ని మాత్రమే చదవడం మన బాధ్యత కాదు. మనం వారి కంటే గొప్ప జ్ఞానాన్ని సృష్టించగలం. అందుకు యూనివర్సిటీనీ యూనివర్సిటీగా పనిచేయించాలి. దాని చుట్టూ ఉన్న మనుషుల శ్రమశక్తిని, దాని క్రియేటివిటీని ఆధునిక పద్ధతిలో అధ్యయనం చెయ్యాలి. ప్రజల బతుకుల్లో ఫిలాసఫీ ఉంటే పోరాటంలో వారి చరిత్ర ఉంటుంది. అది వారి జీవితంలో పోరాటం ఒక భాగం మాత్రమే.

నేను చదువుకున్న క్లాస్ రూంకంటే ఉస్మానియా లైబ్రరీ నాకు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చింది. సాధారణ చదువునుంచి రీసెర్చి వైపు పయనించే విద్యార్థి క్లాస్ రూంను దాటి జ్ఞానార ్జన మొదటెట్టాలి. ప్రపంచంలో లైబ్రరీ ప్రాధాన ్యం సంతరించుకున్నది ఈ కీలక దశ కోసమే. ఉస్మానియా లైబ్రరీ ఇందుకు ఎంతో అనువైందిగా ఉంది. మేము లైబ్రరీ ఉద్యోగాల పోటీ పరీక్షల ప్రిపరేషన్ కేంద్రంగా చూడలేదు. లైబ్రరీ కర్తవ్యం ఆబ్‌జెక్టివ్ ప్రశ్నల మెమొరైజేషన్ అంతకన్నా కాదు. లైబ్రరీ విద్యార్థుల్ని క్లాస్ రూం నుంచి విశాల ప్రపంచంలోకి, కొంతలోకొంత సిద్ధాంతాల అన్వేషణలోకి తీసుకెళ్తుంది.పౌర హక్కు ల ఉద్యమంలో గ్రామాలు తిరిగి, ఆ గ్రామ జీవితానికి సైతం నెనొక సిద్ధాంత రూపమివ్వగలిగింది ఈ లైబ్రరీ అండతోటే.సమాజ శాస్త్ర వేత్త ప్రపంచ సిద్ధాంతాలను తనలో రంగరించుకొని తనచుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో తిరిగి ప్రపంచానికి మరో కొత్త సిద్ధాంతాన్ని అందించగలగాలి. 

యూరోపియన్ ప్రజలు, ముఖ్యంగా గ్రీకు ప్రజలకే కాదు మన దేశపు ప్రజలకూ ఒక తాత్విక భూమిక ఉందని అర్థం చేసుకోడానికి ఈ లైబ్రరీలోని పుస్తకాలే నాకు సహకరించాయి. తన చుట్టూ ఉన్న ప్రజల నిత్య జీవితంలో ఫిలాసఫీని చూడలేని రచయిత తనదేశ ప్రజలకొక తత్వ భూమికను ఏర్పర్చలేడు. ఇతర రచయితల పుస్తకాలను క్రియేటివ్‌గా చదివినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్ని, అందులో వచ్చే మార్పుల్ని క్రియేటివ్‌గా చదువుతాము. ప్రజలు ప్రకృతిలో, తమ చుట్టూ మట్టి తో, మనుషులతో, జంతువులతో ఏర్పర్చుకునే సంబంధాల్లో తాత్వికత రూపొందాలి. ఈ సంబంధాల్లో నిత్యనూతనత్వం ఉంటుంది. యూనివర్సిటీ ఈ ప్రక్రియల్ని పరిశోధించే పద్ధతిని మనకు నేర్పాలి. నా మట్టుకు నేను ఉస్మానియాలో ఇది నేర్చుకున్నాను. సీరియస్ అధ్యయనం, రచన తన చుట్టూ ఉన్న శక్తుల కుట్రలు, కుతంత్రాలు అతీతంగా జరగాలి.

ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ముఖ్యంగా రచనా రంగంలో ఉన్న వ్యక్తిని ప్రేమించే వా రి కంటే ద్వేషించేవారే ఎక్కువగా ఉంటారు. సంస్థాగత సంఘర్షణ లు చాలా కృంగదీసేవిగా ఉంటాయి. వాటిని అధిగమించడం చాలా ముఖ్యం. ఫ్యూడల్ శక్తులు మొదట్లో నన్ను ఉస్మానియాకు ఉద్యోగ భద్రతతో రాకుండా చూడాలనుకున్నాయి. అక్కడ ఉద్యోగంలో చేరాక రకరకాల అవమానాలకు గురి చేశాయి. హిందూత్వ శక్తుల్ని, ఫ్యూడల్ శక్తుల్ని, యూనివర్సిటీలో ఉన్న విద్యా వ్యతిరేక శక్తుల్ని తట్టుకుని థాట్ రిఫామ్ రచనకు, హిందూత్వ వ్యతిరేక, బ్రాహ్మణీయ వ్యతిరేక రచనలకు ఏకకాలంలో పూనుకోవడం కష్టమైనపనే.

అం బేడ్కర్ పోరాటం నాకు ఈ కాలమంతా ఒక ఆదర్శం గా నిలిచింది. ఉస్మానియా నాకీ అవకాశమిచ్చింది. మూడువేల ఏళ్లు విద్య కు దూరంగా ఉన్న కులాల నుంచి వచ్చి జీవితాంతం ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా బతకగలిగే అవకాశం మామూలు అవకాశం కాదు. రీడ్, రైట్ అండ్ ఫైట్ అని నేను ఎంచుకున్న మార్గాన్ని నేనొక యూనివర్సిటీలో ఉన్నాను కనుక నా శక్తి కొద్దీ అమలులో పెట్టగలిగాను. నారచనలతో సమాజం సమాంతంగా మారుతుందని నేనెప్పుడు అనుకోలేదు. జ్ఞానాన్ని మెట్లు, మెట్లుగా అభివృద్ధి చేయ్యాలి. ఈ పని ని మిగతా సంస్థలకంటే యూనివర్సిటీలు బాగా నెరవేర్చగలుగుతాయి. అది వాటి కర్తవ్యం.

నేను ఉస్మానియాలో జీవించిన 38 సంవత్సరాల్లో హిందూ త్వవాదానికి, రాడికల్ కమ్యూనిజానికి మధ్య భీకర యుద్ధాలను చూశాను. దాడుల్ని, హత్యల్ని చూశాను. ఈ క్రమంలోనేనో మధ్యే మార్గాన్ని ఎన్నుకున్నాను. అందుకు నాకు బుద్ధడు ఆదర్శం. అందుకే నేను అయన రాజకీయ తత్వశాస్త్రం మీద పీహెచ్‌డీ చేశాను. తెలంగాణలో పశువుల మందల్ని అభివృద్ధి చేసి ఆర్యులచే హత్య చెయ్యబడి దేవుడైన కొమురెల్లి మల్లయ్య బుద్ధుని కంటే ముందు వాడు కూడా అయి ఉండవచ్చు. ఆయన పేరుతో ఈ ప్రాంతంలో నాలుగు గుళ్ళు ఉన్నాయి (శ్రీశైలం, కొమరెళ్ళ, కట్ట మల్లన, ఐలోని మల్లన్న) ఈ పరంపరతోనే నాకు ఐలయ్య అనే పేరు పెట్టారు.

మల్లయ్య చరిత్రను, తత్వాన్ని, పోరాట రూపాల్ని అధ్యయనం చేసి తెలంగాణ ప్రాంతపు ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్థిక తాత్వికతను ఒక బలమైన పుస్తకం రూపంలో ప్రపంచానికి చెప్పాలనే కోరిక నాలో చాలాకాలంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చుట్టు ఉన్న సంస్కృతికి మల్లయ్య పునాదులు వేసి ఉంటాడు. ముందు, ముందు ఉస్మానియాలో పుట్టి పెరిగే మేధావులు ప్రపంచ మార్పుకే కొత్త మార్పులు వెయ్యవచ్చు. ఏ మేధావి కూడా జ్ఞానానికుండే అంతిమ ప్రక్రియ గురించి చెప్పలేరు. జ్ఞానం ఎప్పుడు అంతం కాదు. జ్ఞానపు ప్రతి మెట్టుకూ అది ఆరంభాన్ని వెతుక్కుంటుంది. ఉస్మానియా నువ్వు నాకిచ్చిన నిండు అవకాశాలకు కృతజ్ఞతలతో, నువ్వెంతో మంది మేధావుల్ని కంటావనే ఆశతో పొయ్యొస్తా.

- కంచ ఐలయ్య
విద్యార్థిగా, అధ్యాపకుడుగా, ఆచార్యుడుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ప్రగాఢ అనుబంధమున్న రాజనీతి శాస్త్రవేత్త, సామాజిక చింతకుడు కంచ ఐలయ్య ఈ నెల 31న విశ్రాంత జీవితంలోకి 
ప్రవేశిస్తున్నారు.

Andhra Jyothi News Paper Dated : 30/10/2012 

నేటి పోరాటాలకు స్ఫూర్తి (కొమురం భీం)----


నేటి పోరాటాలకు స్ఫూర్తి
ఆ దివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీం. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం.పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు.ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటి కి డ్బ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్బాలు అనేకంఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమై న చోట తమ అస్తిత్వం కోసంఅలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లొద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లొద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. 

ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. నిజాం రాజు నియమించిన హైమన్‌డార్ఫ్ సూచనలను కూడా నేటి పాలకులు పాటించడంలేదు. కానీ నాటి నిజాం ప్రభువయినా.. గిరిజనుల అభ్యున్నతి కోసం హైమన్‌డార్ఫ్ సూచనలను పాటించాడు. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాడు. కానీ..నేటి పాలకులు ఇవేవీ పట్టకుండా ఆదివాసులపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కొమురం భీం స్ఫూర్తితో విప్లవ సంఘాల నాయకత్వంలో మరొకసారి ఆదివాసులు సంఘటిత పోరాటాలు చేశారు. దీంతో.. ఆదివాసుల ఐక్యతను చూసి తట్టుకోలేని ప్రభుత్వం ఇంద్ర మారణకాండను సృష్టించింది. ఇది ఆధునిక కాలంలోని మరో జలియన్‌వాలా బాగ్‌గా ప్రజాస్వామికవాదులు పిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివాసుల పోరాటానికి సంఘీభావం వచ్చింది. ప్రభుత్వ దమననీతిని ఖండించారు. రాజ్యం తన హేయమైన చర్యలు చేస్తూ నే.. మరోవైపు సంస్కరణలు చేపట్టింది. ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా..పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలును తుంగలో తొక్కి ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నా యి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నది.

ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉన్నది. వలస వచ్చిన వాళ్ళు ప్రజావూపతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమా జం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదు. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణా లు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి డెభ్బైఏళ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తినేటికీ ఉన్నది. అది మరోఇంద్ర పోరాట రూపం గా పెల్లుబకవచ్చు. ప్రభుత్వాలు మరో ఉప్పెన రాక మునుపే మేల్కొనాలి.

అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లొద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసులు కొమురంభీం బాటలో పయనిస్తున్నారు. కొమురం భీంను ప్రేమించే వాళ్లుగా.. ఆదివాసుల అస్తిత్వ పోరాటాలకు అండగా నిలుద్దాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలు అస్తి త్వంకోసం,స్వయంపాలన కోసం పోరాడుతున్నారు. సందర్భాలు వేరు కావచ్చు. కాని పోరాట లక్ష్యాలు ఒకటే. తెలంగాణ ప్రజలు కొమురం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పరపీడన నుంచి విముక్తి కోసం ఆయుధమెత్తి పోరాడిన భీం వారసులుగా కదం తొక్కాలి. వలస పాలనను అంతం చేయాలి. అదే.. కొమురం భీంకు నిజమైన నివాళి. 

-బి. వేణుగోపాల్‌
Namasete Telangana Telugu News Paper Dated : 29/10/2012 

ధిక్కార పతాక కలేకూరి----డా. పి. కేశవకుమార్


ధిక్కార పతాక కలేకూరి

- డా. పి. కేశవకుమార్

అంబేద్కర్ గురించి రాసినా, ప్రజాఉద్యమాల గురించి రాసినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రాసినా, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విషయాల గురించి రాసినా, ఆఫ్రికన్ కవుల గురించి రాసినా, అంతటా దళిత దృక్కోణమే కనిపిస్తుంది. తెలుగు సమాజంలో అంతగా అంబేద్కర్‌ని చదివి అర్థం చేసుకుని సగటు దళితుడికర్థమయ్యే రీతిలో చెప్పిన ఏకైక మేధావి కలేకూరి ప్రసాదనే చెప్పుకోవాలి. 

ధిక్కార కవి, ప్రజాపాటల రచయిత, దళిత విప్లవ ఉద్యమకారుడు, సామాజిక పత్రికల సంపాదకుడు, అనువాదకుడు, రాజకీయ విశ్లేషకుడు, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు, మావోయిస్టు, అంబేద్కరిస్టు, అరాచకుడు, ఆప్తవాక్యం, స్నేహకరచాలనం, ఉద్యమ యువక, మనకాలం వీరుడు కలేకూరి ప్రసాద్. విప్లవోద్యమం నుంచి దళిత ఉద్యమం దాకా- మైనారిటీ, దండోరా, తెలంగాణ, ఆదివాసీ, స్త్రీ- అస్తిత్వ ఉద్యమాలన్నింటినీ మనస్ఫూర్తిగా కౌగిలించుకొని కొండంత అండగా నిలిచిన నేటి తరం ఉద్యమకారుడు, రచయిత, ప్రజల మనిషి కలేకూరి. హిందూ మతోన్మాద, సామ్రాజ్యవాద శక్తులకి వ్యతిరేకంగా బిగించిన ఉక్కు పడికిలి కలూకూరి.

కారంచేడు దళితపోరాటం నుంచి నేటి లక్షింపేట పోరాటం దాకా క్రియాశీలకంగా అన్ని దళిత ఉద్యమ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమేగాక, అన్ని సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్రవేస్తూ ఒక నూతన మానవీయ సమాజం కోసం స్వాప్నికుడిగా బతుకుతున్నవాడు కలేకూరి. కలేకూరి ప్రసాద్ జీవితంలో ఎంత అరాచకంగా ఉన్నట్టు కనిపిస్తాడో అదే సాహిత్యంలోనూ, తన రచనల్లోనూ ఎంతో నిక్కచ్చిగా రాజకీయ నిబద్ధతతో ఉంటాడు. గాలివాటంగా ఎప్పుడూ ఉండడు. కెరీరిస్టుగా ఉండటమంటే అసహ్యం. భద్రమైన బతుకుల్లో ఒక్కక్షణం కూడా ఉంటానికి ఇష్టపడడు. ఆత్మగౌరవం అనే ఆయుధాన్ని ఎప్పుడూ తన వెంట బెట్టుకుని తిరిగే సంచార సాహితీ జీవి.

దళితుడంటే, ఏ సంకోచాలూ భయాలూ లేకుండా, ఊరి మధ్య నిట్టనిలువుగా నుంచొన్న అంబేద్కర్ విగ్రహంలా ఉండాలనుకుంటాడు. దళితుడంటే సృజనాత్మకతా, సాహసికత సొంత హక్కుగా ఉండే వాడనుకుంటాడు. కులవ్యవస్థ, హిందూ మతమూ, మనుధర్మంగా మనపై రుద్దిన అమానవీయత, అణచివేత, దోపిడీ మీద తిరుగుబాటు చేయడమే దళితత్వంగా కలేకూరి నమ్ముతాడు. అది దళితుల హక్కుగా కూడా చెబుతాడు. తన అన్ని రచనల్లోనూ ఈ ధిక్కారమే కేంద్రంగా ఉంటుంది. దళిత జీవనసాంద్రతనీ, గాయపడ్డ గుండెల్లో ఉండే భావోద్రేకాల్ని, ఎగిసిపడే ఆవేశాల్ని, పిడికెడు ఆత్మగౌరవం కోసమంటూ అక్షరాల్లో ఆవిష్కరించే పనిలో మునిగిపోయిన కవి కలేకూరి ప్రసాదు. 'అవమానం ఈదేశంలో విరగపండే సంపదని' గుర్తించిన కలేకూరి ఈ అమానవీయమైన పంటను తగలబెట్టేందుకూ కావాల్సినంత పదసామాగ్రీని పోగుచేసి, కవిత్వంగా, కథలుగా, పాటలగా, వ్యాసాలుగా చేసి ఆ పదాల చేత యుద్ధ కవాతు చేయించాడు.

రాయడం కోసం రాయలా. ఏం రాసినా, చేసినా ఓ మహోన్నత ఉద్యమంకోసమే. ఈ ఉద్యమాన్ని దళిత/అణగారిన జన విముక్తి కోసంగా, జీవితం, సాహిత్య సృజన, ఉద్యమంల మధ్య గీతలు చెరిపేసే సాహిత్యాన్ని జీవితమంత గొప్పగా, జీవితాన్ని సాహిత్యంగా చేసిన గొప్ప రొమాంటిక్ కలేకూరి. దళిత కవుల్లో విప్లవ, అస్తిత్వవాద కవుల్లో బలమైన గొంతు కలేకూరిది. తన రచనల్ని పోగుచేసి పుస్తకాలేసుకోకపోవడం వల్ల యూనివర్శిటీలకీ, పరిశోధకులకీ చేరకపోవచ్చేమోగానీ, ఉద్యమ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కలేకూరిది గుండె సంబంధం. జనం మధ్య నాటుకుపోయినోడిని ఎలా పరిచయం చెయ్యాలన్నది పెద్ద సమస్యే. కలేకూరి రచనలు ఏ కొలమానాలతో చూడాలన్నది మరో సవాలు.

కలేకూరి ప్రసాద్ రచనలన్నీ కవిత్వంతో నిండిపోయింటాయి. తెలుగు సాహిత్యంలో కవిగా ఎన్నో ప్రత్యేకతలున్నవాడు. చెప్పే విషయాన్ని స్పష్టంగా సూటిగా, గుండెలో గుచ్చేలా చెబుతాడు. మనకి తెలిసిన పదాల్నే ఎలక్ట్రిఫై చేసి జనం మీదకి వదులుతాడు. కవిత్వంలో యుద్ధానికే సై అంటాడు. కాంప్రమైజులుండవు. కన్నీళ్లు వుండవు. జాలిచూపుల కోసం వెతుకులాట ఉండదు. ప్రత్యామ్నాయ పురాణ ప్రతీకల మధ్య దాక్కోవటం ఉండదు. అంతా వర్తమానంలోనే పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరి వ్యాపిస్తానంటాడు. జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తానంటాడు.

సామాన్య జనానికి కలేకూరి ప్రసాద్ పేరు తెలియక పోవచ్చేమోగానీ, తను రాసిన పాటలన్నీ తెలుసు. వరకట్న హత్యల మీద రాసిన 'కర్మభూమిలో పూసిన ఓ పువ్వా' రైతుల ఆత్మహత్యల మీద రాసిన 'భూమికి పచ్చని రంగేసినట్టు' ఇవి ప్రజల్లో పాపులర్ అయ్యాకే శ్రీరాములయ్య సినిమాలో పాటలయ్యాయి. అదే విధంగా జయం మనదేరా సినిమాలో 'చిన్న చిన్న ఆశలే చిందులేయగా'. 'కుమిలిపోయి, నలిగిపోయినా / చుండూరు గుండె గాయం. దళితా... సాగుతున్న సైనిక శపథం... ఆవేదనంతా పోరాటసైగలై ఊరూరా చుండూరు మండుతుందిలె / రక్తధారలె... ఉదయతారలై వికసించులె ఆత్మగౌవరం... దళితా' అన్నపాట ఎప్పటికీ దళితపోరాట పాటే.

చర్చిలో పాడుకునే క్రైస్తవ పాట బాణిలో ఈ పాట దళితులకి మరింత దగ్గరయింది. 'పల్లెపల్లెనా దళిత కోయిలా / బతుకుపాట పాడుచుండగా / గుండె గుండెన పోరు పుట్టగా / బతుకులోన పొద్దుపొడిచి వెలుగునిండగా / ఆహా సాగే పేదోళ్ల జాతరా / ఓహో కూలీ గుండెల్లో పండగా... ఇదో దళిత మార్చింగ్ సాంగ్.

కలేకూరి కవిత్వం, పాట వొక ఎత్తయితే, తను చేసిన అనువాదాలు తెలుగు మేథో లోకానికి మరింత దగ్గరికి చేర్చినవి. తను ఎంచుకున్న అనువాదాలన్నీ, ఎంతో సామాజిక ప్రయోజనమున్నవే. మనల్ని ఆలోచింపచేసేవే. కలేకూరి చేసిన అనువాదాల్లో స్వామిధర్మ తీర్థ రాసిన 'హిందూ సామ్రాజ్యవాదం' (1998) (History of Hindu Imperialism) అరుంధతీరాయ్ రాసిన 'ఊహలు సైతం అంతమయ్యేవేళ' (1998) (1998) (End of Imagination)కిశోర్ కుమార్ కాళే ఆత్మకథ, 'ఎదురీత' (Against All Odds) యూదులపైన జరుగుతున్న నాజీ దురాగతాలను ప్రిమొలెవీ రాసిన ఖైదీనెంబర్ 17777 (2003) ఈ రచనలన్నీ జీవితంపైన ఆశని పెంచేవి. బతుకు పోరుపైన విశ్వాసం సడలనివ్వనివి. వీటితో పాటుగా అనేక ప్రముఖుల వ్యాసాలని, వందనాశివ, ఉత్సాపట్నాయ క్, కృష్ణకుమార్, సోనాల్కర్‌ల చిన్నవ్యాసాల్ని, గొప్పరచయితలైన మహాశ్వేతాదేవి, బషీర్ కథల్ని కొన్నింటిని అనువాదం చేసేడు. ఈ అనువాదాలన్నీ హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ చొరవతో తన అభిరుచికొద్దీ చేసినవి.

25 అక్టోబర్ 1964న విజయవాడ పక్కనున్న కంచికచర్లలో పుట్టిన కలేకూరికి యాభయ్యేళ్లు. 1987లో పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటకొచ్చాక దళిత/సాహిత్య వుద్యమాలన్నింటిలోనూ తనదైన గొంతుకతో నిలబడ్డాడు. 1994లో నందిగామ నియోజకవర్గం నుండి బిఎస్‌పి నుంచి పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత హైద్రాబాద్ కేంద్రంగా దళిత/సాహిత్య ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. సత్యమూర్తి సారథ్యంలో నడిచిన ఏకలవ్య పత్రికకి తనవంతు సహకారాన్నందించాడు. సాక్షి ఎన్‌జివో నడిపిన పత్రికను కొన్నాళ్లు నడిపాడు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలపై పెద్ద చార్జిషీటుని పుస్తకంగా తీసుకొచ్చాడు. ప్రస్తుతం 'బహుజన కెరటాలు' పత్రికకు గౌరవ సంపాదకులుగా వున్నాడు. ఈ పత్రికకు శ్వాస, డైరెక్షన్ కలేకూరే. గత పదేళ్లుగా కలేకూరి అనేక విషయాలపై రాసిన వ్యాసాలన్నీ ఇందులోనే అచ్చయ్యాయి.

ఈ సంకలనంలోని వ్యాసాలు అంబేద్కర్ గురించి రాసినా, ప్రజాఉద్యమాల గురించి రాసినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రాసినా, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విషయాల గురించి రాసినా, ఆఫ్రికన్ కవుల గురించి రాసినా, అంతటా దళిత దృక్కోణమే కనిపిస్తుంది. ఈ వ్యాసాలు రచయిత అవగాహనా, జ్ఞానపరిధినీ, అణచివేతకూ, అవమానాలకీ గురవుతున్న ప్రజానీకం విముక్తికోసం, వాళ్ళను తన రచనల ద్వారా చైతన్యపరచాలన్న తపన బలంగా కనిపిస్తుంది. అనేక విషయాలపైన అవగాహనతోబాటు, అర్థవంతంగానూ పాఠకుడి గుండెకి తగిలేలా ఎలా చెప్పాలో అలాగే చెప్పేడు. సిద్ధాంత గాంభీర్యం కనిపించదు. జ్ఞానప్రదర్శన కనిపించదు. గాఢమైన భావాన్ని, ఆవేశాన్ని చిన్నచిన్న మాటల్లో, చిక్కనైన భావుకతతో చెబుతాడు కలేకూరి.

ఈ సంకలంలోని వ్యాసాలను గమనించినట్టయితే ఎక్కువ భాగం అంబేద్కర్ జీవితం గురించి, ఆయన రచనల గురించి విశ్లేషణాత్మక వివరణలతోబాటు సమకాలీన సమాజాకి ఉద్యమాలు, మరీ ముఖ్యంగా దళిత ఉద్యమాలు అంబేద్కరిజాన్ని ఎలా అన్వయించుకోవాలో సూటిగా, సృజనాత్మకంగా చెప్పడం జరిగింది. తెలుగు సమాజంలో అంతగా అంబేద్కర్‌ని చదివి అర్థం చేసుకుని సగటు దళితుడికి అర్థమయ్యే రీతిలో చెప్పిన ఏకైక మేధావి కలేకూరి ప్రసాదనే చెప్పుకోవాలి. అంబేద్కరంటే ఒక సంపూర్ణ సామాజిక పరివర్తనను ప్రతిపాదించి ఆచరించిన విప్లవకారుడంటారు.

దళిత ప్రజానీకాన్ని తన రచనల ద్వారా చైతన్యపరుస్తూ, దళిత ఉద్యమ నిర్మాణాల్లో ప్రధానపాత్ర వహిస్తూ, దళిత ఉద్యమతీరు తెన్నులపైన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఎటువంటి సంకోచాలు లేకుండా ప్రకటించినవాడు కలేకూరి. భూమికోసం, అత్యాచారాల నిరోధం కోసం, గౌరవప్రదమైన జీవితం కోసం వనరులపైన, రాజ్యాధికారంలోనూ వాటా సాధించడం కోసం ఒక సమగ్ర దళిత ఉద్యమం రూపొందలేదంటాడు. సమగ్ర వ్యూహం మాట బుద్ధుడెరుగు, కనీసం పది సంవత్సరాలకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారుచేసుకోలేని దయనీయస్థితిలో ఈనాడు దళిత ఉద్యమముందని వాపోతాడు. మనం విజయాలనెన్నైనా చెప్పుకోవచ్చు. కానీ లోపాలను గుర్తించి సవరించకపోతే ఏ ఉద్యమమైనా మరణిస్తుందని హెచ్చరిక కూడా చేస్తాడు.

ఆయన మాటల్లోనే, మనం చేయాల్సిందల్లా రాయడమే. బాగారాయడం. వాళ్ళ ప్రమాణాల్లో, వాళ్ళ ఆమోదం కోసం కాదు. పువ్వులు వికసించినట్లు, నవ్వులు రాలినప్పుడు గుండెలు మండినట్లు, గట్లు తవ్వేటప్పుడు కందిమోడు గుచ్చుకుంటే గుండెలు కలుక్కుమన్నట్లు అప్పటిదాకా కళకళలాడిన పల్లెపల్లెంతా స్మశానమై, పీనుగుల పెంటగా తయారైతే కోట్ల పిడికిళ్ళు ఒక్కసారిగా బిగుసుకొని ఒక బ్రహ్మాండమైన మెరుపు మెరిసినట్లు, మన భాషలో మనం రాయాలి. మన ప్రమాణాలతో మనం రాయాలి.

కొత్త సూర్యుడిని చూడలేని వాళ్ళు కళ్ళు మూసుకుంటే మూసుకోనీ, వెన్నెల నవ్వితే వళ్ళు మండిపోయే వాళ్ళు మాడి మసైపోనీ, మనం చేయాల్సిందల్లా బతుకే ఎడతెగని పోరాటమై పోయిన మన బతుకు మనం బతుకుతున్నంత సహజంగా రాయడమే. పల్లెపల్లెనా దళిత కోయిల పాట పాడినట్లు, గుండె గుండెనా పోరు మంటలు రాజుకున్నట్లు, జాతర జాతరగా దళిత సమూహాలు ఈ గడ్డ గుండెల మీదుగా ఊరేగింపై నడిచి పోతున్నట్లుగా మనం రాయాలి. మనది ఓడిపోయిన మానవుల తుది విజయగీతం. ఇది దళితయుగం. దళితసాహితీయుగమనీ పిడికెడు ఆత్మగౌరవంతో వెయ్యిగొంతుకలతో నినదించిన ఓ ధిక్కార పతాకమా నీకు సలామ్‌లు.

- డా. పి. కేశవకుమార్
(కలేకూరి ప్రసాద్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా 'బహుజన కెరటాలు' ప్రచురించిన కలేకూరి రచనల సంకలనం 'పిడికెడు ఆత్మగౌరవం కోసం' ముందుమాటలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi News Paper Dated : 29/10/2012 

Saturday, October 27, 2012

జల్ జంగిల్ జమీన్ భీం ఆశయం--మైపతి అరుణ్‌కుమార్



ఆదిలాబాద్ జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం గోండ్, కోలా మ్, పర్థాన్, మన్నెవార్, నాయకపోడ్, కోయ, తట్ తదితర తెగలు ఉన్నా యి. 1976లో గిరిజనులుగా గుర్తించిన లంబాడీలు కూడా నివసిస్తున్నారు. ఆసిఫాబాద్‌లోని సంకేపల్లి గ్రామంలో కొమురం చిన్నూ, సోం బాబు దంపతులకు 1900 సంవత్సరంలో కొమురం భీం జన్మించాడు. పదిహేనేళ్ళ వయస్సులోనే అటవీశాఖ సిబ్బంది దాడిలో తండ్రి చనిపోయాడు. అప్పుడు భీం కుటుం బం కెరిమెరి మండలం సర్దాపూర్‌కు వలసవెళ్ళింది. అక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలోనే నిజాం తొత్తుగా వ్యవహరిస్తున్న ‘సిద్ధిఖీ’ అనే జాగీర్‌దార్ భీం సాగుచేస్తున్న భూమిని ఆక్రమించాడు. కోపంతో సిద్ధిఖీని హత్యచేసి, నిజాం పోలీసులకు చిక్కకుండా అస్సాం రాష్ట్రం వెళ్ళి భీం తలదాచుకున్నాడు. అక్కడే ఐదేళ్ళ పాటు పత్తి, కాఫీ, తేయాకు తోటల్లో కూలీపని చేస్తూ, కార్మిక ఉద్యమాలను చూశాడు.

చదవటం, రాయడం నేర్చుకుంటూ, తన మిత్రుడు కొమురం సూరు (అతని రహస్య వార్తహరుడు) ద్వారా పరిస్థితులను ఆకళింపు చేసుకొని తమ ప్రాంతం చేరుకున్నాడు. స్వాతంత్య్రం కోసం విశాఖ ప్రాంతంలో ‘అల్లూరి’ సాగించిన మన్యం పోరాటం, ఆదివాసుల స్వేచ్ఛకోసం ‘బిర్సాముండా’ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనపై భీం కదంతొక్కాడు. ఆనాడు నిజాం సర్కార్ పశువులు మేపడానికి, వంట చేసుకునేందుకు కట్టెలు తెచ్చుకోవడానికి ‘బంబ్‌రాం’, ‘దూపపెట్టి’ పేర్లతో శిస్తులు వసూలు చేసేది. దీనిని వ్యతిరేకించాలని, జాతిస్వేచ్ఛా, హక్కుల కోసం భీం చేసిన ప్రసంగాలకు ఆదివాసీ లు ఆకర్షితులయ్యారు. అసిఫాబాద్ పరిసర ప్రాంతాలల్లోని జోడేఘాట్, పట్నాపూర్, బాబేఝరి, టోకెన్నోవాడ, చాల్‌బడి, శివగూడ, పిట్టగూడ, లైన్‌పటల్ అనే 12 గ్రామాలు భూపోరాటానికి సిద్ధమయ్యాయి. గోండు, కోయ యువకుల తో భీం, ‘గెరిల్లా’ సైన్యం ఏర్పాటు చేశాడు. సాయుధ పోరాటమే శరణ్యమని గిరిజనులను సమీకరించి గెరిల్లా పోరాటంలో సుశిక్షితులను చేశాడు. జోడేఘాట్ గుట్టలను కేంద్రంగా చేసుకొని ‘గెరిల్లా యుద్దం’ ప్రారంభించాడు.

ఆ సంఘటనతో ఖంగుతిన్న నిజాం సర్కార్ ఆదివాసులపై దాడులు చేసి, సాధారణ గిరిజనులను సైతం జైల్లో పెట్టింది. అయినా భీం తన పోరాటంలో రాజీపడలేదు. ఇక పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన నిజాం సర్కార్ ఓ మెట్టు దిగివచ్చింది. మన్యం గిరిజన భూములకు పట్టాలిస్తామని ఆ12 గ్రామాలను మాత్రమే పరిపాలించుకోమని జిల్లా కలెక్టరుతో వర్తమానం పంపింది. కానీ గిరిజన ఆదివాసీలకు, గూడేలకు స్వయం వూపతిపత్తి కోసం కొమురంభీం డిమాండ్ చేశారు. సర్కార్ భీంషరతులను తిరస్కరించి, అతని స్థావరాలపై నిఘా పెంచింది. పోలీసు, సైనిక చర్యలకు చిక్కకుండా ఉన్న సమయంలో కుర్ధుప అనే నమ్మకవూదోహి సమాచారంతో భీం స్థావరాలను సైనికులు చుట్టుముట్టారు. చివరకు జోడేఘాట్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో కొమురంభీం అశ్వీయుజ శుద్ధపౌర్ణమి రోజున వీర మరణం పొందాడు. భీం మరణానంతరం నిజాం సర్కార్ ఆంత్రోపాలజిస్టు క్రిష్టఫర్ హైమాన్‌డార్ఫ్‌ను నియమించి గిరిజనుల జీవితాలపై అధ్యయనం జరిపింది.

హైమాన్ డార్ఫ్ ఆదివాసీ ప్రాంతాలపై అధ్యయనం చేసి ఓ నివేదికను నిజాంకు సమర్పించాడు. తదనంతరం ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల భూ ములకు పట్టాలివ్వాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఒక కుటుంబానికి 15 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఉట్నూరు తాలుకాలో 47వేల ఎకరాలు, తిర్యాని బ్లాక్‌లో 23వేల ఎకరాలు, మానిక్‌నగర్ బ్లాక్‌లో 30వేల ఎకరాలు ఇలా 1944-46 మధ్యకాలంలో 1,60,000 ఎకరాలు ఆదివాసులకు భూపట్టాలు ఇవ్వటం జరిగింది. ఈ ప్రాంతానికి గిరిజనేతరులు రాకుండా ఆదివాసుల భూముల అన్యాక్షికాంతం కాకుండా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖకు అనుబంధంగా సోషల్ సర్వీస్ శాఖను ఏర్పాటు చేసి దానికి అధిపతిగా హైమాన్ డార్ఫ్‌ను నియమించింది. 

కానీ..స్వాతంత్య్రం వచ్చిందన్న తర్వాత ఆదివాసుల బతుకులు మారకపోగా మరింత దుర్భరమయ్యాయి. నిజాం, బ్రిటిష్ పాలకుల ను తలదన్ని ఆదివాసులను అరిగోస పెడుతున్నారు. గిరిజనుల సంస్కృతి, ఆవాస రక్షణకు ఏర్పాటు చేసిన ప్య్రతేక చట్టాలను తుంగలో తొక్కే చర్యలు ఎక్కువయ్యా యి. దీంతో.. ఆదివాసులు తమపై సాగుతున్న దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా.., హక్కుల కోసం పోరాటం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. 1981 ఏప్రిల్ 20న తమ హక్కుల కోసం పోడు భూముల పట్టాల కోసం ఇంద్రవెల్లిలో సభను నిర్వహించుకుంటుంటే సభకు వచ్చిన గోండ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి ఆదివాసులను కాల్చిచంపింది. నాటి నుంచి నేటివర కు పాలకులు ఇదే అణచివేత విధానాన్ని అమలు చేస్తున్నారు. గోండు గూడెంల ను ఓపెన్‌కాస్ట్ పేరుతో విధ్వంసం చేస్తున్నారు. 300 మీటర్ల లోతు 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహించే గని వల్ల కనీసం 10 కిలోమీటర్ల పరిధిలోని భూగర్భ జలాలు అన్నీ గనుల్లోకి చేరుతాయి. దీంతో ఈ 10 కి.మీ. పరిధిలో సాగునీటి వనరులు విధ్వంసమై 10వేల ఎకరాల వ్యవసాయ భూమి బీడు బారింది.

వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్ గోండ్ పల్లెలు సీజనల్ వ్యాధులతో గోసరిల్లు తా యి. జిల్లాలో ఆదివాసీల శిశు మరణాల రేటు 6.3శాతం ఉన్నది. 12 నుంచి 14 శాతం వరకు ఉండవలసిన హివెూగ్లోబిన్ గోండ్ కోలమ్ తెగలలో చాలా తక్కువగా ఉన్నది.1998లో రెండువేల మంది ఆదివాసులు విష జ్వరాల బారినపడి మరణించారు. ఇలా ప్రతియేటా చిన్నపిల్లలు పిట్టల్ల రాలిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 200మంది ఆదివాసులు రోగాలబారినపడి మరణించారు. ఆదివాసీ మహిళల స్థితిగతులు అయితే ఇంకా దయనీయంగా ఉన్నాయి. 

శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరా టం మూలంగా 1970లో వచ్చిన 1/70 చట్టం ప్రకారం గిరిజనుల భూములు అన్యాక్షికాంతం అవడానికి వీలులేదు. కానీ..ఈ చట్టాన్ని తుంగలో తొక్కి,ఆదివాసు ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి భూములను గిరిజనేతరులు కాజేస్తున్నారు. గిర్‌గ్లాని కమిషన్ నివేదిక ప్రకారం 21,000 ఎకరాలు ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములు గిరిజనేతరుల చెరలో ఉన్నవి. ఇదిగాక ఉట్నూరులోని 21వేల ఎకరాలు అన్యాక్షికాంతమైనవని, ఆదివాసులు స్వంత భూముల్లోనే కాందిశీకులుగా మారారని ఈ నివేదిక పేర్కొన్నది.

గిరిజనుల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ నేటికి సక్రమంగా అటవీహక్కు పత్రాలు అందిన దాఖాలాలు లేవు. ఉమ్మడి అటవీ సముదాయక హక్కు అయితే ఎక్కడా అమలు కావడంలేదు. జన్నారం అటవీ వూపాంతంలోని కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల రక్షణ కేంద్రంగా కేటాయించాలని కుట్రలు పన్నుతున్నదీ ప్రభుత్వం. ఆదివాసులను వారి సంస్కృతి, సంప్రదాయాల నుంచి వేరుచేసి వారిని ఆకలిచావులకు బలిచేస్తున్నారు. గిరిజనులను అంతం చేయడానికి పూనుకుంటున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం ఆశయ సాధన జల్, జంగిల్, జమీన్, ‘మావనాటె మావరాజ్’(మాఊళ్ళో మా రాజ్యం) అనేది రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో పొందుపరచినా అమలు పరచటంలేదు. ఇకనైనా ప్రభుత్యం దీనిపై దృష్టి సారించి ఆదివాసుల విద్యా అభివృద్ధిపై ఉట్నూరు కేంద్రముగా కొమురంభీం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.

విష జ్వరాల నుంచి ఆదివాసీలను కాపాడటానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. యస్.సి, యస్.టి. అట్రాసిటీ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి షెడ్యూల్డు ఏరియాలో ఆదివాసులపై దోపిడీ దౌర్జన్యాలను అరికట్టాలి. అటవీ హక్కుల చట్టా న్ని అమలుచేసి హక్కు పత్రాలను అందించాలి. గిరిజన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. అదిలాబాద్ జిల్లాలో మెజారిటీగా ఆదివాసీలు నివసిస్తున్న ఆసిఫాబాద్, ఉట్నూర్‌లను ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలి. 

-మైపతి అరుణ్‌కుమార్
(అక్టోబర్ 29న కొమురం భీం72వ వర్ధంతి సందర్భంగా..

Friday, October 26, 2012

కూడంకుళం: శేష ప్రశ్నలు--సుజాత సూరేపల్లి



దేశంలో ప్రజలు ఇవాళ ఉద్యమాల బాట పడుతున్నారు. వనరుల దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన వారిని ఎదో ఒక పేరు పెట్టి నిర్బంధానికి గురి చేయడం జరుగుతున్నది. అది కూడంకుళం లాంటి పెద్ద అణు రియాక్టర్ పరిక్షిశమలు కావొచ్చు, ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్ ),బొగ్గు, గ్రానైట్, ఇనుము, బాక్సైట్,యురేనియం లాంటి ఖనిజ తవ్వకాలు కావచ్చు. పోర్టులు, ప్రాజెక్టులు, రోడ్లు, ఎఫ్‌డిఐ లాంటి పథకాల పేరుతో సాగుతున్న విధ్వంసాన్ని ప్రశ్ని స్తూ ఉద్యమిస్తే,చాలు వారిని జైలుకి పంపడం పరిపాటి అయిపోయింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యమైంది. 
తమిళనాడులోని అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారుల మీద, వేలాది మంది ప్రజలమీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టా రు. మార్చి 2011లో జపాన్‌లోని ఫుకుషిమ అణువిద్యుత్ విస్ఫోటనం వల్ల జపాన్ విల విలలాడింది. ఇప్ప ట్లో ఆ దుష్ర్పభావం నుంచి బయటపడేటట్టు లేదు. ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ప్రమాద కరమైన సంఘటనగా సాంకేతిక నిపుణులు గుర్తించినరు. జపాన్ ప్రభుత్వం ఇది హిరోషిమా కంటే 168 రెట్లు ప్రమాదకరమైనదని అధికారికంగా ప్రకటించి, జపాన్‌లోఉన్న 54 రియాక్టర్లను మూసేశారు. ఈ ఘటన తరువాత లక్షా యాభై వేలమంది దూర ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు. బహుశా కొన్ని దశాబ్దాలు దీని ప్రభావం ఉండొచ్చు. 

టెక్నాలజీలో ఎంతో ముందున్న జపాన్ ఇప్పడు తమ శక్తిని మరోసారి అంచనా వేసుకుంటున్నది .ఇతరదేశాలు కూడా వీటికి దూరంగా ఉంటున్నా యి. ఫుకుషిమ ప్రమాదంతో ప్రకృతి విధ్వంసం, గాలి నీరు కలుషితం, ఆహార ధాన్యాలపై పడ్డ ప్రభావంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచానికి అణు రియాక్టర్ల వల్ల కలిగే నష్టాలు, లాభాల గురించి ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి పెద్ద ప్రమాదాల గురించి దూరదృష్టితో ఆలోచించి వీటిని అడ్డుకుంటున్నారు. 
కూడంకుళం 1988లో దివంగత రాజీవ్‌గాంధీ, మైకేల్ గోర్బచేవ్ మధ్యన జరిగిన ఒప్పందంతో కూడంకుళం అణు రియాక్టర్ నిర్మాణం ప్రారం భమైంది. కొద్ది రోజులు రష్యా రాజకీయ అనిశ్చితి కారణంగా, అటు తరువాత అమెరికా పెట్టిన అడ్డంకుల వల్ల ఆగి 2001 సెప్టెంబర్‌లో మొదలైంది.అప్పటి నుంచే దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అనేక రూపాలలో నిరసనను తెలుపుతూ ఉద్యమం చేపట్టారు. 

మత్స్యకారులు, పేద ప్రజలు దీన్ని రేడియేషన్ ద్వారా జరిగే నష్టాలను తెలుసుకుని మరింత పట్టుదలతో ముందుకుపోతున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టులో వేసిన పిల్ ప్రజలకు అనుకూలంగా వచ్చినా పట్టించుకొనే నాథుడు లేడు. ఉదయకుమార్ న్యూక్లియర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకుడిని అరెస్ట్ చేసి, వాళ్ళ సంస్థకు విదేశీ నిధులు వస్తున్నాయని, కొన్ని ఎన్‌జీవోలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిస్తున్నాయని అనుమానం తో కేసులు పెట్టి, భయవూబాంతులకు గురిచేస్తున్నారు. 
ఈ నెల 11న కూడంకుళం అణు రియాక్టర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్ళిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులైన విరసం, పౌర హక్కుల సంఘం, విద్యార్థి సంఘాలు మొదలగువారిని అరెస్ట్‌చేసి నాంగనేరి పోలీస్‌స్టేషన్‌లో విరసం కార్యదర్శి పి.వరలక్ష్మితోపాటు ఎనిమిది మందిపై అర డజన్‌కు పైగా కేసులు పెట్టా రు. ఈ కమిటీ సభ్యులు తమిళనాడులో మావోయిస్ట్ ప్రచారానికి వచ్చారని, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి, వారి వద్దకు వచ్చే లాయర్లను కలువనీయకుండా, కార్యదర్శి వరలక్ష్మి ఫోటోను ఫేస్‌బుక్‌లో నుంచి తీసి మావోయిస్ట్‌ను వివాహమాడినట్టు ఓ కట్టు కథ అల్లారు. 

ఇలాంటి కట్టుకథలు అల్లే పోలీసు ఘనులు దేశం నిండా ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో హమీద్-ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, దస్తగిరి-రాయల్ సీమ విద్యార్థి వేదిక, ప్రతిమ దాస్- ఒడిషా హైకోర్ట్ లాయర్, అరవింద్ అవినాష్, దామోదర్-పి.యు.సి.ఎల్ జార్ఖండ్, ప్రియదర్శిని-పరిశోధక విద్యార్థి, జేఎన్‌యు ఢిల్లీ తదితరులను తమిళనాడు ప్రభుత్వం బస్సులో పోతుండగా అరెస్ట్ చేసింది. లెఫ్ట్ భావజాలం ఉంటే మావోయిస్టులెనా? 40 ఏళ్లుగా పనిచేస్తున్న విప్లవ రచయితల సంఘం ఇప్పుడు కొత్తగా కనపడుతుందా? మావోయిస్టు సానుభూతిపరులుగా ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోదా? 

నిజంగా మావోయిస్టులు దేశ విద్రోహులా? రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ రాజకీయలతోనైనా ఉండొచ్చు అన్నప్పుడు ఎందుకు ప్రతిసారి కొద్దిమందిని, కొన్ని సంఘాలకు ఆ ముద్ర వేసి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారు? పోలవరం, కూడంకుళం, కోస్టల్ కారిడార్, సెజ్‌లలో జరిగింది ఇదే. ఉద్యమకారు లు ఎప్పుడూ హిట్ లిస్టులోనే ఉంటారు. సమాచార హక్కు కార్యకర్తల హత్యలు, జర్నలిస్ట్‌ల హత్యలు, ప్రజాస్వామికవాదుల జైలు జీవితాలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మావోయిస్టులు అంటే అసాంఘిక శక్తులని ముద్ర వేయడం సమంజసమేనా? ఇప్పటి వరకు పోలీసుల చేతిలో మరణించిన వాళ్ళు ఎంతమంది? ప్రజల నిర్వాసిత్వానికి కారణమైన వాళ్ళు, వేల సంఖ్యలో రైతులు, విద్యార్థులు, నేత కార్మికుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? భూములు, వృత్తులు కోల్పోయి మతి స్థిమితం తప్పిన వాళ్ళ లెక్కలు తీస్తే ప్రభుత్వాలు అధికారికంగా చేస్తున్న హింసని అర్థం చేసుకోవచ్చు. ఈవిధానాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక బస్సు తగుల బెట్టడమే హింస అయితే, వేలాది మంది ఆదివాసీల గూడాలను తగులబెట్టి, జైలులో నిర్బంధించడం హింస కాదా? దీన్ని ఏమనాలి? ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే విధానాలు అవలంబిస్తూ నిత్యం అమాయక ప్రజలను భయాందోళనలకు ఎవరు గురి చేస్తున్నారో కమిటీ వేసి పరిశోధిస్తే విచారిస్తే బాగుంటుంది. ప్రజ ల కోసం పనిచేస్తున్న వారిని మావోయిస్టులు అంటున్నారు. మరి ప్రజలను హింసి స్తున్న రాజ్యాన్ని ఏమనాలి? ఎవరు ఈదేశాన్ని రక్షించాలి ? హింస అని ఎవరు నిర్వచిస్తున్నారు? ఎట్లా నిర్వచిస్తారు? అతి పెద్ద ప్రజాస్వామ్యం, కోట్లకొద్దీ డబ్బు తో నడిపిస్తున్న రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా తప్పుడు కేసులు, ఆరోపణలు చేయడంలో.. వారి వ్యవస్థలు ఏవీ సరిగ్గా పని చేయ అర్థం చేసుకోవాల్నా? 

ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో భయంకర నిశ్శబ్దం రాజ్యమేలుతున్నదిపపంచీకరణలో భాగంగా వ్యక్తివాదం, స్వలాభం కావొ చ్చు లేదా ఈ రాజ్యం విధానాల వల్ల భయం కూడా కావొ చ్చు కానీ ఈ నిశ్శబ్దం ద్వారా రేపు మనమూ నష్టపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటి సామాజిక ఆర్థిక , రాజకీయ పరిస్థితులను అంచనా వేయకుండా మౌనంగా ఉంటే మన సమాధిని మనం అందంగా తవ్వుకున్నట్లే. ప్రజల పోరాటాలు వారివి మాత్రమే కాదు, మనందరివి. అందరం గొంతెత్తి ఈ అన్యాయాలను అడ్డుకోకపోతే ఒకరో ఇద్దరో చరివూతలోకి ఎక్కి అసాంఘిక శక్తుల లాగానో, హక్కుల కార్యకర్తల లాగానో మిగిలి పోతారు. కాని సమాజాన్ని మొత్తంగా మార్చడంలో విఫలమౌతారు. ప్రజాకార్యకర్తలు నిస్వార్థంగా తమ జీవితాలను ఫణంగా పెట్టి చేసిన త్యాగాలకు ఫలితం దక్కాలంటే మన మందరం గొంతెత్తి అన్యాయాన్ని, అవినీతిని ఎదిరించాలి. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించాలి, దళిత, బహుజన, ఆదివాసి, మైనారిటీ, స్త్రీల జీవితాలకు అండగా నిలవాలి.

నేటి సందర్భం, సమయం మధ్య తరగతి ప్రజల అవగాహనపై ఆధార పడి ఉన్నది. కింది కులాల పోరాటాలకు, వనరుల పై హక్కుల పోరాటాలకు మద్దతు తెలపాలి. బడుగుల జీవితాలను నాశనం చేస్తూ, వారి సమాధుల మీద అభివృద్ధి పునాదులు వేసే విధానాలను వ్యతిరేకించాలి. 

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana News Paper Dated : 26/10/2012 

ఆస్ట్రేలియాలో తెలంగానం(సాహిత్య యాత్ర)---గోగు శ్యామల



ఆరోజు ఉదయం 9 గంటలకు నేను సిడ్నీలో ఫిలిఫ్ స్ట్రీట్‌లోని ట్రావెలాడ్జిలో దిగాను. నేను హడావిడిగా తయారై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బస్‌లో ఎక్కాను. ఒక్కసారి అందరూ హాయ్ అన్నారు. వారందరకి నేను ‘హాయ్, నమస్కార్ ’ అని బదులు చెప్పిన. కానీ అంత మంది నా కోసం ఎదురు చూస్తున్నరని నేను ఊహించలేదు. ఆ క్షణం ఉక్కిరిబిక్కిరయిన. వారికి ‘నమస్కారం’ అని మామూలుగా విష్ చేయడం, ఏదో వెల్తి అనిపించింది. నా అస్తిత్వం జైపూర్ లిట్రరీ ఫెష్టె నుంచే వారందరికి తెలిసిందనేది నాకు తట్టింది. వెంటనే సీట్లో కూర్చున్నదాన్ని పైకి లేచి నిలబడి ‘జై తెలంగాణ’ అని తిరిగి విష్ చేసిన. అందరూ ముక్తకం ‘జై తెలంగాణ’ అని బదులు చెప్పిండ్రు. అప్పుడు నా మనసు నిమ్మలమయింది. వారందవరో తెలుసా? భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ రచయితలు.

అందులో ప్రముఖ రచయిత ‘యయాతి’, ‘తుగ్లక్’, ‘నాగమండల’ మొదలగు గొప్ప రచనలు చేసి, పద్మభూషణ్, అవార్డు గ్రహీత కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్ ఉన్నారు. ఉర్దూలో చారివూతకమైన మౌఖిక కథలను చెప్పే సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన ప్రముఖ కళాకారుడు రచయిత మహ్మద్ ఫారుఖి ఉన్నారు. అరుణాచల్‌వూపదేశ్ చరివూతను, సంస్కృతిని ప్రముఖంగా రాస్తూ, ‘రివర్’పోయమ్స్, ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్‌సామ్’ తదితర పేరు గాంచిన రచనలు చేసి పద్మశ్రీ, 2011లో ‘ది ఫోర్తు హైమెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియన్’ అందుకున్న మమాంగ్‌దాయ్ ఉన్నారు. 2012లో జైపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సంబరాల నిర్వాహకుల్లో ఒకరైన మితాకపూర్ ఉన్నారు.

‘ది ఫేస్ బిహైండ్ ది మాస్క్’ (తమిళ సాహిత్యంలో స్త్రీ) ‘ఎ పర్పుల్ సి’ (కథా సంకలనం) వెలువరించి ‘అంబయ్’ కలం పేరుతో రాస్తున్న సియస్ లక్ష్మి ఉన్నారు.‘అకర్మషి’ ఆత్మకథ, నవలలు రాసిన ప్రముఖ మరాఠీ దళిత రచయిత షరణ్‌కుమార్ లింబాలే ఉన్నారు. ‘లిటానిష్ ఆఫ్ డచ్ బెటరి’ నవల వలన ప్రముఖంగా జాతీయస్థాయిలో పేరుగాంచిన కేరళ రచయిత యన్ యస్ మాధవన్ ఉన్నారు. ‘అరౌండ్ ది ఎర్త్, కాసీ లెజెండ్స్’ రచనల ద్వారా పేరొందిన, కాసీ, ఇంగ్లిష్ భాష ల్లో రాస్తున్న మేఘాలయ రచయిత యనపామ్ సింగ్ నాంగ్‌యనర్రి ఉన్నారు. ‘మిట్రో ’ ‘విననా లోకో’ ‘ప్రియ బయాని సాహెబ్’ ‘కౌన్ బహర్’ రచనల ద్వారా ప్రముఖంగా ముందుకొచ్చిన గుజరాతీ రచయిత ప్రబోద్ పరిక్ ఉన్నారు. 

‘ది వాల్స్ ఆఫ్ ఢిల్లీ’ ‘ది గర్ల్ విత్ ది ఎల్లో అంబ్రెల్లా’ రచనలతో ఎన్నో మన్ననలు పొందిన హిందీ రచయిత ఉదయ్ ప్రకాశ్ ఉన్నారు. పెంగ్విన్ పబ్లిషర్ నుంచి శివవూపియ ఉన్నారు. ఇంకా సిడ్నీలో కార్యక్షికమ నిర్వాహకులు ఉన్నారు.కల్మషంలేని మనస్తత్వాలతో ‘జై తెలంగాణ’ అనడంతో నా ఆలస్యం ద్వారా వారిని ఇబ్బందిపెట్టిన సంగతి కూడా నేను మర్చిపోయిన. ఇంక మా బస్సు సిడ్నీ ప్రధాన పట్టణం నుంచి వెస్టన్ సిడ్నీలోని మెల్‌బోర్న్ వైపువెళ్లింది. అట్ల పరమట్టా కేంపస్‌లోకి ప్రవేశించింది. కేంపస్ ఆవరణమంతా తేటగా తాజాగా కడిగేసినట్లున్నది.

పొద్దుపొడ్పు కిరణాలు పడి చెట్టు ఆకులపై నిలిచున్న నీటి బిందువులు తళుక్కున మెరుస్తున్నయి. అప్పటికే నిర్వాహకులు సుసాన, నికొలస్‌లు వేగంగా మీటింగ్ హాలులోకి వెళ్లుతుంటే మేము వారిని అనుసరించాం. మీటింగ్ హాలు కారిడార్‌లో అప్పటికే మా కోసం ఎదురు చూస్తు న్నారు. అందులో ముగ్గురు భారతీయ మహిళలు, మిగితా వారంతా ఆస్ట్రేలియన్ ఫాకల్టీస్ ఉన్నారు. అయితే నేను ఎప్పుడెప్పుడు మృదులను చూస్తానా అని ఎదురుచూస్తున్న. ఎంతో ఆశతో ఎదిరి చూస్తున్న మృదుల ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారా’ అని? ఆతృతతో చూస్తున్న.

నలుపు రంగు చీరకు పసుపు పచ్చ అంచున్న పోచంపల్లి పట్టు చీర కట్టుకున్న ఆమెను చూస్తున్నా.. చీర చాలాబాగుంది. అందులో అది మా తెలంగాణలోని పోచంపల్లి పట్టు చీర. ఆమె చాలా చురుకుగా కనిపిస్తుంది. ఇతరులతో మాట్లాడుతూనే నన్ను గమనిస్తున్నట్లున్నది. నా దగ్గరకు వచ్చి హాయ్ గోగు ఐయామ్ మృదుల అన్నది. ఇంక నా సంతోషానికి అవదుల్లేవు. దానికి రెండు కారణాలున్నయి. ఒకటి నాకు సిడ్నీలో నిర్వహిస్తున్న సాహిత్యసభలో పాల్గొనే అవకాశం రావడానికి గల ప్రధాన కారకుల్లో ఈమె ఒకరు. నన్ను ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్ మెయిల్లో కలిసేది. రెండుసార్లు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి నాతో ప్రత్యక్షంగా మాట్లాడింది.విదేశీ ప్రయాణాలు అలవాటులేని నాకు ప్రతి అంశాన్ని ఎంతో ఓపికతో వివరించింది. 

రెండవ కారణం తాను తెలంగాణ పోచంపల్లి పట్టు చీర కట్టుకుంది. ఆమెనే ఈ మృదుల. మృదులానాథ్ చక్రబర్తి. ఇంక ప్రారంభ కార్యక్షికమంలో యూనివర్సిటీ ఆఫ్ వెస్టన్ సిడ్నీ వైస్‌చాన్స్‌లర్, వివిధ డిపార్టుమెంటులకు సంబంధించిన ప్రొఫెసర్లు వారి వారి సందేశాలను ఇచ్చారు. తరువాత అక్కడికి వచ్చిన రచయితలను, వారి నేపథ్యాలను మృదుల పవర్ పాయింట్ ప్రెజెం ద్వారా ఆమె ఇంగ్లిష్‌లో వివరించింది. అందులో నా గురించి సంక్షిప్తంగా ఇట్ల చెప్పింది. ఈమె గోగు శ్యామల. తెలుగులోనే రాస్తుం ది, కానీ తెలంగాణ తెలుగులో రాస్తుంది. 

నల్లపొద్దు (దళిత స్త్రీల సాహిత్య సంకలనం నల్లరేగటి సాళ్లు (మాదిగ, మాదిగ ఉపకులాల ఆడోళ్ళ కథలు) ఎల్లమ్మ (అనేక అస్తిత్వాల ఆడోళ్ళ కథలు), వాడపిల్లల కథలు, నేనే బలాన్ని(టి.యన్ సదాలక్ష్మి బతుకు కథ) సదాలక్ష్మి గూర్చి ఇంకొంత వివరంగా చెబుతూ ‘ఈమె దళిత రాజకీయ నాయకురాలు, మొదటి దేవాదాయ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసింది. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఈమె నాయకత్వం వహించింది. ఈ చరివూతను గోగు శ్యామల సదాలక్ష్మితో దఫ దఫాలుగా కూర్చొని రికార్డు చేసి రాసింది. ఇంగ్లిష్‌లో అనువాదంచేసే ప్రయత్నం జరుగుతున్నది.‘ఫాదర్ మే బి ఎ ఆన్ ఎలిఫెంట్ మదర్ మే బి ఎ స్మాల్ బాస్కెట్.....బట్.’ అనే కథా సంకలనం జైపూర్ లిట్రేచర్ ఫెస్టివల్లో రిలీజ్ అయింది.


అద్భుతమైన కథలు. కావాల్సిన వారికి రేపటి నుంచి స్టేట్ లైబ్రరీలో జరగబోయే సెషన్స్‌లో రచయితలందరి పుస్తకాలను అందుబాటులో పెడతామని ముగించింది. అందరొక్కసా రి నా వైపు అభిమానంతో చూసి చప్పట్లు కొట్టిర్రు. అట్ల అందరి గురిం చి నా గురించి అంత బాగా పరిచయం చేయడం, అందులో మొదటది ‘తెలంగాణ’, రెండవది ‘దళిత’ అని నాకు సంబంధించి ముఖ్యమైన అస్తిత్వంగా ప్రస్తావించడం, వారంతా హర్షం వ్యక్తం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. కష్టమైనప్పుడే కండ్లు తడి అయితయి కదా. ఆకలి, అలసట సంబరం కలగల్సిన మిగతా రచయితలకు కావచ్చు, కాకపోవచ్చు నాది మాత్రం ఆ పరిస్థితి. 

ప్రారంభ సెషన్‌లో అలసటను, ఆకలిని మర్చిపోయిన నేను మృదుల ప్రత్యేక శ్రద్ధతో వండించి, వార్చి న భోజనాలు నన్ను మరో లోకంలోకి తీసుకెళ్ళింది. అబ్బో కలర్ ఫుల్ గా అలంకరించిన ఆ డైనింగ్ యాదికి తెచ్చుకోకుండా ఎట్ల ఉండగలం. వాటి మధ్యలో ఒక అందమైన కవర్‌తో ప్యాక్ చేసి ఉంది. ఎలియట్ వెయిన్‌బర్గర్ రాసిన ‘ వైల్డ్‌లైఫ్ ’ పుస్తకమున్నది. దాని పైనా పేరు రాసి ఉంది. నా ప్యాకు నేను తీసుకుని దాచుకున్నాను. అందరి మీద అట్లనే ఉన్నది. గిరీష్ కర్నాడ్ గారు నా దగ్గరకొచ్చి ‘తెలంగాణ ఎప్పుడు వస్తుంద’ని అడిగిండు. ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాటం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నాము. పోయినసారి మిలియన్ మార్చ్ చేశాం. ఈసారి డిసెంబరు 30న హైద్రాబాదులో పెద్ద ‘మార్చ్’ జరగబోతున్నది. 

వెయ్యి మందిదాక విద్యార్థులు ప్రాణాలిచ్చిండ్రు. అన్ని వర్గాల ప్రజలు 40 దినాల దాక ‘సకల జనుల సమ్మె’ చేసిండ్రు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం ప్రజలు చెయ్యాల్సిన పోరాటాలన్ని చేసిం డ్రు. చేస్తుండ్రు. ఇంక మిగిలింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేయడమే’ అన్నాను. ‘అవును తెలంగాణ ప్రజలు నిజం గా సీరియస్ పీపుల్. నేను చిన్ననాటి నుంచి వివిధ సందర్భాలలో తెలంగాణ గూర్చి వింటున్నాను. ఇప్పుడు చూస్తున్న. ఒకటి మాత్రం నిజం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తమ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారు’ అన్నారు. మేం మాట్లాడుతుంటే మా చుట్టూ గుమిగూడి వింటున్న వారిలోఎపూక్స్ వ్రైట్స్, మృదుల, సి.యస్ లక్ష్మి, మమాంగ్‌దాయ్‌లున్నారు.

తెలంగాణ ప్రజలు రాష్ర్టం కోసం చేస్తున్న పోరాటం పట్ల తన నమ్మకాన్ని, అభిమానాన్ని గిరీష్ గారు అంత దృఢంగా చెప్పడం చూసి నేను అవాక్కయిన. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రచయిత గిరీష్ కర్నాడ్ ద్వారా తెలంగాణ గురించి ఆస్ట్రేలియా రచయితలకు, మన ఇండియాలోని ఇతర రాష్ట్రాల రచయితలకు ఈ సందర్భంలో తెలియడం ఎంతో ముఖ్యమనిపించింది.

మర్నాడు సెప్టెంబరు నాలుగవ తేదీనాడు మొదటిరోజు మొదటి సెషన్‌లో ‘పాత సాంప్రదాయం కొత్త సంస్కృతి’ అనే శీర్షిక గల ప్యాన ల్లో నా పేపరును ప్రెజెంట్ చేసిన. అందులో దక్కన్‌లోని తెలంగాణ చరిత్ర, సంస్కృతిలలో మాతృస్వామిక వ్యవస్థ పునాదిగా ఉన్న కుటుం బ వ్యవస్థ కొనసాగుతున్నది, జీవావరణాన్ని, జీవవైవిధ్యాన్ని వనరులను ఆలంబన చేసుకుని, వాటిని పరిరక్షిస్తూ, వృద్ధి చేస్తూ, వినియోగించుకుంటూ, నాగరిక ఆధునిక సమాజాన్ని నిర్మించిన క్రమాన్ని నేను పాత సాంప్రదాయంగా వివరించిన. ఇందులో ప్రత్యేకంగా ఉత్పత్తి నైపుణ్యంలో అంతర్భాగంగా పని, పాట, ఆటల స్వభావాన్ని కలిగి ఉన్నది.

ఇందులో ప్రధానంగా ఉత్పత్తి యూనిట్‌గా కుటుంబ వ్యవస్థ పనిచేసిన సమాజంగా నిర్మితమైన క్రమంలో వీటన్నింటిలో స్త్రీ అనివార్యంగా కేంద్రబిందువైంది. ఈ క్రమంలోనే నాగరిక సమాజ నిర్మాణంలో అనేక అస్తిత్వాల సమాజాల భాగస్వామ్యాన్ని నా పేపరులో క్లుప్తంగా చెప్పాను. నాగరికతను, సంస్కృతిని, చరివూతను నిర్మించిన అస్తిత్వ సమాజాలే కొత్త సంస్కృతిలో అదృశ్యులుగా, అస్పృశ్యులుగా చేయబడిన తీరును చెప్పాను. ఆధునిక తెలంగాణ సమాజంలో వలస పీడనను, అణిచివేతను, పరాయికరణను, నియంతృత్వపు ఆధిపత్యాలను వ్యతిరేకించే పోరాటాలే నేడు కొనసాగుతున్నవి. జీవ వైవిధ్యం కుటుంబ వ్యవస్థను పునర్మించుకోవడంలో భాగంగా నేటి ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం కొనసాగుతున్నది. వీటినే ప్రతీకలుగా ఉద్యమంలో ఉపయోగించడం తొలిదశ పోరాటం నుంచి మలి దశ పోరాటం వరకు కొనసాగుతున్న విధానాన్ని చూస్తున్నాం. 

మాతృవవ్యస్థ, ఆత్మగౌరవ, స్వయంపాలన, సమానత్వపు ఆకాంక్షలు వెల్లువలై అలుగు దుంకిన చెరువు నీళ్లోలే వెల్లు ఈ ఉద్యమంలో తెలంగాణ తల్లిగా, బతుకమ్మగా, సమ్మక్క సారక్కలుగా, జాతర్లుగా, బోనాలుగా మాతృ వ్యవస్థ ప్రతీకలుగా, ఉద్యమ రూపాలుగా ముందుకు రావడం దక్కన్, తెలంగాణ ప్రత్యేకతనే చెప్పవచ్చు. వీటిలో వృత్తి కళాకారులు, కులాలుగా పేరుపడిన సమాజాలు డక్కలి, చిందు, బయిండ్ల, మాల దాసరి, బుడ గ జంగాలు, మాష్టీలున్నారు. వివిధ కళారూపాల ద్వారా మౌఖిక సాహిత్యాన్ని ఇప్పటికీ బతికిస్తున్నది ఈ కళాకులాల ఆస్తిత్వ సమాజా లే.

దీనినే తరతరాలుగా తమకు దక్కిన వారసత్వంగా నమ్మి, సాంప్రదాయంగా బతుకుతున్న తీరు కొత్త సంస్కృతిలో తెరమరుగైన ఆ కులాలు, కళారూపాలు అంతరించే, పరాయికరించబడే, క్షీణించబడే స్థితి దాపురించింది. అనే అంశాలను మౌఖిక సాహిత్యంలోని పాటల ను, సంగీత వాయిద్యాలను, సంభాషణలను ఉదాహరణలుగా పేర్కొంటూ వివరించాను. వీటితోపాటు ప్రధానంగా భాష గురించిన చారివూతక రాజకీయాలు, ‘అసలు తెలుగు’ అనే ప్రత్యేకాంశాలను వివరించాను. ఇందులో ప్రధానంగా ‘తెలంగాణ, దళిత ఇండిజీనస్’ రచయి త్రిగా నాకు వారిచ్చిన గుర్తింపునకు, గౌరవానికి అనుగుణంగా నా ప్రసంగం, ప్రశ్నలకు జవాబులు నడిచినాయని చెప్పాలి. 

కానీ నేను అంతదూరం వెళ్ళి తెలంగాణ, దళిత రచయిత ప్రాతినిధ్యానికి నేనెంత వరకు న్యాయం చేసిన్నో నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ రకమైన ప్రశ్నల పరంపరలో ఎదురు చూస్తున్న నాకు తోటి రచయితల స్పందన కొంతవరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. తెల్లవారి నుంచి సి.యస్ లక్ష్మిని ఉదయం కల్సిన వెంటనే నేను ఆమెకు గుడ్‌మార్నింగ్ చెపుతుం ఆమె నాకు ‘జై తెలంగాణ’ అనడం మొదలుపెట్టింది. మూడో రోజు ఉదయం మా హోటల్‌కి ఒక కిలోమీటరు దూరం ఒపెరా హౌజ్ బీచ్ ఉంది. అక్కడికి ఉదయం నడ్చుకుంటూ వెళ్దామని ఆ ముందు రాత్రే అనుకున్న ప్రకారం బయలుదేరి నం. వెళ్తున్నదారి మధ్యలో ఉన్న హస్పిటల్ ముందు ఓ బలిష్టమైన అడవి పంది విగ్ర హం ప్రతిష్టించి ఉన్నది.

దాని పునాది గచ్చుపై ఈ విధంగా రాసిఉంది ‘నా మూతిని పట్టుకొని మీ మనసులో కోరికలు కోరుకున్నట్లయితే అవి నెరవేరుతాయి‘ అని రాసి ఉంది. ‘గోగు నీవు దాని మూతిని పట్టుకుని మీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకో. నేను నా స్పారో సంస్థ బాగా నడవాలని కోరుకుంట’ అన్నది. ఆమె చెప్పినట్లే కోరుకున్న. 

మూడోరోజు ఉదయం సెషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ప్రారంభంలోనే మృదుల ఓ శుభవార్తను వెూసుకొచ్చింది. ఈరోజు సాయంత్రం మనం ఇండస్ (ఇండియన్ ఆస్ట్రేలియన్ అసోసియేషన్) వారు ఇచ్చే డిన్నరుకు వెళుతున్నం. అందరూ సిద్ధంగా ఉండండి అన్నది. ప్రత్యేకంగా నా వైపుకు తిరిగి గోగు శ్యామల మీ తెలంగాణ వారు కూడా వస్తున్నారు. నిజానికి నేను తెలంగాణ వారి కోసం, ఆంధ్రావారి కోసం రోజూ ఎదురుచూస్తున్నా ఎవరైనా తెలుగువారు వస్తారే చూసుడేకాదు, రోజూ సభలో పాల్గొనడానికి వస్తున్న కర్ణాటకకు చెందిన శ్రీనివాస్‌ను అడుగుతున్న, ఈయన సిడ్నీ శ్రీనివాస్ పేరుతో మంచి పుస్తకాలను రాసిండు. ఎదురు చూసినా కానీ ఒక్క గోల్డి ఒసీరి తప్ప ఎవ రూ రాలేదు. ఈరోజు తెలంగాణ వారిని కలవబోతున్నాం అంటే చాలా సంతోషమయింది.

అనుకున్నట్లే సిడ్నీ నగరంలో స్టేట్ లైబ్రరీకి దాదా పు 30 కిలోమీటర్ల దూరంలోఉన్న ఇండియన్ హోటల్‌కు చేరుకున్నం. ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఇక్కడ గుమిగూడి ఉన్నారు. గుంటూరుకు చెందిన భాస్కర్ ఉన్నారు. మమ్ములను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానింంచారు. ఇండస్ అధ్యక్షుడు డాక్టర్ యాదుసింగ్ అందరు తమ పరిచయాలను చేసుకోవాలని ప్రకటించడంతో తమ తమ పరిచయాలను చేసుకుంటున్నారు. అధ్యక్షుడు ఇండస్‌ను గురించి క్లుప్తంగా పరిచయం చేశాడు. వేదికపై మధ్యమధ్యలో ఓ వ్యక్తి హిందీ పాటలు పాడుతున్నాడు. 

అతన్ని మధ్యలో కాస్త ఆపిం చి ఇప్పుడు తెలంగాణ వారు వచ్చారు మనతో జాయిన్ అవుతారు. ‘మనందరికి తెలుసు తెలంగాణలో ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమం నడుస్తున్నద’ని అధ్యక్షుడు అనే వరకు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు రావడం వారిని చూసిన వెంటనే మా సొంత మనుషులు వచ్చిన భావం కలిగింది. ఉపేందర్, సోమేశ్వర్, స్వర్ణ, ప్రసాద్ రావడం వస్తూ వస్తూనే జై తెలంగాణ అని పలకరించారు. మమ్ముల చూస్తున్న నాతోటి ఇతర భాషా రచయితలు ‘మీ తెలంగాణ వారొచ్చిరి. నీవింక తెలంగాణ తెలుగు మాట్లాడొచ్చు’ అన్నరు. 

ఈ రచయితలు ఎంత మనసెరిగిన వారో కదా అని వారిని అభినందించిన. నిజ మే ఆ వారం రోజులుగా మాట్లాడితే ఇంగ్లిష్ లేకుంటే హిందీ బిగవట్టుకొని మాట్లాటం వల్ల నాకు నేను నా నోటిని పరిమితం చేసుకున్నట్లయింది. వారితో మాట్లాడడం మొదలు తరువాత నేను మాత్రం స్వేచ్ఛగా మాట్లాడాను. తెలంగాణలో ఎవరు ఏ జిల్లా అంటే ఒకరు ఖమ్మం, నల్గొండ, పాలమూరు, హైద్రాబాదు. తూప్రాన్. ఓల్డ్ సిటీ ఇట్ల ప్రతి ప్రాంతం నుంచి ఏరి, కూర్చినట్టు మనవారు సిడ్నీలో ఉన్నారనిపించింది. అధ్యక్షుడు ఇండస్‌ను క్లుప్తంగా పరిచయం చేయడం. తెలంగాణ గూర్చి ఈయనకు బాగానే తెలిసినట్టున్నది, చెబుతూనే ఉన్నడు ‘సౌత్ ఇండియాలో ప్రతేక రాష్ర్టం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తున్నారు.

నేను ఉత్తరవూపదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన వాణ్ని, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అనేది మనం నమ్ముతున్నాం, చూస్తున్నాం, కనుక తెలంగాణ వారికి తెలంగాణ రాష్ర్టం కావాలి, మాకు బుందేల్‌ఖండ్ రాష్ర్టం కావాలి.’ అని ముగించాడు. మన పోరాటాలను ఆయన కనులారా చూడని వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, మన రాజ్యాంగంలోని చిన్నరావూష్టాల నియమాన్ని గౌరవించి తన విశాల దృక్పథంతో ప్రకటించిండు. అక్క డ ఉన్న భారత ప్రజలందరి ముఖాలలో అంగీకారం ఉన్నది. గుంటూ రు భాస్కర్‌కు కూడా అంగీకారమున్నది. 

ఎఎల్‌ఎఫ్ ఉత్సవంలో పాల్గొన్న బహుభాషా, సంస్కృతి రచయితలకు, సన్మా నం చేయడం, ఎవరి రాష్ర్ట రచయితకు ఆ రాష్ర్ట వారితో ఇండస్ జ్ఞాపికను బహూకరించారు. నాకైతే సహజంగా తెలంగాణ ఫోరం వారితో జ్ఞాపికను అందచేయించారు. అపుడు కొన్ని ముచ్చట్లు ఉపేందర్, ప్రసాద్ తెలుగులో మాట్లాడిండ్రు, నేను తెలుగులో మాట్లాడిన. ఆ వాతావరణం చూసిన తరువాత ఆంధ్రవూపదేశ్‌లో కొంతమంది మేధావులుగా, రాజకీయనాయకులుగా, ప్రధానక్షిసవంతి తెలుగురచయితలు, సినీ రంగం లో ప్రధానంగా ఉన్నవారు, రాజకీయ నాయకులు. వీరందరికన్నా ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రజలు ఎంతో గొప్పవారనిపించింది. తెలంగాణలో జరిగేవన్నీ కనులార చూసుకుంటూ కూడా తెలంగాణకు మద్దతుగా నోరు విప్పరు.

వారికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష వారికి అర్థం కావడంలేదా? వారు అర్థం చేసుకోదలుచుకోలేదనిపించింది. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా సిడ్నీలో తెలంగాణ రాష్ట్ర పోరాటానికి సంఘీభా వం, ఆదరణ రావడానికి కారణం అక్కడి తెలంగాణ బిడ్డలు తమ కుటుంబాల సమేతంగా ఇట్ల రాత్రింబగళ్ళు తపించి, కష్టించి తెలంగాణ పోరాటాన్ని ‘ప్రపంచ ప్రఖ్యాత’ స్థాయిలోకి తీసుకొచ్చారు. సుదీ ర్ఘ కాలం నుంచి ‘ఆవూస్టేలియా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం’, ‘ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్’ పేరుతో చేస్తున్న ఉద్యమ కార్యాచరణ ఫలితమే నేడు నాకు కనిపించిన సంఘీభావం, ఆదరణ అనిపించింది. 

సిడ్నీలో తెలంగాణలోని పది జిల్లాల వారున్నారు. కానీ ఇండస్ నిర్వహించిన కార్యక్షికమానికి కొద్ది మంది మాత్రమే వచ్చారు. తెలంగాణ రాష్ర్టం కోసం వారు పడుతున్న తపన, సంఘీభావాన్ని కూడగట్టాలనే నిరంతర ఆరాటాన్ని ప్రత్యక్షంగా చూసింది నేనేనని గర్వపడుతున్న. అంతేకాదు వారి ఆవేదనను, ఆగ్రహాన్ని కూడా చూసిన. ‘ఆ ఎమ్యెల్యేలు అట్లెందుకు మాట్లాడుతున్నడు? పర్కాల నియోజక వర్గంలో ఆమెకన్ని ఓట్లు ఎట్ల పడినయి? తెలంగాణ కోసం పని చేయకుండా ఇంత మంది మీరేం చేస్తున్నారు? అని నావైపు మళ్లింది వారి ప్రశ్న. వారి ప్రశ్న న్యాయమయింది. 

కానీ కడ్పు చించుకుంటే కాళ్లమీద వడ్డట్లున్నది. అధికార రాజకీయ పార్టీల నాయకులు ప్రజలతో ఆడుతున్న నాటకాలు, సీమాంధ్ర నాయకులతో లాలూచీలు, వారికి తొత్తులుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి అడ్డంకిగా తయారైన తీరు. ఇంటి దొంగలు, బయటి దొంగలను గురించి చాలాసేపు చర్చ జరిగిం ది. కొంత దూరంలో ఉన్న ఇండియాలోని ఇతర భాషా రచయితలు మమాంగ్‌దాయ్, మాధవన్, శరణ్‌కుమార్ లింబాలె, ప్రకాశ్, శివవూపియలు నా దగ్గరకొచ్చి ‘శ్యామల ఫేస్ ఈజ్ డిలైటింగ్ నవ్’ అన్నరు. శ్యామలా నీవు వారితో మాట్లాడుతున్నావా? కొట్లాడుతున్నావా? అరే మీరు చాలా సీరియస్‌గా చర్చిస్తున్నరు వారు దళితులా అని అడిగిం డు. లేదు వారంత ఆధిపత్య కులాల రెడ్డీలు, వెలమలు, బ్రాహ్మణులు కావచ్చని సమాధానం చెప్పిన. ఆధిపత్య కులాలు, దళితులు కలిసి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నరా? అడిగిండు.

ఔను.. అది తెలంగాణ గొప్పతనం. రాష్ట్రాన్ని బుడగ జంగాల నుంచి బ్రాహ్మణుల దాక అన్నికులాలు, తెగలు, అన్ని వర్గాలు, అన్ని రంగాలు ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పిన. ఎందుకు ఆధిపత్య కులాలవారు తెలంగాణను అడుగుతున్నారు? నన్ను ఎదురు ప్రశ్న అడిగిండు? తెలంగాణలో కులాల మధ్య అంతరాలు, వ్యత్యాసాలున్నప్పటికీ తెలంగాణ ఆధిపత్య కులాల వారు ఆంధ్రా పాలకుల దృష్టిలో బానిసలే, లేదా అంటరానివారే. ఈ ధోరణి పాలన విధాన నిర్ణయాల్లో , ఉద్యోగ పంపకాల్లో, నీటి, చదువు, ఆరోగ్యపు, నీటిపారుదల పంపకాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ‘తెలంగాణ ప్రాంతాన్ని అసాంతం మేం ఆక్రమించుకు న్నం’ అనే భావనలో సీమాంధ్ర ఆధిపత్య కులాల పాలకులు వ్యాపారులు బతుకుతున్నారు.

తెలంగాణ ఆధిపత్య కులాలు మాత్రం వారిని మా కులం వారని చూస్తారు. ఆ కులాల్లో వియ్యమందుకున్నా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను కూడా సాధికారతతో నిర్వహించలేని పరాధీనతలో కొనసాగుతున్నారు. అందుకే ప్రస్తుతం తెలంగాణను మొత్తం నీరులేని, చదువులేని, పంటలేని, కరెంటు లేని చీకటి వాడ వెలివాడను చేసిండ్రు ఆంధ్ర పాలకులని.. తెలంగాణ ప్రజలకం తా అర్థమయింది. కనుకనే అన్ని కులాలు, తెగలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రజలు వారివారి ప్రత్యేక అస్తిత్వాలతో ఉద్యమిస్తున్నారు. 

అధికార, ప్రతిపక్ష, కమ్యూనిస్టు, మత పార్టీలే డైలమాలోనో, వ్యతిరేకంగానో, తొత్తులుగానో ఊగిసలాడుతూనో, అవకాశవాదంగానో కొనసాగుతున్నారని వివరించిన. శరణ్ కుమార్ లింబాలే ఇంతింత పెద్ద కండ్లు చేసి ‘అరే తెలంగాణలో ఈ రకమైన ఉద్యమాలు, రాజకీయాలున్నాయా? మహారాష్ర్టలో ఈ రకమైన పరిస్థితి కనడబడదు. మాకైతే నిజంగా తెలంగాణ కొత్త సమాచారాన్ని విజ్ఞానాన్ని ఇచ్చింది.’ అన్నడు. ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం సూత్రధారుల్లో ఒకరైన వినోద్‌డ్డి ఎలిటె ద్వారా ఎక్కువ వివరాలను తీసున్నంక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మలుపులు వివరంగా అర్థమయింది.

సిడ్నీలో తెలంగాణ వారు ఒక రాజకీయ అస్తిత్వంతో తమ పోరాటానికి ఇతరుల మద్దతును కూడగట్టడంలో విజయవంతమయ్యారనే చెప్పాలి. 
ఈ నేపథ్యంలోనే.. వీరు తెలంగాణ ఏమి కోరుకుంటున్నదనే వివరాలను స్పష్టంగా పిటిషన్‌లో రాసి ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజలంతా సంతకాలు పెట్టి భారత ప్రధానికి అందజేశారు. ఆనాటి నుంచి తెలంగాణ అస్తిత్వ సమాజం ‘బతుకమ్మ’ పండుగ ఉత్సవాలను జరుపుకుంటున్నది. అదేవిధంగా ‘ఆపరేషన్ పోలో’ అమరవీరులను స్మరించుకుంటుంది. అలాగే చారివూతక ఘట్టాలతో ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం తన కోసం ప్రణాళికా సూత్రాలను తయారు చేసుకున్నది. ఇందులో తెలంగాణ చరిత్ర, వర్తమాన, భవిషత్తు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికాంశాలు మిళితమయ్యే విధంగా రూపొందించుకున్నారు. అందులో తెలంగాణ ప్రజలు రజాకారుల నుంచి విముక్తి కోసం ఆనా డు పోరాడినారు. ఈ రోజు సీమాంధ్ర పాలకుల పీడన నుంచి విముక్తి కోసం పోరాడుతున్నారు.

ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతిని కొనసాగించడం దానిని భవిషత్తు తరాల కోసం కాపాడుకోవడం ముఖ్యమైన ఆచరణగా పెట్టుకున్నారు. అవి బతుకమ్మ, బోనాలను జరుపుకోవడం అనే ఆచరణగా పెట్టుకోవడం. ఈ ఒరవడితోనే మొదట టిడియఫ్, తర్వాత ఏ దేశానికాదేశం తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా తెలంగాణ రాష్ర్ట ఉద్యమాన్ని విస్తరింప జేశారు. ఆ విధం గా ఖండాంతరాలు దాటినా తెలంగాణ ప్రజలు విముక్తి కోసం పోరాడి పేగుబంధపు రుణం తీర్చుకుంటున్నారు. అపుడర్థమయింది నాకు ఎంతో కాలం నుంచి పోరాడుతున్నారు కాబట్టే ‘ఆవూస్టేలియా ఇండియా లిటరేచర్ ఫోరమ్’లో తెలంగాణ దళిత రచయివూతిగా నేను మాట్లాడిన ప్రతి మాట ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 


-గోగు శ్యామ
Namasete Telangana News Paper Dated : 24/10/2012