Saturday, October 27, 2012

జల్ జంగిల్ జమీన్ భీం ఆశయం--మైపతి అరుణ్‌కుమార్ఆదిలాబాద్ జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం గోండ్, కోలా మ్, పర్థాన్, మన్నెవార్, నాయకపోడ్, కోయ, తట్ తదితర తెగలు ఉన్నా యి. 1976లో గిరిజనులుగా గుర్తించిన లంబాడీలు కూడా నివసిస్తున్నారు. ఆసిఫాబాద్‌లోని సంకేపల్లి గ్రామంలో కొమురం చిన్నూ, సోం బాబు దంపతులకు 1900 సంవత్సరంలో కొమురం భీం జన్మించాడు. పదిహేనేళ్ళ వయస్సులోనే అటవీశాఖ సిబ్బంది దాడిలో తండ్రి చనిపోయాడు. అప్పుడు భీం కుటుం బం కెరిమెరి మండలం సర్దాపూర్‌కు వలసవెళ్ళింది. అక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలోనే నిజాం తొత్తుగా వ్యవహరిస్తున్న ‘సిద్ధిఖీ’ అనే జాగీర్‌దార్ భీం సాగుచేస్తున్న భూమిని ఆక్రమించాడు. కోపంతో సిద్ధిఖీని హత్యచేసి, నిజాం పోలీసులకు చిక్కకుండా అస్సాం రాష్ట్రం వెళ్ళి భీం తలదాచుకున్నాడు. అక్కడే ఐదేళ్ళ పాటు పత్తి, కాఫీ, తేయాకు తోటల్లో కూలీపని చేస్తూ, కార్మిక ఉద్యమాలను చూశాడు.

చదవటం, రాయడం నేర్చుకుంటూ, తన మిత్రుడు కొమురం సూరు (అతని రహస్య వార్తహరుడు) ద్వారా పరిస్థితులను ఆకళింపు చేసుకొని తమ ప్రాంతం చేరుకున్నాడు. స్వాతంత్య్రం కోసం విశాఖ ప్రాంతంలో ‘అల్లూరి’ సాగించిన మన్యం పోరాటం, ఆదివాసుల స్వేచ్ఛకోసం ‘బిర్సాముండా’ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనపై భీం కదంతొక్కాడు. ఆనాడు నిజాం సర్కార్ పశువులు మేపడానికి, వంట చేసుకునేందుకు కట్టెలు తెచ్చుకోవడానికి ‘బంబ్‌రాం’, ‘దూపపెట్టి’ పేర్లతో శిస్తులు వసూలు చేసేది. దీనిని వ్యతిరేకించాలని, జాతిస్వేచ్ఛా, హక్కుల కోసం భీం చేసిన ప్రసంగాలకు ఆదివాసీ లు ఆకర్షితులయ్యారు. అసిఫాబాద్ పరిసర ప్రాంతాలల్లోని జోడేఘాట్, పట్నాపూర్, బాబేఝరి, టోకెన్నోవాడ, చాల్‌బడి, శివగూడ, పిట్టగూడ, లైన్‌పటల్ అనే 12 గ్రామాలు భూపోరాటానికి సిద్ధమయ్యాయి. గోండు, కోయ యువకుల తో భీం, ‘గెరిల్లా’ సైన్యం ఏర్పాటు చేశాడు. సాయుధ పోరాటమే శరణ్యమని గిరిజనులను సమీకరించి గెరిల్లా పోరాటంలో సుశిక్షితులను చేశాడు. జోడేఘాట్ గుట్టలను కేంద్రంగా చేసుకొని ‘గెరిల్లా యుద్దం’ ప్రారంభించాడు.

ఆ సంఘటనతో ఖంగుతిన్న నిజాం సర్కార్ ఆదివాసులపై దాడులు చేసి, సాధారణ గిరిజనులను సైతం జైల్లో పెట్టింది. అయినా భీం తన పోరాటంలో రాజీపడలేదు. ఇక పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన నిజాం సర్కార్ ఓ మెట్టు దిగివచ్చింది. మన్యం గిరిజన భూములకు పట్టాలిస్తామని ఆ12 గ్రామాలను మాత్రమే పరిపాలించుకోమని జిల్లా కలెక్టరుతో వర్తమానం పంపింది. కానీ గిరిజన ఆదివాసీలకు, గూడేలకు స్వయం వూపతిపత్తి కోసం కొమురంభీం డిమాండ్ చేశారు. సర్కార్ భీంషరతులను తిరస్కరించి, అతని స్థావరాలపై నిఘా పెంచింది. పోలీసు, సైనిక చర్యలకు చిక్కకుండా ఉన్న సమయంలో కుర్ధుప అనే నమ్మకవూదోహి సమాచారంతో భీం స్థావరాలను సైనికులు చుట్టుముట్టారు. చివరకు జోడేఘాట్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో కొమురంభీం అశ్వీయుజ శుద్ధపౌర్ణమి రోజున వీర మరణం పొందాడు. భీం మరణానంతరం నిజాం సర్కార్ ఆంత్రోపాలజిస్టు క్రిష్టఫర్ హైమాన్‌డార్ఫ్‌ను నియమించి గిరిజనుల జీవితాలపై అధ్యయనం జరిపింది.

హైమాన్ డార్ఫ్ ఆదివాసీ ప్రాంతాలపై అధ్యయనం చేసి ఓ నివేదికను నిజాంకు సమర్పించాడు. తదనంతరం ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల భూ ములకు పట్టాలివ్వాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఒక కుటుంబానికి 15 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఉట్నూరు తాలుకాలో 47వేల ఎకరాలు, తిర్యాని బ్లాక్‌లో 23వేల ఎకరాలు, మానిక్‌నగర్ బ్లాక్‌లో 30వేల ఎకరాలు ఇలా 1944-46 మధ్యకాలంలో 1,60,000 ఎకరాలు ఆదివాసులకు భూపట్టాలు ఇవ్వటం జరిగింది. ఈ ప్రాంతానికి గిరిజనేతరులు రాకుండా ఆదివాసుల భూముల అన్యాక్షికాంతం కాకుండా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖకు అనుబంధంగా సోషల్ సర్వీస్ శాఖను ఏర్పాటు చేసి దానికి అధిపతిగా హైమాన్ డార్ఫ్‌ను నియమించింది. 

కానీ..స్వాతంత్య్రం వచ్చిందన్న తర్వాత ఆదివాసుల బతుకులు మారకపోగా మరింత దుర్భరమయ్యాయి. నిజాం, బ్రిటిష్ పాలకుల ను తలదన్ని ఆదివాసులను అరిగోస పెడుతున్నారు. గిరిజనుల సంస్కృతి, ఆవాస రక్షణకు ఏర్పాటు చేసిన ప్య్రతేక చట్టాలను తుంగలో తొక్కే చర్యలు ఎక్కువయ్యా యి. దీంతో.. ఆదివాసులు తమపై సాగుతున్న దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా.., హక్కుల కోసం పోరాటం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. 1981 ఏప్రిల్ 20న తమ హక్కుల కోసం పోడు భూముల పట్టాల కోసం ఇంద్రవెల్లిలో సభను నిర్వహించుకుంటుంటే సభకు వచ్చిన గోండ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి ఆదివాసులను కాల్చిచంపింది. నాటి నుంచి నేటివర కు పాలకులు ఇదే అణచివేత విధానాన్ని అమలు చేస్తున్నారు. గోండు గూడెంల ను ఓపెన్‌కాస్ట్ పేరుతో విధ్వంసం చేస్తున్నారు. 300 మీటర్ల లోతు 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహించే గని వల్ల కనీసం 10 కిలోమీటర్ల పరిధిలోని భూగర్భ జలాలు అన్నీ గనుల్లోకి చేరుతాయి. దీంతో ఈ 10 కి.మీ. పరిధిలో సాగునీటి వనరులు విధ్వంసమై 10వేల ఎకరాల వ్యవసాయ భూమి బీడు బారింది.

వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్ గోండ్ పల్లెలు సీజనల్ వ్యాధులతో గోసరిల్లు తా యి. జిల్లాలో ఆదివాసీల శిశు మరణాల రేటు 6.3శాతం ఉన్నది. 12 నుంచి 14 శాతం వరకు ఉండవలసిన హివెూగ్లోబిన్ గోండ్ కోలమ్ తెగలలో చాలా తక్కువగా ఉన్నది.1998లో రెండువేల మంది ఆదివాసులు విష జ్వరాల బారినపడి మరణించారు. ఇలా ప్రతియేటా చిన్నపిల్లలు పిట్టల్ల రాలిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 200మంది ఆదివాసులు రోగాలబారినపడి మరణించారు. ఆదివాసీ మహిళల స్థితిగతులు అయితే ఇంకా దయనీయంగా ఉన్నాయి. 

శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరా టం మూలంగా 1970లో వచ్చిన 1/70 చట్టం ప్రకారం గిరిజనుల భూములు అన్యాక్షికాంతం అవడానికి వీలులేదు. కానీ..ఈ చట్టాన్ని తుంగలో తొక్కి,ఆదివాసు ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి భూములను గిరిజనేతరులు కాజేస్తున్నారు. గిర్‌గ్లాని కమిషన్ నివేదిక ప్రకారం 21,000 ఎకరాలు ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములు గిరిజనేతరుల చెరలో ఉన్నవి. ఇదిగాక ఉట్నూరులోని 21వేల ఎకరాలు అన్యాక్షికాంతమైనవని, ఆదివాసులు స్వంత భూముల్లోనే కాందిశీకులుగా మారారని ఈ నివేదిక పేర్కొన్నది.

గిరిజనుల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ నేటికి సక్రమంగా అటవీహక్కు పత్రాలు అందిన దాఖాలాలు లేవు. ఉమ్మడి అటవీ సముదాయక హక్కు అయితే ఎక్కడా అమలు కావడంలేదు. జన్నారం అటవీ వూపాంతంలోని కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల రక్షణ కేంద్రంగా కేటాయించాలని కుట్రలు పన్నుతున్నదీ ప్రభుత్వం. ఆదివాసులను వారి సంస్కృతి, సంప్రదాయాల నుంచి వేరుచేసి వారిని ఆకలిచావులకు బలిచేస్తున్నారు. గిరిజనులను అంతం చేయడానికి పూనుకుంటున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం ఆశయ సాధన జల్, జంగిల్, జమీన్, ‘మావనాటె మావరాజ్’(మాఊళ్ళో మా రాజ్యం) అనేది రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో పొందుపరచినా అమలు పరచటంలేదు. ఇకనైనా ప్రభుత్యం దీనిపై దృష్టి సారించి ఆదివాసుల విద్యా అభివృద్ధిపై ఉట్నూరు కేంద్రముగా కొమురంభీం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.

విష జ్వరాల నుంచి ఆదివాసీలను కాపాడటానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. యస్.సి, యస్.టి. అట్రాసిటీ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి షెడ్యూల్డు ఏరియాలో ఆదివాసులపై దోపిడీ దౌర్జన్యాలను అరికట్టాలి. అటవీ హక్కుల చట్టా న్ని అమలుచేసి హక్కు పత్రాలను అందించాలి. గిరిజన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. అదిలాబాద్ జిల్లాలో మెజారిటీగా ఆదివాసీలు నివసిస్తున్న ఆసిఫాబాద్, ఉట్నూర్‌లను ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలి. 

-మైపతి అరుణ్‌కుమార్
(అక్టోబర్ 29న కొమురం భీం72వ వర్ధంతి సందర్భంగా..

No comments:

Post a Comment