ప్రజలు ఓట్లకు అమ్ముడుపోతారు, ప్రజలు గొర్రెలు, ఎందుకూ పనికి రారు, బిర్యానీ, సారా ప్యాకెట్లు, నాలుగు పచ్చనోట్లు ఉంటే చాలు వీరంతా నా బలగమే, ఒక్కసారి ఎన్నికలైపోతే వారితో ఎన్ని ఆటలైనా ఆడొచ్చు... ఇలాంటి మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ తెలంగాణ ఉద్యమం చేయబట్టి ఈ మాటలను తెలంగాణ ప్రజలు తిరగరాస్తున్నారు. ఈ పవిత్ర భారతదేశంలో అక్రమాలకూ నిలయమైన రాజకీయ పార్టీల నిర్వాకంతో వేల, లక్షల కోట్ల రూపాయల స్కాములు తలెత్తాయి. 2జీ, బొగ్గు, ఇనుము, గుట్టలు, చెట్లు, పుట్టలు, మనుషులు... ఇక ముందు గాలి, నీరు ఏమైనా కావొచ్చు. ఆశ్చర్యపడవలసిన పనిలేదు. భారతదేశం భిన్న మతాల, కులాల సాంస్కృతిక సమ్మేళనం అయినా ఇక్కడి రాజకీయ పార్టీలు దేవుళ్ళని ఎన్నికల బరిలోకి దింపి ఓట్లు గెలుచుకుంటాయి.
ఇంకొందరు యజ్ఞాలు, యాగాల ద్వారా రాజకీయ నిర్ణయాలు సిద్ధిస్తాయని నమ్మిస్తారు. అదృష్టం, జాతకాలు, వాస్తు ఎలాగైనా ఉంటాయి అనుకోండి. ఒకవేళ అవి కూడా ఫలించకపోతే అండర్ గ్రౌండ్‌కి పోవచ్చు లేదా దూర ప్రాంతాలలో బస చేయొచ్చు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల పుణ్యమా అని కొద్దిమంది నాయకులు కటకటాల వెనుక ఉన్నారు. దానికి మన దగ్గర వేరే కారణాలున్నాయి. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదు. తెలంగాణ కోసం ప్రాణాలకి తెగించి కొట్లాడుతున్నా ఒక్క నాయకుడూ తగినంతగా స్పందించకపోవడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యం. సమ్మెలు, మార్చ్‌లు చేస్తే కేంద్రం కదిలొస్తుంది కానీ ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు లెక్కలేనన్ని 'లేఖలు' రాస్తారు. అవి ఎందుకు రాస్తారో, సోనియమ్మ ఎంత భయపడతుందనుకుంటారో తెలియదు.
తెలంగాణ మార్చ్ కవాతు చరిత్రను సృష్టించింది. పోలీసులను, ప్రభుత్వ కుట్రలను, రాజకీయ నాయకుల కుటిల పాత్రలను ఛేదించి ఒక గొప్ప ప్రజా ఉద్యమానికి నాంది పలికింది. ఎంతైనా అక్టోబర్ మాసం ప్రపంచ విప్లవాలకి కేరాఫ్ కదా! తెలంగాణ మార్చ్‌కి రానోళ్లు జీవితంలో ఒకగొప్ప అనుభూతిని చేజార్చుకున్నట్టే. ఎన్ని అడ్డంకులున్నా, పోలీసులు పహారాకాస్తున్నా, ఎంతో దూరంలో వేదిక పెట్టి, నడవడానికి అవస్థలు పడుతూ పోయినోళ్లకి కనీసం కూర్చునే జాగా కూడా చక్కగా లేదు.
కానీ తెలంగాణ మార్చ్ మాత్రం ఒక ప్రత్యేకమైనది. హైదరాబాద్‌లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో కూడా ఇన్ని వైవిధ్యాలు గల ప్రజలు కనబడరు. భిన్న కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, లెఫ్ట్‌లు, రైట్లు, ఫాస్ట్ ట్రాక్ పిల్లల దగ్గరి నుంచి మాస్ ట్రాక్ వరకు, సినిమా రంగం, నాటక రంగం, రచయితలు ఒక్కరేంది, ఇద్దరేంది, ప్రతి ఒక్క వెరైటీ కనిపించింది అక్కడ. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ ఉద్యమం రాకపోతే ఇన్ని రకాల మనుషుల కలయిక ఈ గ్లోబల్ యుగంలో సాధ్యమేనా అని.
అదొక జన ప్రవాహం, ప్రభంజనం. మొక్కవోని ధైర్యంతో కదం తొక్కుతున్న తెలంగాణ సైన్యం. చూడడానికి రెండు కళ్ళు చాల్తాయా? ఉండబట్టలేక సెల్‌ఫోన్ కెమెరాలు, వీడియో కెమెరాలలో ఎలాగైనా సరే ఆ అందమైన, ఉద్విగ్నమైన అనుభూతులు పట్టుకొని భద్రపరచుకోవాలి, పంచుకోవాలి అనే అందరి ఆశ. పోలీసుల కళ్ళు కప్పి స్టేజ్ వద్దకు చేరుకోవడం, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌ల ఉద్విగత్న కొనసాగినా ఉత్సాహంతో ఉరకలేసే పాటలు పాడుతూ జనాలు తెలంగాణ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జాక్ ఐక్య సంఘటన బూర్జువా రాజకీయాలలో ఒక కొత్త ఒరవడికి తెరలేపింది. నిజానికి తెలంగాణ ఉద్యమం ఏమిచ్చింది అని ఎవరైనా అడిగితే కొన్ని విషయాలలో గొప్ప జీవితానుభవాలను నేర్పింది.
1. ఈ మలి దశ ఉద్యమం రాజకీయ నాయకుల, పార్టీల నిజ స్వరూపాలను బట్టబయలు చేసింది. రాజకీయ పార్టీల రంగు, రుచి, వాసనా ఒక్కటే అని, ఏ పార్టీ జెండా, అజెండా చూసినా ప్రజలు కాక వారి వారి పార్టీల స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని సాక్ష్యాధారాలతో నిరూపించింది. పళ్ళు రాలగొట్టడానికి, కొట్టుకోవడానికి ఏ రాయి అయినా ఒక్కటే అని రాలగొట్టి మరీ చూపించింది. 2. గొర్రెలను బలిస్తారు, పులులను కాదు అని చెప్పిన బాబా సాహెబ్ అంబేద్కర్ మాటలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొని మేము గొర్రెలం కాదు అని గొంతెత్తి చెప్పడం నేర్చుకుంది తెలంగాణ. 3. వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణకు అడ్డెవ్వడు- అన్న మాటలు నినాదాలకు పరిమితం కాకుండా, తెలంగాణకు అడ్డు ఇక్కడి ప్రాంత నేతల వైఫల్యమే అని తెలుసుకున్నారు ఇక్కడి ప్రజలు. 4. ఉద్వేగ, ఉద్రేక, ఊకదంపుడు ఉపన్యాసాలు, రాజీలు, రాజీనామాలు ఇవేవి తెలంగాణ తేలేవని, ప్రజాస్వామిక పోరాటాల ద్వారానే సాధ్యం అని నమ్మి ఉద్యమ బాట పట్టారు.
5. ముఖ్యంగా రెండు ప్రాంతాలు అని మాట్లాడే వాళ్ళని, విడగొట్టి చెడగొడుతున్నారు అని కుళ్ళి కుళ్ళి ఏడ్చే వారిని చూసి తెలంగాణ జాలి పడుతుంది. రాష్ట్రం మూడు వైవిధ్యాలు, నేపథ్యాలు గల ప్రాంతం. అన్ని ప్రాంతాల సమస్యలు చూడడమే అందరి నాయకుల కర్తవ్యం మరి. ఒక ప్రాంతం మోసపోయి, అలసిపోయి, ఉద్యమకారులని పోగొట్టుకుని కన్నీరు మున్నీరై, ఆవేశంతో ఉద్యమబాట పడితే పట్టించుకోని వాడు దేనికి? ఇప్పటికీ తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడే ఉన్నాయని అధికారికంగానే చెబుతున్నారు. మరి ఇన్నేళ్ల కాపురంలో ఇంకా ఒక ప్రాంతం ఎందుకు వెనుకబడ్డది? దిగజారుడుతునాన్ని తెలంగాణ అర్థం చేసుకుంది. ఒక రాష్ట్రంలో రెండు ముక్కలైన పార్టీ ప్రతినిధులపై ఏ చర్య తీసుకోకుండా ఉన్న పార్టీ పెద్దల పైనా ఇక్కడి ప్రజలకు అసహ్యం వేస్తుంది. రెండు నాలుకలు, ప్రాంతాలు, కళ్లు అన్నవాళ్ళు రెండు ప్రాంతాలలో ఎందుకు ఉంటారు? ఒకే ప్రాంతాన్ని రెండు కళ్ళు పెట్టి, ఒక గుండె పెట్టి తెగ ప్రేమంచి ప్రపంచంలో ప్రసిద్ధి గాంచేటట్టు పరిపాలించొచ్చు కదా? 6. ఎవడు ఏమన్నా కానీ జై తెలంగాణ అనకపోతే బిడ్డ నీకు పుట్టగతులుండవ్ అని ఖరాఖండిగా చెప్పింది. అందుకే నై తెలంగాణ అన్నోళ్లు ఇక్కడ తిరగలేరు. 7. కులాల సమీకరణలు, ప్రాంతాల రాజకీయాలు తెలుసుకుని మరొక సమానత్వ పోరాటానికి సిద్ధమౌతున్నది తెలంగాణ. ఇంక అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు నడిపితేనే ఉద్యమం అన్న అపవాదు నుంచి బయటపడింది తెలంగాణ. ప్రజలు స్వచ్ఛందంగా ఒక ఐక్య సంఘటన ఆధారంగా ముందుకు నడుస్తున్నారు. ప్రజలు శాంతియుత ఉద్యమాలతో కూడా విపరీతమైన ఒత్తిడి తేగలరు అని నిరూపించింది.
2014 వరకు గుంజుతారు తెలంగాణని అని పెద్దమనుషులు అంటుంటారు. చాలా మంది ఎన్నికలు తేల్చేస్తాయి అని జాతకం చెప్తారు కూడా. ఇప్పుడు రాజీనామాలు చేయకుండా అప్పటిదాకా ఉంటే కదా మళ్లీ ఎన్నికలు. ఉద్యమానికి నిరంతరం కృషి చేసినోళ్లని, విద్యార్థులని, అమరవీరుల కుటుంబాలని, ఉద్యమకారులని నిలబెట్టి గెలిపిస్తాం కానీ మళ్లీ ఈ బేకార్ మొహాల్ని రానిస్తామా అని ప్రజలు ముక్త కంఠంతో అంటున్నారు. ఇక తేల్చుకొనేది నాయకులే. పాపం రేపు వారికి వాళ్ల పదవులు రావాలన్నా, మళ్లీ మోసం చేయడానికి లైసెన్స్ కావాలన్నా ఇప్పుడు తెలంగాణ విషయం తేల్చాల్సిందే. లేకపోతే మరొక వినూత్న పోరాటాన్ని చవిచూసి దిక్కుతోచని వారై ఉండిపోవాల్సి వస్తుంది.
- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 12/09/2012
No comments:
Post a Comment