Wednesday, October 10, 2012

తెలంగాణ జెఎసి ఎవరిది? - ప్రొఫెసర్ భంగ్యా భూక్యా



జరుగుతున్న పరిణామాలు చూస్తే అణగారిన కులాల నాయకత్వంలో తెలంగాణ వచ్చే సూచనలు కనబడడం లేదు. వస్తే రెడ్డి లేక వెలమ పాలక వర్గ నాయకత్వంలోనే వస్తుంది. అప్పుడు తెలంగాణతో పాటు నయా దొరలూ వస్తారు. మరి ఈ నయా దొరలను ఎదుర్కొనే శక్తి అణగారిన కులాలకు ఉందా! 

తెలంగాణ మార్చ్ ముగింపు సభలో తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలన్న జెఎసి చైర్మన్ కోదండరామి రెడ్డి డిమాండ్‌కు ప్రతిస్పందిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి 'జెఎసి ఎక్కువా? నేనెక్కువా? జెఎసి నాకంటే పెద్దనా? అయినా జెఎసిని సృష్టించిందే నేను' అని అసలు విషయాన్ని బయటపెట్టారు. దీనితో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సంశయంలో పడ్డారు. ఇన్ని రోజులు జెఎసిని తమ చమటోడ్చీ, రక్తం చిందించి నిర్మించుకున్నామని అనుకున్నారు. కానీ మంత్రి గారి ప్రకటనతో జెఎసి తమది కాదనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. జెఎసి నిర్మాణం జరిగిన రోజు నుంచే దానిపై ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తపరుస్తూ వచ్చారు. అయితే ఎట్లా అయినా తెలంగాణ సాధించాలన్న ఆకాంక్షతో ఈ అనుమానాలను దిగమింగుకొని ఉద్యమంతో ముందుకు సాగారు.

తెలంగాణ ఉద్యమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే జెఎసి నిర్మాణం రెడ్డి, వెలమ పాలకవర్గాల ఆధిపత్య పోరులో భాగంగానే జరిగిందని స్పష్టమౌతుంది. అసలు టిఆర్ఎస్ స్థాపనను కూడా ఈ వర్గాల ఆధిపత్య పోరులో భాగంగానే చూడాల్సి ఉంటుంది. రెడ్డి, వెలమ పాలక వర్గాలు నిజాం పాలనలో నిజాం రాజుల కళ్లు కప్పి ప్రజలపై ఆధిపత్యం చెలాయించి దోపిడీ చేయడంలో సమాన పాత్రనే పోషించారు. ఈ కులాలు దోపిడీ కులాలుగా తెలంగాణలో గుర్తించబడి ఉండటం వల్లనే, నిజాం పాలన అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం ఈ కులాలను పక్కకు నెట్టి, బ్రాహ్మణ పాలక వర్గాన్ని ముందుకు తీసుకువచ్చింది.

అనతి కాలంలోనే విశాలాంధ్ర ఉద్యమ పేరుతో తెలంగాణ రెడ్డి వర్గం మిలాఖతై ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, రెండు ప్రాంతాల్లో రెడ్లు, బ్రాహ్మణ పాలకవర్గాన్ని వెనక్కి నెట్టి తమ ఆధిపత్యాన్ని తిరిగి సాధించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రెడ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను బూచిగా చూపించి, 1969 తరువాత మరింత బలపడ్డారు. ఈ పరిణామాలు వెలమ పాలకవర్గానికి మింగుడుపడలేదు. తెలుగుదేశం పార్టీ రంగంలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు ఊతమిచ్చింది. 

ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ గ్రామాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న పటేల్, పట్వారీలను తొలగించటం, మండల వ్యవస్థను స్థాపించి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయటంతో ప్రజల్లో నూతన చైతన్యం వచ్చింది. ఇది రెడ్ల ఆధిపత్యాన్ని చాలా వరకు వెనక్కి నెట్టింది. అదను కోసం ఎదురుచూస్తున్న వెలమ వర్గం 1990 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో వచ్చిన ఉద్యమ రూపాలను తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ శక్తిగా ఎదగాలనే ప్రయత్నం చేసింది.

ఈ ప్రయత్నంలో భాగంగానే కె. చంద్రశేఖర్ రావు టి.ఆర్.ఎస్.ను స్థాపించటం, దాని చుట్టూ వెలమ రాజకీయాల్ని బలోపేతం చేసుకోవటం జరిగింది. కెసిఆర్ తన మాటకారి తనంతో వివిధ స్వాతంత్య్ర ఉద్యమ రూపాలను తన పార్టీలో కలుపుకొని, ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ, తెలంగాణ ఛాంపియన్‌గా ఎదిగారు. నాటకీయంగా జరిగిన ఆయన 11 రోజుల ఉపవాస దీక్ష, తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వం ప్రకటన, ఆయనను తెలంగాణలో తిరుగులేని నాయకుడిని చేసింది. ఈ పరిణామాల్ని గమనిస్తున్న రెడ్డి పాలకవర్గం కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పొరపాటున తెలంగాణ రాష్ట్రమే ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వాళ్ళను తొలిచేసింది. ఈ ప్రశ్న నుంచి పుట్టిందే టిజెఎసి అన్న విషయం మొన్నటి జానారెడ్డి ప్రకటనతో స్పష్టమౌతుంది.

ఢిల్లీలో ఉండే, రెడ్డి సామాజికుడైన పెద్ద మనిషి దీనికి సూత్రధారన్న విషయం బహిరంగ రహస్యమే. జానారెడ్డి, ఢిల్లీ పెద్ద మనిషి సూచనల మేరకే తెలంగాణలోని ఇతర రెడ్లను ఆర్గనైజ్ చేసి జెఎసి ఏర్పాటుచేసినట్లు రూఢీ అవుతుంది. చాలా తెలివిగా, ఎవరికీ అనుమానం రాకుండా మానవ హక్కుల ఉద్యమ చరిత్ర ఉన్న ప్రొ. కోదండరామి రెడ్డిని దీనికి చైర్మన్‌గా నియమించారు. అయితే రెడ్డి పాలకవర్గం కుట్రలు కోదండరామి రెడ్డికి తెలియదనుకుంటే పొరపాటే. కోదండరామి రెడ్డి వెలమల ఆధిపత్యంలో ఉన్న ఉద్యమాన్ని రెడ్ల ఆధిపత్యంలోకి తీసుకురావటంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

గత సంవత్సరం జరిగిన మిలియన్ మార్చ్‌లోనూ, మొన్నటి సాగర హారం మార్చ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయత్నంలో కోదండరామి రెడ్డి చాలా వరకు విజయం సాధించారనే చెప్పాలి.
ఈ చరిత్రనంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు అణగారిన కులాలు, జాతులు చొక్కాలు చింపుకొని మాది అనుకుంటున్న తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా పాలక కులాల ప్రయోజనాలు మిళితమై ఉన్నాయో అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఏ ఉద్యమమైనా ప్రజలే స్థాపించి మొదలు పెడతారు. కానీ అవి క్రమంగా ఆధిపత్య వర్గాల నాయకత్వంలోకి వెళ్ళిపోతుంటాయి. తెలంగాణ విషయంలో ఇదే ప్రస్తుతం జరుగుతున్నది. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకూ అన్నింటికీ అణగారిన ప్రజలే పునాదులేశారు. కానీ ఏ ఒక్క ఉద్యమంపై వారికి నాయకత్వం రాలేదు. నక్సలైట్ ఉద్యమంతో సహా.

ఒక విధంగా ఈ ఉద్యమాలు దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ ఉద్యమ రూపాలను మింగేస్తున్నాయి. 1990 నుంచి వచ్చిన ఉనికి ఉద్యమాలు తెలంగాణ సమస్యను జోడించి నిర్మించబడ్డాయి. ఈ ఉద్యమాల పునాదుల మీదనే చంద్రశేఖర్‌రావు టి.ఆర్.ఎస్.ను స్థాపించుకున్నారు. కెసిఆర్ రాజకీయాలను కొంత కాలంలోనే అవగతం చేసుకున్న సంఘాలు, ఉద్యమ రూపాలు, తెలంగాణ సమాంతర ఉద్యమాన్ని సాగించాయి. ఈ దశలోనే అణగారిన కులాలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నాన్ని ఆధిపత్య కులాలు కొద్ది కాలంలోనే అణచివేశాయి.

అయితే టిజెఎసి రూపంలో వచ్చిన తెలంగాణ ఉద్యమం ఈ ఉనికి ఉద్యమ రూపాలను పూర్తిగా మింగేసింది. ఈ జెఎసి కూర్పు చాలా విచిత్రంగా ఉంది. కుల, ప్రజా సంఘాలతో పాటు, రాజకీయ పార్టీలు కూడా దీనిలో సభ్యులు. రాజకీయ పార్టీలు వాటి వాటి అవసరాన్ని బట్టి దీనిలోకి రావటం, పోవటం జరిగింది. కుల, ప్రజా సంఘాలకు తెలంగాణ తప్ప మరో ఎజెండా లేదు కాబట్టి, జెఎసిని అంటిబెట్టుకొనే ఉన్నాయి. ఇవి జెఎసిలో సభ్యులే కానీ వాటికి ఎటువంటి నిర్ణయాధికారాలు లేవు. వీరందరూ వారి వారి సంఘాలకే నాయకులు. వీరందరికీ నాయకుడు కోదండరామి రెడ్డి. వీళ్ళంతా కోదండరామి రెడ్డి అగ్గిలో దూకమంటే దూకాలి. రైళ్ళ కింద దూకి చావమంటే చావాలి. టెలిఫోన్ టవర్‌లు ఎక్కి దూకమంటే దూకాలి.

తెలంగాణ అణగారిన కులాలు, జాతులు, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు వారు ఈ పరిస్థితికి నెట్టివేయబడ్డారు? తెలంగాణ ఉద్యమం పేరుతో అణగారిన కులాల వారు ఆస్తిని, ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. నాలుగు సంవత్సరాలుగా మన విద్యార్థులకు చదువులు లేవు, ప్రజల కనీస అవసరాలు తీర్చే నాయకుడు లేడు. మరి ఈ త్యాగాలు ఎందుకు? ఎవరి కోసం? రెడ్ల కోసమా! వెలమల కోసమా! జరుగుతున్న పరిణామాలు చూస్తే అణగారిన కులాల నాయకత్వంలో తెలంగాణ వచ్చే సూచనలు కనబడడం లేదు. వస్తే రెడ్డి లేక వెలమ పాలక వర్గ నాయకత్వంలోనే వస్తుంది. అప్పుడు తెలంగాణతో పాటు నయా దొరలు కూడా వస్తారు. మరి ఈ నయా దొరలను ఎదుర్కొనే శక్తి అణగారిన కులాలకు ఉందా! నయా దొరలు మైనింగ్ మాఫియాలుగా, సెజ్‌ల యజమానులుగా, పెట్టుబడిదారులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వస్తారు. జాగ్రత్త మరి!

- ప్రొ. భంగ్యా భుక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ
Andhra Jyothi News Paper Dated : 10/10/2012 

No comments:

Post a Comment