Wednesday, October 31, 2012

లక్షింపేట కుల -వర్గ సమస్యే - పాపని నాగరాజు



లక్షింపేటలో ఐదుగురు దళిత మాలల్ని తూర్పుకాపులు హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై రాష్ట్రంలో చాలా సీరియస్‌గా చర్చ జరుగుతుంది కూడా. లక్షింపేటలో మాలలు తూర్పు కాపుల కులదురహంకారానికి, దుర్మార్గానికి దాష్టీకానికి గురైనారు. ఈ కుల దుష్టలక్షణాల్ని అనుభవిస్తూనే ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ మిగులు భూములు దళితుల్లోని పేదలకు చెందాల్సిందేననే దృష్టితో మడ్డువలస ప్రాజెక్టు క్రింద ముంపునకు గురికాని భూమిని మాలలు సాగుచేసుకోవడం జరిగింది. 

అప్పటికే అనేక విధాలుగా తూర్పుకాపులు ఈ దళిత మాలల్ని కుల వివక్ష, దాడులు, దూషణలు చేసినా ఆ భూముల్ని మాలలు వదలకపోవడంతో ఈ హత్యాకాండకు పాల్పడ్డారన్నది స్పష్టం. అయితే ఈ అంశంపై వివిధ ప్రజా ఉద్యమ, విప్లవ శక్తులు వాస్తవాల్ని కప్పిపుచ్చి, శాస్త్రీయంగా విశ్లేషించకపోవడం జరుగుతోంది. దళితులపై దాడులు, వెలివేతలు, వివక్ష, అత్యాచారాలకు మూలం వారికి భూమిలేక పోవడమేనని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో దళిత బహుజనులు ముఖ్యంగా దళిత ప్రజలు ఆర్థికంగా మంచి స్థితిలో ఉండి కూడా అగ్రకుల దురహంకారానికి గురైన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. 

తాగునీరు కావాలన్నందుకు, పెళ్లి ఊరేగింపులు నిర్వహించినందుకు, ఓట్లు వేసినందుకు, అగ్రకులాల వారితో సమానంగా సినిమాలు చూసినందుకు, అగ్రకులాల వారి ఇళ్ల ముందు నుంచి గ్రామ చావిడి మీదుగా వెళ్లినందుకు పెత్తందారుల దాష్టీకానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భూమి కావాలన్నందుకు కాదు ఆత్మ గౌరవం కావాలని అన్నందుకు జరిగినవి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నత స్థానాలలో ఉన్న దళితులూ వివక్షకు గురవుతున్న వారే. లక్షింపేటలో దళిత మాలలు స్వయం గౌరవ సమన్యాయం ప్రాతిపదికన భూమి కావాలని దున్నుకోవడంతోనే హత్యాకాండ జరిగింది. ఒక్క మాటలో కులం-వర్గం జమిలియై మాలల్ని హత్య చేసింది. 

ఈ దాడి కుల-వర్గ దృక్కోణంలో జరిగిందనడానికి కులానికి వర్గానికి ఉన్న సంబంధ విషయాల్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. కులం-వర్గం ఒకటి కాకపోయినా అవి ప్రత్యేక అస్తిత్వాలను కలిగిఉంటూ రెండు పోగుల ట్వైన్ దారంలాగా కలగల్సి ఉన్నాయి. వర్గ ఉత్పత్తి సంబంధాలు ఇండియాలో నిచ్చెన మెట్ల కుల వర్గ ఉత్పత్తి సంబంధాలుగా విడగొట్టబడి ఉన్నాయి. కనుక నిచ్చెన మెట్ల కుల అసమానతల స్వయం పోషక గ్రామ వ్యవస్థే మన దేశంలో కుల భూస్వామ్య వ్యవస్థకు పునాదైంది. బ్రిటిష్ వారు ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశపెట్టిన సెటిల్‌మెంట్ విధానంలో కులాల్లో వర్గాలేర్పడి కుల-వర్గ ద్విముఖ వ్యవస్థ మొట్టమొదట ఆవిర్భవించింది. 

ఇక్కడే భూమి అగ్రకులాల ఉమ్మడి ఆస్తిగా కొనసాగడంతో బడుగు వర్గాల ప్రజలు ఊరుమ్మడి సేవకులుగా, బానిసలుగా, వ్యవసాయకూలీలుగా మార్చ బడ్డారు. మన దేశంలో బ్రాహ్మణీయ అగ్రకుల పాలక వర్గాలు వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర సకల సామాజిక రంగాలలో అవలంభించిన విధానాలన్నీ కూడా బ్రాహ్మణీయ కుల స్వభావాన్ని ఆధారం చేసుకొని అమలు పర్చ బడ్డాయి. వ్యవసాయ క్షేత్రాల్లో నూతన సాంకేతిక విధానాల అమలుతో అధిక దిగుబడి సాధించడం ప్రారంభమైన తర్వాత చిన్న సన్నకారు రైతాంగం ఈ అగ్రకుల బడా ఉన్నత వర్గాలలో పోటీపడలేక వ్యవసాయకూలీలుగా మార్చబడ్డారు. 

ఇలా లాభపడిన భూస్వాములు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతాంగంలోని పై అంతస్తులోని శూద్ర అగ్రకులాల వారే. భూమిలేని వారెవరూ అంటే దళిత బహుజన శ్రామిక ప్రజలే. దళిత ప్రజలే. ఈ అన్ని విషయాల్ని సామాజికవేత్తలైన ఫూలే, అంబేద్కర్‌లు, చరిత్రకారులు, వీరన్నలు ప్రకటించారు. మన రాష్ట్రంలో బ్రాహ్మణ, శూద్ర అగ్రకులాలైన కర్నాలు, కమ్మరెడ్డి, వెలమలు చారిత్రకంగా ఈ కుల-వర్గ వ్యవస్థలో లాభపడిన వాళ్లలో ఉన్నారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితంగా లేకపోయినా ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, కళింగులు ఉన్నారు. వీరే ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని దళితులపై, బీసీలపై, బీసీల్లోని మైనార్టీ బీసీలపై, ఆదివాసీ గిరిజనులపై దాడులు, శిరోముండనలు, అత్యాచారాలు, కుల, గ్రామ సామూహిక బహిష్కరణలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే లక్షింపేటలో దళితులు స్వయం గౌరవ సమన్యాయంతోనే మాకు కూడా భూమి కావాలని అన్నందుకు ఈ హత్యాకాండను సృష్టించారు. ఒక్కమాటలో అగ్రకులాలుగా చెలామణి అవుతున్న తూర్పుకాపులు ఆధిపత్య, అహంకారంతోనే భూమిపై తమకు కూడా హక్కు ఉండాలని రాజ్యం అండదండలతో మారణహోమంకు పాల్పడుతున్నారు. అందుకే లక్షింపేట సంఘటనకు ద్వీముఖ కుల-వర్గ స్వభావం ఉంది. లక్షింపేట సంఘటనను వివిధ విప్లవ, ప్రజా ఉద్యమశక్తులు లక్షింపేటలో కులేతర భూ(వర్గపోరాట) సాధన పోరాటంలోనే దళిత సమస్యకు, కులసమస్యకు, స్పృశ్య-అస్పృశ్య, గ్రామ, కులవెలివేతలకు పరిష్కారం జరుగుతుందని ప్రకటిస్తున్నారు. 

అలా ప్రకటించడంలోనే బ్రాహ్మణీయ అగ్రకులతత్వాన్ని మరుగునపర్చడం అవుతుంది. వీరిసంస్థల్లో నేటికీ బ్రాహ్మణీయ అగ్రకులతత్వం ఇంకా కొనసాగుతుందని స్పష్టమైపోతుంది. పైగా ఈ శక్తులు సామాజిక (కుల) ప్రజాస్వామ్య పోరాటాలు కులతత్వాన్ని పెంచుతున్నవని నీలాపనిందల్ని వేస్తున్నారు. మరొకరేమో ఈ సమాజంలో కులం-వర్గం పునాదిగా ఉన్నవని ప్రకటిస్తూనే వర్గ విప్లవ పోరాటం విజయవంతంతో ఉపరితలమైన కులాన్ని అంతంచేయొచ్చని ప్రకటిస్తున్నారు. 

వాస్తవానికి వీరు బైటికి కులం పునాదంటూనే అంతర్గతంగా కులం ఉపరితలంగానే చూస్తున్నారు. మార్పుపేర 1987లో మద్రాస్‌లో ప్రకటించిన అవగాహననే నేటికీ కొనసాగిస్తున్నారని అర్థమవుతుంది. కొత్తసీసాలో పాత సారా లాంటిదే. కులం ప్రాతిపదికన స్వయంగౌరవంతో జరిగే సామాజిక న్యాయ పోరాటంతో దళిత బహుజనుల్లో బూర్జువాలు పుట్టుకొస్తారని ఈ దళిత బూర్జువాలు దళితమాలల పక్షాన ఉండరని లక్షింపేట రుజువుచేసిందని ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సామాజిక పోరాటాలు వర్గపోరాటానికి అడ్డంకిగా మారుతుందని అపవాదును అంటగట్టారు. 

నిజానికి కుల-వర్గ వ్యవస్థలు అస్పృశ్యతకి మూలం కులవ్యవస్థ. కులవ్యవస్థకు మూలం మతం(వర్ణాశ్రమ) సనాతన ధర్మం. వర్ణాశ్రమ ధర్మానికి మూలం బ్రాహ్మణీయ హిందూమతం. బ్రాహ్మణీయ హిందూమతానికి మూలం రాజ్యాధికారం. ఈ బ్రాహ్మరహస్య వ్యూహానికి బ్రాహ్మణిజం దోపిడీ వర్గ రాజ్యాధికారానికి పరిరక్షించేదిగా ఉంది కనుక బ్రాహ్మణీయ పద్మవ్యూహమైన విడగొట్టి పాలించే దానికి ప్రతివ్యూహమైన కూడగట్టి పాలించే దళితబహుజన 'ఐక్యత' పాలసీతో దళితులతో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆదివాసీ గిరిజనులు ఐక్యసంఘటన కట్టాలి. లేదా దళితులు బీసీతో, ఎస్టీతో, మైనార్టీతో, ఆదివాసీ గిరిజనులతో ఐక్యసంఘటన కట్టాలి. 

ఈ ఐక్యసంఘటన వేలసంవత్సరాలుగా విద్య, ఉద్యోగ, వైద్యం, రాజ్యాధికారానికి నోచుకోని ఈ బడుగులు స్వయంగౌరవ, సామాజికన్యాయం ప్రాతిపదికన రాజ్యాధికారాన్ని కైవసంచేసుకొని కుల-వర్గ వ్యవస్థల నిర్మూలన పోరాటంగా మలచవచ్చు. ఈ క్రమంలో అణగారిన కులాల్లో బూర్జువావర్గం వర్గరీత్యా ఉన్నత వర్గంగా ఉంది కనుక వారికి కుల రీత్యా అవమానాలకు గురౌతున్న మేరకు మనతో కలిసివచ్చే స్థాయి వరకు కులపుకోవాల్సి ఉంటుంది. 

అలా రానియెడల వారికి వారే బడుగు వర్గాల శత్రువులవుతారు. కనుక విప్లవ శక్తులు ఈ జమిలి పోరాటాల్ని చేపట్టకుండా ఏక వర్గ విప్లవం పేరిట, కుల-వర్గ నిర్మూలన లక్ష్యం గల కుల విప్లవ పోరాటాల్ని ఫూలే, అంబేద్కర్‌ల కులనిర్మూలన అంశాల్ని విమర్శనాత్మకంగా స్వీకరించకుండా దాటేయడం కులతత్వమే అవుతుంది. బడుగువర్గాల్ని నేటికీ కులవ్యతిరేకత పేరుతో మభ్యపెట్టి దగాచేయడమే అవుతుంది. ఇలా నూతన తరహా అవగాహనను స్వీకరించకుండా ఉంటే లక్షింపేటలు అనేకంగా జరిగే అవకాశం ఉంది. 

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ

Andhra Jyothi Telugu News Paper Dated : 1/11/2012 

No comments:

Post a Comment