Wednesday, October 31, 2012

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలు ఆర్‌ అరుణ్‌ కుమార్‌


   Wed, 31 Oct 2012, IST  

  • గత పది సంవత్సరాల్లో ఆసియాలోని దేశాలు సాధించిన వృద్ధి రేటులో సగం శాతం మాత్రమే లాటిన్‌ అమెరికా దేశాలు సాధించినప్పటికీ ఆ దేశాల్లో పేదరికం 30 శాతం తగ్గింది. ఆదాయ పంపిణీ మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికాలో ప్రగతిశీల ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరాదరణకు గురవుతున్న వర్గాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలపై ఎకానమిస్ట్‌ పత్రిక ఇటీవల ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచం రోజురోజుకూ అసమానంగా మారుతోందని ఇన్ని రోజులుగా మనం చెబుతున్న విషయానికి ఇది అనుగుణంగానే ఉంది. 'అనేక దేశాల్లో ఆదాయ అసమానతలు పెరిగాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది 1980 తరువాత ఆదాయ అసమానతలు పెరిగిన దేశాల్లో నివసిస్తున్నారు. ఆ దేశాల్లో అనేక సందర్భాల్లో ఈ అసమానతలు తీవ్ర ఆందోళన రేకెత్తించే స్థాయికి చేరుకున్నాయి' అని ఆ నివేదిక తెలిపింది. ఫలితాలపై ఆందోళన వ్యకం చేసిన నివేదిక ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ఆటంకం రాకుండా ఈ అసమానతలను తగ్గించే మార్గాలతో ముందుకొచ్చేందుకు 'ఆధునిక రాజకీయాలకు' పిలుపునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సర్వే చేసిన వివరాలతో ఈ నివేదికను రూపొందించింది. 'బ్రిటన్‌, కెనడా, చైనా, భారత్‌ వంటి దేశాలతోపాటు స్వీడన్‌లో అగ్ర స్థానంలో ఉన్న ఒక్క శాతం ప్రజల ఆదాయాలు పెరిగాయి. సంపన్నుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఫోర్బ్స్‌ పత్రిక ప్రచురించిన జాబితా ప్రకారం అమెరికాలో 421 మంది, రష్యాలో 96 మంది, చైనాలో 95 మంది, భారత్‌లో 48 మంది శత కోటీశ్వరులున్నారు. మెక్సికోకు చెందిన కార్లోస్‌ స్లిమ్‌ 6,900 కోట్ల డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే అత్యంత ధనికునిగా నిలిచాడు.
పెరుగుతున్న అసమానతల చరిత్రను ఎకానమిస్ట్‌ పత్రిక వివరిస్తూ, 'పారిశ్రామిక విప్లవానికి పూర్వం దేశాల సంపదల మధ్య అంతరాలు సాధారణ స్థాయిలో మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో పది సంపన్న దేశాల్లో తలసరి ఆదాయం పది నిరుపేద దేశాల్లోని ప్రజల తలసరి ఆదాయం కంటే ఆరు రెట్లు మాత్రమే అధికంగా ఉంది. పారిశ్రామిక విప్లవం దేశాల మధ్యనే కాకుండా, దేశాలలోని ప్రజల మధ్య అంతరాలను కూడా పెంచింది. పశ్చిమ ఐరోపా, అమెరికాలో ఆదాయాలు గణనీయంగా పెరగ్గా, ఈ దేశాలు, ఇతర దేశాల మధ్య తేడాలు కూడా పెరిగాయి. అలాగే అంతర్గతంగా ఆదాయాల్లో వ్యత్యాసాలు కూడా పెరిగాయి'.
వర్తమాన పరిస్థితులపై వివరిస్తూ, '1980 నుంచి ప్రపంచ ఆర్థికవ్యవస్థలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, నియంత్రణల ఎత్తివేత, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విప్లవం, సంబంధిత వర్తకం, పెట్టుబడుల ప్రవా హాలు, ప్రపంచ సరఫరా సంబంధాలు దేశాల ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించాయి. అయితే, అదే సమయంలో దేశాల్లో అంతర్గతంగా ప్రజల ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని పెంచాయి'. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిణామానికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది. 'ఈ సాధారణ ధోరణికి లాటిన్‌ అమెరికాలో నెలకొన్న పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచంలో దీర్ఘకాలంగా అత్యంత అసమానమైందిగా పేరుగాంచిన ఈ ఖండంలో గత పదేళ్లుగా గినీ కోఎఫీషియంట్స్‌ భారీగా పతనమయ్యాయి'.
అసమానత్వ సమస్యను సత్వరం పరిష్కరించాల్సిన అవసరాన్ని ఉద్బోధిస్తూ ఐఎంఎఫ్‌, ఎడిబి, ప్రతి సంవత్సరంలో లావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక గురించి ఎకానమిస్ట్‌ ప్రస్తావించింది. అసమానత్వం వృద్ధికి అవరోధంగా నిలుస్తుందని, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుందని, డిమాండ్‌ను తగ్గిస్తుందని ఐఎంఎఫ్‌లో ఆర్థికవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ద్రవ్య అస్తవ్యస్థ పరిస్థితులతోపాటు రానున్న దశాబ్దం ఎదుర్కోనున్న అత్యంత తీవ్రమైన సమస్య అసమానత్వమని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక కోసం నిర్వహించిన సర్వే హెచ్చరించింది. ఈ ప్రపంచం రోజురోజుకూ అసమానంగా మారిపోతోందని, ఆ ఆసమానతలు, అవి చూపే ప్రభావాలు అత్యంత ప్రమాదకరమైనవనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది'.
ప్రపంచాన్ని నేడు పట్టిపీడిస్తున్న సమస్యను ఆ కథనం సమగ్రంగా అధ్యయనం చేసినట్లు పైన పేర్కొన్న వివరాల బట్టి స్పష్టమవుతోంది. అధ్యయన నివేదిక కూడా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేదిగా ఉంది. పెరుగుతున్న అసమానతలు డిమాండ్‌ తగ్గిపోవడానికి దోహదం చేస్తాయని కూడా అది గుర్తించింది. మెజారిటీ ప్రజల కొనుగోలు శక్తి దెబ్బ తినడం ఇందుకు కారణం. ఉత్పత్తి చేసిన వస్తువులను ఎవరూ కొనుగోలు చేయకపోతే సంక్షోభం తలెత్తుతుంది. అసమానతలు తగ్గించడంలో కార్మిక సంఘాలు నిర్వహించే చారిత్రాత్మక పాత్రను ఈ కథనం వివరించింది. పారిశ్రామిక కార్మికుల సంఖ్య పెరగడం ఆదాయాల పునఃపంపిణీపై రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. కమ్యూనిజం అత్యంత నాటకీయమైన ఫలితమని పేర్కొంది. అయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో కూడా తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. కార్మిక సంఘాల ఏర్పాటు, సోషలిస్టు పార్టీల ఆవిర్భావానికి ప్రతిస్పందనగా అట్లాంటిక్‌కు ఇరువైపులా ఉన్న రాజకీయ నాయకులు పురోగామి పన్నులను విధించారు, ప్రభుత్వ నియంత్రణ ప్రవేశపెట్టారు. సామాజిక భద్రత కల్పించారు. అనేక దేశాల్లో ఆదాయంలో ఉన్నతస్థాయి ఒక శాతం వాటా 1920 దశకం నుంచి 1970 దశకం వరకూ క్రమంగా తగ్గుతూవచ్చింది. అమెరికాలో 1930,1940 దశకాల్లో అసమానతలు వేగంగా తగ్గాయి. రెండవ ప్రపంచయుద్ధం తరువాత యూరప్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో గినీ కోఎఫీషియంట్‌ 1970 దశకం మధ్యలో అత్యల్ప స్థాయి 0.3 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో స్వీడన్‌లో ఇది 0.2 శాతానికి తగ్గింది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 1970 దశకంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు 1920 దశకంలో ఉన్న అంతరాల కంటే తక్కువగా ఉన్నాయి. 1970 దశకం నాటికి పది అగ్రస్థాయి ధనిక దేశాల్లో తలసరి ఆదాయం 10 పేద దేశాల్లో తలసరి ఆదాయం కంటే సుమారు 40 రెట్లు అధికంగా ఉంది.
ఈ సరళికి లాటిన్‌ అమెరికా అడ్డుకట్ట
అసమానతలు తగ్గించడంలో ప్రభుత్వాలు, ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో ప్రభుత్వాలు నిర్వహించిన పాత్రను ప్రస్తావిస్తూ, 'తక్కువ ఆదాయాలు గల ప్రజల వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించేందుకు సామాజిక వ్యయ పథకాలను లాటిన్‌ అమెరికాలోని దేశాలు అమలుచేశాయి. మరింత ఉదారంగా పింఛన్ల మంజూరు, షరతులతో కూడిన నగదు బదిలీ పథకాల వంటి వాటిని అత్యంత నిరుపేద కుటుంబాలకు అమలుచేశాయి. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆ కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలకు పంపాలనే నిబంధనను విధించినట్లు ఆ పత్రిక కథనం వివరించింది. అర్జెంటీనా నుంచి బొలీవియా వరకూ గల దేశాలు కార్మికులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని పింఛను పథకాలను ప్రవేశపెట్టాయి. వృద్ధులకు ఊతం ఇస్తానని ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా ప్రకటించాయి. లాటిన్‌ అమెరికా ఖండం అంతటా కనీస వేతనాలను పెంచారు. బ్రెజిల్‌ ఈ వేతనాలను 2003 నుంచి 50 శాతానికి పైగా పెంచింది. పింఛను పథకాన్ని కనీస వేతనాలతో ముడిపెట్టడంతో రెండు అంశాలు పరస్పరం ఒకదానికొకటి అనుబంధంగా మారాయి. ఈ చర్యలు అసమానతలను ఎలా తగ్గించాయనే విషయంపై ప్రపంచబ్యాంకుకు చెందిన లస్టిగ్‌, లూయిస్‌ లోపెజ్‌-కాల్వా, యుఎన్‌డిపికి చెందిన ఎడ్వర్డో ఆరిట్జ్‌-జువారెజ్‌ విశ్లేషించారు. వేతనాల మధ్య వ్యత్యాసాలను తగ్గించడం ఈ ఖండం మొత్తంలో అసమాతలు తగ్గడానికి దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు.
గత దశాబ్దంలో పేద ప్రజల ఆదాయాలు పెరిగాయి. అందువల్ల అసమానత్వం గణనీయంగా తగ్గింది. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో గినీ కోఎఫీషియంట్‌ 2000 సంవత్సరంలో కంటే 2010లో తక్కువగా ఉంది. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి తగ్గింది. గత పది సంవత్సరాల్లో ఆసియాలోని దేశాలు సాధించిన వృద్ధి రేటులో సగం శాతం మాత్రమే లాటిన్‌ అమెరికా దేశాలు సాధించినప్పటికీ ఆ దేశాల్లో పేదరికం 30 శాతం తగ్గింది. ఆదాయ పంపిణీ మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికాలో ప్రగతిశీల ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరాదరణకు గురవుతున్న వర్గాలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందాయి. అయితే పత్రికా కథనం ఛావెజ్‌ (వెనెజులా), మొరేల్స్‌ (బొలీవియా), కొర్రియా (ఈక్వెడార్‌), రౌసెఫ్‌ (బ్రెజిల్‌), తదితరులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కల్పించలేదు. అమెరికాలో అమలు జరుగుతున్న విధానాలను సమీక్షించింది. లాటిన్‌ అమెరికా దేశాలు తమ జిడిపిలో అత్యధిక వాటాను విద్యారంగంపై కేటాయిస్తున్నాయని కూడా కథనం వివరించింది. ముఖ్యంగా నిరుపేదలకు విద్యావసతులు కల్పించడంలో అమెరికా కంటే అత్యధిక మొత్తాన్ని ఈ దేశాలు ఖర్చుచేస్తున్నాయి.
అమెరికాలో వరుసగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న సంక్షేమ చర్యల గురించి ఆ కథనం విశ్లేషిస్తూ, సామాజిక సంక్షేమం కోసం అమెరికాలో పెడుతున్న ఖర్చు సంపన్నుల కోసం చేస్తున్న ఖర్చు కంటే ఎప్పుడూ తక్కువగానే ఉంది. సంపన్నులకు గృహ నిర్మాణానికిస్తున్న సబ్సిడీలు నిరుపేదలకు ఇస్తున్న సబ్సిడీల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
వాస్తవ ఫలితాలు
అమెరికాలో సంపన్నులైన ఒక్క శాతం ప్రజలు జాతీయాదాయంలో అనుభవిస్తున్న వాటా 1980 తరువాత రెట్టింపైంది. ఇది పది శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. 2.4 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం గల కుటుంబాలు నాలుగు రెట్లు పెరిగాయి. మొత్తం ప్రజల్లో వీరి సంఖ్య ఒకటి నుంచి ఐదు శాతానికి పెరిగింది. ధనికులు, అత్యధిక ధనవంతుల ఆదాయాలు గత 30 సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. స్థాయి పెరిగిన కొద్దీ వారి ఆదాయం కూడా పెరిగింది. ఫలితంగా ధనికులు, పేదల మధ్య అంతరాలు మరింతగా పెరిగాయి. ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా ఈ అంతరాలు పెరిగాయి. 1979-2007 మధ్య కాలంలో పన్నులు, బదిలీల తరువాత సమాజంలో ఒక శాతంగా గల ఈ వర్గాల నిజ ఆదాయం 300 శాతం పెరిగింది. అయితే అట్టడుగు స్థాయిలో ఉన్న వారి ఆదాయం కేవలం 40 శాతం మాత్రమే పెరిగింది. మధ్య తరగతి జనాభారీత్యానూ, భౌగోళికంగానూ తగ్గిపోయింది. జాతీయ సగటు ఆదాయంలో 20 శాతం ఆదాయం గల కుటుంబాల సంఖ్య 40 శాతం ఉంది. 1970 దశకంలో వీరి సంఖ్య 70 శాతం ఉండేది. 1970 దశకంలో ప్రారంభించిన నయా ఉదారవాద విధానాల ఫలితాలు ఇవి. ఇటీవల చోటుచేసుకున్న ఆర్థికమాంద్యం అమెరికాలో ధనికుల ప్రయోజనాలకు అంతగా హాని చేయలేదని కూడా ఎకానమిస్ట్‌ పత్రిక కథనం విశ్లేషించింది. మాంద్యం అనంతరం కోలుకున్న తరువాత కలిగిన ప్రయోజనాల్లో దాదాపు 90 శాతం ధనికుల పరమైనట్లు తెలిపింది.
అమెరికా ప్రభుత్వాలు నగంగా ప్రదర్శిస్తున్న వర్గ పక్షపాతాన్ని పరిశీలకులు ప్రత్యక్షంగా ఎత్తి చూపారు. అమెరికాలో పెరుగుతున్న అసమానతలకు రాజకీయ మూలాలున్నట్లు వారు విశ్లేషించారు. సంపన్నులు రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తూ దాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు నిర్ధారించారు. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల మొత్తంలో 80 శాతం దాదాపు రెండు వందల మంది దాతల నుంచే వస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. వర్గ శక్తుల పొందికలో మార్పులు లేకుండానే ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాలకవర్గాలు చేసిన పోరాటానికి ఎకానమిస్ట్‌ పత్రిక కథనం ఒక సూచిక. అసమానతలను తగ్గించడానికి చేసిన కృషిలో కూడా ఈ వర్గ పొందికల ప్రభావం కనిపిస్తుంది. పేదల పట్ల ఏమాత్రం కనికరం, ఆందోళన వ్యక్తం చేయకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడే ధ్యేయంతోనే ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకున్నాయనేది సుస్పష్టం. ఏ సంస్కరణలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడజాలవు. 
-ఆర్‌ అరుణ్‌ కుమార్‌
Prajashakti Telugu News Paper Dated : 31/10/2012

No comments:

Post a Comment