ఉస్మానియా క్యాచ్‌మెంట్ కింది విద్యార్థులలో చాలా క్రియేటివిటీ ఉంది. అది ఉద్యమాలు నడపడంలో కనబడింది. కానీ కొత్త జ్ఞాన సృష్టివైపు దాన్ని మరల్చలేదు... ముందు, ముందు ఉస్మానియాలో పుట్టి పెరిగే మేధావులు ప్రపంచ మార్పుకే కొత్త మార్పులు వెయ్యవచ్చు. ఏ మేధావి కూడా జ్ఞానానికుండే అంతిమ ప్రక్రియ గురించి చెప్పలేరు. జ్ఞానం ఎప్పుడు అంతం కాదు. జ్ఞానపు ప్రతి మెట్టుకూ అది ఆరంభాన్ని వెతుక్కుంటుంది. ఉస్మానియా నువ్వు నాకిచ్చిన నిండు అవకాశాలకు కృతజ్ఞతలతో, నువ్వెంతో మంది మేధావుల్ని కంటావనే ఆశతో పొయ్యొస్తా..
ఉస్మానియా! ఇక పొయ్యొస్తా
నీ ఒడిలోకి నేన్నొచ్చిన్నాడు,
కట్టు గుడ్డ ల్లేవు కాళ్ళకు చెప్పుల్లేవు
ఇప్పుడు ఒంటినిండా కోటు
కాలినిండా బూటుతో పొయ్యొస్తా
నేనొచ్చిన్నాడు కడుపుకు తిండిలేదు,
మెదడుకు మేత లేదు.
ఇప్పుడు కడుపు నిండా తిండి
మెదడుకు బోలెడు మేతతో పొయ్యొస్తా
నేనొచ్చినప్పటికి నీ కడుపులో పుట్టిన బెస్ట్ బ్రెయిన్ చంపబడ్డది
జార్జి రెడ్డి బతికుంటే
ఫిజిక్స్‌లో నీకో నోబెల్ ప్రైజొచ్చేది
అందించడం నా కసాధ్యం
కాని నా కలం కనిపెట్టిన
ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం
అనంతలోకాల్ని మార్చుతూంది
జార్జిని చంపిన ఆధ్యాత్మిక ఫాసిజాన్ని
ఈ గడ్డ మీద బొందపెట్టి పోతున్నా.
ఈ యూనివర్సిటీలో నేనడుగుపెట్టినప్పుడు జార్జి రెడ్డి బ్రెయిన్ పవర్ గురించి కథలు కథలుగా చెప్పేవాళ్ళు. ఆడపిల్లలను అవమానపర్చే దుండగులను నకల్ డస్టర్లతో బాది, బాది మరుక్షణమే సెల్లార్ లైబ్రరీలో పిచ్చి పిచ్చిగా ఫిజిక్స్ చదివే వాడన్న కథలెన్నో ఉండేవి. జార్జిరెడ్డి నక్సలైట్‌కాడు, సోషలిస్టు భావాలు ఉన్న యువకుడు. ఫిజిక్స్‌లో పిహెచ్.డి చేస్తున్న విద్యార్థి. ఆయన హత్య జరిగిన కొద్ది రోజులకే రాడికల్ విద్యార్థిశక్తులు అక్కడ బాగా పెరిగాయి. 'స్టడీ అండ్ స్ట్రగుల్' నినాదంతో గ్రామాలనుంచి వచ్చిన విద్యార్థులను బాగా ఆకర్షించాయి. చుట్టూ ఫ్యూడలిజం తాండవం ఆడుతున్న రోజుల్లో అంటే 1974 నాటికి నిజాం పాలన నుంచి విడిపోయి విశాలాంధ్రలో కలిసిన తెలంగాణలో ఇది ఏకైక యూనివర్సిటీ.
దాన్ని 1918లో ఉస్మాన్ అలీఖాన్ ఏర్పరిచాక సుదీర్ఘకాలం సీరియస్ చదువు అందులో ఎప్పుడూ సాగలేదు. స్వాతంత్య్ర పోరాటం, రజాకార్ల బెడద, కమ్యూనిస్టు విప్లవం, విలీనమైన మరుసటి రోజు నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1969నుంచి దాని ఉధృత రూపం, నక్సల్‌బరీ పోరాటం, మళ్ళీ తెలంగాణ పోరాటం ఒకటి తరువాత ఒకటిదాని చుట్టే ఉన్నాయి. అసలు యూనివర్సిటీ లక్ష్యం విద్యార్థులను నిత్యం వీధి పోరాటాల్లో ఉంచడం గాదు. విద్యార్థులను గంట, గంట, రోజు, రోజు నెలలు, నెలలు క్లాసు రూముల్లో, లైబ్రరీల్లో, లాబొరేటరీల్లో చదివించి విజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప సాహిత్య కారులను తయారు చెయ్యడం యూరివర్సిటీ అసలు కర్తవ్యం.
జార్జిరెడ్డిలా సీరియస్ స్టడీస్‌ను, పోరాటాన్ని మేళవించగల విద్యార్థి మేధావిని ఆ తరువాత మాత్రం నేను చూడలేదు. జీవితమంతా పోరాటం, సీరియస్ రచన ప్రపంచంలో మార్క్స్‌కు, అంబేడ్కర్‌కు మాత్రమే సాద్యమయ్యాయి. నా అనుభవంలో పోరాటాలను పొగిడి, చదువును అంటే, అంతంతమాత్రం చేసిన వాళ్ళంతా మీడియేకరు. వాళ్ళు పూర్తికాలం చదువు, రాయడంలో ఉన్నా అంతగా చేయగలిగే వాళ్ళేమీ కాదు. మీడియోక్రసి మార్పును తేదు. ఏ యూనివర్సిటీ అయినా సీరియస్ పాఠాలు చెప్పి, ప్రాక్టికల్స్ చేయించి బ్యాచ్‌ల తరువాత బ్యాచ్‌లను బయటికి పంపిస్తా ఉంటే అందులో కొందర్ని కొత్త జ్ఞానాన్ని సృష్టించే మేధావులుగా తయారు చేస్తుంది.
యూనివర్సిటీ కర్తవ్యం ప్రాంతీయ సమస్యల చుట్టూ ప్రతి నిత్యపు పోరాటాల చుట్టూ తిరగడం కాదు. అట్లని యూనివర్సిటీలో పనిచేసే మేధావులకు ప్రజా ఉద్యమాలతో సంబంధముండొద్దా అంటే ఉండాలి. అది సిద్ధాంత రంగాన్ని బలపర్చేదిగా ఉండాలి. మార్క్సిజం, పౌరహక్కులు ఆ లక్షణాన్ని కలిగి ఉండేవి. నిరంతరంగా కొంత సిద్ధాంత చర్చ ఉండేది. ప్రాంతీయవాదానికి ఏ సిద్ధాంతం ఉండదు. పాఠాలు చెప్పదల్చుకోని టీచరుకు అదొనక అదనిస్తుంది. నాయకత్వాన్నిస్తుంది. కానీ మౌలికంగా అది ప్రొఫెసర్ల రంగం, స్కాలర్ల రంగం కాదు. నాలా మొదటితరం ప్రొఫెసర్ అయిన వ్యక్తికి యూనివర్సిటీ ఊహించనన్ని అవకాశాలిస్తుంది. ఆ అవకాశాల్ని రోజు ఉద్యమాల్లోనే ఫలప్రదం చెయ్యలేం.
వేలాది సంవత్సరాలు విద్యతో సంబంధంలేని కులాలనుంచి, గ్రామాల నుంచి వచ్చిన మేధావులకు మొత్తం ప్రపంచానికే ఒక కొత్త జ్ఞానాన్ని అందించగల శక్తి యూనివర్సిటీ ద్వారా వస్తుంది. అక్కడి వాతావరణం మేధావి వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. కానీ యూనివర్సిటీ విద్య ఫలప్రదం కావాలంటే, అక్కడికొచ్చే విద్యార్థులు స్కూళ్ళలో కిందస్థాయి కాలేజీల్లో వేసిన విద్యా పునాదులు గట్టిగా ఉండాలి. 38 ఏండ్ల నా అనుభవంలో తేలింది ఎంట్రెన్స్ వడపోత మేధోశకి ్తకి గ్యారెంటీ కాదు. పంట పండించడానికి నిరంతర ం భూమితో సంఘర్షణ పడినట్లు, యూనివర్సిటీలో జ్ఞానం పండించడానికి నిరంతరం చదవడం, రాయడంతో సంఘర్షణ పడాలి. కనీసం నెలకొకటైనా కొత్త పుస్తకాన్ని సంపూర్ణంగా చదవని టీచర్ విద్యార్థుల్ని ఇన్‌స్పైర్ చెయ్యలేడు/లేదు.
ఉస్మానియా క్యాచ్‌మెంట్ కింది విద్యార్థులలో చాలా క్రియేటివిటీ ఉంది. అది ఉద్యమాలు నడపడంలో కనబడింది. కానీ కొత్త జ్ఞాన సృష్టివైపు దాన్ని మరల్చలేదు. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలు రోజువారి ఉద్యమాలు నడి పించనందువల్ల ప్రపంచానికి కొత్త జ్ఞానాన్ని అందించలేదు. అందులో చదివినవారివి అద్భుత మెదళ్ళేమీ కావు. మనం వారికేం తీసిపోము. పోరాటాలు మాత్రమే జ్ఞానానికి మూలమనుకునే చోట కొత్త ఫిలాసఫీ పుట్టదు. కొత్త జ్ఞానం, స్టయిలు వాళ్ళ సొత్తేమీ కాదు. వారి జ్ఞానాన్ని మాత్రమే చదవడం మన బాధ్యత కాదు. మనం వారి కంటే గొప్ప జ్ఞానాన్ని సృష్టించగలం. అందుకు యూనివర్సిటీనీ యూనివర్సిటీగా పనిచేయించాలి. దాని చుట్టూ ఉన్న మనుషుల శ్రమశక్తిని, దాని క్రియేటివిటీని ఆధునిక పద్ధతిలో అధ్యయనం చెయ్యాలి. ప్రజల బతుకుల్లో ఫిలాసఫీ ఉంటే పోరాటంలో వారి చరిత్ర ఉంటుంది. అది వారి జీవితంలో పోరాటం ఒక భాగం మాత్రమే.
నేను చదువుకున్న క్లాస్ రూంకంటే ఉస్మానియా లైబ్రరీ నాకు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చింది. సాధారణ చదువునుంచి రీసెర్చి వైపు పయనించే విద్యార్థి క్లాస్ రూంను దాటి జ్ఞానార ్జన మొదటెట్టాలి. ప్రపంచంలో లైబ్రరీ ప్రాధాన ్యం సంతరించుకున్నది ఈ కీలక దశ కోసమే. ఉస్మానియా లైబ్రరీ ఇందుకు ఎంతో అనువైందిగా ఉంది. మేము లైబ్రరీ ఉద్యోగాల పోటీ పరీక్షల ప్రిపరేషన్ కేంద్రంగా చూడలేదు. లైబ్రరీ కర్తవ్యం ఆబ్‌జెక్టివ్ ప్రశ్నల మెమొరైజేషన్ అంతకన్నా కాదు. లైబ్రరీ విద్యార్థుల్ని క్లాస్ రూం నుంచి విశాల ప్రపంచంలోకి, కొంతలోకొంత సిద్ధాంతాల అన్వేషణలోకి తీసుకెళ్తుంది.పౌర హక్కు ల ఉద్యమంలో గ్రామాలు తిరిగి, ఆ గ్రామ జీవితానికి సైతం నెనొక సిద్ధాంత రూపమివ్వగలిగింది ఈ లైబ్రరీ అండతోటే.సమాజ శాస్త్ర వేత్త ప్రపంచ సిద్ధాంతాలను తనలో రంగరించుకొని తనచుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో తిరిగి ప్రపంచానికి మరో కొత్త సిద్ధాంతాన్ని అందించగలగాలి.
యూరోపియన్ ప్రజలు, ముఖ్యంగా గ్రీకు ప్రజలకే కాదు మన దేశపు ప్రజలకూ ఒక తాత్విక భూమిక ఉందని అర్థం చేసుకోడానికి ఈ లైబ్రరీలోని పుస్తకాలే నాకు సహకరించాయి. తన చుట్టూ ఉన్న ప్రజల నిత్య జీవితంలో ఫిలాసఫీని చూడలేని రచయిత తనదేశ ప్రజలకొక తత్వ భూమికను ఏర్పర్చలేడు. ఇతర రచయితల పుస్తకాలను క్రియేటివ్‌గా చదివినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్ని, అందులో వచ్చే మార్పుల్ని క్రియేటివ్‌గా చదువుతాము. ప్రజలు ప్రకృతిలో, తమ చుట్టూ మట్టి తో, మనుషులతో, జంతువులతో ఏర్పర్చుకునే సంబంధాల్లో తాత్వికత రూపొందాలి. ఈ సంబంధాల్లో నిత్యనూతనత్వం ఉంటుంది. యూనివర్సిటీ ఈ ప్రక్రియల్ని పరిశోధించే పద్ధతిని మనకు నేర్పాలి. నా మట్టుకు నేను ఉస్మానియాలో ఇది నేర్చుకున్నాను. సీరియస్ అధ్యయనం, రచన తన చుట్టూ ఉన్న శక్తుల కుట్రలు, కుతంత్రాలు అతీతంగా జరగాలి.
ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ముఖ్యంగా రచనా రంగంలో ఉన్న వ్యక్తిని ప్రేమించే వా రి కంటే ద్వేషించేవారే ఎక్కువగా ఉంటారు. సంస్థాగత సంఘర్షణ లు చాలా కృంగదీసేవిగా ఉంటాయి. వాటిని అధిగమించడం చాలా ముఖ్యం. ఫ్యూడల్ శక్తులు మొదట్లో నన్ను ఉస్మానియాకు ఉద్యోగ భద్రతతో రాకుండా చూడాలనుకున్నాయి. అక్కడ ఉద్యోగంలో చేరాక రకరకాల అవమానాలకు గురి చేశాయి. హిందూత్వ శక్తుల్ని, ఫ్యూడల్ శక్తుల్ని, యూనివర్సిటీలో ఉన్న విద్యా వ్యతిరేక శక్తుల్ని తట్టుకుని థాట్ రిఫామ్ రచనకు, హిందూత్వ వ్యతిరేక, బ్రాహ్మణీయ వ్యతిరేక రచనలకు ఏకకాలంలో పూనుకోవడం కష్టమైనపనే.
అం బేడ్కర్ పోరాటం నాకు ఈ కాలమంతా ఒక ఆదర్శం గా నిలిచింది. ఉస్మానియా నాకీ అవకాశమిచ్చింది. మూడువేల ఏళ్లు విద్య కు దూరంగా ఉన్న కులాల నుంచి వచ్చి జీవితాంతం ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా బతకగలిగే అవకాశం మామూలు అవకాశం కాదు. రీడ్, రైట్ అండ్ ఫైట్ అని నేను ఎంచుకున్న మార్గాన్ని నేనొక యూనివర్సిటీలో ఉన్నాను కనుక నా శక్తి కొద్దీ అమలులో పెట్టగలిగాను. నారచనలతో సమాజం సమాంతంగా మారుతుందని నేనెప్పుడు అనుకోలేదు. జ్ఞానాన్ని మెట్లు, మెట్లుగా అభివృద్ధి చేయ్యాలి. ఈ పని ని మిగతా సంస్థలకంటే యూనివర్సిటీలు బాగా నెరవేర్చగలుగుతాయి. అది వాటి కర్తవ్యం.
నేను ఉస్మానియాలో జీవించిన 38 సంవత్సరాల్లో హిందూ త్వవాదానికి, రాడికల్ కమ్యూనిజానికి మధ్య భీకర యుద్ధాలను చూశాను. దాడుల్ని, హత్యల్ని చూశాను. ఈ క్రమంలోనేనో మధ్యే మార్గాన్ని ఎన్నుకున్నాను. అందుకు నాకు బుద్ధడు ఆదర్శం. అందుకే నేను అయన రాజకీయ తత్వశాస్త్రం మీద పీహెచ్‌డీ చేశాను. తెలంగాణలో పశువుల మందల్ని అభివృద్ధి చేసి ఆర్యులచే హత్య చెయ్యబడి దేవుడైన కొమురెల్లి మల్లయ్య బుద్ధుని కంటే ముందు వాడు కూడా అయి ఉండవచ్చు. ఆయన పేరుతో ఈ ప్రాంతంలో నాలుగు గుళ్ళు ఉన్నాయి (శ్రీశైలం, కొమరెళ్ళ, కట్ట మల్లన, ఐలోని మల్లన్న) ఈ పరంపరతోనే నాకు ఐలయ్య అనే పేరు పెట్టారు.
మల్లయ్య చరిత్రను, తత్వాన్ని, పోరాట రూపాల్ని అధ్యయనం చేసి తెలంగాణ ప్రాంతపు ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్థిక తాత్వికతను ఒక బలమైన పుస్తకం రూపంలో ప్రపంచానికి చెప్పాలనే కోరిక నాలో చాలాకాలంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చుట్టు ఉన్న సంస్కృతికి మల్లయ్య పునాదులు వేసి ఉంటాడు. ముందు, ముందు ఉస్మానియాలో పుట్టి పెరిగే మేధావులు ప్రపంచ మార్పుకే కొత్త మార్పులు వెయ్యవచ్చు. ఏ మేధావి కూడా జ్ఞానానికుండే అంతిమ ప్రక్రియ గురించి చెప్పలేరు. జ్ఞానం ఎప్పుడు అంతం కాదు. జ్ఞానపు ప్రతి మెట్టుకూ అది ఆరంభాన్ని వెతుక్కుంటుంది. ఉస్మానియా నువ్వు నాకిచ్చిన నిండు అవకాశాలకు కృతజ్ఞతలతో, నువ్వెంతో మంది మేధావుల్ని కంటావనే ఆశతో పొయ్యొస్తా.
- కంచ ఐలయ్య
విద్యార్థిగా, అధ్యాపకుడుగా, ఆచార్యుడుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ప్రగాఢ అనుబంధమున్న రాజనీతి శాస్త్రవేత్త, సామాజిక చింతకుడు కంచ ఐలయ్య ఈ నెల 31న విశ్రాంత జీవితంలోకి
ప్రవేశిస్తున్నారు.
Andhra Jyothi News Paper Dated : 30/10/2012
No comments:
Post a Comment