Wednesday, October 31, 2012

మహిళలకు రక్షణేదీ ?----కె విజయగౌరి


దేశమంటే మట్టికాదోరు, దేశమంటే మనుషులోరు అన్న గురజాడ మహిళలంటే మట్టి అనుకుంటున్నారా? అని పాలక వర్గాలను హెచ్చరించారు. ఆ బాటలోనే మహిళా చైతన్యం విరబూసింది. ఇలాంటి సంఘ సంస్కర్తలు మహిళాభివృద్ధి కోసం చేసిన త్యాగాలు, తెచ్చిన చట్టాలు స్త్రీలు మరిచిపోరు. వీరేశలింగం, జ్యోతిరావ్‌ పూలే, రాజారామ్మోహన్‌రారు వంటి వారి అడుగుజాడలు ఎప్పటికీ సజీవం.
స్త్రీలపై జరుగుతున్న హింసను రూపుమాపాలని, ఇది ఒక సామాజిక సమస్యగా ఉందని అనేక దశాబ్దాలుగా మహిళలు చేస్తున్న పోరాటాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వారు ఎదుర్కొనే సమస్యలు పేద, ధనిక, కుల, మత, వర్గం అనే తేడా లేకుండా ఉన్నాయి. పుట్టక ముందు ఆడపిండంగా, పుట్టిన తరువాత స్త్రీగా వివక్షకు, అణచివేతకు బలైపోతున్నారు. పని ప్రదేశాలలో, వ్యవసాయ భూముల్లో, చదువుకునేచోట, గృహాలలో నానాటికీ హింస పెరుగుతోందని చెప్పడానికి తాజాగా దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసాఘటనలు తార్కాణం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ నివేదిక ప్రకారం ప్రతి 100 మంది మహిళలలో 70 మంది ఏదో ఒక రూపంలో హింసకు గురవుతున్నారు.
ఆధునిక జీవనంలో పూర్వంకన్నా కొంత మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ పురుషాధిక్యతను, హింసను తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి విముక్తి కోసం మహిళలు, మహిళా సంఘాలు చేస్తున్న పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు సాధించినా అవి అమలుకు నోచుకోవడం లేదు. అటువంటి చట్టాలపైనా, హింసకు గల కారణాలపైనా పాలకులు విపరీతార్థాలు తీస్తున్నారు. వీటన్నింటికీ కారణం మహిళలే అని కొంతమంది పాలకులు, రాజకీయ నాయకులు నీతులు వల్లిస్తున్నారు. సమాజంలో అంతర్భాగంగా ఒకవైపు అందరిలాగానే అన్ని సమస్యలను, స్త్రీగా ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
తప్పులెన్నువారు తమ తెప్పులెరుగరు
తప్పులెన్నువారు తమ తెప్పులెరుగరు అని వేమన అన్నట్లు హర్యానాలో జరిగిన అత్యాచారాలు, హింసలపై చర్యలు తీసుకోలేక తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాంసం తినకండి, బాల్యవివాహాలు చేయండి, పెళ్ళి వయస్సు తగ్గించండి, వీటన్నింటికీ కారణం మహిళలే అని వ్యాఖ్యానించిన పాలపక్ష ముఖ్య నేతలు నలుగురూ మహిళల పట్ల తమ చిత్తశుద్ధి ఏపాటిదో నిరూపించుకున్నారు. మరో మహిళా ముఖ్యమంత్రిగారు స్వేచ్ఛ ఎక్కువైందని, అందువల్లనే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని సెలవిచ్చారు. ఇంకా చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు.
చట్టాలు చుట్టపు చూపుకా?
ఎంతో మంది మహనీయులు సమాజాభివృద్ధికి ఆటంకంగా ఉండే అనేక సాంఘిక దురాచారాలపైనా, బాల్య వివాహాలపైనా, వరకట్నంపైనా, హింసపైనా దేశ విదేశాలలో తీవ్రమైన చర్చలు జరిపి సమాజంలో మహిళలు ఉన్నతమైన స్థాయిలో ఉంటే తప్ప ఏ దేశం పురోగమించదని అనేక చట్టాల కోసం పోరాడి సాధించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘసంస్కర్తలు, మహిళా ఉద్యమాల చైతన్య స్ఫూర్తి భారత మహిళకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలిగాయి. 1990 తరువాత వచ్చిన సంస్కరణలు మహిళల జీవనశైలిపై ఏ రకమైన ప్రభావం చూపుతున్నాయో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
ఆందోళన కల్గించే గణాంకాలు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ 30 కోట్ల మంది మహిళలు హింస, అనారోగ్యం, భ్రూణ హత్యలు, అక్రమ రవాణా వంటి ప్రభావంతో అంతర్థానమయ్యారని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ప్రకటించారు. అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలలో 497 కేసులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఒక్క నెలలోనే హర్యానాలో 17 అత్యాచారాలు జరిగాయి. బాల్య వివాహాలలో ఆంధ్రప్రదేశ్‌ మూడవ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే హత్యలు 3 శాతం, అత్యాచారాలు 30 శాతం, కిడ్నాప్‌లు 43 శాతం, నిర్బంధించిన కేసులు 27 శాతం, భ్రూణ హత్యలు 19 శాతం పెరిగాయని యునెస్కో, ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. ఇవి అధికారిక లెక్కలు. దేశవ్యాప్తంగా అమ్మాయిలను అమ్మడం, కొనడంలో వరుసగా 65 శాతం, 13 శాతం పెరిగాయి. భ్రూణ హత్యలు కూడా 56 శాతం పెరిగాయి. అత్యాచారాలు సగటున 30 శాతంగా ఉందంటే మహిళలకు రక్షణ ఎక్కడ ఉందో పాలకులు గమనించాల్సి ఉంది.
ఆందోళన కల్గించే అక్రమ రవాణా
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రోజుకు 22 మంది మహిళలు అదృశ్యమవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. 2009 నుంచి 2012, జులై వరకూ 23,760 మంది అదృశ్యమయ్యారు. 2012, జులై నుంచి ఇప్పటి వరకూ మూడు వేల మంది వ్యభిచార గృహాలకు తరలించబడ్డారు. వీరంతా పూణె, నాగపూర్‌, ఢిల్లీ, ముంబయిలలోనే ఉన్నారని యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీస్‌లు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు తెలిపాయి. పేదరికం, కరువు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కూలి పనుల కోసం వెళ్లే మహిళలు, యువతులు నరక కూపంలోకి నెట్టబడుతున్నారు. రేవ్‌ పార్టీల పేరుతో బ్రోకర్లు హైటెక్‌ వ్యభిచారం చేస్తున్నారు.
నాటి సంఘ సంస్కర్తల అడుగుజాడలు సజీవం
దేశమంటే మట్టికాదోరు, దేశమంటే మనుషులోరు అన్న గురజాడ మహిళలంటే మట్టి అనుకుంటున్నారా? అని పాలక వర్గాలను హెచ్చరించారు. ఆ బాటలోనే మహిళా చైతన్యం విరబూసింది. ఇలాంటి సంఘ సంస్కర్తలు మహిళాభివృద్ధి కోసం చేసిన త్యాగాలు, తెచ్చిన చట్టాలు స్త్రీలు మరిచిపోరు. వీరేశలింగం, జ్యోతిరావ్‌ పూలే, రాజారామ్మోహన్‌రారు వంటి వారి అడుగుజాడలు ఎప్పటికీ సజీవం. 1872లో గురజాడ ఒక్క ప్రాంతంలో సర్వే చేస్తే 1,507 మందికి బాల్య వివాహాలు జరిగాయని, వీరందరినీ వృద్ధులకిచ్చి పెళ్లిచేశారని రూఢ అయింది. ప్రగతిశీల భావాలతో అనాగరిక చర్యలను త్రిప్పికొట్టిన సంఘ సంస్కర్తలు, మహనీయుల జయంతులు, వర్ధంతులను కూడా రాజకీయంగా వినియోగించుకుంటున్న పాలకులు, అటువంటి వారి ఆశయాలకు మాత్రం గోరీ కడుతున్నారు.
వికృత భాష్యాలు
వస్త్రధారణలే కారణమంటూ చేసిన వ్యాఖ్యలను చూస్తే వాకపల్లి గిరిపుత్రికలు ఏ వస్త్రధారణలో ఉన్నారు? ఏడు సంవత్సరాల చిన్నారులు ఏ వస్త్రధారణలో ఉన్నారు? వీధికో బెల్టుషాపుకు అనుమతిస్తూ బాగా తాగి అత్యాచారాలు చేయండని ప్రోత్సహిస్తున్నారు. పురుషునికి 21, స్త్రీకి 18 ఏళ్లు దాటాక పెళ్లి చేస్తే అన్ని విధాలా ఆరోగ్యం అని శాస్త్రాలు చెబుతుంటే పెండ్లీడు వయస్సును 15, 16 సంవత్సరాలకు తగ్గించేయాలని న్యాయ కమిషన్‌లు, రాజకీయ నాయకులు సెలవిస్తున్నారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రస్తావించినప్పుడు, నిజంగానే అదే కారణమైతే అటువంటి మీడియాకు ఎందుకు లైసెన్సులివ్వాలి? ఈజీగోయింగ్‌ అనే సంస్కృతికి మూల కారణమైన ప్రపంచీకరణకు ఎందుకు అడ్డుపడరు.
ప్రపంచీకరణ విష కౌగిలిలో మహిళలు
మద్యపానం, బెల్టుషాపులు, వినిమయ సంస్కృతి, అర్ధనగ చిత్రాల ప్రదర్శన, టీవీ సీరియళ్ళు, నేర ప్రవృత్తి సినిమాలు, డిస్కోథెక్‌ల సంస్కృతి, సాంకేతికత వీటన్నింటినీ కలబోసుకున్న ప్రపంచీకరణ మహిళల జీవితాలకు శాపంగా మారింది. పాలకులు సరిగ్గా ఇవే అంశాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచీకరణ స్త్రీలను అంగడి సరుకుగా నిలబెట్టింది. అటువంటి ప్రపంచీకరణ విధానాలపై తిరగబడక తప్పదు. స్త్రీలను వినియోగించి చేసే వ్యాపార ప్రకటనలు ఏ తప్పుచేసినా పర్వాలేదు అనే స్థాయికి తెచ్చాయి. పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారు. స్త్రీల అభివృద్ధే తమ ధ్యేయమని ఒకవైపు చెబుతూ, రెండోవైపు స్త్రీని రెండవశ్రేణి పౌరురాలిగా పరిగణిస్తున్నారు. ఆనాడు హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, ఓటు హక్కు కోసం పోరాటాలకు నాంది పలికిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా ఈనాడు అన్ని వర్గాల మహిళలు అదే స్ఫూర్తితో ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి.
(రచయిత యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి) 
-కె విజయగౌరి

Prajashakti Telugu News Paper Dated : 28/10/2012 

  

No comments:

Post a Comment