Fri, 1 Feb 2013, IST
- మీడియాలో కానీ, వెలుపల కానీ జరిగిన ఈ మొత్తం చర్చా క్రమంలో ఒక్క అంశం పూర్తిగా విస్మరణకు గురైంది. అదేమంటే వికలాంగులైన మహిళలపై దాడులు, అత్యాచారాల గురించి. ఈ విషయం అసలు ఎవరికీ పట్టలేదు. కానీ ఈ మహిళలపై జరిగే దాడులే కాదు, హింసకు సంబంధించిన వార్తలు కూడా ఇలాగే వివక్షకు గురయ్యాయి. గత కొద్ది సంవత్సరాలుగా వికలాంగ మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. ఇది వాస్తవం. ఈ సంఖ్య పెరిగినా కూడా వారిపై జరుగుతున్న హింసాకాండ గురించి పెద్దగా బయటకు రావడం లేదు.
ఇటీవల దేశ రాజధానిలో సభ్య సమాజం సిగ్గుపడేలా జరిగిన దారుణ అత్యాచార సంఘటన నేపథ్యంలో ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉవ్వెత్తున ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఎవరి నాయకత్వం, ఉద్బోధలు లేకుండానే ఎవరికి వారు చైతన్యవంతంగా ఈ ఆందోళనలు, నిరసనలకు చేయూతనిచ్చారు. అమానుషమైన రీతిలో జరిగిన ఆ ఘాతుకాన్ని తీవ్రంగా నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో మహిళల భద్రత, రక్షణపై కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే కేవలం మహిళలకు కల్పించాల్సిన భద్రత, రక్షణలపైనే ఈ చర్చ ఆగిపోలేదు. సమాజంలో పోగొట్టుకున్న తమ స్థానాన్ని తిరిగి పొందేందుకు గానూ వారు చేస్తున్న ప్రయత్నాలు, పితృస్వామ్య ధోరణి ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారాయి. పైగా నాగరిక సమాజం ఉలిక్కిపడేలా జరిగిన ఆ ఘటన వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించడమే కాదు, గట్టి డిమాండ్లకు కూడా దారి తీసింది. ఆ ఘటనకు కారకులైన నరరూప రాక్షసులను తాలిబాన్ తరహాలో బహిరంగంగా ఉరితీయాలని, అంగచ్ఛేదన జరగాలని, రాళ్ళతో కొట్టి చంపాలని, ప్రతీకార న్యాయం ఉండాలని ఇలాంటివే ఇంకా అనేకానేక డిమాండ్లు వచ్చాయి. లక్ష్మణ రేఖల గురించి మాట్లాడరాదని, డ్రస్ కోడ్‌ల గురించి ప్రస్తావించరాదని ఇలా అనేకానేక అంశాలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పలు చోట్ల పదుల సంఖ్యలో అత్యాచార సంఘటనలు వెలుగు చూశాయి. మీడియా అకస్మాత్తుగా వాటిపై దృష్టి పెట్టడం కూడా కనిపించింది.
మీడియాలో కానీ, వెలుపల కానీ జరిగిన ఈ మొత్తం చర్చా క్రమంలో ఒక్క అంశం పూర్తిగా విస్మరణకు గురైంది. అదేమంటే వికలాంగులైన మహిళలపై దాడులు, అత్యాచారాల గురించి. ఈ విషయం అసలు ఎవరికీ పట్టలేదు. కానీ ఈ మహిళలపై జరిగే దాడులే కాదు, హింసకు సంబంధించిన వార్తలు కూడా ఇలాగే వివక్షకు గురయ్యాయి. గత కొద్ది సంవత్సరాలుగా వికలాంగ మహిళలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. ఇది వాస్తవం. ఈ సంఖ్య పెరిగినా కూడా వారిపై జరుగుతున్న హింసాకాండ గురించి పెద్దగా బయటకు రావడం లేదు.
అయితే, ఇప్పుడు జస్టిస్ వర్మ కమిటీ ఏర్పాటు రూపంలో దీనిపై మాట్లాడేందుకు ఒక అవకాశం వచ్చింది. వికలాంగుల సమస్యలపై పనిచేస్తున్న జాతీయ వికలాంగుల హక్కుల వేదిక(ఎన్‌పిఆర్‌డి) మరో 24 ఇతర సంస్థలు, సంఘాలు కలిసి జనవరి 4వ తేదీన కమిటీకి ఒక నివేదిక ఇచ్చాయి.
ఏదో ఒక రకమైన అంగవైకల్యంతో బాధపడుతున్న బాలికలు, యువతులు ఇలాంటి లైంగిక దోపిడీకి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారని ఎన్‌పిఆర్‌డి తన నోట్‌లో పేర్కొంది. ఎందుకంటే వీరిపై ఏ విధమైన దాడికి పాల్పడినా కూడా తప్పించుకోవడం చాలా సులభం. పైగా, అనేక కేసుల్లో ఇలాంటి మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని ఇతరులతో చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఇతర మహిళలతో పోలిస్తే వీరిపై జరిగే దాడులు మూడు రెట్లు ఎక్కువ. పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఈ బాధితులను తీవ్రంగా పట్టించుకోకపోవడం కూడా దారుణం. తమకు తాము చెప్పుకోలేని వారి లోపాల కారణంగా వారి ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.
ప్రత్యేక సమస్యలు
తమ సమస్యలను ప్రత్యేకంగా వినాలని, పరిష్కరించాలని ఆ మహిళలు కోరుతున్నారు. పైగా ఒక్కో వైకల్యం వల్ల ఒక్కో రకంగా సమస్య ఉంటుంది. ఉదాహరణకు అంధురాలైన మహిళ తనపై దారుణానికి పాల్పడిన ఆ కిరాతకుడిని నేరుగా చూసే అవకాశం లేదు. మూగదైన బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని నోరు విప్పి చెప్పలేదు. ఇంకా మానసికంగా అంత ఎదుగుదల లేనివారి పరిస్థితి మరీ ఘోరం. వారికి జరిగిన అన్యాయం గురించి కూడా తెలియదు. చాలా కేసుల్లో ఇలాంటి బాధితులే ఎక్కువగా ఉంటారు. అయితే మానసిక అస్వస్థతతో బాధపడేవారి పరిస్థితులు మరోలా ఉంటాయి.
'క్రైమ్ పెట్రోల్' అనే టీవీ సీరియల్ ఇటీవలి ఎపిసోడ్‌లో ఇలాంటి కేసునే ఒకదాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ కేసులో ఆ మహిళ మానసిక వికలాంగురాలు. తనపై జరిగిన అన్యాయం తెలియదు. పైగా ఆమె గర్భవతి కూడా అయింది. దాంతో ఆమెను చండీఘర్‌లోని 'ఆశ్రయ' అనే ప్రభుత్వ హోంలో ఉంచారు. ఈ కేసులో ఆమె తనపై దాడి జరిపిన వారిని కూడా గుర్తించలేకపోయింది. ఇకపోతే ఆశ్రయం ఇవ్వాల్సినవాళ్ళే కాటువేస్తే వారిని క్షమించరాదు. గతేడాది జులైలో హుగ్లీలోని ఓ ఎన్‌జిఓ హోంలో ఇలాంటి సంఘటనే జరిగింది. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నా దాన్ని తెలుసుకోలేని ఒక నిస్సహాయురాలిని ఆ కాంపౌండ్‌లోనే తగలబెట్టారు. పైగా బయటివారు ఆ హోంలోని వికలాంగ మహిళలను తమ లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంకా అంతకన్నా దిగ్భ్రాంతి కలిగించే అంశమేమంటే వారిలో కొందరితో నిత్యం ఇలాంటి సంబంధాలు నెరుపుతున్నవారు ఉన్నారు. పైగా సురక్షితంగా ఉండేందుకు గానూ కాపర్ టి కూడా వేయించిన ఘటనలు వెలుగుచూశాయి. ఎంత దారుణం! అక్కడ ఒక హత్య విషయం వెలుగులోకి రావడంతో మిగిలిన వారిని ప్రశ్నించినా వారు తమ అనుభవాలను చెప్పే స్థితిలో లేని మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. ఇదంతా కూడా మానసిక వికలాంగులకు ఆశ్రయం అన్న పేరుతో నిర్వహిస్తున్న హోంలోనే జరగడం అత్యంత దారుణం. సంరక్షకులు అనే పేరుతో దర్జాగా వీరు ఆ హోంకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇకపోతే అంధురాలైన ఒక యువతి అనుభవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవల జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కొల్‌కతాకు చెందిన స్మృతి వికలాంగ హక్కుల కేంద్రం సహకారంతో 'వికలాంగ మహిళలు ఎదుర్కొనే సమస్యలు'పై నిర్వహించిన బహిరంగ విచారణలో ఆమె తన అనుభవాలు వెల్లడించింది. తాను రోజూ ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నానని ఆమె చెప్పింది. ఆమె బస్సులో కాలేజీకి వెళ్ళాల్సి ఉంది. రోడ్డు దాటాలంటే ఎవరిదో ఒకరి సాయం అవసరం. అందుకని ఆమె సాయాన్ని ఆర్థిస్తే ఆ చేయూత ఇచ్చే వారు కూడా దాన్ని అడ్డుగా పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయింది. చేయి అందించే నెపంతో ఒళ్ళంతా తాకుతూ కంపరం పుట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందింది. ఒకవేళ ఏదైనా తాను గట్టిగా అరిచినా, నిరసన తెలిపినా అతడు మధ్యలో వదిలేసి వెళ్తే తన పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించింది. పైగా ఒకవేళ గట్టిగా అరిచినా తాను గుర్తుపట్టలేను కనుక సదరు వ్యక్తి ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. మిగిలినవారు కూడా తనను నమ్మే పరిస్థితి ఉండదని పేర్కొంది. మూగ, బధిరులైన యువతులు రద్దీగా ఉన్న కూడళ్ళలో సురక్షితంగా ఉండలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి చోట్లే వారు దాడులకు లక్ష్యంగా మారుతున్నారు. బెంగాల్‌లోని బంకూరా మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగిన సంఘటన పరిశీలిస్తే కంచే చేను మేసిన చందంగా ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళిన ఆమెపై డాక్టరే అత్యాచారానికి ఒడిగడితే ఎవరితో చెప్పుకోవాలి? పైగా నిందితుణ్ణి గుర్తించేందుకు అంటూ పోలీసులు ఐడింటిఫికేషన్ పెరేడ్ పెట్టారు. కానీ అక్కడ ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి అనేది బాధితురాలికి పోలీసులు కానీ, అధికారులు కానీ చెప్పలేదు. ఆమె మాట్లాడలేదు, వినలేదు. పైగా నిరక్షరాస్యురాలు. అటువంటప్పుడు ఆమెతో సంభాషించడానికి ఇతరుల సేవలను కూడా వినియోగించుకోలేదు. ఇలా ఉంటాయి ప్రభుత్వం వారి సేవలు.
అనేక కేసుల్లో ఇలాంటి బాధితులకు న్యాయ వ్యవస్థ కూడా సాయం అందించడంలో విఫలమవుతోంది. ఇలాంటి వారి సాక్ష్యాలకు విలువ లేకుండా పోతున్న కేసులు అనేకం. ఎందుకంటే బాధితురాలి సాక్ష్యం నమోదు చేసినా అది సరైన పద్ధతిలో ఉండదు. పాటించాల్సిన నిబంధనలు, ప్రమాణాలు పాటించరు. అటువంటప్పుడు వారు సాక్ష్యమిచ్చినా ఫలితం ఏముంది? ఒకవేళ అన్నీ సక్రమంగా పాటించి చట్ట ప్రకారం సాక్ష్యాలు నమోదు చేసినా అర్థవంతంగా లేదంటూ తోసిపుచ్చేవి కూడా ఎక్కువే. వైద్యపరమైన సాక్ష్యాలతో సరిపోల్చేలా లేవంటూ సాక్ష్యాలను తోసిపుచ్చిన సంఘటనలూ ఎక్కువేనని చెప్పవచ్చు.
ఈ రకంగా వికలాంగ మహిలపై జరిగే దాడులే ఇతర మహిళలతో పోలిస్తే విభిన్నమైనవి అనుకుంటే అందులో మళ్ళీ ఒక్కో వైకల్యం గల బాధితులది ఒక్కో కథ. వారు అనుభవించే ఇబ్బందులు, కష్టనష్టాలు అన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ తరహా దాడుల గురించి, బాధితుల సంఖ్య గురించి సరైన సమాచారం లేదు. దీనిపై ఎలాంటి అధ్యయనాలు జరగకపోవడం ఇందుకు కారణం. కాగా, ఒక్క 2012లోనే ఈ తరహా దాడుల సంఖ్య బాగా పెరిగిందని అంచనా. కేవలం ఒక్క బెంగాల్ నుండే ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మీడియా కూడా ఈ విషయంలో గగ్గోలు పెడుతూనే ఉంది. వికలాంగ మహిళలపై ఇంతలా దాడులు పెరిగినా కూడా ఈ సమస్యను రూపుమాపడానికి ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ జరగడం లేదు. దాంతో అటు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర కానీ, మరే ఇతర వర్గాల వద్ద గానీ విశ్వసనీయమైన సమాచారం లేదు. అందువల్ల ఇలాంటి నేరాలు తమ దృష్టికి వచ్చినప్పుడే ప్రత్యేక కేటగిరీలో వికలాంగులైన మహిళలపై దాడులు అన్న రీతిలో నమోదు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన మహిళలపై దాడులను ఎలా నమోదు చేస్తున్నామో ఇక్కడ కూడా అలాగే చేయాల్సిన అవసరముంది.
పర్యవేక్షక యంత్రాంగాలు
చాలా కేసుల్లో నేరాలకు పాల్పడేవారు బాధితులకు తెలిసిన వారే అయివుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వికలాంగ బాలికలను, యువతులను ఉంచే హోంలపై ప్రత్యేకంగా పర్యవేక్షక యంత్రాంగాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. ఇలాంటి యంత్రాంగాల్లో కార్యకర్తలు, ప్రత్యేక నిపుణులు ఉండాలి. వారు క్రమం తప్పకుండా ఈ హోంలను సందర్శిస్తూ ఉండాలి. అనేకానేక కేసుల్లో ఇలాంటి నేరాలు బయటకు రాకుండానే మరుగున పడిపోతుంటాయి. ఎందుకంటే సాధారణంగానే బాధితురాలినే చిన్నచూపు చూసే సమాజం మనది. పైగా ఆమె వికలాంగురాలు కావడం మరో అనర్హత. ఇక ఆ రెండూ తోడైతే చాలు ఆమె ఇబ్బందులు పదింతలవుతాయి. దాంతో ఆమె కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఫిర్యాదులు చేయడానికి కూడా ముందుకురారు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఒక ప్రయత్నం జరిగినా వారు ఎదుర్కొనే కడగండ్లు ఇన్నీ అన్నీ కావు. పైగా బాధితురాలి సాక్ష్యం పట్ల సంశయాలు, సందేహాలు ఎన్నో. తరచుగా వాటిని అదే కోణంలో చూస్తూ ఉంటారు.
జాతీయ మహిళా కమిషన్ బృందం గతేడాది ఏప్రిల్ 3, 4 తేదీల్లో బెంగాల్‌లో పర్యటించింది. అనంతరం కొన్ని సిఫార్సులు చేసింది. వికలాంగ బాధితులతో వ్యవహరించేటప్పుడు అన్ని పోలీసు స్టేషన్లు, వైద్య సంస్థలు కూడా కొన్ని ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది. అనువాదకులు, రీడర్లు, సైకాలజిస్టులు, ఎన్‌జిఓలు ఇలా కేసు స్వభావాన్ని బట్టి వారి సేవలను ఉపయోగించుకోవాల్సి ఉంది. దీనికోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఇలాంటి సేవలను అందించాలంటూ గతేడాది చేసిన లైంగిక వేధింపుల నుంచి బాలల సంరక్షణ చట్టం -2012లో నిబంధనలు కూడా రూపొందించారు. తమ దగ్గరకు వచ్చే వికలాంగ మహిళలకు కావాల్సిన అన్ని రకాల సాయం, సేవలు అందించడానికి పోలీసు స్టేషన్లు, కోర్టులు, న్యాయాధికారులు, ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఆదేశాలు జారీ చేయాలి. అలాగే పోలీసు, న్యాయ, వైద్య నిపుణులకు తగిన రీతిలో శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి కేసుల్లో దర్యాప్తుకు దేశవ్యాప్తంగా అందరూ అనుసరించేలా ప్రామాణిక నిర్వహణా పద్ధతులు(ఎస్‌ఓపి) తప్పనిసరి చేయాలి. అలాగే బాధితులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారికి పునరావాస సౌకర్యాలు కల్పించాలి.
-మురళీధరన్
PRAJASHAKTI TELUGU NEWS PAPER DATED: 1/2/2013
No comments:
Post a Comment