Sunday, February 3, 2013

జైపూర్ సాహిత్య పండుగ...ఆడవారి తెలివికి అద్దం ---కంచ ఐలయ్య, 
సాహిత్య ప్రేమ అంతర్జాతీకరించబడితే ఒక జె.ఎల్.ఎఫ్ పుడుతుంది. అక్కడికి ఎక్కువగా దళిత-బహుజన ఆదివాసీ రచయితలు ఇంకా రావడం లేదు. ఆ స్థాయి ఇంగ్లీషులో రచనలు చేసిన వారు చాలా తక్కువ. నా పుస్తకాన్ని లాంచ్ చేస్తున్నప్పుడు నాతో చర్చా వేదికను పంచుకున్నది ఒక సంతాల్ రచయిత్రి. అయితే ఆమె సంతాలీ, హిందీలో మాట్లాడింది. ఆమెకే ఇంగ్లీషు వచ్చి ఉంటే వాళ్ళ కథలు మహాశ్వేతాదేవి ప్రపంచానికి తెలపాల్సిన అవసరం లేదనిపించింది... ఆంగ్ల విద్యను అందరికీ అందుబాటులోకి తెస్తే మరో 20 సంవత్సరాలలోపు ఆ వేదికలో మెజారిటీ దళిత-బహుజన ఆదివాసులే ఉంటారనే ఆశతో నేరు తిరుగు ప్రయాణం పట్టాను. 

జైపూర్ సాహిత్య పండుగ 2006 నుంచి నడుస్తోంది. అయితే అంతకు రెండేళ్ల ముందే డిగ్గీ ప్యాలెస్ యజమానులు - జైపూర్ మహారాజా కుటుంబీకులు - ఈ సాహిత్య పండుగని చిన్న స్థాయిలో నడిపారు. అందుకే ఆ పురాతన ప్యాలెస్ హోటల్‌ను వాళ్ళు ఉచితంగా ఇస్తారు. పండుగంటే దేవతలకు ఆరగింతలు, పట్టుబట్టల ప్రకంపనాలు కాదు. జైపూర్ సాహిత్య పండుగ తెలివిని తెల్లారబోయించి ప్రతి ఆరాటానికి అక్షర రూపం ఇప్పించే ఒక నూతన ప్రక్రియ. ఆ పండుగలో మంచ్ మీద మాట్లాడుతుంటే అందరిలో కూర్చొని వింటుంటే ఎంత సంబురమో! ఇది ప్రపంచ రచయితలందరూ రాసుకు తిరిగే రచ్చబండ. ఆడవాళ్ళు మగవాళ్ళు డ్రెస్ కోడ్‌లో కూడా తేడా లేకుండా 'హాయ్' అని అలాయి బలాయి తీసుకునే అభివృద్ధి చెందిన సంస్కృతికి అద్దం. అన్ని రంగాలకు (అన్ని కులాలకు ఇంతే కాదు) అన్ని దేశాలకు చెందిన ఆడ-మగ ఐదు రోజులు ఆలోచనతో, పుస్తకాలతో కుస్తీ పట్టే రాజరికం నాటి రచ్చబండ అది.

ఈ సంవత్సరం రెండు లక్షల మంది ఆ రచ్చబండలో రాసుకు తిరిగారు. ఈ రెండు లక్షల మందికి పాసులివ్వడం, బయట కొన్ని జంతు లక్షణాలు కనబరిచిన వారిని సైతం మనుషులుగా మలుచుకొని, పుస్తకాల గురించి, అన్ని దేశాల్లో జరిగే అద్భుతాల గురించి, ఆగడాల గురించి నేర్చుకునే మంచి మనుషులుగా మలిచే కార్యకర్తల్లో అమ్మాయిలే ఎక్కువ. వీళ్ళంతా మంచి ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు. ఇక్కడ తెలుగు మహాసభల్లా అర్ధ నగ్నత, ఆకలి మంటలు ఉండవు. ప్రభుత్వ రచయితలు, పైసలు, దోతులు, చీరలు అతి తక్కువ. ప్రపంచ జ్ఞానాన్నంతా తమ చేతుల్లో పెట్టుకొని ప్యాంట్ - కోటు వేసుకొని మగవాళ్ళందర్నీ మేము చెప్పేది వినండి అనే ఆడవాళ్ళే ఎక్కువ.

ఐదు విభిన్న వేదికలపై అనుకున్న సమయానికి- అర నిమిషం - ముందే ప్రారంభం అయ్యే సెషన్స్‌లో ముఖ్యమంత్రి (గెల్హాట్ వచ్చారు). గవర్నర్ (మార్గరెట్ అల్వా), దలైలామా వచ్చినా మనుషుల్లో మనుషుల్లా కూర్చోవలసిందే. 2010లో నేనొక సెషన్‌లో కూర్చొని వింటున్నాను. నా వెనుక మాజీ ముఖ్యమంత్రి, విజయరాజె సింధియా కూర్చొని వింటోంది. అటువంటి సాధారణత్వానికి వేదిక ఈ పండుగ. ప్రాంతీయ సాహిత్య సభలో ఉండే బ్రాహ్మణీయత, పురుషాధిక్యత ఇక్కడి గాలిలో కూడా కనిపించదు. ఇది దళితీకరించబడ్డ ఆధునిక సాహిత్య పండుగ.

ఈ పండుగలో చర్చలెలా జరుగుతాయి? ఆ వేదిక మీద ఉన్న రచయితల పుస్తకాలను బాగా చదివిన విమర్శకురాలు/విమర్శకుడు వాళ్ళను ముందు నుంచే ప్రశ్నించడం మొదలవుతుంది. ఉదాహరణకు నేను రాసిన 'గాడ్ అజ్ పొలిటికల్ ఫిలాసఫర్' అనే నా పుస్తకం పేరుతో ఏర్పరచిన సెషన్‌ను పాట్రిక్ ఫ్రెంచ్ అనే విదేశీ రచయిత మోడరేట్ చేశారు. ఆయనకు నా రచనలపైనా, నా ఆలోచనా విధానం పైనా బాగా అంచనా ఉంది. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఆ టాపిక్ పరిధిలోనే వెతకాలి. చర్చ పూర్తిగా నిబద్దతతో జరగాలి.

ఈ చర్చ సందర్భంలోనే బౌద్ధ మతం, దేశంలో నేడు జరుగుతున్న మతమార్పిడుల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆడియన్స్‌లో ఉన్న జావేద్ అఖ్తర్‌కూ, నాకు ఆసక్తికరమైన చర్చ జరిగింది. నేను మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న వ్యక్తినని జావేద్ అఖ్తర్ భావించి ఉంటారు. 'నేను దేవునిపై నమ్మకం లేనివాడిని, మతాల్లో ఉండడమంటే గుహలలో ఉన్నట్టు. ఏ మతంలో మనుషులుండడాన్ని అంగీకరించినా, ఆత్మహత్యకు సిద్ధంగా ఉండండి అని చెప్పడమే' అని నన్ను నిలదీశాడు. 

బుద్ధుడు అఖ్తర్ కంటే గొప్ప అథెయిస్టు అని ఆయనకు తెలియదు. అయినా ప్రజలకు దేవుడనే ఒక కొమ్మ కావాలి కనుక ఆయన్నే దేవుడిగా మార్చారనే అంశంపై ఆయనకు అంతకన్నా తెలియదు. ఆయనకు నేనిచ్చిన సమాధానం 'విశాల ప్రజల నిత్య జీవితం డ్రామా కాదు, సినిమా కాదు, హిందీ సినిమా అంతకన్నా కాదు' అని. వేల మందితో నిండి ఉన్న 'టాటా స్టీల్' హాల్ గొల్లుమని నవ్వింది. బుద్దుడు స్త్రీ విముక్తి విషయంలో 'డిజాస్టర్' అని ఒక ఎన్ఆర్ఐ రచయిత్రి నన్ను నిలదీశారు. బుద్ధుడు బతికుండగానే సంఘాల్లో చేరిన స్త్రీలు తాము అనుభవిస్తున్న స్వేచ్ఛ గురించి రాసిన పాట ఒకటి చదివి వినిపించాను. బుద్ధుడు స్త్రీలకు ఏం చేశాడో ఇంద్రునితో, బ్రహ్మతో, రామునితో, కృష్ణునితో, విష్ణువుతో, శివునితో పోల్చి చూస్తే తప్ప అర్థం కాదని చెప్పాను. చర్చలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి.

అశిష్ నంది మాట్లాడిన సెషన్ మాత్రమే 'రిపబ్లిక్' అనే టాపిక్ నుంచి పక్కకుపోయి కరప్షన్ - కులాల పైకి మారింది. వివాదానికి దారితీసింది. అయినా అది మంచే చేసింది. దేశం మొత్తంలో ఏ కులం ఎక్కువ కరప్షన్‌తో సంపాదించుకున్నదో చర్చించడానికి ఇదొక అవకాశాన్నిచ్చింది. ఈ చర్చలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను సమూలంగా కరప్ట్‌గా చిత్రించిన ఆయన్ని సిద్ధాంత రంగంలో ఓడించాలి గానీ, అరెస్టుతో కాదని నేను తీసుకున్న లైన్ తెలిసిందే.

జైపూర్ లిట్ ఫెస్ట్ పాటలు పాడుకొని, ఆటలాడుకొని, కవిత్వం రాసుకొని వహావ్వా - వహావ్వా అనుకునే వారికి అసలు వేదిక కాదు. సాహిత్యాన్ని అది చాలా విశాలంగా నిర్వహించింది. గొప్ప తత్వవేత్తలు, చరిత్రకారులు, నవలా రచయితలు, కవులు, కళా రంగాల్లో పనిచేసేవారు తమ ఆలోచనా సరళిని అభివృద్ధి పరుచుకునేందుకు ఉపయోగపడే వేదిక అది. అందుకే అశీష్ నంది, ఐలయ్య, దలైలామా, మహా శ్వేతాదేవి అందరూ అందులో ఆలోచనా సంఘర్షణ చేస్తారు.

గత సంవత్సరం ఓ ఫ్రావిన్ ప్రీ, సల్మాన్ రష్దీ చర్చనీయాంశం అయ్యారు. అయితే రష్దీ రాలేదు. ఆయన్ని కొన్ని శక్తులు రానీయలేదు. ఈ ధోరణులే దురదృష్టకరం. కానీ ఈ సంవత్సరం ఏ భిన్న అంశం కూడా చర్చలను పక్కదారి పట్టనీయలేదు. ప్రపంచంలో చాలా గొప్ప ముస్లిం రచయితలున్నారని నాకీ చర్చల ద్వారా తెలిసింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఇరాన్ వంటి దేశాల్లో మనదేశం ఊహించలేని సాహిత్య ఎక్స్‌పెర్‌మెంట్స్ జరుగుతున్నాయి. జమీల్ అహమ్మద్, మహమ్మద్ హనీఫ్, ఎం.ఎ. ఫారూఖీ, అమీనా సాయిదా, నధీమ్ అస్లామ్, అస్ఘరలీ ఇంజనీర్ ఇంకెంతో మంది అద్భుతమైన రచనలు చేశారు. అందులో నన్ను బాగా ఆకట్టుకున్న రచయిత నధీమ్ అస్లామ్. పాకిస్థాన్‌లో అతి బీద కుటుంబంలో పుట్టి ఇంగ్లండుకు కూలీగా వలసపోయి హోటళ్ళలో పనిచేస్తూ గొప్ప రచయిత అయ్యారు. చాలా చిన్న వయస్సులోనే ప్రపంచ గుర్తింపు పొందారు. 'బ్లైండ్ మ్యాన్స్ గార్డెన్' నవల రాయడానికి వారాలకు వారాలు కళ్లకు గంతలు కట్టుకుని బ్లైండ్ మ్యాన్‌గా జీవించారు. ఆ నవలతో ఆయన ప్రపంచం కళ్లు తెరిపించారు. నలభై కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు మహాసభలు ఈ రాష్ట్రం నుంచి ఒక నధీమ్ అస్లామ్‌ను తయారు చెయ్యగలిగితే ఎంత బాగుండేది. గొప్ప సాహిత్యం పైరవీ అవార్డులలో పుట్టదు. అది ప్రజా జీవనాన్ని మార్చే పోరాటాల్లో - ఆరాటాల్లో పుడుతుంది. రానున్న ఇరవై సంవత్సరాల్లో పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ రచయితలు మన దేశంలో ఏ ప్రాంతీయ భాషలో రాయలేనటువంటి సాహిత్యాన్ని సృష్టిస్తారు. వారు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ వెనుకబాటుతనంపై ఇంగ్లండు, అమెరికా నుంచి పోరాటం చేస్తున్నారు. ఇది నాకొక గొప్ప కనువిప్పు.

జైపూర్ లిట్ ఫెస్ట్ ప్రపంచ సాహిత్య, తాత్విక ప్రక్రియలన్నిటినీ పోల్చిచూసుకోడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశంలో సాహిత్య ప్రక్రియలు అభివృద్ధి కాకపోవడానికి బ్రాహ్మణిజం ప్రధాన కారణం. ఒక కులం- అదీ ఉత్పత్తితో సంబంధం లేని కులంలో సాహిత్యం బంధించబడినందువల్ల విభిన్న ప్రక్రియల అభివద్ధి ఇక్కడ జరగలేదు. సాహిత్య రంగంలో, సాంకేతిక రంగంలో, సైన్స్ రంగంలో మనం విదేశాలకు నేర్పగలిగే స్థితిలో లేము. సాహిత్య రంగంలోనైతే మనం పాకిస్థాన్ నుంచి కూడా నేర్చుకోవలసిందే. బ్రాహ్మణిక్ అర్రొగాన్స్ విద్యా రంగంలో పనికిరాదు. దానితోనే బాగా దెబ్బతిన్నాం.

స్త్రీల హక్కుల సమానత్వం వంటి రంగాల్లో చాలా ముస్లిం దేశాలు మనకంటే ముందున్నాయి. పాకిస్థాన్‌లో బెనజీర్ భుట్టో, ముషరఫ్ రాసిన ఆత్మకథలు, భుట్టో మనువరాలు ఫాతిమా భుట్టో రాసిన 'సాంగ్స్ ఆఫ్ బ్లడ్ అండ్ స్వోర్డ్' ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. పుస్తకాల పేర్లు పెట్టడంలోనే రచయిత స్థాయి తెలిసిపోతుంది. బెనజీర్ భుట్టో తన పుస్తకానికి 'ది డాటర్ ఆఫ్ ఈస్ట్' అని పెట్టి తూర్పు ప్రపంచానికంతా తాను ప్రతినిధి అయింది. రచయితలు ఏ భాషలో రాస్తున్నారనే దాని కంటే ఎటువంటి స్టాండర్డ్ గల పుస్తకాలు రాస్తున్నారనేది ముఖ్యం. జె.ఎల్.ఎఫ్. సాహిత్య ప్రక్రియలను ఒకచోట, అదీ మనదేశంలో చర్చించడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది.

రచనా రంగంలో ఉన్నత విలువలను, స్టాండర్డ్స్‌ని ప్రవేశపెట్టాలంటే రచనా పద్ధతులపైన పట్టు ఉండాలి. కొన్నివేల ఏళ్లు భారతదేశంలో ఆత్మకథ, నవల, ప్రక్రియలుగా ఉంటాయని తెలియదు. ఈ దేశం పురాణాల మీద పుస్తకాలు రాసి సంబరపడింది. సమకాలీన ప్రజల జీవితాలను, చరిత్ర ఘట్టాలను పుస్తకాలుగా మలచడానికి పుక్కిటి పురాణాలు పనికిరావు. నిజ జీవితాలను కొత్తకొత్త కోణాల నుంచి గ్రంథస్థం చేయాలి. అదీ కేవలం రాజ్యం, పోరాటాల గురించి రాస్తే పోరాటాలు లేకపోతే రాయలేని స్థితి వస్తుంది. ప్రజల రోజువారీ జీవితం మీద గొప్ప గొప్ప రచనలు చెయ్యగలగాలి. జె.ఎల్.ఎఫ్. వివిధ ప్రక్రియల మీద రచనలు చేసిన కొత్త రచయితలను ఒకచోట చేర్చి చర్చలు చేయించింది. సాయంకాలం గ్రామాల్లో 'కల్లు మండువాల దగ్గర' కళల గురించి చర్చించినట్టు వైన్ తాగుతూ ఆడ-మగ, తింటూ చర్చించుకుంటారు. కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటారు. గ్రామాల్లో 'కల్లు మండువ' ఎలాగైతే పంటల గురించి మంచి చెడ్డల గురించి చర్చించే వేదికో, అలానే ఈ సభల సందర్భంగా 'వైనింగ్ అండ్ డైనింగ్'లో సాహిత్యంలో కొత్తకొత్త కోణాలను వ్యక్తుల మధ్య పంచుకునే రూపంగా ఉంటుంది.

ఈ ప్రక్రియను చూస్తున్నప్పుడు, ఆడ-మగ తేడా లేకుండా మేధోపర సంఘర్షణలు ఒకచోట జరుగుతున్నప్పుడు 'వై ఐయామ్ నాట్ హిందూ'లోని దళితీకరణ చాప్టరంతా నా మదిలో మళ్ళీ ఒకసారి తిరిగింది. అయితే ఈ దళితీకరణ ముడిసరుకు రూపంలో లేదు. అదొక ఆధునికీకరించిన ఉన్నత రూపంలో ఉంది. దినమంతా రాతలపై చర్చ దాని పని. సాయంత్రం ఆ చర్చలను వ్యక్తులుగా సమన్వయపరుచుకోవడం దాని లక్ష్యం. ఇక్కడ నాకు తాగుబోతులు కనిపించలేదు. ఆ 'వైనింగ్ డైనింగ్‌కి' రిక్రియేటివ్ వాల్యూ ఉంది.

నేనక్కడ చూసిన మరో అద్భుతం డిగ్గీ ప్యాలెస్ ఓనర్ మహారాణులు బ్రహ్మాండమైన ఇంగ్లీషు మాట్లాడుతూ 'టాటా స్టీల్' వేదిక ఎదురుగా టీ అమ్ముతుండడం. 70 ఏళ్ల వయస్సు పైబడిన ముసలి మహారాణి ఇంగ్లీషులో ఆర్డర్లు తీసుకుంటూ స్వయంగా టీ, టిఫిన్ కూపన్లు చింపి ఇస్తుండడం. మీరెందుకు ఈ పనిచేస్తున్నారని నేనడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం.. 'ఈ పండుగను మేం ప్రారంభించాం. ఈ ప్యాలెస్‌ను ఉచితంగా ఇస్తున్నాం. అందులో మావంతు పాత్రగా టీ అమ్ముతున్నాం.' మహారాణులు శ్రమ గౌరవ పాఠాలు నేర్చుకొని పనిచేస్తున్న వేదిక అది. ఇది వారి ఆంగ్ల విద్యలో సాధ్యమైంది. సాయంకాలం ఒక రాణి వైన్ గ్లాస్ పట్టుకొని ఒక విదేశస్థునితో చర్చిస్తుండగా నేను చూసాను. ఆ కుటుంబ మహారాజులు నాకక్కడ కనిపించలేదు. బహుశా స్త్రీలల్లో వచ్చిన మార్పు వారి పురుషుల్లో వచ్చి ఉండకపోవచ్చు.

సాహిత్య ప్రేమ అంతర్జాతీకరించబడితే ఒక జె.ఎల్.ఎఫ్ పుడుతుంది. అది మాత్రమే ఉన్నత ప్రమాణాలను సంతరించుకుంటుంది. అక్కడికి ఎక్కువగా దళిత-బహుజన ఆదివాసీ రచయితలు ఇంకా రావడం లేదు. ఆ స్థాయి ఇంగ్లీషులో రచనలు చేసిన వారు చాలా తక్కువ. నా 'అన్‌టచబుల్ గాడ్' పుస్తకాన్ని లాంచ్ చేస్తున్నప్పుడు నాతో చర్చా వేదికను పంచుకున్నది ఒక సంతాల్ రచయిత్రి. ఆమెకే మొదటి ప్రతి అందజేశాం. అయితే ఆమె సంతాలీ, హిందీలో మాట్లాడింది. ఆమెకే ఇంగ్లీషు వచ్చి ఉంటే వాళ్ళ కథలు మహాశ్వేతాదేవి కూడా ప్రపంచానికి తెలపాల్సిన అవసరం లేదనిపించింది. ఆంగ్ల విద్యను అందరికీ అందుబాటులోకి తెస్తే మరో 20 సంవత్సరాలలోపు ఆ వేదికలో మెజారిటీ దళిత-బహుజన ఆదివాసులే ఉంటారనే ఆశతో నేరు తిరుగు ప్రయాణం పట్టాను.

- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త


Andhra Jyothi News Paper Dated: 4/1/2013

No comments:

Post a Comment