Thursday, February 21, 2013

తెలంగాణ ఫ్యూడలిజం - సామాజిక న్యాయం - కంచ ఐలయ్యతెలంగాణ ఫ్యూడలిజం దాని వత్తాసు దారులైన రెడ్డి-వెలమలు వారి కనుసన్నల్లో లేదా నాయకత్వంలో ఒకవేళ తెలంగాణ వస్తే సామాజిక న్యాయం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై ఈ మధ్య కొంత చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న దశలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవాలా వద్దా అన్నది ఈ అంశంతోనే ముడిపడి ఉంది. తెలంగాణ ఫ్యూడలిజాన్ని (ముఖ్యంగా ఇక్కడి రెడ్డి - వెలమల ఫ్యూడల్ విలువల్ని) అంచనా వేసేటప్పుడు ప్రపంచంలో వివిధ దేశాల్లో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బతికి బట్టగట్టి, మారిన-లేదా మారుతున్న ఫ్యూడల్ వ్యవస్థలపై ఒక మంచి చారిత్రక అంచనా అవసరం. ఫ్యూడల్ శక్తులు చాలా దేశాల్లో అక్కడ ముందుకొచ్చిన విప్లవ పోరాటాల్లో, వాటితోపాటు అభివృద్ధి కానారంభించిన పెట్టుబడిదారీ సంబంధాల్లో మారుతూ వచ్చాయి.

మనదేశంలో కూడా ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు శక్తులు పోరాటాలు చేశాయి. మరికొన్ని దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భం నుంచి పుట్టుకొచ్చిన ప్రజాస్వామిక శక్తులు పోరాటం చేశాయి. ఫ్యూడల్ శక్తులు మారాయా లేదా అనేదానికి కొలబద్ద - ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనదేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు ఫ్యూడల్ శక్తులను కలుపుకొని లేదా అగ్రకులాల నాయకత్వంలో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

కొన్ని పాంత్రాల్లో ఇరవయ్యవ శతాబ్దపు మొదటి దశ - లేదా మధ్య దశలో బలమైన కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి. అందులో తెలంగాణ, బెంగాల్, కేరళలలో చరిత్రలో ప్ర పోరాటాలు జరిగాయి. ఈ మూడు చోట్ల ఫ్యూడల్ శక్తులు కులతత్వంతో ముడివడి ఉన్నాయి కనుక తమ ఆధిపత్యాన్ని చాలా పదిలంగా కాపాడుకున్నాయి. కానీ తెలంగాణలో రెడ్లు-వెలమలు (ఇక్కడి బ్రాహ్మణుల అండతో) బెంగాల్ కేరళ కంటే ఎంత ప్రజావ్యతిరేకమైనవిగా వ్యవహరిస్తున్నాయో చూడాలి.

ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని విధంగా ఇక్కడ రెండు ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు జరిగాయి. మొదటిది చరిత్రకెక్కిన తెలంగాణ సాయుధ పోరాటం. రెండవది మళ్ళీ మహత్తర రక్తపాతంతో కూడిన నక్సల్‌బరీ పోరాటం. ఈ రెండు పోరాటాలు తెలంగాణలోని రెడ్డి, వెలమ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినవే. ఇం దులో వేలాదిమంది చనిపోయారు. గ్రామాలు రక్త-సిక్త మయ్యాయి. ఈ రెండు పోరాటాల్లో ఇక్కడి ఆదివాసీ, ఎస్సీ, బీసీ ముందుగుండు సామగ్రిలా కాల్చబడ్డారు. పోరాట ఫలితాలు విచిత్రంగా రెడ్డి-వెలమలకు దక్కాయి. 

అతి కొద్దికాలంలోనే ఇక్కడ కమ్యూనిస్టు-విప్లవ చైతన్యం కూడా వారి కాళ్ళకింద మట్టిలా మారిపోయింది. ఆంధ్రలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఇంత భీకర పోరాటం జరగలేదు. రాయలసీమలో అరకొర తప్ప ఇటువంటి పోరాటం జరగలేదు. అయినా అక్కడి భూస్వామ్య శక్తులు ఎంతో కొంత పెట్టుబడిదారీ శక్తులుగా ఎదిగాయి. రాయలసీమలో ఫ్యాక్షనిజంతో కలగలిసి లుంపన్ పెట్టుబడి ఎదుగుతుంది. తెలంగాణలో ఏ పెట్టుబడికీ తావులేని ఫ్యూడలిజం రెండు భీకర విప్లవ పోరాటాల తరువాత కూడా ఎలా బతికి ఉంది? ఈ శక్తులే అగ్రకుల ఆధిపత్య కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇక్కడ లేకుండా ఎలా చెయ్యగలిగాయి?

ఇక్కడి ఫ్యూడల్ శక్తులు బలంగా - ఫ్యూడలిజంలోనే కూరుకొని ఉండి ఆధిపత్య శక్తులుగా కొనసాగుతున్నాయనటానికి 1969 తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు జరుగుతున్న 'వసూలు ఉద్యమంలో' వారే అన్ని కులాలను తమ చెప్పు కాలికింద పెట్టుకొని నడుపుతున్నారనేది ప్రూఫ్ కాదా? ఈ శక్తులు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎదిగిన కొద్దిమంది ఎస్సీ, బీసీ నాయకులను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలిగారు. ఆ తరువాత 2001 నుంచి తిరిగి వెలమ-రెడ్డి నాయకత్వంలో ముందుకొచ్చిన 'వసూలు ఉద్యమంలో' అన్ని రకాల దళిత-బహుజన నాయకత్వాన్ని, మేధావి వర్గాన్ని (కొద్ది మందే ఉన్నారు) పూర్తిగా తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్నారు. 

1969 నాటికి ఎన్నికల రంగంలో ఇంకా బతికి ఉన్న కమ్యూనిస్టు ప్రజాస్వామిక చైతన్యాన్ని (ఎన్నికల రంగంలో) కూడా చంపగలిగారు. మళ్ళీ ఎన్.టి. రామారావు పార్టీ పెట్టి కమ్యూనిస్టులకు ప్రాణం పోసే వరకూ తెలంగాణ ఫ్యూడల్ శక్తులు కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు కూడా దక్కనివ్వలేదు. ఈ విధంగా కరుడుగట్టి, నిలదొక్కుకుని, తెలంగాణ సాయుధ పోరాట ఫలితాలను సైతం మట్టిలో తొక్కి గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న తెలంగాణ భూస్వామ్య వర్గంపైన నక్సలైటు ఉద్యమాల్లో చేరి ప్రజలు తిరుగుబాటు చేశారు. నేనింతకు ముందే చెప్పినట్లు 6,000 మంది ప్రాణాలను ఈ ఫ్యూడలిజం బలిగొన్నది.

ఆ పోరాటాలన్నిటినీ మళ్ళీ తెలంగాణ ఉద్యమం పేరుతో మాజీ నక్సలైట్లందర్నీ, నక్సలిజం చుట్టూ తిరిగి కవిత్వమో, కథలో రాసిన రచయితల్ని మళ్ళీ తమ గడీల్లో బంధించగలిగింది. ఇప్పుడు గ్రామాల్లో కూడా కమ్యూనిస్టు-నక్సల్‌బరీ-మావోయిస్టు చైతన్యం అడుగంటిపోయి దొరల 'ఇన్నోవా' కార్లలో కవులు - కళాకారులు, మాజీ నక్సలైట్లు 'జై తెలంగాణ' అంటూ తిరుగుతున్నారు. ఇక్కడి రెడ్డి, వెలమలు ఎంత కరుడుగట్టిన - తెలివైన ఫ్యూడల్స్ అయితే ప్రపంచాన్నే గడగడలాడించిన మార్క్స్‌ను, లెనిన్, మావోలను సైతం తమ గడీల్లో నయా వెట్టి చాకిరీదార్లుగా మార్చగలిగారు? ఇది మాటల విషయం కాదు. అందువల్లే తెలంగాణ ఫ్యూడల్ రెడ్డి - వెలమల్ని మిగతా ప్రాంతపు ఫ్యూడల్స్‌తో పోల్చడం సాధ్యం కాదు.

సమైక్య ఆంధ్రలో ఆంధ్రుల దోపిడీతో పాటు ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అభివృద్ధి కాకుండా తెలంగాణ దొరలు చేయగలిగిన ప్రత్యేక పనులున్నాయి. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్ర, రాయలసీమల్లో ఎప్పుడూ బలాన్ని సంపాదించుకోలేదు. అయినా అవి అభివృద్ధి చెందాయి (ఎంతో కొంత). ఇక్కడ కమ్యూనిస్టు - మావోయిస్టు పార్టీలు కేంద్రీకరించి పోరాడింది ఇక్కడి ఫ్యూడలిజాన్ని బలహీనపర్చి అభివృద్ధి పథంలో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికే. కానీ ఇక్కడి ఫ్యూడల్ శక్తులు కమ్యూనిజాన్ని - మావోయిజాన్ని మట్టుపెట్టగలిగాయి. 

ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధి కాకుండా చూసుకున్నాయి. ఇక్కడి అభివృద్ధిని ఆంధ్ర పాలకులు మాత్రమే అడ్డుకోలేదు. తెలంగాణ దొరలు ఈ పనిలో మంచి పాత్ర పోషించారు. ఎక్కడైనా గానీ ఫ్యూడలిజం విశాల ప్రజల మధ్య విద్య అభివృద్ధి కాకుండా చూసుకుంటుంది. ఆధునిక విద్య ప్రజాస్వామీకరించబడి అభివృద్ధి అయిన అన్ని వర్గాల ప్రజల్ని ఆధునిక చదువులోకి రానిస్తే ఆ ప్రాంతంలో పెట్టుబడి కూడా ఎంతోకొంత అభివృద్ధి అవుతుంది.

ఈ ప్రాంత ఫ్యూడల్స్ మొదటి నుంచి విద్య అభివృద్ధి కాకుండా చూసుకున్నారు. గ్రామ స్థాయిలో స్కూళ్ళు నడవకుండా చూసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరుతో 1969 నుంచి యూనివర్సిటీ విద్యను ఏమాత్రం నిలకడ లేనిదిగా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రజాస్వామిక రాజ్యాంగంలో, ఎన్నికల రంగాన్ని ఫ్యూడలీకరించి, దాని ద్వారా డబ్బు సమీకరించి ఫ్యూడల్ లగ్జరీలకు ఖర్చు చెయ్యడం తెలంగాణ ఫ్యూడల్స్ ప్రత్యేక లక్షణం. 

దానికి ఈ ప్రాంతపు బ్రాహ్మణిజం అన్ని 'రూపాల్లో' వంత పాడుతూ వచ్చింది. 1969 నుంచి ఇప్పటిదాకా కోద్దోగొప్ప చదువు బ్రాహ్మణుల చేతిల్లో, డబ్బు, రాజకీయ అధికారం రెడ్డి-వెలమల చేతుల్లో పెట్టుకొని ఇక్కడి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలకు ఇటువంటి ఫ్యూడల్ కుట్ర అర్థం కావడం కష్టం. తెలంగాణ రాష్ట్ర సమస్య అన్ని రకాల ఐడియాలిజికల్ శక్తుల్ని నయా గడీలకు తాబేదార్లను చేసింది కనుక అర్థం చేసుకునే సత్తా ఎవరికీ లేకుండా పోయింది. యూనివర్సిటీల స్థితే చూడండి. ఈ ఫ్యూడల్ కుటుంబాల నుంచి వచ్చిన వారు పైరవీలతో, కుల/రాజకీయ బలంతో ప్రొఫెసర్ వృత్తిలో చేరి అక్కడ చదువును అభివృద్ధి చెయ్యడం కంటే నాశనం చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 

పెద్ద సంఖ్యలో యూనివర్సిటీ కాలేజీ టీచర్లు అయ్యి టీచింగ్‌కు, రీసెర్చ్‌కి ఏ ప్రాధాన్యం లేని స్థితికి తెచ్చారు. రిజర్వేషన్లను ముందు అమలుచెయ్య నిరాకరించారు. తప్పని స్థితిలో డిగ్రీలు ఉండి, సీరియస్ టాలెంట్ లేనటువంటి వారిని ఎంచుకొని నియమించడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఉద్యోగంలో చేరగానే అడ్మినిస్ట్రేటివ్ పదవులు, ఫైనాన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టూ చక్కర్లు ప్రొఫెసర్ల ముఖ్య డ్యూటీలుగా మార్చారు. తమ పిల్లల్ని ప్రైవేటు సంస్థల్లో చదివించడం కింది కులాల వాళ్ళు ఉండే ప్రభుత్వ సంస్థలను నాశనం చెయ్యడం ఒక 'ఫ్యూడల్ విద్యా విలువగా' రూపొందించారు.

ఇక్కడి పాత యూనివర్సిటీలైన ఉస్మానియా, కాకతీయల్ని చూస్తే వాటిని వీరేమి చేశారో అర్థమౌతుంది. ఈ స్థితిలోనే కేంద్రం దాని అవసరాలకొద్దీ (ప్రభుత్వాన్ని జగన్, కె.వి.పిల నుంచి రక్షించుకునేందుకు) 2009 డిసెంబర్ 9 ప్రకటన చెయ్యగానే ఫ్యూడల్ కుటుంబాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లంతా జేఏసీల్లో పని, పైసల వసూళ్ళు, నాయకత్వ ఉపన్యాసాలు పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. అన్ని కులాల టీచర్లకు కూడా చదువు చెప్పకుండా జీతం రావడం, జేఏసీల్లో చేరి నినాదాలివ్వడం సులభమైంది. ఒక్క పుస్తకం గానీ, వ్యాసంగానీ రాయని వ్యక్తులు ప్రొఫెసర్ డిజిగ్నేషన్‌తో రోజూ రోడ్లమీద ఉండడం ఇక్కడ తప్ప, ఎక్కడా సాధ్యం కాదు. 

ఇదంతా ఫ్యూడలిజం ప్రభావమే. జేఏసీల పేరుతో మళ్ళీ దొరలు 'మజా' చేసుకుంటుంటే మావోయిస్టు మేధావులు సైతం 'విముక్తి ప్రాంతాలేర్పడుతున్నట్లు' గంతులెయ్యడం ఇక్కడే చూస్తాం. ఇదే తెలంగాణ ఫ్యూడలిజపు ప్రత్యేక లక్షణం. ఇది ప్రజల మెదళ్లను తొలిచేసింది. ఇటువంటి శక్తులు ఒకవేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రెండు ఎన్నికల వరకూ అధికారం తమ చేతిలో ఉంచుకొని ఆ తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీలను రానిస్తారా? మావోను, లెనిన్‌ను, మార్క్స్‌నే బ్రాందీగా మల్చుకొని తాగినోళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని బతకనిస్తారా? ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పుడు ప్రజలు (తెలంగాణ ఆడవాళ్ళు) బట్టలు కట్టుకొని బతుకమ్మ ఆడితే అది వచ్చిన తెల్లారి నుంచే 'బట్టలిప్పి బతుకమ్మ' ఆడిస్తారు. తెలంగాణ జీవితం ఒక షేక్స్‌పియర్ డ్రామా.

అన్ని ట్రాజడీలకు అది ఆలయం. ఇక్కడి ఫ్యూడల్స్ చరిత్రలోనే సర్వమానవ సమానత్వాన్ని కోరుకునే లక్షణం లేదు. ఇన్ని విప్లవ పోరాటాల తరువాత కూడా ఇక్కడ ఫ్యూడల్స్‌లో ఏమాత్రం మానవ విలువలు పెరుగలేదు. ఫ్యూడల్స్‌లో చదువు ద్వారా నేర్చుకునే సంస్కారం ఉండదు. చదువును చంపే సంస్కారమే ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏం చెయ్యాలనేది పెద్ద సమస్యే? తెలంగాణ చందమామను చూపెట్టి విద్యావంతులంతా రోడ్లమీద ఉండడం, ఏ పనిమీద కేంద్రీకరించకపోవడం అలవాటైంది. ఇక్కడి ఫ్యూడల్ శక్తులను విమర్శించినా పాఠాలు చెప్పకుండా తిరిగే పంతుళ్లకూ చాలా కోపం వస్తుంది. గడిలోని కవులకు, కళాకారులకు కోపం వస్తుంది. ఇదిప్పుడు ఆలోచనకు రక్షణ లేని రాజ్యం.

ఈ ఫ్యూడలిజంలోని ఒక లక్షణం కొంత ఆశను మిగిల్చింది. కేంద్ర ప్రభుత్వపు పైసలు - పదవులు, బిజినెస్ డీల్స్ ఆశపెడితే అది తెలంగాణ నినాదాన్ని, గెలిచిన సీట్లను అమ్ముతుంది. ఈసారి వసూళ్ళు ప్రధానమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం రాదని ప్రధాన నాయకులుగా ఉన్న ఫ్యూడల్స్ అందరికీ తెలుసు. సామాజిక న్యాయం వారి ఎజెండా కాదు. కానివ్వరు. ఈ దఫా తెలంగాణ ఉద్యమం పేరుతో సాధారణ ప్రజలు (ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు) ఎక్కువగా నష్టపొయ్యారు. 

ముందు ప్రజల ఉనికి ముఖ్యం, వాళ్ళ పిల్లల చదువులు ముఖ్యం. ముఖ్యంగా ఈసారి తెలంగాణ ఉద్యమం పేరుతో అన్ని రకాల ప్రొగ్రెసివ్ ఆలోచనలకు అడ్డుకట్ట వేశారు. ప్రత్యేక రాష్ట్రం రాదని చెబుతున్నా తమ ఉనికినీ, సంపాదనలను కాపాడుకునేందుకు ఏవో కొన్ని ఉద్యమాలు నడపడం వారి అవసరం. ఎస్సీ, బీసీ, ఎస్టీల్లారా పోలీసు దెబ్బలు, కేసులుమీకు, పైసలు, పదవులు వాళ్ళకు. అయినా ఇష్టమైతే వారితోనే ఉండండి. తెలంగాణ రాదు; వచ్చినా మీకేమీ దొరకదు.

- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated : 22/2/2013

No comments:

Post a Comment