Saturday, February 9, 2013

పురాణ కథలు కుల తటస్థీకరణ --KalluriEditorial-Photo2
భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ముందు అందరూ సమానమే. అందులో కుల, మత, ధనిక, పేద తేడాలు లేవు. అయితే, ఈ నీతిని ఉల్లంఘించేవారు లేరా అంటే ఉన్నారు. అది వేరే చర్చ. మరి మహాభారత రాజ్యాంగం ప్రకారం కూడా చట్టం ముందు అందరూ సమానమేనా? కాదని ‘నాడీజంఘుడు అనే కొంగ-గౌతముడు’ అనే బ్రాహ్మణుని కథ చెబుతుంది. మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసంలో ఈ కథ ఉంది. 
సంగ్రహంగా కథ ఇదీ: గౌతముడు కులధర్మం వదిలేసి ఒక బోయను పెళ్లి చేసుకున్నాడు. ధనసంపాదన కోసం కొంతమంది వర్తకులతో కలసి దేశాంతరం బయలుదేరాడు. వారు ఒక కీకారణ్యంలోంచి వెడుతుండగా ఒక అడవి ఏనుగు వారిమీద పడింది. ప్రాణభయంతో తలోవైపుకీ చెదిరిపోయారు. గౌతముడు ఒంటరిగా ముందుకు సాగాడు. అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. ఆ చెట్టు మీద నివసించే నాడిజంఘుడు అతనిని చూసి జాలిపడ్డాడు. ఆతిథ్యమిచ్చి అలసట తీరేలా సేవలు చేశాడు. నీకు కావలసినంత ధనమిస్తాడని చెప్పి తన మిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు దగ్గరకు పంపించాడు.

రాక్షసరాజు అతనికి మోయలేనంత ధనమిచ్చి పంపించాడు. తిరిగి మర్రిచెట్టు దగ్గరకు వచ్చిన గౌతముని నాడీజంఘుడు యథాప్రకారం ఆదరించాడు. గౌతమునిలో ఒక దుర్మార్గపు ఆలోచన పుట్టింది. బాగా బలిసి ఉన్న ఈ కొంగ తనకు కడుపునిండా ఆహారమవుతుందనుకున్నాడు. నిద్రపోతున్న కొంగను కట్టెతో బాది చంపేశాడు. మాంసం వలిచి మూట కట్టుకుని డొక్కను అక్కడే వదిలేసి ప్రయాణమయ్యాడు. 
రోజూ తన దగ్గరకు వచ్చే నాడీజంఘుడు ఎంతకూ రాకపోయేసరికి విరూపాక్షుడు కీడు శంకించాడు. ఏంజరిగిందో తెలుసుకు రమ్మని భటులను పంపించాడు. కొంగ డొక్కను చూసిన భటులకు జరిగింది అర్థమైంది. గౌతముడే కొంగను చంపిఉంటాడని గ్రహించిన భటులు అతన్ని వెతికి పట్టుకుని బంధించి విరూపాక్షుని ముందు నిలబెట్టారు. ఈ కృతఘు్నని మీరే చంపి తినెయ్యకుండా నా ముందుకు ఎందుకు తీసుకొచ్చారని విరూపాక్షుడు అన్నాడు. మాకు మాత్రం నీతి లేదా? ఈ పాపాత్ముని శరీరాన్ని మేమెలా తింటామని భటులు అన్నారు. అతన్ని తీసుకెళ్లి నెత్తుటి గాయాలు అయ్యేలా ఒక ఎతె్తైన ప్రదేశం నుంచి కిందికి తోసేశారు. ఆకలితో నకనకలాడుతూ ఆ సమీపంలోనే తిరుగుతున్న కుక్కలు కూడా అతన్ని తినడానికి ఇష్టపడలేదు. 

మిత్రుని మరణానికి దుఃఖించిన విరూపాక్షుడు కొంగ డొక్కను తెప్పించి దహనసంస్కారాలు చేశాడు. అంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. నాడీజంఘుడు నీకే కాదు, బ్రహ్మకు కూడా మిత్రుడేననీ, అతడు తనను చూడడానికి ఈ రోజు రాకపోవడంతో ఆందోళన పడుతున్నాడనీ చెప్పాడు. నువ్వు నాడీజంఘునికి దహనసంస్కారంచేసి వెళ్ళిన తర్వాత దగ్గరలోనే ఒక ఆవు దూడ- తల్లిగోవు వద్ద పాలు తాగుతుండగా దాని మూతికి అంటిన పాలనురగ గాలికి ఎగిరివెళ్లి చితిమీద పడిందనీ, దాంతో నాడీజంఘుడు ప్రాణాలతో లేచికూర్చున్నాడనీ, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడనీ చెప్పాడు. 

నాడీజంఘుడు వచ్చాడు. తనవల్ల బ్రాహ్మణునికి ఇలాంటి దుర్దశ కలిగినందుకు నొచ్చుకు న్నాడు. అతన్ని విడిచి పెట్టేలా వరమిమ్మని ఇంద్రుని కోరాడు. బ్రహ్మ ఉద్దేశం కూడా అదేనని దివ్యదృష్టితో తెలుసుకున్న ఇంద్రుడు నాడీజంఘుని కోరిక తీర్చాడు. విరూపాక్షుడు భటులను పంపించి గౌతముని డబ్బుమూటలు తెప్పించి అతనికి ఇప్పించాడు. గౌతముడు వాటిని మోసుకుంటూ, తొట్రుపాటుతో మాటి మాటికీ వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయాడు.

కృతఘు్నని దేహాన్ని కుక్కలు కూడా తాకవని చెప్పడం ఈ కథలోని ప్రధాన ఉద్దేశం. దాంతోపాటే, పశుపక్షులలో కూడా దయ, క్షమ ఉంటాయనీ; మిత్రధర్మాన్ని, అతిథి మర్యాదను అవి కూడా పాటిస్తాయనీ చెబుతోంది. రాక్షసులను మనుషుల్ని తినే వారుగా చిత్రిస్తూనే వారికీ నీతి, మిత్రధర్మం ఉంటాయని అంటోంది. అలాగే ఒక వ్యక్తి భ్రష్ఠుడు, కృతఘు్నడు, హంతకుడు కావడానికి కులంతో సంబంధంలేదని కూడా చెబుతోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ హత్యవంటి తీవ్ర నేరానికి పాల్పడిన గౌతముని శిక్షించకుండా విడిచి పెట్టడం, పైగా డబ్బుమూటలు ఇచ్చి మరీపంపించడం నేటి మన అవగాహన రీత్యా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. చట్టంముందు అందరూ సమానులన్న సహజన్యాయాన్ని తలకిందులు చేసే ఇలాంటి కథలు మన పురాణ, ఇతిహాసాలలో చాలా ఉన్నాయి. 

అది ఆ కాలపు నీతి అనీ, ఇప్పుడు కుల, మత, లింగ వివక్షకు తావులేని కొత్త నీతిని తెచ్చుకున్నాం కనుక పాత కథలు తవ్వుకోనవసరం లేదనీ ఎవరైనా అనచ్చు. పైపైన చూస్తే ఇది సమంజసంగానే కనిపిస్తుంది. కానీ కాస్త లోతుకు వెడితే అలా అనిపించదు. ఇవి పాతకథలే అయినా ఇలాంటివి పొందుపరచిన భారత, భాగవత, రామాయణాదులు ఇప్పటికీ ప్రవచన, వ్యాఖ్యాన, కళారూపాలలో ప్రచారంలోనే ఉన్నాయి. కాకపోతే, నేటి సామాజిక, రాజకీయ వాతావరణంలో ఇబ్బందికరంగాతోచే విషయాలనుదాచి, పాక్షికంగా మాత్రమే వాటిని ప్రచారంలో ఉంచుతున్నారు. మరోవైపు, ఆ రచనలలోని కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పీడితసామాజిక వర్గాలు పోరాడుతున్నాయి. ఆ రచనల విశిష్ఠతను బోధించే సామాజికవర్గాలకూ, వీరికీ మధ్య అర్థవంతమైన సంభాషణ జరగడం లేదు. రెండూ పరస్పర శత్రుశిబిరాలుగా కొనసాగుతున్నాయి. పీడిత సామాజికవర్గాలు ఆ రచనలలోని చెడును ఎత్తి చూపుతుంటే, వాటి సమర్థకులు మంచిని మాత్రమే చూడమంటున్నారు. 

కుల, మత, ప్రాంత, లింగభేదాలకు అతీతంగా ఒక తటస్థ భూమికనుంచి ఆలోచింపజేసే నీతి, రాజనీతి, ధర్మం, మానవీయ విలువలకు సంబంధించిన అనేక మంచి విషయాలూ ఈ రచనల్లో ఉన్నమాట నిజమే. అయినాసరే, తమకు ప్రతికూ లమై న విషయాలు వాటిలో ఉన్నప్పుడు పీడిత సామాజికవర్గాలు ఉదారబుద్ధితో కేవలం మంచిని మాత్రమే చూడడం సాధ్యమేనా? అదీగాక, ఈ రచనలను మన దేశ సాంస్కృతిక, జ్ఞాన వారసత్వంలో భాగంగా గుర్తించి నప్పుడు ఈ వారసత్వానికి పాత/ కొత్త అన్న హద్దులు గీయడం తగనూ తగదు, సాధ్యమూ కాదు. వాటిని దేశవారసత్వంగా గుర్తించినప్పుడు నేటి ప్రజాస్వామిక యుగ లక్షణానికి అనుగుణంగా అన్ని సామాజికవర్గాలూ ఆ వారసత్వంపై హక్కుదారులే అవుతారు. ఇంకాస్త సూటిగా చెప్పాలంటే ఒక దళితుడు, లేదా మరో పీడితవర్గానికి చెందిన వ్యక్తి భారత, భాగవత, రామాయణాదులను సొంతఆస్తిగా భావించుకునే అవకాశం ఉండాలి. అంటే, వారికి ప్రతికూల మైన అంశాలను తొలగించి ఆ రచనలను కుల తటస్థంగా మార్చాలి. మొత్తం సాంస్కృతిక వారసత్వాన్నే ప్రజాస్వామికీకరించి దానిని ఉమ్మడి వారసత్వంగా మార్చాలి. 

అలా అనడం తేలికే, కానీ అందుకు ఏం చేయాలన్నదే అసలు ప్రశ్న. ప్రతికూల కథలను, ఘట్టాలను తొలగించడం ఒక మార్గమా? అలా అయితే, ఆ రచనలకు, అందులోని భావాలకూ గల చారిత్రకతకు నష్టం కలుగుతుంది. వాటిని అన్నిటినీ ఒకచోట పొందుపరచి అనుబంధంగా ఇస్తూనే వాటిని ఆమోదయోగ్యం కానివిగా ప్రకటించి కుల తటస్థ పాఠాన్ని రూపొందించడం మరో మార్గమా? మొదట ఉమ్మడి పాఠం అవసరాన్ని అందరూ గుర్తించగలిగితే, అది ఎలా చేయాలో మార్గాలు స్ఫురించకపోవు. 

Surya News Paper Dated : 10/2/2013

1 comment:

 1. అయ్యా
  "ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ
  ఎల్ల మతముల సారమొకటే తోటకెల్ల వసంతుడొకడే"
  బోయి భీమన్నగారి పాట అనుకుంటాను.
  చిన్నప్పుడు ఆకాశవాణిలో విన్నాను.
  ఈ పాట కావాలి.మీ దగ్గర దొరుకుతుందా?

  ReplyDelete