Wednesday, February 27, 2013

దిల్ దుఖ్ నగర్ By - కృపాకర్ మాదిగ



అయ్యో నా బిడ్డలార
ఈ నెత్తుటి కళ్లాపిని చూడలేను
మీ నిస్సహాయ రోదనల్ని వినలేను
బయటపడ్డ పేగులు
తెగిపోయిన కాల్జేతులు
పేలిపోయిన కండ ముద్దలు
పగిలిపోయిన చెవుల పొరలు

గాల్లో కలిసిన ఊపిర్లు
చెల్లాచెదరైన నూకలు
మట్టిలో కలిసిన మెతుకులు
పిల్లలవో పెద్దలవో
నల్లనివో తెల్లనివో
హిందువువో

మహమ్మదీయునివో
ఎంచలేను తేల్చలేను
అవన్నీ నా బిడ్డలవే
అన్నీ నావే, నా లోపలివే

నా అశోక వనంలో
కొమ్మల్ని నరికి
మొక్కల్ని పెరికి
అభద్రతల మంటబెట్టిన
దొంగలెవరో నాకు తెలవాల
ఈ నెత్తుటి సాగు ఆగాల

- కృపాకర్ మాదిగ

Andhra Jyothi Telugu News Paper Dated : 28/2/2013 

No comments:

Post a Comment