గత డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తర్వాత..‘రేప్’ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. దేశ దేశాల్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారఘటనలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రోజురోజుకూ మహిళలపై హింసా దౌర్జన్యాలు పెరిగిపోతున్న తీరుపై ప్రపంచం తీవ్ర ఆందోళన చెందుతున్నది. నిర్భయ ఘటన ఒక్క మనదేశాన్నే కాదు, ప్రపంచాన్ని కుదిపేసింది. మహిళల భద్రతపై సమాజ భాద్యతను ప్రశ్నిస్తున్నది. ఈనేపథ్యంలో దేశంలో మహిళ భద్రత విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. నేటికీ జరు గుతున్నది. నివారోపణోపాయాల గురించి వాద,వివాదాలు సాగుతున్నవి. చాలా ఏళ్ల కిందటే ఇందిరాగాంధీ అన్న మాటలు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. ‘భారతదేశాన్ని అవినీతి, రేప్ సంస్కృతి పట్టి పీడిస్తున్నాయ’ని ఇందిరాగాంధీ వాపోయారు. ‘ఈరెంటీని రూపుమాపిన నాడే.. సమాజం బాగుపడుతుంద’ని ఆమెఅన్నారు. ఇన్నేళ్లు గడిచినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు. పరిస్థితులేమీ చక్కబడలేదు. స్త్రీలపై అఘాయిత్యాలు తగ్గడం అటుంచి ఒకటికి రెండింతలుగా పెరిగిపోతున్నాయి.
‘రేప్’ అనేది ఇవ్వాల ఒక్క ఇండియా సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలూ, అన్ని ప్రాంతాలూ దీనికి మినహాయింపు ఏమీ కాదు. అత్యాచాట ఘటనలు కొన్ని ప్రాంతాల్లో తక్కువ,కొన్నింటిలో ఎక్కువ జరుగుతున్నాయి. అంతే కానీ.. మహిళలపై అత్యాచారాలు లేని చోటు అంటూ..ఈ మహిపై లేదు. గతకొంత కాలంగా చూస్తే.. ప్రతి ఉద యం అరడజన్ రేప్‌ల ఉదంతాలను చూస్తున్నాము. వాస్తవంగా జరుగుతున్న ఘటనల్లో సగం కూడా మీడియాలో ప్రచారం అయి, వెలుగు చూడటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ అత్యాచారాలు కూడా.. మూడేళ్ల పసిపాపలు మొదలు కొని 17 ఏళ్ల మధ్య వయసున్న వారిపై అత్యాచారాల సంఖ్య పెరుగుతున్నది. ఇందులో మైనర్లు, మైనర్లనే రేప్ చేసిన ఉదంతాలు కూడా ఎక్కువగా ఉం టున్నాయి.
ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఈ అత్యాచార ఘటనల్లో కేవలం ‘సెక్స్’ పాత్రను ఊహించడానికి కూడా ఉండదు. అలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తి తప్పకుండా మనిషికన్నా భిన్నిమైన(వికృతమైన) మానసిక స్థితిలో జంతువు సమానుడుగా ఉంటాడని చెప్పక తప్పదు. మానవీయత ఉన్నవాడు ఎవ్వ రూ ఆమోదించలేని, అంగీకరించలేని చేష్టలకు ఒడిగట్టిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదంతా ఈ సమాజపు వికృత రూ పాన్నీ, విధ్వంసక స్థితినీ తేటతెల్లం చేస్తున్నది. ఇదిలా ఉంటే..ఈ అత్యాచారాలు (రేప్‌లు) మహిళల్లో కింది స్థాయి వర్గాలు, పేదలు, నిమ్న వెనుకబడిన వర్గాలపై అధికంగా జరుగుతున్నాయి. అంటే మహిళలను అబలగా చూడటమ నే ది ఒక పార్శమైతే..,బలహీన వెనుకబడిన వర్గా లకు చెందినవారైతే మరింత బలహీను లుగా బలి అవుతున్నారని తేటతెల్ల మవుతున్నది.
ఇక ఆఫ్రికా విషయానికి వస్తే.. స్త్రీలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ‘కాంగో’ అయితే.. మహిళపాలిట అది మృత్యుకుహరమే అయ్యింది.
కాంగోలో మిలిటరీ బలగాలు ప్రజలను ముఖ్యంగా మహిళలను కిడ్నాప్ చేసి నెలల తరబడి బంధించి అత్యాచారాలు చేస్తున్నాయి. అక్కడ ఉన్న సాయుధ మూకలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ పరిస్థితుల్లోనే కాంగో ప్రపంచంలోనే అత్యాచారాల్లో అగ్రస్థానంలో ఉన్నది. యుద్ధభూమిగా మారిన జిం బాబ్వే, అంగోలా, చాద్, నమీబియా, బురుండీ లాంటి దేశాల్లో స్త్రీలపై అత్యాచారాలు ఒక విధానంగా, యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఒక సమూహాన్ని లొంగదీసుకోవడం కోసం, ఆధిపత్యం చేసేందుకు మహిళలను బంధీలుగా పట్టుకోవడం బలిచేయడం జరుగుతున్నది. కేన్యాలో కూడా జరిగిన అంతర్యుద్ధంలో మహిళలు ఎంతో మంది అత్యాచారాలకు బలయ్యారు.
ఒకానొక అధ్యయనం ప్రకారం అంతకలహాలతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశాల్లో మహిళ లింగత్వమే శాపంగా మారింది. ఈ దేశాల్లో ప్రతి 36 సెకన్లకు ఒక అత్యాచారం జరుగుతున్నది. రోజుకు154 రేప్‌ల చొప్పు న 2010-11సంవత్సరంలో 56,272 అత్యాచారాలు జరిగాయి. ఈ దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంత పెద్ద ఎత్తున మహిళలపై అత్యాచారాలు జరిగినా కేవలం 200 మంది మాత్ర మే అత్యాచార కేసుల్లో దోషులుగా నిరూపించబడ్డారు. అక్కడి జనాభా లో 25 శాతం మంది పురుషులు ఎవరినో ఒకరిని ఎక్కడో ఒక చోట అత్యాచారానికి ఒడిగట్టారని తేలింది. అత్యాచారానికి గురైన వారిలో సగం మంది ఒకరికంటే ఎక్కువ మందితో అత్యాచారానికి గురయ్యారని తేలింది. ఇక సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో రేప్ ఒక అణచివేత ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. అక్కడి ప్రభుత్వ సాయుధ బలగాలు విచ్చలవిడిగా ప్రజలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నాయి. స్త్రీలను, పిల్లలను కూడా నెలల తరబడి నిర్బంధించి అత్యాచారాలు చేస్తున్నాయి.
కఠినమైన చట్టాలకు, నియమ నిబంధనలకు పేరుగాంచినదిగా చెప్పుకుంటున్న చైనాలో అత్యాచారాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒక సంవత్సర కాలంలోనే చైనాలో రెండున్నర లక్షల మంది అత్యాచారాలకు గురయ్యారు. నాగరికతకు, అభివృద్ధికి కేంద్రంగా చెప్పుకుంటున్న అమెరికా పరిస్థితి కూడా అత్యాచారాల విషయంలో మిగతా ప్రపంచానికి ఏమీ తీసిపోలేదు.యూనివర్సిటీ, విద్యాలయాలన్నీ అఘాయిత్యాలకు నెలవుగా మారాయి. ఒక సర్వే ప్రకారం తమ చదువులు పూర్తయ్యే కాలం లో 25 వేలమంది విద్యార్థులు అత్యాచారాలకు గురయ్యారు. 80 వేల మంది పిల్లలు లైంగిక వేధింపులతో సతమతమయ్యారు. అమెరికాలోని ప్రతి ఆరుగురు స్త్రీలలో ఒకరు తమ జీవితంలో ఒకసారైనా అత్యాచారానికి బలయ్యారు, లేదా లైంగిక దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నారు.
బ్రిటన్‌లో కూడా స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోవడాన్ని అక్కడి సామాజిక, మానసిక శాస్త్ర వేత్తలను కలవరపరుస్తున్నది. చిన్న పిల్లలను సైతం కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. 85 వేలమంది ఇంగ్లాండులో అత్యాచారాలకు బలిఅయితే.., 800 మంది మాత్రమే దోషులుగా శిక్షలు అనుభవిస్తున్నారు. నగ్నత్వం పెద్ద నేరంగా పరిగణించని స్వీడన్ దేశంలో యూరప్ దేశాలన్నింటికన్నా అతి ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి.
ఈ విధంగా ప్రపంచంలో ఏదేశంలో చూసినా..మహిళల పరిస్థితి గొప్ప గా, భద్రంగా ఏమీలేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న రేప్ సంస్కృతిపై అటు సామాజిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. మహిళల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎందుకు ఇంత అమానవీయంగా అత్యాచారాలకు ఒడిగడుతున్నారని వారు తమ అధ్యయనాలు కొనసాగించారు. అత్యాచారాలకు ప్రధానంగా రెండు కారణాలను గుర్తించారు. ఒకటి నేరమయ జీవితం, రెండవది-మనస్తత్వం. కడు బీద పరిస్థితుల్లో జీవిస్తూ.. కనీస విద్య కు నోచుకోని అట్టడుగు సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా నేరమయ అత్యాచారాలు జరుగుతునాయని తే లింది. అలాగే మానసిక సమస్యల కారణంగా అత్యాచారాలు చేస్తున్న వారి లో ఎక్కువగా బాగా చదువుకున్నవారూ, సంపన్న వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఇలాంటి వికృత మనస్తత్వంతో అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
సామూహిక అత్యాచారాలు జరగడాని కి ఆ అకృత్యంలో పాల్గొన్న గుంపులో తాము దోషులుగా పట్టుపడటం జరగదనే దాంతో ఘోరానికి పాల్పడుతున్నవారే ఎక్కువ. అలాగే.. మద్యం మత్తు లో, నిస్సహాయ స్థితిలోఉన్న వారిని గుంపులో ఒకరిగా అకృత్యానికి పాల్పడటం సులువుగా భావించడం కూడా సామూహిక అత్యాచారాలకు కారణం గా చెబుతున్నారు.
ప్రపంచమంతటా స్త్రీలపై సామాజిక హింసలో భాగంగా జరుగుతున్న హింస, అత్యాచారాలు ఒక ఎత్తు అయితే.., ప్రభుత్వ బలగాలు కూడా అణచివేత సాధనంగా మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టడం దారుణం. సామాజిక శాంతిని నెలకొల్పే పేరుతో ప్రభుత్వ సాయుధ బలగాలు సాధారణ ప్రజలపై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాయి. సామాజిక ఉద్యమాలను అణచేందుకు కూడా లైంగిక హింసను ఆయుధంగా ఎం చుకుంటున్నాయి. ప్రజలను భయభ్రాంతులను చేసి లొంగదీసుకునేం దుకు అత్యాచారాలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి కని పిస్తున్నది. దీన్ని మనదేశంలోనూ చూడవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభు త్వ పారామిలిటరీ దళాలు చేస్తున్న అత్యాచారాలకు పరాకాష్టగా గత పన్నెండేళ్లుగా ఇరోన్ షర్మిల చేస్తున్న పోరాటాన్ని చూడవచ్చు. ఈ పరిస్థితులన్నీటినీ చూస్తుంటే.. సమాజం ముందుకు పోతున్నదని చెబుతున్నా నాగరికగంగా, మానవీయంగా వెనక్కుపోతున్న తీరే గమనిస్తున్నాం. మహిళలను అత్యాచారాలతో హింసిస్తూ..,అంతం చేస్తూన్న సమాజంలో కేవలం కఠినమైన చట్టాలు, రక్షణ వ్యవస్థలు కట్టుదిట్టం చేయడంతోనే సరిపోదు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలి. స్త్రీ అంటే లౌంగిక పరమైన వస్తువుగా చూసే సంస్కృతి అంతరించి మనసున్న మనిషిగా గుర్తించిన నాడే అత్యాచారాలు అంతం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతున్న వస్తుమయ, వినియోగ విష సంస్కృతిలోనే రేప్ సంస్కృతికి మూలాలున్నాయి. ఈ విష సంస్కృతిని అంతమొందించినప్పుడే రేప్‌లు అంతర్థానమవుతాయి. రేప్ సంస్కృతి అంతరిస్తుంది.
(ఇండియా న్యూస్ ఫీచర్స్ అలయెన్స్
Namasete Telangana Telugu News Paper Dated: 1/4/2013