ఒక అంధుడు పొట్టకూటికోసం ఆ వీధిలో రోజూ పాడుకుంటూ పోతుంటాడు. అందగాడు కూడా అయిన అతడి మధురగానం మగదిక్కులేని ఆ కుటుంబాన్ని ఆకర్షిస్తుంది. ముగ్గురు పెళ్ళీడుకొచ్చిన తన కూతుళ్ళ సూచనమేరకు ఆ తల్లి ఆ అంధున్ని రెండో వివాహం చేసుకుంటుంది. (ఆ విధంగా తమ కుటుంబానికో గుర్తింపు వచ్చి తమ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయని వారి ఆశ.) కానీ వాస్తవం మరోలా ప్రత్యక్షమవుతుంది.
ఇరుకైన ఇంట్లో కొత్తదంపతుల ఉచ్ఛ్వాసనిశ్వాసలు రోజూ ఆ ముగ్గురు యువతులను తాకి మెలిపెడతాయి. వివాహ సమయంలో అంధుడు తమ తల్లికి కానుకగా ఇచ్చిన 'ఉంగరం' రాత్రివేళ ఒక్కొక్కరి చేయి మారుతుంటుంది. చూపులేనివాడు కనుక అతడు ఆ ఉంగరం ఆనవాలును బట్టి ఆ స్త్రీ చెంత చేరుతుంటాడు. అది వారి మధ్య జరిగిన ఓ అనధికార ఒప్పందంగా కథ ముగుస్తుంది. యుసెఫ్ ఇద్రిస్ రాసిన 'ఉంగరం' అనే ఈ ఈజిప్టు కథ సంకలనంలో మొదటి కథ
***
పాతికేళ్ల క్రితం సంచలనం రేపిన మరో తెలుగు కథ-కె.ఎన్.వై. పతంజలి 'చూపున్న పాట'లో ముసలి గుడ్డివాడు సాదాపాటలే కాక, గద్దర్‌పాటలు, శివసాగర్ పాటలు పాడినందుకు అతడి వేణువును తొక్కేస్తాడు పోలీసోడు. అది చిట్లి రక్తమై స్రవించి వాడిని వెంటాడుతూ... పోతుంది.
***
కూలిచేసుకుంటూ అన్యోన్యంగా జీవనం సాగించే చెంచి,చెంచుగాడు పెళ్ళికి కోక కోసం,పంచెకోసం చేసిన అప్పు తీర్చాలని వారిని వేధిస్తాడు కాబూలివాడు. తీర్చలేనందుకు చెంచిని చెరపడతాడు. ఆమె పిచ్చిదై చనిపోతుంది. అంధుడైన చెంచిగాడు జీవచ్ఛవంలా మిగిలిపోతాడు. గూడూరు రాజేంద్రరావు రాసిన 'చెంచి' కథ చదివితేగాని అది అనుభూతం కాదు.
***
వేముల ఎల్లయ్య, శంకర్ సంపంగి సంపాదకత్వంలో వచ్చిన సరికొత్త ప్రయోగం 25 కథల ఈ సంకలనం. వికలాంగుల కోణంలో ఒక పుస్తకం ప్రచురించడం, అందులోనూ కొందరు వికలాంగులే తమ పట్ల సమాజం చూపుతున్న వివక్షపై కలమెత్తడం తెలుగులో ఇదే తొలిసారి కావొచ్చు. ఈ పుస్తకం నిండా వారి బాధలు, కలలు, ఆకాంక్షలు పరుచుకొని ఉన్నాయి. కన్నీళ్ల దగ్గరే ఆగిపోక, సొంతంగా లేచి నిలబడి, మెట్టు మెట్టుగా అడ్డంకులన్నీ అధిగమించి, తమ జీవితాల్ని విజయగాథలుగా వారు మలుచుకున్న తీరు కూడా అద్భుతం. కొత్తగా రాసిన వారి కథల్లో నాటకీయత పాలు ఎక్కువే ఉన్నా, ఒక మెరుపు కూడా ఉంది. ఆ మెరుపులో, భవిష్యత్తులో వారు ఇంకా నైపుణ్యంతో సాహిత్యసృష్టి చేయగలరనే హామీ ఉంది.
హైదరాబాద్‌లో జరిగిన రెండు సభలు 'అవిటి కథ ల'కు ప్రేరణ. అందులో, 2008లో నిజాంకాలేజీ గ్రౌం డ్స్‌లో లక్షలాదిమంది వికలాంగులు తమ కోర్కెల సాధనకోసం గళమెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన సభ ఒకటి, 2012లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇందిరాపార్కు ఎదురుగా జరిగిన వికలాంగుల రాజ్యాధికార సభ రెండవది. వాటిలో పాల్గొని ప్రత్యక్షంగా ప్రేరణ పొందినవారే ఈ పుస్తక సంపాదకులు. తెలుగుసాహిత్యానికి గొప్పచేర్పు చేసిన వారి కృషి అభినందనీయం.
ఇందులో ప్రసిద్ధులైనవారి కథలు- పైన పేర్కొన్నవి గాక, ఎంపు(చాసో), కుష్టాది కిష్టయ్య(వేముల ఎల్లయ్య), పెద్దరోగం(కెమెరా విజయ కుమార్), ఉప్పునీరు (బోయ జంగయ్య), ఒక తల్లి (పటేల్ సుధాకర్‌రెడ్డి), ఒంటికాలి శివుడు(బెజ్జారపు రవీందర్), గుడ్డివాడు(రావులపాటి సీతారాంరావు), ప్రత్యామ్నాయం(కె.వరలక్ష్మి), జ్ఞాననేత్రం(చక్కిలం విజయలక్ష్మి), జేజి(భూతం ముత్యాలు).
వికలాంగుల వర్గం కింద చేరడానికి వృద్ధులు అంగీకరిస్తారోలేదో కానీ, వారి సమస్యలపై కథలను కూడా ఇందులో చేర్చారు. ఉదాహరణకు- అక్కినేని కుటుంబరావు 'అన్నీ మేమే చెయ్యాలా?' కథ, డాక్టర్ శ్రీలత రాసిన 'ఎద్దు చస్తే ఎట్టమ్మా?' కథ. ఈ చేర్పు ఒక విశేషంగా మిగులుతుంది. ఈ రెండు కథలు కూడా వృద్ధుల సమస్యలను చాలా ఆవేశంగా, నిజాయతీగా, ఆత్మీయంగా చిత్రించాయి.
ఒకటిన్నర సంవత్సరం వయసులో కాళ్ళు చచ్చుబడిపోయి, ఆపై ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో పిహెచ్‌డి విద్యార్థిగా స్థానం పొందేవరకు సాగిన తన ప్రస్థానాన్ని, ఇటీవల 'బీఫ్‌ఫెస్టివల్'లో తనతోపాటు తోటి విద్యార్థులపై దౌర్జన్యం జరిగినంత వరకు విషయాలన్నీ రిపోర్టులా రాసాడు శంకర్. ఈ రిపోర్టు కథ కావడానికి తగిన కృషి చేసివుంటే బాగుండేది. పుస్తకంలో అక్షరదోషాలు చాలా ఎక్కువ. పేజీ పేజీకి ఉన్నాయన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. కొన్ని 'బూతు' పదాలు కూడా అలాగే వ్యవహారంలో వున్నట్టే వాడేసారు.
లోటు పాట్లను పక్కన పెడితే, ఈ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తి వికలాంగులకు, అనుభవం పాఠకులకు చాలా విలువైనవి. పుస్తకం పూర్తిచేసాక, 'అవిటి కథల'పై దయ, జాలి కలగవు...నిండైన ప్రేమ కలుగుతుంది.
- యింద్రవెల్లి రమేష్
అవిటి కథలు
వెల : రూ 100, పేజీలు : 204
ప్రతులకు : 98666 24901
No comments:
Post a Comment