Sunday, March 31, 2013

మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు - డా.జి లుకర శ్రీనివాస్




ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులూ ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.


సాహిత్యంలో వాస్తవికత ఒక తిట్టుపదంగా మారిపోయింది. వాస్తవికత ఒక నిర్మాణం. గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడలు బ్రాహ్మణీయ వాస్తవికతను నిర్మాణం చేశారు. అయితే, బ్రాహ్మణీయ వాస్తవికత నికరంగా నిలబడకుండానే పలాయనవాదంలోకి జారుకుంది. అదే కాల్పనికవాదం. భావ కవిత్వం దానిలో ఒక పాయ. కుల వాస్తవికతను సైద్ధాంతిక, రాజకీయ క్షేత్రంలో కింది కులాలు వ్యక్తీకరించడమే కాదు దాని తార్కికతనూ నిర్ణాయకవాదాన్నీ ప్రశ్నిస్తున్న 'కాలం'లో తెలుగు సాంస్కృతిక 'స్థలం' బ్రాహ్మణీకపు కాల్పనికవాదంలోకి సచేతనంగానే పాదం మోపింది. అదే నడక అభ్యుదయ, విప్లవ రంగాలను కూడా నియంత్రించింది. దానికి మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పునాది. అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు మార్క్సు ప్రతిపాదించిన భౌతికవాదం పునాది. లెనిన్ మార్క్సు జ్ఞాన సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దానికి శాస్త్రీయతను చేకూర్చాడు. లెనిన్ ప్రతిపాదించిన 'పరావర్తన సిద్ధాంతం' (రిఫ్లెక్సివ్ థీయరీ) ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన సిద్ధాంతాలను విశేషంగా ప్రభావితం చేసింది. సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ రచయితలు పరావర్తన సిద్ధాంతాన్ని బలంగానే ప్రచారం చేశారు. మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతానికి పరావర్తన సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం నిజంగా అద్భుతమైంది. కాని, ఈ సిద్ధాంత స్ఫూర్తిని ఇక్కడి బ్రాహ్మణవాద రచయితలు గ్రహించలేదని విమర్శకుల భావన.

త్రిపురనేని మధుసూదనరావు 'సాహిత్యంలో వస్తు శిల్పాలు' అనే గ్రంథంలో 'పరావర్తన సిద్ధాంతం - సాహిత్యం' అనే ఉపశీర్షిక కింద పరావర్తన సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించారు. "...ఇంద్రియ జ్ఞానాలకి ఆలోచనలకీ మూలాధారం ఏమిటి? అంటే చైతన్యానికి మనస్సుకీ సంబంధం ఏమిటి? పదార్థం ముందు, దాని నుంచీ చైతన్యం ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకోవటం మాత్ర మే చాలదు. మనిషికి ఇంద్రియ జ్ఞానాలూ, ఆలోచనలూ, ఆవేశం వంటివి ఎలా వస్తాయి అనేది భౌతికవాద జ్ఞాన సిద్ధాంత మౌలిక ప్రశ్న. దీనికే లెనిన్ పరావర్తన సిద్ధాంతం సమాధానం చెపుతుంది'' అని తెలిపారు. మనిషి మనస్సు నుండే జ్ఞానం పుడుతుందని భావవాదులు తలుస్తారనీ, భౌతికవాదులు ఇంద్రియ జ్ఞానం వికసిస్తుందని చెపుతారని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనా క్రమంలో ఇంద్రియాల ద్వారా సమాచార గ్రహణం తొలి దశ. ఇంద్రియాలు లేకుండా మెదడుకు సమాచారం అందే వీలు లేదు. మెదడూ, ప్రపంచం రెండూ పదార్థ రూపాలే అంటాడు త్రిపురనేని. ఈ రెండింటి మధ్య వుండే సృజనాత్మకమైన, క్రియాశీలమైన సంబంధాన్ని పరావర్తన సిద్ధాంతం అంటారని ఆయన భావన. 

"అద్దంలో చూసుకున్నప్పుడు మొఖం బింబం. అద్ధంలో కనిపించే మొఖం ప్రతిబింబం. బింబం లేకుండా ప్రతిబింబం ఉండదు. అలాగే మెదడు అద్దం అయితే అందులో ప్రతిబింబించేది బాహ్యప్రపంచం. ఈ బింబ ప్రతిబింబ ఉదాహరణ చాలా ప్రాథమికమైన పోలికగా మాత్రమే గ్రహించాలి. ప్రతిబింబానికి పరావర్తనకీ చాలా తేడా వుంది. అద్దంలో ప్రతిబింబానికి బింబానికీ మధ్య క్రియాశీలమైన, సృజనాత్మకమైన పరావర్తనా శీలమైన సంబంధం ఉండదు. మెదడు కేవలం అద్దం కాదు. అదొక జీవ శారీరక వ్యవస్థ. నిర్ధిష్ట క్రియలను నిర్వహించే అనేక సూక్ష్మ భాగాల అవిభాజ్య సముదాయం. కాబట్టి బాహ్య ప్రపంచం జ్ఞానానికి మూలం. ఇంద్రియాలు జ్ఞానానికి సాధనాలూ, వాహికలూ మాత్రమే కానీ ఇంద్రియాలే జ్ఞానానికి మూలం కాదు. బాహ్య ప్రపంచం ఇంద్రియాల ద్వారా మెదడులో పరావర్తనం చెందకుండా జ్ఞానం అనేది ఉండదు'' అంటారు త్రిపురనేని మధుసూదనరావు. మార్క్సు పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, ఉత్పత్తి విధానాన్ని సూత్రీకరించడానికీ కూడా పరావర్తన సిద్ధాంతమే మూలమని త్రిపురనేని భావన. పంటని ఉత్పత్తి చేసేందుకు భూమి, నీళ్లు, నాగలి, ఎద్దులు, ఎరువులు వంటివన్నీ అవసరమనీ, అవన్నీ బాహ్య ప్రపంచంలో దొరికేవనీ, అవి మనిషి చైతన్యంతో సంబంధం లేకుండానే ప్రపంచంలో ఉంటాయనీ, కానీ, వాటిని సృజనాత్మకంగా పరావర్తనం చేసుకోవటం వల్లే రైతులు పంటలు పండిస్తున్నారనే ఉదాహరణ సరిపోతుందని ఆయన అన్నాడు. మానవ చేతన కేవలం వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించటమే కాదు, దాన్ని పునర్ సృష్టిస్తుంది కూడా అని లెనిన్ తన వృద్ధాప్యంలో రాసుకున్న నోట్సులో పేర్కొన్నాడు. 

అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న బాహ్య ప్రపంచాన్ని మానవుడు తనకు అవసరమైన విధంగా నిర్మాణం చేసుకుంటాడని దీని అర్థం. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని బట్టీ, చారిత్రక పరిమితుల్ని బట్టీ అది నిర్ణయించబడుతుందని కూడా త్రిపురనేని పేర్కొన్నారు. ఈ మొత్తం సిద్ధాంతంలో 'బాహ్య ప్రపంచం', 'వస్తుగత ప్రపం చం', 'ఇంద్రియ చర్య' అనేవి చాలా కీలకం. బాహ్య ప్రపంచం అంటే కేవలం భౌతిక వస్తు సముదాయం మాత్రమే కాదు. ఆ వస్తు సముదాయాన్ని నియంత్రించే లేదా ఉత్పత్తి చేసే లేదా ప్రకృతిలో అంతర్భాగంగా జీవించే మానవ సముదాయం కూడా. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు కూడా బాహ్య ప్రపంచం అనే భావనలో అంతర్భాగం. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి విధానంతో పాటు మారుతాయనేది మార్క్సిస్టు అవగాహన. కాని కులం అనేది ఒక సంబంధం. ఆయా కులాలకు వ్యవస్థలో నిర్దేశిత స్థానం అనుసరించే అనులోమ, విలోమ సంబంధాలు ఉంటాయి. ఇవి వందల యేళ్లుగా ఉత్పత్తిలో గుణాత్మకమైన మార్పు వచ్చిన తర్వాత కూడా మారకుండా కొనసాగుతూ వున్నాయి. ఇండియా సమాజంలోని మానవ సంబంధాలు కుల సంబంధాలుగా వున్నాయనే సంగతిని ఇంద్రియాల ద్వారా మెదడుకు నిరంతరం చేరవేయబడుతూనే ఉంటుంది. ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులు కూడా ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. 

అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానంతోటే వివిధ కులాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి అంతర్వును బట్టీ, స్థానం, స్థాయిని బట్టి ఆయా కులాల వ్యక్తుల మానసిక ప్రవర్తన ఉంటుంది. అది ఆ కులస్తుడి చైతన్యమై నిరంతరం అతని ప్రమేయ, ప్రవర్తనలను నిర్దేశిస్తుంది. ఇది వాస్తవిక దృశ్యం. ఈ వాస్తవిక దృశ్యం అనేక కుల నియమాల వల్ల నియతం అవుతూంటుంది. ఈ వాస్తవాన్ని మార్క్సిస్టు రచయితలు అంగీకరించలేదు. లెనిన్ వృద్ధాప్యంలో చెప్పిన మానవ చైతన్యం తిరిగి వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తుందనే సూత్రీకరణను సారభూతంగా అర్థం చేసుకొంటే రచయితలు కుల సంబంధాలను, వాటిని నిర్ణయిస్తున్న భావజాలాన్ని సృజనాత్మకంగా చిత్రించేవారు. కానీ అలా చేయలేదు. అంటే బ్రాహ్మణవాద రచయితల చైతన్యం వాస్తవ ప్రపంచాన్ని పరావర్తనం చేయటం లేదనీ, కాల్పనికతను లేదా అబద్ధాన్ని నిర్మాణం చేస్తుందని అంగీకరించాలి.

పరావర్తన సిద్ధాంతం చారిత్రక భౌతికవాదంతో అంతస్సంబంధం కలిగి ఉంది. చారిత్రక భౌతికవాదం అనేది సమాజాన్ని అధ్యయనం చేసే విశ్లేషించే ఒక పద్ధతి. ఒక మెథడాలజీ. పాశ్చాత్య సమాజాన్ని విశ్లేషించినట్టే కుల నిర్మిత సమాజాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. అది మెథడాలాజికల్ ప్రాబ్లెం. సమాజ పరిణామ క్రమాన్ని మార్క్సిస్టు పద్ధతిలో అర్థం చేసుకొనే ప్రయత్నం త్రిపురనేని చేశారు. రాంభట్ల కృష్ణమూర్తి కూడా అదే ప్రయత్నం చేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అన్వర్తింప చేసే కృషి రాంభట్ల కొనసాగించారు. ఆయన వాస్తవికతను పురాణ వాస్తవికత, ప్రబంధ వాస్తవికత, కాల్పనిక వాస్తవికత, సోషలిస్టు వాస్తవికతలుగా అనేక విభజనలు చేశారు. ఆ క్రమంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నిర్మాణం వెనక ఉత్పత్తి పోషించిన పాత్రను తెలిపారు. ఉత్పత్తి క్రమంలో రూపొందిన సాహిత్యమే వేదాది సాహిత్యమని ఆయన భావించారు. ఈ కాల్పనిక ఆధిపత్యవాద సాహిత్యంలో ఆయన కెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. రామ, రావణ వైరంలో కూడా ఆయనకు వర్గ సంఘర్షణ కనిపించింది. ఇతిహాస, పురాణాల పట్ల ఆయనకు బలమైన విశ్వాసం వుంది. ఆ రచనలను మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్నీ, మార్క్సిస్టు వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు ఉపయుక్తం చేసుకోవటమే వింత. వేదాలు యురేషియా నుండి ఇక్కడికి వచ్చినవి. హరప్పా నాగరికత నాటి మానవులకు వేదాలకు ఎలాంటి సంబంధం లేదు. వైదిక ధర్మం పూర్తిగా విదేశీయమైంది. 

యురేషియా సంచార జాతుల దురాక్రమణ వల్ల హరప్పా నాగరికత అంతరించింది. హరప్పా నాగరికతలో వర్గ అసమానతలు లేవు. వారు ఉత్పత్తి సాధనాలను అభివృద్ధి చేయటమే కాదు, శాస్త్రీయమైన జ్ఞానాన్ని కూడా నిర్మించారు. మరి హరప్పా నాగరికత కాలం నాటి పురాణాలేవి? ఇప్పుడు ప్రచలితంగా ప్రచారంలో వున్న పురాణాలకు ఎంత వయస్సు ఉంటుంది? ఇతిహాసాలు ఏ కాలంలో ఆవిర్భవించాయి? ఈ ప్రశ్నలకు మార్క్సి స్టు పద్ధతి సరైన సమాధానం చెప్పదు. ఉత్పత్తి పెరిగినప్పుడే వర్ణ వ్యవస్థ ఏర్పడిందనేది మార్క్సిస్టు అవగాహన. కానీ ఉత్పత్తి ఎక్కువగా జరిగిన హరప్పా నాగరికతలో వర్ణ వ్యవస్థ రూపొందలేదు. అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ యురేషియా సంచార తెగల దురాక్రమణ ఫలితమని బోధపడుతుంది. అష్టాదశ పురాణాలు ప్రతివిప్లవం తర్వాత రూపొందినవి. కుల పురాణాలు కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏర్పడినవి. క్రీ.పూ. 187లో మౌర్య చక్రవర్తి బృహద్రదున్ని హతమార్చిన పుశ్యమిత్రుడు వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాడు. మనుధర్మం, భగవద్గీత, మహాభారత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు రాయించాడు. అంటే వర్ణ వ్యవస్థను సమర్ధించే రచనలు మూలవాసీ చక్రవర్తి బృహద్రదుని రాజ్యాన్ని బ్రాహ్మణుడైన పుశ్యమిత్రుడు చేజిక్కించుకొన్నాకే జరిగింది. 

కానీ, వర్గ సిద్ధాంతం ప్రకారం పైన పేర్కొన్న రచనలన్నీ సమాజం తనకు తానే ఉత్పత్తి క్రమంలో కల్పించుకొన్నవి. అందుకే వాటిలో మార్క్సిస్టులు అనుకూల అంశాలను మాత్రమే చూడగలిగారు. కుల వ్యవస్థ పరిణామాన్ని సూత్రీకరించడానికి చారిత్రక భౌతికవాదం సరిపోదు. అది వర్గ ప్రాతిపదికన మాత్రమే సమాజాన్ని వ్యాఖ్యానించగలదు. సుమారు వేయి సంవత్సరాల పాటు ఉనికిలో వున్న బౌద్ధ రాజ్యాలలో ఎలాంటి సాహిత్యం ఉందో తెలుసుకొనే ప్రయత్నం మార్క్సిస్టు సాహిత్యకారులు చేయలేదు. వేద కాలంలోని రచనలను విశ్లేషించి, ఆ వెంటనే ప్రబంధ కాలానికి వెళ్లిపోయే ఒక పలాయన వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధ రాజ్యాల్లో విలసిల్లిన సాహిత్య, సాంస్కృతిక, కళా సిద్ధాంతాలను గానీ, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని గానీ ఏ మాత్రం ప్రస్తావించరు. అంటే, బ్రాహ్మణవాద చరిత్రకారులు ఏ ఆకరాలను ప్రామాణికమని సమాజం మీద రుద్దారో వాటిని మాత్రమే గ్రహిస్తే సమాజ పరిణామ క్రమం సవ్యంగా ఎలా అర్థం అవుతుంది? చారిత్రక భౌతికవాదం పేరుతో బ్రాహ్మణీయ చరిత్ర రాజ్యమేలింది. ఇయంఎస్ నంబూద్రిపాద్ రాసిన 'వేద భూమి' అందుకు నిదర్శనం. వాస్తవికవాదం బ్రాహ్మణవాదానికి మరో పేరుగా మారిపోవటమే విచారం. యూరోప్ సమాజంలో అది సాధించిన ఘన విషయాలు ఇక్కడ సాధించలేకపోవడానికి అది వక్రీకరణకు గురికావటమే కారణం.

వాస్తవికవాదం పేరుతో చలామణి అయిన సాహిత్య ఆధిపత్యానికి ప్రతిస్పందనగా వచ్చిందే 'ప్రతివాస్తవికవాదం' (కౌంటర్ రియలిజం). కులం ఒక వాస్తవం. అస్పృశ్య రచయితలు సాహిత్యంలో కుల వ్యవస్థ స్వరూప, స్వభావాలను చిత్రించిన తీరు, కులం ఒక అధికార వ్యవస్థగా ప్రజల జీవితాలను శాసించే సామాజిక నియతిని కళాత్మకంగా రూపుగట్టిన తీరును పఠించే ఒక పద్ధతే ప్రతివాస్తవికవాదం. అదొక పఠన పద్ధతి మాత్రమే కాదు. ప్రాపంచిక దృక్పథం కూడా. ప్రతివాస్తవికతను అర్థం చేసుకొనేందుకు అంబేద్కరిజం వెలుగులో కుల వాస్తవికతను అర్థం చేసుకోవాల్సిందే. బ్రాహ్మణ ధర్మంలోని కుల అంతర్వుల నియమాన్నీ, కులం పేరుతో కొనసాగుతున్న దాస్యాన్ని చిత్రించటమే సాహిత్యంలో ప్రతివాస్తవికత. కుల వ్యవస్థలో బానిస కులాల రచయితలు సమాజ పరివర్తన కోసం సృజించిన రచనలన్నీ ప్రతివాస్తవికత పరిధిలోకి వస్తాయి. కులం పేరుదో చీల్చబడిన మూలవాసుల కళా సృజనకు, బ్రాహ్మణవాదుల కళా దృష్టికీ మధ్య చాలా వైరుధ్యం తప్పకుండా వుంటుంది. అందుకే ప్రతివాస్తవికవాదం కళాతత్వానికి సంబంధించింది కూడా. పరావర్తన సిద్ధాంతంతో పీడిత కులాల నిజమైన జ్ఞాన సిద్ధాంతానికి సంధి కుదరదు. మసక బారిన పరావర్తన అద్దం సత్య రూపాన్ని ప్రతిఫలించదు. బ్రాహ్మణీయ జ్ఞాన సిద్ధాంత పద్ధతిలో చరిత్ర సమాలోచన చేస్తే సత్యం బోధ పడదు. మూడు దశాబ్దాల కింద అలవాటైన వాస్తవికతను పట్టుకొని వేళ్లాడే మూసవాదులకు ఈ కొత్త జ్ఞాన సిద్ధాంతం చికాకునూ చిరాకునూ కల్గిస్తుంది. అయినా సరే, సత్యాన్ని సత్యంగా చెప్పమని కదా అంబేద్కర్ బోధించింది!

- డా.జిలుకర శ్రీనివాస్
jilukara@gmail.com

Andhra Jyothi Telugu News Paper Dated: 1/4/2013

No comments:

Post a Comment