Tuesday, March 19, 2013

రాజకీయ పార్టీలు-ఉద్యమ ఉద్యోగులు - కంచ ఐలయ్య



పార్టీలు నడపాల్సిన ఉద్యమాల్ని ప్రభుత్వ ఉద్యోగులెందుకు నడుపుతున్నారు? ఈ పద్ధతి తెలంగాణను ఎలా బాగుచేస్తుంది?... ఉద్యోగులను ముందు పెట్టి ఉద్యమాలు నడపడం ఒక రాజకీయ ఫ్యూడల్ చర్య. అంతేకాదు క్రిమినల్ చర్య కూడా. ప్రపంచంలో ఎక్కడా ఉద్యోగులు విప్లవాలు తేలేదు. రాజకీయ పార్టీలు తెచ్చాయి... ఎద్దు ముందు బండిని పెట్టి ఉరకమనడం ఆపెయ్యాలి. స్టాప్ దిస్ నాన్‌సెన్స్! 

మతానికి రాజకీయ పార్టీకి గల ప్రధాన తేడాను కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఫ్రెడరిక్ ఏంగెల్స్ చాలా అద్భుతంగా విశ్లేషించాడు. మతానికి, రాజకీయ పార్టీకి సమాజాన్ని సమీకరించే ఒక శాస్త్రీయ అభివృద్ధికాముక లక్షణం ఉందని ఏంగెల్స్ చెప్పాడు. మతం ఫ్యూడల్ వ్యవస్థలో అభివృద్ధికాముక సంఘటిత పాత్ర నిర్వహిస్తే రాజకీయ పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థ దశలో అంతకంటే అభివృద్ధి కాముక ప్రజాస్వామిక సమీకరణకు నిర్దేశించింది అని చెప్పాడు. మతం, వాగు దాటడానికి మానవుడు నేర్చుకున్న ఈత వంటిదైతే, రాజకీయ పార్టీ వాగుపై కట్టిన వంతెన వంటిదని కూడా ఏంగెల్స్ చెప్పాడు.

అయితే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలను గమనిస్తే అవి చాలా ఫ్యూడల్ లక్షణాలు కలిగిన సంస్థలుగానే ఉన్నాయనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కమ్యూనిస్టు పార్టీలు కూడా కుల ఫ్యూడలిజంలో కొట్టుమిట్టాడుతూ ఉండడం వలన వాటి ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలన్నీ ఫ్యూడల్ దొరల గడీల్లో ఎలా బంధించబడ్డాయో గత వ్యాసం ('తెలంగాణ ఫ్యూడలిజం-సామాజిక న్యాయం' ఫిబ్రవరి 22, 'ఆంధ్రజ్యోతి')లో చూసాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల్లో ఫ్యూడల్ రాజకీయ శక్తులు కొత్త కొత్త రూపాలు తీసుకొని బలపడ్డాయే తప్ప ఆ శక్తులు శ్రామిక వర్గాలకో, శ్రామిక కులాలకో మౌలిక మార్పునందించలేదు. అం దుకే ఎక్కువ పోరాటాలు జరిగిన తెలంగాణ ప్రాంతం, పోరాటాలు జరుగని సీమాంధ్ర ప్రాంతాల కంటే వెనుకబడి ఉందని తేలింది. ముఖ్యంగా పోరాట గడ్డ మీద విద్య ఎక్కువ అభివృద్ధి చెందాలి కానీ అందుకు భిన్నంగా తెలంగాణ, ఆ రంగంలో వెనుకబడింది. ఇది అన్ని పార్టీల విద్యా వ్యతిరేకతను సూచిస్తుంది.

ఎందువల్ల ఇలా జరిగింది? పార్టీలు ఇక్కడ ఏ పేర్లతో పనిచేసినా అగ్రకుల ఫ్యూడల్ శక్తుల అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాలను చాలా పకడ్బందీగా కొనసాగించాయి. నిజానికి ప్రపంచ అనుభవం ఇం దుకు భిన్నంగా ఉన్నది. మొదటి శ్రామిక విప్లవ పోరాట గడ్డైన ప్యారిస్ (1871 ప్యారిస్ విప్లవం ఇక్కడే వచ్చిందే. అదే మార్క్స్, ఏంగెల్స్‌కు బీజ సిద్ధాంతాన్ని అందించింది) చూసినా, మొదటి రైతాంగ విప్లవమొచ్చిన హ్యునాన్(చైనా)ను చూసినా మన కర్థమయ్యేది అదే. తెలంగాణ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2009నుంచి ఇక్కడి రాజకీయ పార్టీలు (పాలక కాంగ్రెస్ అం డతో) మొదలుపెట్టిన ఉద్యమం మరో కొత్త అనుభవాన్ని మన ముందుంచింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ అండతో నాటకీయంగా మొదలైన కేసీఆర్ 'ఆసుపత్రి నిరాహార దీక్ష'ను సాకుగా చూపి ఒక విచిత్ర ప్రకటన చేసింది. మళ్ళీ ఆంధ్ర ప్రాంత శక్తులు రాజీనామాల నాటకమాడగానే మరో ప్రకటన (డిసెంబర్ 23 ప్రకటన) చేసింది. ఇదంతా జగన్‌ను జైలుకు పంపి నాడు కూలిపోవడానికి అనువుగా ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికేనని అందరికీ తెలిసిందే.

ఆ తరువాత రెండు ప్రాంతాల రాజకీయ పార్టీల కొత్త ఫ్యూడల్ డ్రామా ఒకటి మొదలైంది. 2009 డిసెంబర్ 23 రాత్రే మరో ఫ్యూడల్ నాయకుడు ఉద్యోగులతో ఒక జేఏసీని ఏర్పాటు చేసి దానికొక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను కన్వీనర్‌గా చేసి ఉద్యోగ సంఘాల నాయకులను అనుసంధానం చేసారు. తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఆ సంఘం చుట్టూ చేరాయి. ఇదే తరహా ఆంధ్ర ప్రాంతంలో కూడా జేఏసీలు ఏర్పడ్డాయి. అక్కడా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను కన్వీనర్‌ను చేసి ఉద్యోగుల్ని రంగంలోకి దింపారు. దాన్ని లగడపాటి డ్రామా అనవచ్చు.

గత మూడు సంవత్సరాలుగా రాజకీయ పార్టీలూ తమ పాత్రను, లక్ష్యాలనూ మరచిపోయి ఈ జేఏసీల ద్వారా కార్యక్రమాలు ప్రకటింపజేస్తూ వాటిని అవి అమలు చెయ్యడం మొదలెట్టాయి. ముందు కాంగ్రెస్ మంత్రులు, పార్టీల ప్రధాన నాయకులు ఈ జేఏసీల చుట్టూ చేరడం ద్వారా వాటికి విచిత్రమైన హోదా కల్పించారు. తెలంగాణ వచ్చేస్తుంది, వీళ్ళందరూ మహాను భావులో, మంత్రులో కాబోతున్నారని ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి యూనివర్సిటీ టీచర్, ప్రభుత్వోద్యోగి వారిలా తామెట్ల నాయకులమైతామని ఉవ్విళ్ళూరడం మొదలైంది. వీళ్ళు బంద్‌లు, రాస్తారోకోలు వంటి పిలుపులివ్వడం, రాజకీయ పార్టీలు వాటిని తమ క్యాడర్ ద్వారా అమలయ్యేట్టు చూడడం మొదలైంది. అలాంటి జేఏసీలు జిల్లా జిల్లాకు, మండల మండలానికి, గ్రామ గ్రామానికి ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీలను మించిన బెదిరింపును, ప్రభుత్వ సంస్థల్ని స్తంభింపచెయ్యడం ఎవరికి ఇష్టమొచ్చిన పద్ధతిలో వాళ్ళు డబ్బు వసూళ్ళు చెయ్యటం మొదలైంది.

ఈ క్రమంలో రకరకాల సమ్మె పిలుపులు ముందుకొచ్చాయి. సకల జనుల సమ్మె పేరుతో గ్రామ స్థాయి నుంచి స్కూళ్ళు, తెలంగాణలోనే పంట పొలాలకు ఉపయోగపడే కరెంటు ఉత్పత్తి ఆపేయబడ్డాయి. రేపు మేం తెచ్చే తెలంగాణ కోసం ఇప్పుడు మీరు చావండి అని అమాయక ప్రజల్ని ఆకలికి, దాహానికి గురిచేసి ఆ పైన పెద్ద ఎత్తున వసూళ్ళు జరిపారు. ఇక్కడి రాజకీయ పార్టీలు ఇటువంటి పిలుపుల్ని ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించి 'అవి వారి పిలుపులు అని చెబుతూనే' రోడ్ల మీద సిన్మాలు మాత్రం పార్టీలవే.. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమాక్రసీ అనే విప్లవ పార్టీ విచిత్రమైన డ్రామా నడిపించాయి.

ఈ కార్యక్రమాలన్నీ వాటి ఐక్య సంఘటనలో అంగీకరించినవైతే అవి యూపీఏ, ఎన్‌డీఏలు కేంద్రంలో ఏర్పడినట్టు ఒక రాజకీయ ఐక్య నిర్మాణాన్ని ఏర్పరచుకొని చెయ్యవచ్చు. ఏ పిలుపు ఇచ్చినా పార్టీలు ఎన్నికల ద్వారా, అసెంబ్లీలో ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులతో ఉద్యమ పిలుపు ఇప్పించి తాము నాటకమంతా నడిపి 'జవాబుదారీ తనం' లేకుండా ప్రపంచంలో ఎక్కడా రాజకీయ పార్టీలు ఉండవు. రాజకీయ పార్టీలు నడుపాల్సిన ఉద్యమాలను ప్రభుత్వోద్యోగులతో ఎక్కడా నడుపరు. ఈ విధంగా ఉద్యమాల్లో తిరిగే ఉద్యోగులు రాజీనామాలు చెయ్యకుండా సంవత్సరాల తరబడి బయట తిరుగుతుంటే వారిని నియంత్రించగలిగే శక్తిని రాజకీయ సంస్థలు కోల్పోయాయి. ప్రభుత్వంలోని మినిస్టర్లే తమ ఇండ్లలోనే 'వీరే ఉద్యమానికి నాయకులని' ప్రకటించి రోడ్లమీదికి పంపాక వారిని అడుగగలిగే దమ్ము, ధైర్యం వైస్ చాన్సులర్లకు, ప్రభుత్వ అధికారులకు ఉంటుందా? పైగా వీరు మంత్రుల్ని, ప్రభుత్వ అధికారుల్ని 'రాళ్ళతో కొడుతాం' అని ప్రకటించినా నియంత్రించే ప్రభువులు లేరు కనుక వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఈ విధంగా ఉద్యమ పిలుపులిచ్చే ఉద్యోగులెవ్వరూ ప్రజలకు జవాబుదారీలు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల రంగంలో లేరు అసెంబ్లీలో అంతకన్నా లేరు. వాళ్ళ సంపాదన, జీవన విధానాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ రేపే వస్తుంది, మేమే తెస్తామని చెబుతున్నారు. అది రాదని వాళ్ళకు తెలుసు. కేసీఆర్ ఒక దశలో 'మనం టైగర్‌పై స్వారీ' చేస్తున్నామన్నారు. కానీ ఈ జేఏసీ నాయకులు 'తెలంగాణపై స్వారీ' చేస్తున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఏదో ఒక పార్టీలో చేరి నాయకులు కావాలి. ఒకాయన ఇప్పటికే అయ్యారు. పదవి కూడా వచ్చింది. కనుక అంతవరకు తెలంగాణపై స్వారీ ఆగదు.

ముఖ్యంగా వీరిచ్చే పిలుపులను ఆచరణలో పెడుతూ టీఆర్ఎస్ బీజేపీలు చాలా ప్రమాదకర రాజకీయ వాతావరణాన్ని మనముందు ఉంచాయి. న్యూడెమొక్రసీని ప్రజలు పెద్దగా పట్టించుకోరని మనకు తెలుసు. ఇందులో ఒకటి దేశాన్ని పరిపాలించిన పార్టీ, మరొకటి తెలంగాణకు ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని ప్రకటిస్తున్న పార్టీ. ఈ రెండు పార్టీలు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉంటూ వాటి నిబంధనలను ఏమాత్రం గౌరవించకుండా వాటిపై స్వారీ చేస్తున్న ఉద్యోగులు రేపు తెలంగాణ వస్తే, అది వీళ్ళ చేతుల్లో ఉంటే ఏం చేస్తారని చూడకూడదా? పార్టీలు నడపాల్సిన ఉద్యమాల్ని ప్రభుత్వ ఉద్యోగులెందుకు నడుపుతున్నారు? ఈ పద్ధతి తెలంగాణను ఎలా బాగుచేస్తుంది?

కొన్ని పత్రికలైతే వీరే ప్రత్యామ్నాయ నాయకులని రాస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ నాయకులు మంచిగా ఉద్యమం నడిపితే గెలిపించండి, చెడుగా నడిపితే ఓడించండి అని మనందరం ప్రజలకు చెప్పవచ్చు. వీరినేం చెయ్యమని ప్రజలకు చెబుదాం? ఈ కొత్త పద్ధతి తెలంగాణలోనే ఎందుకు పుట్టుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే ఈ ఉద్యమాన్ని తెరవెనుక ఉండి నడిపే పార్టీలకు, వాటి నాయకత్వానికి ప్రజాస్వామిక సంస్థల పట్ల ఏమాత్రం గౌరవం లేదు కనుక.

ఒక యూనివర్సిటీ టీచర్ పాఠాలు చెప్పకుండా, జీతం తీసుకుంటూ రోజూ నాయకుల వెంట తిరుగుతుంటే రేపు తెలంగాణ వచ్చినా ఇటువంటి ప్రొఫెసర్లను ఎట్లా నియంత్రిస్తామని ఇంగిత జ్ఞానం ఉండాలిగదా? ప్రజాస్వామ్యంలో అన్ని సంస్థల్ని నడిపేది, వాటి చట్టాలు నియమించేది రాజకీయ నాయకులు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, జేఏసీ పేరుతో ప్రవేశపెట్టిన పద్ధతి తోక కుక్కను ఆడించే పద్ధతి. ఈ పార్టీలకు ఒక ఉద్యమ కార్యక్రమంపైనో, ఎన్నికల కార్యక్రమంపైనో ఏకాభిప్రాయం ఉంటే తమ పార్టీల జేఏసీని తమ నాయకులతో వేసుకొని ఒక బాధ్యతాయుతమైన ఉద్యమం నడపాలి.

ఏ బాధ్యతాలేని పిలుపులిస్తే ప్రజలు నమ్మి రోడ్లమీదికొచ్చి దెబ్బలు తింటున్నారు. జైళ్ళకు పోతున్నారు. వారి కుటుంబాలు సర్వనాశనమౌతున్నాయి. వీరు ఇప్పుడు అనుసరించే పద్ధతికిన్నీ, మవోయిస్టులు అజ్ఞాతంలో ఉండి తమ పార్టీ సభ్యులుగాని వారితో ఉద్యమాలు చేయించి నిర్బంధం పాలు చెయ్యడానికి తేడా ఏముంది? కనీసం వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టే అవకాశముంది? కానీ ఇక్కడ ఉద్యమాలు నడిపే జేఏసీ బహిరంగంగా కాంగ్రెస్ మంత్రి ఇంట్లో పుట్టిందేనే! ఆ ఫ్యూడల్ మంత్రి ఇంట్లో పుట్టిన ఒక జేఏసీ నాయకుడు ఒక దళిత మంత్రిని 'కర్రుతో కాలుస్తానన్నా' అరెస్టు చెయ్యగలిగే స్థితిలో ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇంకా తెలంగాణలో అన్నిటిని ఫ్యూడలిజం శాసిస్తోంది. ఇక్కడి పార్టీలను, ప్రభుత్వాలను 'ఫ్యూడల్ నరసింహుడు' పాలిస్తున్నాడు. ఇదొక విచిత్ర పరిస్థితి.

ఈ క్రమంలో మొత్తం డెమొక్రాటిక్ సంస్థలు కుప్పకూలాయి. నడవాల్సిన పద్ధతిలో సంపూర్ణంగా తెలంగాణ మేధావుల చేతుల్లో ఉన్న స్కూళ్ళు నడవడం లేదు. జూనియర్ కాలేజీలు నడువడం లేదు. యూనివర్సిటీలు నడువడం లేదు. వీటిని ఆంధ్రా వాళ్ళైతే ఆపడం లేదు కదా! మన పిల్లలకి మనం చదువు చెప్పుకోవడానికి ఈ కమిటెడ్ తెలంగానైట్స్‌కి ఏం అడ్డమొస్తుంది? గత పదేళ్లలో తెలంగాణ 'విద్యావంతులు' నిర్మించిన విద్యా వ్యతిరేక విధానం అడ్డమొస్తుంది. ఈ పద్ధతిని తెలంగాణను అభివృద్ధి చేస్తామని శపథం చేస్తున్న పార్టీలు ఎందుకు ఒప్పుకుంటున్నాయి? ఈ పార్టీల నిండా ఫ్యూడల్ విద్యావంతులు ఉన్నారు కనుక.

ఇంకా పదేళ్లు లేదా ఇరవై ఏళ్లు తెలంగాణ రాదు, అయినా పరిస్థితి ఇలానే ఉంటుందా? మనం కూర్చున్న కొమ్మను రోజూ మనం నరుక్కుంటూ చెట్టునెట్ల బాగుచేస్తాం! నా దృష్టిలో రాజకీయ పార్టీలు ఈ మాయావాదపు జేఏసీలతో సంబంధాన్ని తెంపుకొని ఐక్య నిర్మాణం పెట్టుకుంటే వేరే విషయం. ఇట్లా ఉద్యోగులను ముందు పెట్టి ఉద్యమాలు నడపడం ఒక రాజకీయ ఫ్యూడల్ చర్య. అంతేకాదు క్రిమినల్ చర్య కూడా. ఉద్యోగం చెయ్యకున్నా జీతమొస్తే, లేదా క్లాసు తీసుకోకున్నా కాసులొస్తే ఆ సౌఖ్యాన్ని ఎవ్వరూ వదులుకోరు. ప్రపంచంలో ఎక్కడా ఉద్యోగులు విప్లవాలు తేలేదు. రాజకీయ పార్టీలు తెచ్చాయి. ఉద్యోగులు వారి వారి, సిద్ధాంత అవగాహన ప్రకారం వాటికి సహకరిస్తారు. కనుక టీఆర్ఎస్, బీజేపీ ఈ విధంగా ఎద్దు ముందు బండిని పెట్టి ఉరకమనడం ఆపెయ్యాలి. స్టాప్ దిస్ నాన్ సెన్స్!

- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Dated : 20/3/2012 

No comments:

Post a Comment