Thursday, March 21, 2013

గిరిజనులకు పోరాటమే మార్గం ---సీహెచ్. విద్యాసాగర్ రావు



people
గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గిరిజన భూములను గుర్తించి వారికి అప్పగించే చర్యలు గిరిజనేతరుల ఒత్తిడి వల్ల ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఆగిపోయాయి. గిరిజన సలహా మండలి నామమావూతంగా మిగిలిపోయింది. ఈ దారుణమైన పరిస్థితికి భిన్నంగా1997 జూలై 11న ‘సమతా జడ్జిమెంట్’గా పేరుగాంచిన తీర్పు వెలువడింది. దీని ప్రకారం కేవలం కనబడే మట్టి భూమే కాకుండా, అందులోని ఖనిజ సంపదను వెలికి తీసే హక్కు కూడా గిరిజనులదేనని స్పష్టం చేసింది. ఎల్‌టిఆర్ క్రమంగా ప్రభుత్వం కూడా వ్యక్తేనని కాబట్టి ఈ షెడ్యూల్డ్ ప్రాం త భూహక్కులను, ఈఖనిజాన్ని వెలికితీయడం గాని, ఏ ఇతర పనులను గాని గిరిజనేతరులకు బదిలీ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మైనింగ్‌కు అనుమతిస్తే అది ప్రభుత్వం గాని దాని తరఫున కార్పొరేషన్ గాని చేయవచ్చని, అది కూడా గిరిజనులను అందులో భాగస్వాములను చేసినప్పుడే సాధ్యమవుతుందని చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం సర్వహక్కులు గిరిజనులకు ఇచ్చినా, వాస్తవంగా వారికి మాత్రం అటవీ ప్రాంతాలలో వారి భూములలోనే స్థానం లేకుండా చేస్తున్నారు. 

అండమాన్ నికోబార్‌కు చెందిన ఆరు తెగలకు చెందిన ఆదిమ జాతీయుల జీవన స్రవంతికి భంగం వాటిల్లకుండా తీసుకునే చర్యలు-ఆంవూధవూపదేశ్ గిరిజనుల స్థితిగతుల నిర్లక్ష్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కేవలం వందల సంఖ్యలో ఉన్న రెండు తెగలకు సంబంధించిన వారి వార్తలు గాని, చిత్రాలు గాని మనం చూడలేము. వారి జీవన విధానాన్ని బాహ్య ప్రపంచానికి బహిర్గతం చేస్తే శిక్షార్హమవుతుంది.

వారిని చూడడం అనేది-దగ్గరికి పోవడమనేది సాహసిక చర్య అవుతుం ది. దీనికి ప్రయత్నించిన వారు అధికారులతో సహా ఎంతోమంది బలైపోయారు. అయినా ఆదిమజాతులు అంతరించిపోకుండా అంతర్జాతీయంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి దూరంగా వారి జీవితాలను కొనసాగించే అవకాశం ఇవ్వాలన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంకల్పం. దీనికోసం చట్టాలను తేవడమే కాకుండా కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది.ఇదే స్ఫూర్తి దేశంలో ఉన్న ఇతర షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉండవలసి ఉన్నా దాన్ని లెక్కచేయడంలేదు. కానీ రాజ్యాంగపరంగా అండమాను నికోబారు నుంచి ఆంధ్రవూపదేశ్ వరకు అవే రక్షణలు ఉండాలి.

ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న భూమి, చెట్టు, పుట్ట, తేనెతుట్టే, అడవి, నీరు, ఖనిజ సంపదపై ఆదివాసులకు సంపూర్ణమైన అధికారాన్ని ఇవ్వాలని రాజ్యాంగం చెబుతున్నా భారీ ప్రాజెక్టుల నిర్మా ణం, పరిక్షిశమల స్థాపన, టూరిజం ఆదివాసీల పాలిట కృత్రిమ సునామీగా పరిణమించాయి. ఈమధ్యన వచ్చిన సునామీ వల్ల అండమాన్ నికోబార్ ప్రాంతాలు అతలాకుతలమైనాయి. కారు నికోబార్‌లో ఏర్పాటు చేసిన విమానాక్షిశయం కొట్టుకుపోయింది. అక్కడ విమానాక్షిశ యం ఏర్పాటు చేయడానికి నాటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ స్వయం గా అక్కడి గిరిజనులతో సంప్రదింపులు జరిపి అంగీకరింపజేశారని కథలుగా చెప్పుకుంటారు.గిరిజనులు ఒప్పుకున్నారు కాబట్టి సంతోషంతో మీకు ఏం కావాలో కోరుకొమ్మంటే వారు నెహ్రూ ధరించిన వాసుకోటు కావాలని కోరినారని దాన్ని వారికిచ్చివేశారని ఈనాటికీ చెప్పుకుంటారు. 

1854కు ముందు అడవి అనేది ఆదివాసులకు అరుదైనది కాదు. కానీ 1864లో చట్టాన్ని తీసుకొచ్చి వారి సంప్రదాయ హక్కులను లాక్కొని జుర్మానా చెల్లిస్తేనే సేద్యానికి అనుమతి ఇవ్వడం ప్రారంభించారు. చివరికి ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980ని తెచ్చి గిరిజనులనే చొరబాటుదారులను చేయడమే కాకుండా 1980 జూలై 1 వరకు వారు అనుభవిస్తున్న భూమిని ఇంతవరకు క్రమబద్ధీకరణ చేయలేదు. ఆదివాసీ రక్షణ కరువైందని 1917లోనే బ్రిటిష్ పాలకులు గ్రహించి గిరిజనుల భూమిని గిరిజనేతరులు పొందే వీలు లేకుండా చట్టాలు తేవాలనే ఆలోచనకు అంకురార్పణ చేశారు.

ఈ స్ఫూర్తినే రాజ్యాంగంలోని 244 అధికరణలో పొందుపరచడమైంది. గిరిజనేతరుల చేత తరిమికొట్టే చర్యలను గిరిజనులు ప్రతిఘటించడం వల్ల పాలకులు వారు నివసించే ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించక తప్పలేదు. అప్పుడే ఇవి షెడ్యూల్డ్ ఏరియాలుగా ఏజెన్సీ ఏరియాలుగా ఏర్పడి సాధారణ చట్టాల నుంచి మినహాయించారు. ఆదివాసుల భూములు అన్యాక్షికాంతం కాకుండా భూ బదలాయింపులను నిలిపే చట్టాలను తెచ్చారు. రాజ్యాంగంలో 5,6 షెడ్యూల్ ద్వారా గవర్నర్లకు విశేషాధికారాలు కల్పించారు. అసెంబ్లీ, పార్లమెంటులో చేసే చట్టాలను సైతం ఆదివాసులకు మినహాయించి, వారి జీవన స్రవంతిని రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో స్వతంవూతంగా జీవించే జన్మహక్కును రక్షించే విధంగా గవర్నర్ తన రెగ్యులేషన్ ద్వారా పరిపాలించే అధికారాలు ఇవ్వడం జరిగింది.

ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి గవర్నర్ అవసరమైనప్పుడు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి నివేదికను సమర్పించాలి. 1961లో భారత ప్రభుత్వం డెహబార్ కమిషన్‌ను మొదటి షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్‌గా ఏర్పాటు చేసి ఆదివాసుల సంక్షేమానికి చక్కటి పరిపాలనకు సూచనలను అడిగింది. తిరిగి ప్రభుత్వం భూరియా నేతృత్వంలో 22 ఎంపీలతో 1994 జూన్ 10న ‘భూరియా కమిటీ’ని నియామకం చేసింది. ఈ కమిటీ ఆదివాసీల పరిపాలనా వ్యవహారం గురించి, ఆస్తి, ప్రాణ, రక్షణతో పాటు వారి సంస్కృతీ జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో అని సూచించే మార్గాలను అన్వేషించింది. 1995 జనవరి 17న ఆ కమిటీ నివేదికను సమర్పించింది. 
గిరిజన ప్రాంతాలలో వారి ఆచార వ్యవహారాల కనుగుణంగా ఏది అమలు చేయాలన్నా, అది ఎంత సున్నితమో, కష్టదాయకమో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంగ్లండులో లిఖితపూర్వంగా లేని రాజ్యాంగం మాదిరిగా ఆదివాసుల సంస్కృతి ఆచారాలు, కట్టుబాట్లు వారి జీవితంలో అత్యున్నతమైనవి. ఈ ఆచారాలు, వారి సాంఘిక జీవితాన్ని శాసిస్తాయి. సమాజాన్ని సంఘటిత పరుస్తాయి. గతంలోనే ఆదివాసులను సమీపించడానికి మూడు ఆలోచనలను పాలకుల ముందుంచారు.

1. ఏకాంత వాసము 2. కలిసిపోవడం 3. అభిన్నత
1958లో నెహ్రూ మధ్యస్త విధానాన్ని అవలంబించి మొదట ఆదివాసులను దోపిడీ నుంచి కాపాడడానికి, వారి రక్షణ-నిర్భయత్వాన్ని కల్పించి సంక్షేమ కార్యక్షికమాలకు అంకిత కావాలని పంచశీలను ప్రతిపాదించారు. వీటిని అయిదు మూల స్తంభాలుగా చెప్పకోవచ్చు.
1.ఆదివాసీల సంప్రదాయాన్ని, కళలను, సంస్కృతిని ప్రోత్సహించడం. వారి తెలివితేటలు, సామర్థ్యానికనుగుణంగా అభివృద్ధికి దోహదపడాలి. వారిపై మన అభివూపాయాలను రుద్దకుండా జాగ్రత్తపడడం.
2. భూమిపైన, అటవీ సంపదపైనా వారి హక్కులను గౌరవించడం.
3. వారి పరిపాలన కోసం, అభివృద్ధి కోసం వారిలో నుంచే కొందరికి శిక్షణ ఇచ్చి సామర్థ్యాన్ని కల్పించడం.
4. వారి పరిపాలనపైన పెత్తనాన్ని, అదే విధంగా మోయరాని పథకాలను ఉంచకుండా వారి పద్ధతుల ప్రకారంగానే పని నడిపించాలని.
5. ఫలితాలను గణాంకాల ద్వారా నిర్ణయం చేయకుండా, లేక ఎంత డబ్బు వెచ్చించామని కాకుండా వారి స్వభావములో ఎంత పరిణతి చెందిందో చూడడం... అని చెప్పడం జరిగింది.

మన పెద్దలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా రాజ్యాంగం గవర్నర్‌లను అప్రమత్తం చేసినా నానా కమిషన్లు ఏండ్ల తరబడి హెచ్చరించినా- రాష్ట్రంలో ఇతర అన్యాయాలతో పాటు- ప్రధానంగా నీటి ప్రాజెక్టుల పేరిట లక్షలాది ఎకరాలు ముంపునకు గురి కావడంతో వేలాదిమంది గిరిజనులను జంతువుల మాదిరి తరిమితే అడిగేవాడు లేడు. గవర్నర్ నివేదికలు సిద్ధం చేసుకున్న దాఖలాలు లేవు. ఐదవ షెడ్యూల్‌లోని అధికారాలతోపాటు, గతంలో హెం శాఖ జారీ చేసిన ఆదేశాలలో, ప్రాజెక్టు రిపోర్టులో నిర్వాసితులైన ఆదివాసుల పునరావాసానికి సిద్ధం చేసిన నివేదిక భాగం కావాలని ఉంది. ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ ఆదివాసులు ఈ సంచలనాత్మక ప్రాజెక్టు వల్ల శారీరకంగా, మానసికంగా ఉద్వేగానికి గురికాకుండా తీసుకునే చర్యలను సూచించాలి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎన్నో సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి, నిర్వాసితుల బాధలను తెచ్చింది. 

ఇటువంటి పరిస్థితులలో సంక్షేమ సాధికార మంత్రిత్వ శాఖ చొరవ తీసుకొని పరిక్షిశమలు, నీటిపారుదల, విద్యుత్ తదితర మంత్రిత్వ శాఖలను సంప్రదించి, ఒక పద్ధతిని రూపొందించి సంబంధిత రాష్ట్రాలను ఆదేశించాలని సూచించింది. ఆదివాసీలను ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములను చేయాలని చెప్పింది. ఆర్టికల్ 338(1) లో It is obligatory for Union & State Governments to consult S.C.&S.T Commission on all major policy matters effecting S.C.& S.Ts అని ఉంటే ప్రభుత్వం ఇ.పి.సి పేరిట ఒక్క కాంట్రాక్టర్‌ను తప్ప ఎవరి అభివూపాయాన్ని అడగడంలేదు. గ్రామ పంచాయితీల అభివూపాయాన్ని తీసుకోవడం లేదు. పర్యావరణ సంబంధిత చట్టాలను, కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా గిరిజనులను ఐదవ షెడ్యూల్ స్ఫూర్తికి విరుద్ధంగా నిరాక్షిశయులను చేస్తున్నారు. 

అసలు గోదావరి వరద ప్రమాదాలను ఎదుర్కొవాలంటే చిన్న చిన్న బ్యారేజీలను, రిజర్వాయర్లను step ladder technology ద్వారా అంటే నిచ్చెన మాదిరి అమెరికా, యూరప్ దేశాలలో నిర్మాణం చేసినట్టు చేసుకొని అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఈ నదిని ఉపయోగించుకోవాలని ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కేవలం కాంట్రాక్టర్లు-వేల కోట్ల రూపాయలు, మెబిలైజేషన్ అడ్వాన్సెన్, అవినీతి, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ప్రజావూపయోజక ఆలోచన ముందుకు సాగడంలేదు. దీనివల్ల గిరిజన బతుకులు పెనం మీది నుంచి పొయ్యి మీద పడ్డట్టు అవుతుంది. ‘జీరో’ సబ్‌మెర్‌జన్సీ తో ఆశించిన నీటిపారుదల అవసరాలు తీరుతాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నివేదిక ప్రకారం- నిర్వాసితులవుతున్న ఆదివాసీలలో 55 శాతం వ్యవసాయం చేసుకుంటున్నారు. 33 శాతం వ్యవసాయ కూలీలుగా ఉంటున్నారు.

13 శాతం మాత్రమే ఇతర పనులపై ఆధారపడుతున్నారు. 1894 భూసేకరణ చట్టంలో డబ్బు ఇవ్వడమే తప్ప సమగ్ర పునరావాస పథకానికి నిబంధనలు లేవు. ఇచ్చే డబ్బువారి జీవితాలను నిలబెట్టుకోవడానికి ఉపయోగించుకోలేరని ఎన్నో నివేదికలు నిర్ధారించాయి. పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల నిర్మా ణం చేసినా పునరావాస ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. చైనాలో ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారి తరహా ఇక్కడి గిరిజనులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికినా అది అమలు చేయడం అసంభవమని అందరికీ తెలుసు. షెడ్యూల్ ప్రాంతాలు నీట మునిగినా ఆ భూము లు షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పరిగణింపబడుతాయని సచివాలయంలో నుంచి పరిపాలన కొనసాగిస్తున్న పెద్దలు కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే కండ్లు చెమర్చక మానవు. రాక్షసులే చేబడుతున్న ఈ జలభూ,ఖనిజ యజ్ఞాలను అదుపు చేయాలని కలియుగ రామలక్ష్మణులను ప్రజలు కోరుకుంటున్నారు. గిరిజనులు తిరుగుబాటు బావుటా ఎగిరేయడం అనివార్యం అనిపిస్తుంది. 

-సీహెచ్. విద్యాసాగర్ రావు
కేంద్ర మాజీ మం


Namasete Telangana Telugu News Paper Dated : 22/3/2013 

No comments:

Post a Comment