Thursday, March 28, 2013

ఆఫ్రికా విషాదమూ - అచెబే సాహిత్యమూ - డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి



చినువా అచెబే అస్తమయంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు... 'ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా ఆఫ్రికా గురించి రాయడం అసాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికాకు గతం అనేది లేదని భావించే వారు ఉన్నారు. మేము చేస్తున్నదల్లా ఆఫ్రికాకు గతం ఉన్నదని చెప్పడమే..' అని చినువా అన్నారు. 

చినువా అచెబే మరణంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు. ఆఫ్రికాలో నయా వలసవాద పరిస్థితులు పలువురు క్రియాశీల రచయితలు, రచయిత్రులను ప్రభవింపచేశాయి. వీరిలో ప్రముఖులు వోల్ సోయింకా (నైజీరియన్ రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత), గూగీ వా థియోంగో (కెన్యా సాహిత్యకుడు, ఇప్పుడు అమెరికాలో ప్రవాసి), నవాల్ ఎల్ సదావీ (ఈజిప్టియన్ సాహితీవేత్త), ఫ్రాంట్జ్ ఫానన్ (మార్టినిక్), అబేబ టెస్ ఫాగియోర్గిస్ (ఎరిట్రియా). సామాన్యుని పక్షాన నిలిచిన ఈ సాహితీ సృజకులందరూ తమ తమ దేశాల్లోని ఆర్థిక-సామాజిక దోపిడీ వ్యవస్థలను తీవ్రంగా దుయ్యబట్టడమే గాకుండా, కొత్త వలస వాదానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ప్రజల విమోచనోద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. నైజీరియా నుంచి వేరుపడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి సహచర బయాఫ్రాన్ (బయాఫ్రా దక్షిణ నైజీరియాలోని ఒక ప్రాంతం) ప్రజలతో కలిసి చినువా పోరాడారు. బయాఫ్రా ప్రాంతంలో 1967-70 సంవత్సరాల మధ్య చోటుచేసుకున్న అంతర్యుద్ధం నైజీరియా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ అంతర్యుద్ధ రక్తసిక్త స్మృతులే చినువా తాజా నవల 'దేర్ వజ్ ఎ కంట్రీ' (2012) ఇతివృత్తం.

'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' (1958) చినువా తొలి నవల. ఈ నవల ప్రచురితమై యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా 2008లో ఆఫ్రికా, ఐరోపా, భారత్‌లలో పలు విశ్వవిద్యాలయాలు ఆ సాహిత్య కృతిపై సదస్సులు నిర్వహించాయి. నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చినువా సాహిత్య సదస్సు నిర్వహణలో భాగస్వామినయినందుకు నేను గర్విస్తున్నాను (అప్పుడు నేను ఆ వర్సిటీ ఆంగ్ల విభాగానికి ప్రధానాచార్యుడుగా నున్నాను). 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా భాషలలోకి అనువదింపబడింది. కోటికి పైగా ప్రతులు వ్యాప్తిలో ఉన్నాయి. మతం (క్రైస్తవం), దాని మిత్రుడు వలసదారు సంయుక్త అధికార ప్రాబల్యానికి వ్యతిరేకంగా మరెవరి సహాయం లేకపోయినా ఒంటరిగా సాహసోపేత పోరాటం చేసిన ఒక ఆఫ్రికన్ కథా నాయకుని విషాదగాథను ఆ నవల చెప్పింది. ఆఫ్రికన్ ప్రజల సంప్రదాయాలు, విలువలు, విశ్వాసాలలో అంతర్భాగంగాఉన్న ఆఫ్రికన్ కల్పనా గాథలు, ఆచారాలు, జానపద సాహిత్యాన్ని చినువా నవలలు 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్', 'ఆంథిల్స్ ఆఫ్ సవన్నా' (1987) రెండూ పునః సృజించాయి. చినువా తన రచనలలో ఆఫ్రికన్ స్ఫూర్తిని నింపుతారు. ఆంగ్ల భాషను ఆఫ్రికీకరణ చేయడానికి ఆయన తన శాయశక్తులా ప్రయత్నించారు. వలస పాలకుల వారసత్వ అవశేషంగా మిగిలిన ఆంగ్ల భాషను ఉపయోగించుకోవడం అనివార్యమయినందుకు ఆయన చాలా విచారపడతారు. అయితే 'తన ఆఫ్రికన్ అనుభవంలోని బరువును వ్యక్తీకరించేందుకు ఆంగ్ల భాష ఉపకరిస్తుందని' చినువా అన్నారు.

చినువా నవలలు 'థింగ్స్ ఫాల్ ఎపార్ట్' (1958), 'నో లాంగర్ ఎట్ ఈజ్' (1960), 'యారో ఆఫ్ గాడ్' (1964), 'ఎ మ్యాన్ ఆఫ్ ది పీపుల్ ' (1966), 'ఆంథిల్స్ ఆఫ్ ది సవన్నా' (1987) మొదలైనవి వలసపాలనాయుగంలోను, వలస పాలన నుంచి విముక్తి పొందిన అనంతరమూ నైజీరియాలో నెలకొనివున్న పరిస్థితులను అభివర్ణిస్తాయి. నిజానికి అవి ఒక్క నైజీరియాలోనే కాక ఆఫ్రికా దేశాలన్నిటా ఉన్న అటువంటి పరిస్థితులకు దర్పణం పట్టాయని చెప్పవచ్చు. ప్రస్తావిత ఐదు నవలలనూ 1890ల నుంచి 1980ల దాకా నైజీరియా చరిత్రగా కూడా చదవవచ్చు. నవలా రచయిత, కవి, విమర్శకుడు, వ్యాసకర్తే కాకుండా చినువా ఒక చరిత్రకారుడు కూడా. వీటన్నిటికీ మించి ఆయన ఒక క్రియాశీలి అయిన రచయిత కూడా. జాత్యహంకారాన్ని, జాత్యదురహంకారులను చినువా ఎటువంటి మినహాయింపులు లేకుండా తీవ్రంగా విమర్శించారు. జాత్యోన్మాదం పాశ్చాత్య ప్రపంచ సృష్టి అని, ఆ దురాచారాన్ని ఆఫ్రికా, ఇతర ప్రాంతాలపై రుద్దారని ఆయన దుయ్యబడతారు. జర్మన్ దార్శనికుడు హేగెల్ 'చరిత్ర తత్వాలు' (ఫిలాసఫీస్ ఆఫ్ హిస్టరీ)లో ఆఫ్రికా కనీసం ఒక అంధకార ప్రాంతంగా కూడా కానరాదని ఆయన అంటారు. 

నోబెల్ పురస్కార గ్రహీత జోసెఫ్ కాన్రాడ్‌కు ఆఫ్రికా అంటే 'చీకటి హృదయం'కు ప్రతిబింబమే! ఆఫ్రికా గురించి ఆయన ఉత్కృష్ట నవల 'హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్' మనకు కల్గించే భావన అదే కదా. మరి కాన్రాడ్‌ను 'సంకుచిత యూరోపియన్ మనస్తత్వం గల జాత్య దురహంకారి' అని విమర్శించగల ధైర్యం చినువాకు కాక మరెవరికి ఉంటుంది? ఆఫ్రికాను 'చీకటి ఖండం'గా వక్రీకరించిన కథనాలను సరిదిద్దడానికి, ఆ ఖండంపై ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని రూపుమాపడానికి చినువా ఒక నిబద్ధతతో రచనా వ్యాసంగాన్ని చేశారు. ఆయన ఇలా అం టారు: 'ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా ఆఫ్రికా గురించి రాయడం అసాధ్యమని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆఫ్రికాకు గతం అనేది లేదని భావించే వారు ఉన్నారు. మేము చేస్తున్నదల్లా ఆఫ్రికాకు గతం ఉన్నదని చెప్పడమే..'

వలస పాలనలో మగ్గిపోతున్న ఆఫ్రికా ప్రజల జీవన స్థితిగతులను చినువా మొదటి మూడు నవలలు అభివర్ణిస్తాయి. శ్వేతజాతీయులు తొలుత తమ మతం, బైబిల్‌తో ఆఫ్రికాలో అడుగుపెట్టారు; వారిని అనుసరించి వలసవాదులు తుపాకులతో వచ్చారు. బైబిల్, తుపాకీ అనే రెండు మాటలు ఆఫ్రికాలో వలసవాదం చరిత్రను సంక్షేపిస్తాయి. స్వాతంత్య్రానంతరం కొత్త వలసవాదంలో అధికార స్థానాలలో సుప్రతిష్ఠులైన నల్ల జాతి నాయకుల పాలనలో మారిన పరిస్థితులను 'ఏ మ్యాన్ ఆఫ్ ది పీపుల్', 'అంథిల్స్ ఆఫ్ ది సవన్నా' అభివర్ణిస్తాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్రికన్ల శత్రువు లోపలి మనిషే. అంటే వారి నుంచి వచ్చిన వ్యక్తే. అయితే అమెరికా, యూరోప్‌లలోని తన నయా వలసవాద యజమానుల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాడు. ఇదే ఆఫ్రికా విషాదం. భారత్, ఇతర వర్ధమానదేశాల చరిత్ర గతి కూడా ఇదే రీతిలో ఉంది. ఈ చారిత్రక సామ్యమే చినువాను మనకు అంటే భారతీయులకు సన్నిహితుడిని చేసింది. ఆయన సాహిత్యం మన సమాజానికీ ఉపయుక్తత కలిగి ఉంది. ఇది చినువా సాహిత్యంలోని విశ్వ జనీన గుణం.

చినువా ఇక లేరు. అయితే ఆయన అర్థవంతంగా జీవించారు. భవిష్యత్తుకు సమున్నత వారసత్వాన్ని వదిలివెళ్ళారు. బలహీనులలో కెల్లా బలహీనులు అత్యంత శక్తిమంతులను ఎలా ఎదుర్కోగలరో ప్రపంచానికి ఆయన చూపారు. ఈ నివాళి వ్యాసాన్ని ఒక నీతికథతో ముగిస్తాను. చినువా నవలలో ఒక నిరక్షరాస్య గ్రామీణుడు ఈ దృష్టాంత కథను చెబుతాడు. అమాయక ప్రజలకు ప్రతీకగా తాబేలును, రాజ్య వ్యవస్థ దుర్మార్గ అధికారాలకు ప్రతీకగా చిరుతపులిని సూచించడానికి చినువా ఆ కథను ఉపయోగించుకుంటారు. ఒక ఆఫ్రికన్ కల్పనాకథ ప్రకారం తాబేలు, చిరుతపులి రెండూ బద్ధ శత్రువులు. తాబేలు కంటపడినప్పుడల్లా చిరుత తక్షణమే దానిని చంపివేసి తింటుంది. ఒకసారి తాబేలును చిరుత చూస్తుంది. 'నేను నిన్ను చంపబోతున్నానని' చిరుత అంటుంది. తను మృతికి సిద్ధం కావడానికి ఒకటి రెండు నిమిషాలు వ్యవధినివ్వమని తాబేలు వేడుకొంటుంది. సరేనంటుంది చిరుత. వెన్వెంటనే తాబేలు మట్టిని కాళ్ళతో తన్నుతూ దుమ్మును రేపుతుంది. చిరుత అయోమయంలో పడుతుంది. 'ఏం చేస్తున్నావని' అడుగుతుంది. తాబేలు వెంటనే ఇలా సమాధానమిస్తుంది: 'నేను ఎలాగూ చనిపోబోతున్నాను కదా. అయితే చనిపోయే ముందు ఇక్కడకు వచ్చిన వారు నీకు నాకు మధ్య మహాయుద్ధం జరిగిందన్న విషయాన్ని గ్రహించాలని నేను కోరుకొంటున్నాను'. ఎంత అద్భుతమైన దృష్టాంత గాథ!

- డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి
ఆంగ్ల ఆచార్యులు


Andhra Jyothi Telugu News Paper Dated: 28/3/2013

No comments:

Post a Comment