19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ముందుకు వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో రైతాంగం పునాదిగా సాగిన ఫూలే ఉద్యమం మహత్తరమైనది. శూద్ర-అతిశూద్ర ప్రజలకు బహుజన ఐక్యతా స్ఫూర్తినిచ్చిన ఫూలే కృషి ఆయన్ని ప్రజల్లో మహాత్మునిగా నిలిపింది. వర్గ-కుల సమాజ నిర్మూలన, సామాజిక న్యాయసాధన అనే తక్షణ ఉద్యమాన్ని, జమిలిపోరాటాన్ని దృఢంగా కొనసాగించడానికి ఫూలే స్ఫూర్తితో మరొకసారి ప్రతిన బూనుదాం.
'దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల వంటివారు' అని ఎలుగెత్తి చాటిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. పూణేలోని జంబూర్దాలో 1827లో ఆయన జన్మించారు. 13వ ఏటనే సావిత్రిబాయితో ఆయనకు వివాహం జరిగింది. 1841-47 మధ్య ఉన్నత విద్యనభ్యసించిన ఫూలే తన శ్రీమతికి ముందుగా విద్య నేర్పినారు. ఆ వెన్వెంటనే 1848లో తరతరాలుగా చదువులు నిరాకరించబడ్డ శూద్ర, అతిశూద్ర మహిళలకు సావిత్రిబాయి ద్వారా పాఠశాలలు స్థాపించారు. శ్రమ జీవుల కోసం 1855లోనే రాత్రి బడులు స్థాపించి నిరక్షరాస్యతను పారద్రోలే దార్శనికుడయినారు. అంటరాని వాళ్ళకు తన ఇంట్లోనే నీళ్ళతొట్టి నిర్మించి ఔదార్యం చూపాడు. వెలివేయబడ్డ బ్రాహ్మణ స్త్రీలకు, పిల్లలకు ఆశ్రయమిచ్చాడు. అక్రమ సంతానంగా ముద్రవేయబడ్డ బాబును దత్తత తీసుకున్నాడు. అందుకే, పురోహితుల దోపిడీని వ్యతిరేకించినా అనేక మంది బ్రాహ్మణులు ఫూలేకు సానుభూతిపరులుగా ఉన్నారు. 1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక్ సమాజ్' స్థాపించి మహాత్మునిగా ఘనతకెక్కిన ఫూలే 1890 నవంబర్ 28న పరమపదించారు. ఈసామాజిక విప్లవకారుడిని స్మరించుకుందాం.
ప్రతికులానికి జనాభా ప్రాతిపదిక మీద ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఫూలే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించారు. సామాజిక అసమానతలకు, విద్యా -ఉద్యోగావకాశాలు లోపించిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే పోరాడి ముందు చూపు ప్రదర్శించారు. పురోహిత వర్గం దోపిడీకి, రైతుల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సరళమైన భాషలో రచనలు చేశారు. నాటకాలు రాసి ప్రదర్శింపజేశారు. బాట్‌జీ (బ్రాహ్మణులు), సేట్ జీ (వ్యాపారస్తులు) వ్యవస్థల దోపిడీని నిష్కర్షగా చీల్చిచెండాడారు. తాను బ్రాహ్మణుడు కానందుకు ఒక పెళ్లి ఊరేగింపు నుంచి బలవంతంగా నెట్టివేయబడ్డ సంఘటన ఫూలేను బాధించింది. కులదోపిడీ వ్యవస్థపై పోరాటానికి అది ఆయనపై బలమైన ప్రభావం నెరపింది. పీష్వాల నిరంకుశ పాలన, పురోహిత వర్గాల దోపిడీపై జరిపిన నిరంతర పోరాటం ఆయనను డాక్టర్ అంబేద్కర్‌కు సైతం గురుతుల్యుడిని చేసింది. సామాజిక విప్లవకారునిగా మలిచింది. 'ఏ రోజునైతే మనిషి బానిసగా మారతాడో, ఆ రోజునే అతని సద్గుణాల్లో సగభాగం నశిస్తాయన్న' గ్రీకు మహాకవి హోమరు మాటల స్ఫూర్తితో శూద్ర, అతిశూద్ర, జాతుల విముక్తి కోసం ఫూలే జీవితాంతం దృఢంగా పోరాడారు. అయితే 'శూద్రులు' (అల్పులు), 'మహరి' (గొప్ప శత్రువు), 'అంత్యజ', 'చండాల' లాంటి అవమానకరమైన పేర్లతో ఈ దేశపు కష్టజీవులకు ఆర్యులు తగిలించిన పేర్లను ఆయన తీవ్రంగా ఖండించారు. 'భూసురులు'గా 'ఆర్యులు'గా తమకు తాము స్తుతించుకున్న బ్రాహ్మణీయుల దోపిడీని అడుగడుగునా చెండాడు. దేవ దానవుల యుద్ధాల గురించి అనేకమైన కట్టుకథలతో బ్రాహ్మణ్యాలు, పురాణాలు నిండి ఉన్నాయని ఫూలే విమర్శించారు. బ్రాహ్మణులు అనగా భూసురులు తమతో యుద్ధాలు చేసి ఆదిమ వాసుల్ని మూల వాసుల్ని రాక్షసులని పిలిచారు. వారు తమ భూమిని రక్షించుకునే వాళ్లు. కాబట్టి రాక్షసులనడం సరైందేనని, రాక్షసుల ఆకారాన్ని కట్టుకథలను పుక్కిటి పురాణాలను ఆయన బట్టబయలు చేశారు. రాక్షసులు ఒడ్డు పొడుగుల్లో ఆర్యుల్ని మించిన దృఢ కాయులని ఫూలే అభివర్ణించారు. యూరోపియనులు అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకుంటూ స్థానిక రెడ్ ఇండియన్లపై జరిపిన దాష్టీకల్లాంటివే ఆర్యుల దండయాత్రలని ఫూలే భావన. నీరో, అవారిక్, మెకయవిల్లీ లాంటి వారు కూడా క్రూర పరశురాముని ముందు దిగదుడుపేనని ఆయన పేర్కొన్నారు. శూద్రులు, చండాలుర పట్ల అమానుషమైన శిక్షలు ప్రతిపాదించిన కుల వ్యవస్థను డ్రూయిడ్ల కాలంలో సైతం చూడలేమని ఫూలే వెల్లడించారు.
'దళితులను ఐక్యం చేయండి -దళితులతో ఐక్యంకండి' అనే జనశక్తి సూత్రీకరణ మూలాలు దాదాపు రెండు శతాబ్దాల క్రితమే మహాత్మా పూలేలో కనబడతాయి. శూద్రులు-అతిశూద్రులు, రక్త సంబంధీకులని తన 'గులాంగిరి' పుస్తకంలో చాటారాయన. ఆయన ఇలా అన్నారు: 'శూద్రజాతిలో కొంతమంది తాము మాలీలమని, కుంబీలమని, కంసాలులమని, దర్జీలమని, మహర్లు-మాంగులమని', వడ్రంగులమని తమ తమ ఉత్పత్తుల ప్రాతిపదికగా గొప్పగా చెప్పుకుంటారు. మన పూర్వీకులున్నూ, మహర్లు -మాంగులు (మాల మాదిగలు)అని పిలవబడే అంటరానివాళ్ల పూర్వీకులున్నూ, స్వయాన తోడబుట్టిన వాళ్లనీ, రక్త బంధువులనీ, మన మన వంశపరంపరల మూలాన్ని జాడతీస్తే మనది ఒకటే మూల కుటుంబమని పాపం వాల్లకు తెలియదు. పైకి దండెత్తి వచ్చిన బ్రాహ్మణులతో, మాతృభూమి రక్షణ కోసం వాళ్ల పూర్వీకులు వీరోచితంగా పోరాడారు. తంత్రగొట్టు బ్రాహ్మల చేతిలో వాళ్లు ఓడిపోవడం వల్ల వాళ్లని దౌర్భాగ్యులుగా, నిరుపేదలుగా చేశారు. ఈ సంగతి తెలుసుకోలేక, శూద్రులు తమ సొంత చుట్ట పక్కాల్నే (అతి శూద్రుల్ని)ద్వేషించడం మొదలు పెట్టారు. దీనికి ఎంత జాలిపడాలో గదా!'
కుల వ్యవస్థ అనేది శ్రమ జీవుల విభజన, హెచ్చు తగ్గుల నిచ్చెన మెట్ల వ్యవస్థ 1873లోనే ఫూలే విశ్లేషించారు. ఆ శాస్త్రీయ విశ్లేషణను డాక్టర్ అంబేద్కర్ మరింత స్పష్టంగా విశదీకరించారు. 'ఈ మొత్తం యంత్రాంగంలో ఒక క్రమ పద్ధతిలో శ్రమ విభజన కనిపిస్తుంది. అయితే కార్ఖానాల్లో ఉన్నట్టి శ్రమ విభజన ఇక్కడ అసాధ్యం. ఎందుకంటే కమ్మరి, వడ్రంగి వారికి మార్కెట్ మారేది కాదు' అంటూ మార్క్స్ సైతం ఉత్పత్తి సామర్థ్యమూ, ఉత్పత్తి శక్తుల ఎదుగుదలా కుంటుపడిపోయాయని తన పరిమిత పరిశీలనలోనూ గమనించారు. మన సమకాలికులైన మార్క్స్, ఫూలేల మధ్య కుల వ్యవస్థ లక్షణాల పట్ల ఏక భావన ఉండటం గమనార్హం.
బ్రాహ్మణీయ కుల వ్యవస్థ నుంచి శూద్రులు, అంటరాని కులాలను విముక్తం చేయడానికి 1873 సెప్టెంబర్ 24న ఫూలే ప్రారంభించిన సత్యశోధక ఉద్యమం ఇంకా పరిపూర్తి కాలేదు. అది ప్రవచించిన మానవీయ సుఖశాంతులు, ఐక్యత, సమానత సాధించే లక్ష్యాల కోసం పోరాడవల్సే వుంది. సాహు మహరాజ్, క్రాంతి సిన్హా, నామా పాటిల్ తదితరులు సత్యశోధక్ సమాజాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఎ.హెచ్. సాలుంకే ఒకొనొక ముఖ్య సహచరుడిగా సత్యశోధక్ లక్ష్యాల సాధనకు కృషి జరుగుతోంది.
దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘమైన బొంబాయి మిల్లు కార్మికుల సంఘం స్థాపించేలా ఆనాడే మహాత్మా ఫూలే, నారాయణ లోఖండేకి మార్గదర్శనం చేశారు. ఈ విధంగా ఫూలే తన కాలంలో ఒక సామాజిక విప్లవకారుడిగా ముందుకు వచ్చారు. అయితే ఆ కాలంలోనే కార్మికులను, రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఫూలే ప్రయత్నించినా, ఆయన బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమంలో స్పష్టమైన వర్గ దృక్పథం, సామ్రాజ్యవాద వ్యతిరేక సమగ్ర దృక్పథం లోపించాయి. ఫలితంగా ఫూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ రెండుగా చీలిపోయింది. ఆనందస్వామి నాయకత్వంలో ఒక వర్గం 1919-22 సంవత్సరాలలో సతారాలోనూ, 1930వ దశకంలో బుల్దానాలోనూ రైతాంగ తిరుగుబాట్లను నడిపించింది. అంతిమంగా ఈ వర్గం భారత కమ్యూనిస్టు పార్టీలో చేరింది. కొల్హాపూర్ మహారాజా నాయకత్వంలోని మరొక వర్గం అంతిమంగా మరాఠాలలో కొందరిని క్షత్రియులుగా గుర్తింపజేసే ఉద్యమంగా మారిపోయింది. ఇది సత్యశోధక్ భావాలకు పూర్తిగా విరుద్ధమైనది.
అయినప్పటికీ బ్రిటిష్ వలసపాలనాకాలపు 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ముందుకు వచ్చిన సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో రైతాంగం పునాదిగా సాగిన ఫూలే ఉద్యమం మహత్తరమైనది. శూద్ర-అతిశూద్ర ప్రజలకు బహుజన ఐక్యతా స్ఫూర్తినిచ్చిన ఫూలే కృషి ఆయన్ని ప్రజల్లో మహాత్మునిగా నిలిపింది. చార్వాకుల నుంచి మొదలైన సామాజిక తిరుగుబాటు నుంచి ఆధునిక కాలంలో అర్ధ వలస -అర్ధ భూస్వామ్య వర్గ- కుల సమాజ దోపిడీ నిర్మూలనా పోరాటం దాకా సామాజిక విప్లవకారుడిగా మహాత్మా ఫూలే స్ఫూర్తిని విప్లవోద్యమం స్వీకరించవలసే వుంది. వర్గ-కుల సమాజ నిర్మూలన, సామాజిక న్యాయసాధన అనే తక్షణ ఉద్యమాన్ని, జమిలిపోరాటాన్ని దృఢంగా కొనసాగించడానికి మరొకసారి ప్రతిన బూనుదాం.
- అమర్ (జనశక్తి)
(నేడు మహాత్మా ఫూలే 123వ వర్ధంతి)
-
Andhra Jyothi Telugu News Paper Dated : 28/11/2013