చట్టంతో పాటు రాజకీయ సంకల్పం, పాలనా వ్యవస్థ అన్ని స్థాయిల్లోనూ చిత్తశుద్ధి ఉన్నప్పుడే మహిళలకు రక్షణ సాధ్యం.
ఢిల్లీ ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలు పెల్లుబికి దేశవ్యాప్త ఉద్యమంతో నిర్భయ చట్టం చేసిన తర్వాత కూడా మహిళలై అత్యాచారాలు తగ్గకపోవటం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. ఇలాంటి ఘటనలు సమాజం నడత, దౌర్భాగ్య స్థితిలో ఉన్న పరిపాలనకు అద్దం పడుతున్నాయి. ఇది ఓ పార్టీకి సంబంధించిన సమస్యకాదు సభ్యసమాజానికి, దేశ నాగరికతకు ఇది సవాలు లాంటిది. ఈ సమయంలో దేశానికి కావాల్సింది దృఢమైన సంకల్పం. అత్యాచార ధోషులకు ఉరిశిక్ష విధించినప్పుడే ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి బలమైన హెచ్చరిక పంపించగలం. నిర్భయ చట్టం ఆశించినంత ప్రభావం చూపించలేదని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'అభయ' సంఘటన స్పష్టం చేస్తోంది. ఈ సమస్య మీద సమగ్ర విధానం అత్యవసరం. పాలకులు, ప్రజలు, మీడియా అందరికీ ఈ అంశంలో కొన్ని బాధ్యతలున్నాయి.
ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలి. స్త్రీలపై వేధింపులు, అత్యాచారాలు వంటి ఫిర్యాదులపై మరింత ప్రతిభావంతంగా పనిచేసేలా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా విభాగం విధానాన్ని తప్పని సరిగా అమలు పరచాలి. పోలీసు వ్యవస్థలో మహిళా అధికారుల సంఖ్య కేవలం ఏడు శాతం మాత్రమే ఉంది. ఈ సంఖ్యను అన్ని స్థాయిల్లోనూ 33 శాతానికి పెంచాలి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా తక్షణం దృష్టి సారించాలి. ఎఫ్.ఐ.ఆర్‌ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. ఈ విషయంలో వారి విధులు బాధ్యతలను విస్మరించిన పోలీసు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అత్యాచారం కేసులో విచారణను మహిళా అధికారులకే అప్పగించాలి. దర్యాప్తు పూర్తిచేసి 60 రోజుల వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేయాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల అవసరం ఉంది. 90 రోజుల వ్యవధిలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. బస్సులు, టాక్సీలు, ఆటోల వంటి అన్ని ప్రజారవాణాలపై జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బస్సులు, టాక్సీలు, ఆటోల్లో డ్రైవర్ల ఫోటోలు, ఫోన్ నంబర్‌లు బయటకు కనిపించేలా నిబంధన రూపొందించాలి.
సమాజంలో మహిళలను వినోద వస్తువుగా అసభ్యమైన చిత్రాలు, దృశ్యాల ద్వారా నీచంగా చూపిస్తున్న మాధ్యమాలను నిరోధించే యత్నం చేయాలి. సమాజం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యకరమైన నైతిక దృక్పథంతో కార్యక్రమాలు ఉండేలా వినోద పరిశ్రమకు దిశానిర్దేశం చేయాలి. సాంస్కృతిక, మానవ విలువలు, సంప్రదాయాలపై వీక్షకులకు మరింత అవగాహన కల్పించటంతో పాటు మహిళలకు అధిక గౌరవాన్నిస్తూ తగిన పాత్ర పోషించాల్సిన అవసరం ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంబంధిత వర్గాలన్నింటితోనూ సమావేశం ఏర్పాటు చేసి తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలి. ఆలస్యంగా న్యాయం అందటం అంటే న్యాయం చెయ్యకపోవటమే... ఈ నేపథ్యంలో న్యాయ సంస్కరణలు అత్యవసరం. ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాధితులు సంవత్సరాల తరబడి ప్రతిరోజూ విచారణ సమయంలో బాధాకరమైన సంఘటనలను గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. అత్యాచారం కేసుల్లో విచారణ మహిళా అధికారులకే అప్పగించాలి. ఈ తరహా కేసుల్లో విచారణ పూర్తి గోప్యంగా నాలుగుగోడల మధ్య జరపాలి. లైంగిక దాడి కేసులో సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయటం అత్యవసరం. సాయంకాల న్యాయస్థానాల ఏర్పాటుతో పాటు కోర్టులో పనిగంటలను పెంచాల్సిన అవసరం ఉంది. లోక్ అదాలత్‌లకు మద్దతు పెంచాలి. న్యాయవ్యవస్థ బలోపేతం చెయ్యడానికి రాష్ట్రాలకు అదనపు నిధులు అత్యవసరం. యాసిడ్ దాడి కేసులను అత్యాచార కేసులుగా పరిగణించి కఠిన శిక్షలు విధించాలి.
ఇలాంటి కేసుల్లో బాధితులకు నష్టపరిహారం దోషుల నుంచే ఇప్పించాలి. వైద్య ఖర్చులను, విచారణ వ్యయాన్ని నేరస్థులే భరించేలా విధానం ఉండాలి. పిల్లల సామాజికీకరణలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించే నైతిక విద్యకు పాఠశాలలు, కళాశాలలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఓ ఆరోగ్యకరమైన పాఠ్యప్రణాళిక వారి భవిష్యత్ వ్యక్తిత్వం మీద సర్వతోముఖ ప్రభావం చూపుతుంది. పాఠశాలలు, తల్లిదండ్రులు పిల్లలకు సామాజికీకరణలో ప్రారంభంలో అందించిన విలువలు వ్యక్తిగత జీవితంలో దీర్ఘ ప్రభావం చూపుతాయని అనేక మానసిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాఠశాలల పాఠ్యప్రణాళిక సార్వత్రిక మానవ విలువలతో పాటు ప్రాచీన సాంస్కృతిక విలువలు సంప్రదాయాలను కలిగి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య లింగ వివక్షను సున్నితంగా వివరించాలి. సమానత్వ భావన ప్రచారం కోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవాలి. పాఠ్యపుస్తకాల తయారీలో కూడా నైతిక కుటుంబ విలువల బలోపేతానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. లైంగిక సంబంధమైన ర్యాగింగ్ కొన్ని సందర్భాలలో తీవ్రమానసిక వేదనను కలిగించటంతో ఆత్మహత్యలకు దారితీసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కళాశాలల నుంచి సస్పెండ్ చేయటం ర్యాగింగ్‌కు పరిష్కారం కాదు. ముఖ్యంగా లైంగిక పరమైన ర్యాగింగ్‌ను క్రిమినల్ కేసుగా నమోదు చేయగల తీవ్రమైన అంశంగా పరిగణించాలి. పలుమార్లు సెక్స్ నేరాలు నమోదైన వారి పట్ల ఓ విధానం రూపొందించాలి. కేసులో దోషిగా తేలిన వారి వివరాలను ప్రజల సమాచారం కోసం ప్రచారం చేయాలి. వారి వివరాలను రాష్ట్రాలు, జిల్లాల వారీగా కేంద్ర వివరాల సంస్థ రికార్డులలో నమోదు చేసే ఏర్పాటు ఉండాలి. ఇటు ప్రజల ఆలోచనా ధోరణి మారవలసిన అవసరం కూడా ఉంది. సమగ్ర పద్ధతిలో అత్యంత ప్రాధాన్యమైన అంశంగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. దౌర్భాగ్యం ఏమిటంటే మహిళలకు చట్టసభల్లో సభ్యత్వం కల్పించటంపై నమ్మబలికిన కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు కోటలు దాటుతున్నా.. ఆచరణలో మాత్రం గడప దాటటం లేదు. ఓ మహిళ అధ్యక్షతన నడిచే పార్టీ మహిళ ఆధీనంలో నడిచే ప్రభుత్వం గడిచిన పదేళ్లుగా ఈ విషయాన్ని విస్మరించింది. మహిళల రక్షణ కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్భయ నిధి ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. మొసలి కన్నీళ్లు సమస్యలను పరిష్కరించవు. రాజకీయ సంకల్పంతో తీసుకోవాల్సిన చర్యలు ఈ ప్రభుత్వంలో కరువయ్యాయి. సమాజంలో మానసిక పరివర్తన, రాజకీయ దృఢసంకల్పం, పాలనా వ్యవస్థలో అన్ని స్థాయిల్లో చిత్తశుద్ధి, కఠిన చట్టాలు, సత్వర విచారణ జరిగినప్పుడే ఈ పరిస్థితిని అధిగమించగలం.
మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ఐదు అత్యంత కీలకమైన అంశాలు; (1) సమాజంలో మానసిక పరివర్తన, (2) రాజకీయ దృఢసంకల్పం, (3) పాలనా వ్యవస్థలో అన్ని స్థాయిల్లో చిత్తశుద్ధి, (4) కఠిన చట్టాలు, (5) సత్వర విచారణ
- ఎం. వెంకయ్యనాయుడు
రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు
Andhra Jyothi Telugu News Paper Dated: 5/11/2013
No comments:
Post a Comment