Friday, November 1, 2013

ఉపాధి' కార్మికులకు మార్గం చూపిన కేరళ By ఎంవి బాలకృష్ణన్‌ మాస్టర్‌

 గత ఎనిమిదేళ్ళుగా అనుభవాలను సమీక్షిస్తే ఆదాయాన్ని కల్పించడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం ద్వారా ఉపాధి హామీ చట్టం అనేక పేద కుటుంబాలకు ఎంతో సాయపడిం దనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఇందులో కల్పించిన విధంగా కార్మికులు పూర్తి స్థాయి ప్రయోజనాలు, హక్కులు పొందడం లేదు. పైగా వారి హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఈ చట్టం అమలు దశలో అనేక సమస్యలు తలెత్తాయి.
    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్‌ఆర్‌ఇజిఎ) 2005 సెప్టెంబరులో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికీ ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పించబడుతుంది. అయితే 2009 అక్టోబరులో దీనికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)గా పేరు మార్చారు. తొలుత దీన్ని కేవలం 200 జిల్లాల్లో అమలు చేశారు. తర్వాత దేశమంతటికీ వర్తింపజేశారు.
          హక్కుల నిరాకరణ
     గత ఎనిమిదేళ్ళుగా అనుభవాలను సమీక్షిస్తే ఆదాయాన్ని కల్పించడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం ద్వారా ఉపాధి హామీ చట్టం అనేక పేద కుటుంబాలకు ఎంతో సాయపడిం దనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఇందులో కల్పించిన విధంగా కార్మికులు పూర్తి స్థాయి ప్రయోజనాలు, హక్కులు పొందడం లేదు. పైగా వారి హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఈ చట్టం అమలు దశలో అనేక సమస్యలు తలెత్తాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి నిరంకుశ అధికార యంత్రాంగం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద అసంఘటిత రంగాన్ని వేధిస్తూ వచ్చాయి. ఒక వ్యక్తికి వంద రోజుల పాటు ఉపాధి దొరుకుతుందన్న హామీ లేకుండా పోయింది. వంద రోజుల పాటు ఉపాధి కల్పించడమే ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అయినా కార్మికులకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. ఒక్కోసారి చాలా కాలం వరకూ అందడం లేదు. ఈ చట్టంలో నష్టపరిహార బాధ్యతకు సంబంధించిన నిబంధనలు లేవు. కేరళలో వేతనాల చెల్లింపులో దాదాపు 193 రోజులు జాప్యం జరిగింది. ప్రాజెక్టు వివరాల రూపకల్పన సకాలంలో జరగలేదు. గ్రామ సభలు కూడా తమ పాత్రను నిర్దేశిత సమయంలో నిర్వర్తించలేక పోయాయి. ప్రాజెక్టు బడ్జెట్‌లు కూడా సకాలంలో రూపొందించలేదు. కేంద్రంలోని, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తగిన నిధులు తగిన సమయంలో కేటాయించలేదు.కార్మికులు డిమాండ్‌ చేసినపుడు లేదా దరఖాస్తు చేసినపుడు ఉపాధి దొరకక పోవడం మరొక ముఖ్యమైన, ప్రధానమైన సమస్య. కానీ చట్టం మాత్రం కార్మికులు ఉపాధి కోరుతూ దాఖలు చేసిన పక్షం రోజుల్లోగా వారికి ఉపాధి దొరికేలా చూడాలని నిర్దేశిస్తోంది. ఒకవేళ వెంటనే ఉపాధి కల్పించలేని పరిస్థితే తలెత్తితే, నిరుద్యోగ భృతి కల్పించాలని కూడా చట్టం పేర్కొంటోంది. కానీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. సక్రమమైన సామాజిక ఆడిట్‌ లేదు. గ్రామీణ వనరుల స్థాయిని, గ్రామీణ జీవనాన్ని పటిష్టపరచడం ద్వారా నిలకడగా అభివృద్ధిని సాధించడం ఈ చట్టం లక్ష్యం. కానీ ఈ అంశం ప్రాజెక్టుల్లో వాస్తవంగా కొరవడుతోంది. చట్టాన్ని అమలు పరచడంలో ఇంజనీర్లు, ఇతర అధికారుల కొరత కూడా పెద్ద అవరోధంగా ఉంది. చట్టంలో పేర్కొన్నట్లుగా అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషీ చేయడం లేదు. పనుల భౌతిక పరిశీలన అనేది సకాలంలో పూర్తి కావడం లేదు. చేసిన పనులను లెక్కించడంలో జరుగుతున్న జాప్యం కారణంగా నష్టపోతున్నది కార్మికులే. వారికే వేతనాల్లో కోతలు పడుతున్నాయి. ఉపాధి కార్డుల కోసం నమోదు చేసుకునే కుటుంబాల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు కేటాయింపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుదిస్తున్నాయి. చట్టంలో పేర్కొన్నట్లుగా తాగునీటి సరఫరా, ప్రథమ చికిత్స కిట్‌లను అందించడం, పని ప్రదేశాల్లో సేద తీరే సౌకర్యాన్ని కల్పించడం వంటివి చేపట్టేందుకు అటు ప్రభుత్వాలు కానీ, ఇటు స్థానిక సంస్థలు కానీ ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదు. అవసరమైన పనిముట్లు, ఇతర పరికరాలను కూడా అధికారులు కొనకడం లేదు. కార్మికులు స్వయంగా పనిముట్లు తెచ్చుకుంటే వాటికి అద్దె చెల్లించడంలేదు. కార్మికులకు తప్పనిసరిగా చేతులకు గ్లౌవ్‌లు, కాళ్ళకు బూట్లు ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. మరీ ముఖ్యంగా మురికిగా ఉండే లేదా ప్రమాదకరంగా ఉండే పని ప్రదేశాల్లో పని చేస్తున్నపుడు ఇవి తప్పనిసరని పేర్కొంటోంది. కానీ వీటి అమల్లో వైఫల్యం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రమాదం జరిగితే సరైన చికిత్స, రక్షణ కల్పించే సౌకర్యాలు పలు పని ప్రదేశాల్లో లేవు. ప్రమాదం జరిగి సదరు కార్మికుడు లేదా కార్మికురాలు పనికి రాలేని పరిస్థితి ఉంటే వారి రోజువారీ అవసరాలు తీర్చే ఏర్పాటు ఉండటం లేదు. అటువంటి చైతన్యమే కొరవడింది.
        మార్గం చూపిన కేరళ కార్మికులు
    కేరళలో గ్రామీణ పేదలు ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఐకెఎస్‌ కేరళ శాఖ రాష్ట్రంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద అసంఘటిత రంగంలోని కార్మికులను సమీకరించాలని నిర్ణయించింది. ఇది, ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల యూనియన్‌ (ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు) ఏర్పడేందుకు దారి తీసింది. 2011 సెప్టెంబరు 4న ఈ యూనియన్‌ ఆవిర్భవించింది. గత ఏడాది నవంబరు 24, 25 తేదీల్లో అలప్పూజలో మొదటిసారిగా రాష్ట్ర మహాసభను నిర్వహించింది. ఆనాడు ఎఐకెఎస్‌ అధ్యక్షుడిగా వున్న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌.రామచంద్రన్‌ పిళ్ళై ఈ మహాసభను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 720మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయుకు ఇప్పుడు రాష్ట్ర, జిల్లా, ప్రాంత (జోన్‌), గ్రామ పంచాయితీలు, వార్డుల స్థాయిలో కమిటీలు ఏర్పడ్డాయి. కేరళలో, యూనియన్‌ ఇప్పుడు దాదాపు 14 జిల్లాల్లో పనిచేస్తోంది. కేరళలో దాదాపు 26,11,116 కుటుంబాలు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నాయి. ఎలాంటి రాజకీయ విబేధాలు, మత లేదా కులాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తేవాలని ఎన్‌ఆర్‌ఇజిఎ భావించింది.
యూనియన్‌ ఏర్పడిన ఈ స్వల్ప కాలంలోనే సమ్మెలు, ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు, జాతాలతో సహా అనేక కార్యక్రమాలను ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు చేపట్టింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులు ఈ అన్ని ప్రచారాల్లోనూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనియన్‌ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికుల సంఖ్య 2.25 లక్షల నుంచి 3.5 లక్షలకు పెరిగింది. ఇప్పటివరకూ ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు కృషి వల్ల దినసరి వేతనాల్లో పెరుగుదల, రోజులో మొత్తం కార్మికుల పనిగంటల్లో ఒక గంట కోత, పని దినాల సంఖ్య పెంపు, సకాలంలో వేతనాల చెల్లింపు, వంద రోజుల పని పూర్తి చేసిన కార్మికునికి వెయ్యి రూపాయిల అవార్డు ఇవ్వడం, ఓనం పండుగ సందర్భంగా ప్రతి కార్మికునికీ రూ.400 విలువ చేసే కొత్త బట్టలు, కార్మికులకు పెన్షన్‌ పథకం వంటివి సాధించుకున్నారు.
2013 సంవత్సరానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు వ్యవసాయ రంగాన్ని చాలా ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేయడం నేడు నెలకొన్న ప్రధాన సమస్య. అంటే దీనర్థం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను ఇటీవలి సంవత్సరాల వరకూ ఉపయోగించిన విధంగా ఇప్పుడు వ్యవసాయ కార్య కలాపాలకు ఉపయోగించ రాదన్నమాట. ఫలితంగా, గ్రామీణ పేదలకు ఉపాధి నిరాకరణ మరింత ఎక్కువవుతోంది. దాంతో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని యూనియన్‌ నిర్ణయించింది.
       డిమాండ్ల పత్రం
   కార్మికుల్లోనూ, అధికారుల్లోనూ ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు కల్పించిన చైతన్యం ఫలితంగా పని దినాలు పెరగడమే కాక వంద రోజుల ఉపాధి పూర్తి చేసే కార్మికుల సంఖ్య కూడా పెరిగింది. ఈ చట్టం గురించి అందరికీ తెలిసేలా చేయడానికి యూనియన్‌ చాలా కృషి చేసింది. మళయాళంలో ఒక చిన్న బుక్‌లెట్‌ను కూడా ప్రచురించింది. వివిధ స్థాయిల్లో చైతన్యపరిచే కార్యక్రమాలను యూనియన్‌ నిర్వహించింది. 'ఉపాధి హామీ : సమస్యలు, పరిష్కారాలు' అనే శీర్షికతో యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఒక కరపత్రాన్ని ప్రచురించి విస్తృతంగా పంపిణీ చేసింది. వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ యూనియన్‌ను ఎలా నిర్మించాలనే దాన్ని వివరంగా పేర్కొంటూ ఒక పత్రాన్ని, సొంతంగా నియమనిబంధనలను కూడా యూనియన్‌ ఆమోదించింది. ఈ ఏడాది జూన్‌ 30న త్రిస్సూర్‌లో ప్రత్యేక రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించింది. ఈలోగా, ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ల పత్రాన్ని అందజేసింది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను సక్రమంగా అమలు చేయాలని ఈ డిమాండ్ల పత్రం కోరుతోంది. నిలకడగా కొనసాగించేందుకు, ఈ చట్టం కింద కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ అందేలా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ప్రతి ఏటా ప్రతి కుటుంబానికీ కనీసం 200 రోజుల పాటు పని కల్పించాలని, దినసరి వేతనాన్ని రూ.320కి పెంచాలని, ఉదయం 9 నుంచి 4 గంటల వరకూ ఒక గంట విరామంతో సహా పని వేళలను రీ షెడ్యూల్‌ చేయాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కింద పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ నిధి బోర్డును ఏర్పాటు చేయాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను పక్కన పెట్టే విధంగా ఉన్న తమ ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని, ఈ కార్మికుల పిల్లలకు విద్యా ప్రయోజనాలు అందచేయాలని, వ్యవసాయ రంగాన్ని ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పనుల పరిధి నుంచి తొలగించడాన్ని రద్దు చేయాలని ముఖ్యంగా, వరిసాగును ఈ చట్టం పరిధిలోకి తేవాలని, ఎందుకంటే కేరళలో ఆహార భద్రతకు హామీ కల్పించాలంటే ఇది తప్పనిసరని యూనియన్‌ ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
ఇంకా వేతనాలు వారం వారం చెల్లించాలని, ఒకవేళ ఎప్పుడైనా జాప్యం జరిగినా ఎట్లి పరిస్థితుల్లోనూ 14 రోజుల కన్నా ఎక్కువ ఆలస్యం చేయరాదని, ఒకవేళ అంతకన్నా ఎక్కువ జాప్యం జరిగితే దానికి నష్టపరిహారం చెల్లించాలిని కూడా డిమాండ్‌ చేసింది. ఈ చట్టం కింద పనిచేసే కార్మికులందరికీ బీమా కల్పించాలని, పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం, ప్రాధమిక చికిత్సా కిట్‌లను కల్పించాలని, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయడం వంటి ఇంకా అనేక డిమాండ్లను ప్రభుత్వాల ముందించింది.
పైన పేర్కొన్నవాటితో సహా వివిధ సమస్యల పరిష్కారానికి, మరింత ఉధృతంగా ప్రచారాన్ని, కార్యాచరణను చేపట్టాలని ఎన్‌ఆర్‌ఇజిడబ్ల్యుయు పిలుపిచ్చింది. ఇందుకు సంబంధించి యూనియన్‌ చాలా ఆశాభావంతో ఉంది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులందరూ యూనియన్‌ బ్యానర్‌ కింద ఐక్యతతో, ఉత్సాహంగా ఉంటూ ఈ డిమాండ్లను నెరవేర్చుకోగలరని యూనియన్‌ భావిస్తోంది.
Prajashati Telugu News Paper Dated: 31/10/2013 
   

No comments:

Post a Comment