Friday, November 15, 2013

పెరుగుతున్న వలసలు,మారుతున్న స్వభావాలు By అర్చనా ప్రసాద్‌



    2011లో భారత్‌లో అంతర్గత వలసదారులు 40కోట్ల మంది ఉంటారని అంచనా వేశారు. అయితే, ఇది తప్పు కావడానికి అవకాశముంది. ఎందుకంటే చాలా తక్కువ కాలం ఉండే సీజనల్‌ మైగ్రేషన్‌ (సీజన్లవారీగా వలసలు) గురించి ఈ నివేదికల్లో దేంట్లో కూడా తగిన విధంగా అంచనా వేయలేకపోయారు. లేబర్‌ మార్కెట్‌కు పునాది వంటిదే ఈ సీజన్ల వారీ వలసలు. ఒక అంచనా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జరిగే వలసలు దాదాపు 10కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో చాలా మంది దళితులు, ఆదివాసీలే కావడం గమనార్హం.

   భారత్‌లో అంతర్గత వలసలు, మురికివాడల ప్రజలకు సంబంధించి ఇటీవల రెండు నివేదికలు వచ్చాయి. దేశంలో అతి వేగంగా మారిపోతున్న కార్మిక వర్గ జనాభా మార్పుల గురించే ఈ రెండు నివేదికలు పేర్కొన్నాయి. వ్యవసాయ రంగంలో తలెత్తిన నిరాశా నిస్పృహలతో, సంక్షుభిత పరిస్థితుల కారణంగా కూడా పల్లెల నుండి పట్టణాలకు వలస వెళ్లడం పెరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఈ వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో, అలాగే కార్మిక వర్గ సామాజిక స్వభావాలు లేదా లక్షణాల గురించి ''అంతర్గత వలసవాదులు, సామాజిక కూర్పు'' పై యునెస్కో వెలువరించిన నివేదిక వెల్లడించింది. 2011లో భారతదేశ జన గణనలో మురికివాడలపై కొత్తగా ఇచ్చిన డేటాను కూడా విడుదల చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితి స్థాయి ఎంతలా వుందో ఈ నివేదికలు వెల్లడించాయి. అలాగే నయా ఉదారవాద విధానాల వల్ల సుదీర్ఘకాలంలో తలెత్తే ప్రభావాల గురించి కూడా వెల్లడించాయి. గ్రామీణ, పట్టణ కార్మికవర్గాల్లో మారుతూ వచ్చిన స్వభావాలను కూడా ఈ నివేదికలు ప్రముఖంగా ప్రస్తావించాయి. సమకాలీన నయా ఉదారవాద కార్పొరేట్‌ పెట్టుబడివాదాన్ని సవాలు చేసేందుకు వీరిని అంటే ఈ కార్మిక వర్గాన్ని సమీకరించాల్సి ఉంది.
                                 వలసలు, దుస్థితి
2001 జనాభా లెక్కల్లో పేర్కొన్నట్లుగా భారతదేశంలో దాదాపు 30శాతం జనాభా అంతర్గత వలసలకు వెళుతూంటుంది. 2007-08లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అంచనాలను పరిశీలిస్తే ఈ సంఖ్య 28.5 శాతానికి పడిపోయింది. కానీ 2011 జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ సంఖ్య 33.3 శాతానికి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. యునెస్కో కోసం వీటిపై అధ్యయనం చేయడం జరిగింది. 2011లో భారత్‌లో అంతర్గత వలసదారులు 40కోట్ల మంది ఉంటారని అంచనా వేశారు. అయితే, ఇది తప్పు కావడానికి అవకాశముంది. ఎందుకంటే చాలా తక్కువ కాలం ఉండే సీజనల్‌ మైగ్రేషన్‌ (సీజన్లవారీగా వలసలు) గురించి ఈ నివేదికల్లో దేంట్లో కూడా తగిన విధంగా అంచనా వేయలేకపోయారు. లేబర్‌ మార్కెట్‌కు పునాది వంటిదే ఈ సీజన్ల వారీ వలసలు. ఒక అంచనా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జరిగే వలసలు దాదాపు 10కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిలో చాలా మంది దళితులు, ఆదివాసీలే కావడం గమనార్హం.
గత రెండు దశాబ్దాల కాలంలో గ్రామీణ జీవితం, జీవన భృతి దారుణంగా విధ్వంసమైన ఫలితంగానే పెద్ద ఎత్తున సీజన్లలో ఈ వలసలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్ళిపోయే రేటులో కూడా పెరుగుదల ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. 2007-08లో ఈ రేటు 36శాతంగా వుంది. 1999-2000 నుండి రెండు శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, ఉపాధి కోసం వెతుక్కుంటూ కాకుండా పెళ్ళిళ్ళయి మహిళలు వలస వెళ్ళిపోయిన ఫలితమే ఈ వలసల రేటు పెరగడానికి ఎక్కువ కారణంగా కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలో ప్రధానంగా వచ్చిన ఈ నిర్ధారణను యునెస్కో సర్వే తిరస్కరించింది. గణనీయంగా మహిళలు వలస వెళ్ళిపోవడానికి పెళ్ళిళ్ళవడం ఒక్కటే కారణం కాదని వాదించింది. వివాహమైన తర్వాత మహిళలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళవచ్చు కానీ వారు వలస వెళ్ళిన తర్వాత అక్కడ ఉపాధి చేపడతారని, తమ కుటుంబ అవసరాలు తీరడానికి వారికి ఇది తప్పదని పేర్కొంది. అందువల్ల మహిళలకు సంబంధించి ఉపాధి, పని అంచనాలు వివాహంతో కూడిన వలసలతో చాలా సన్నిహితంగా ముడిపడి ఉంటాయి. తమ వలసలకు ప్రధాన కారణం ఉపాధి కాకపోయినప్పటికీ వలస వెళ్ళిన మహిళలకు ఉపాధి దొరకడం చాలా అధిక రేటులో ఉండడాన్ని 2007-08లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వలస సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. వలస వచ్చిన మహిళల్లో ఐదవ వంతు మంది క్యాజువల్‌ లేబర్‌గా చేస్తుండగా వారిలో 43.7శాతం మంది నిరుద్యోగులే. 36.7శాతం మంది రెగ్యులర్‌ సర్వీస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే నర్సింగ్‌, ఇంటి పనులు వంటి రంగాల్లో ఎక్కువమంది వున్నారు. తమ భర్తలు ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లిపోయినా గ్రామీణ ప్రాంతాల్లో వుండే మార్గాన్ని వివాహితులు ఎంచుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. వీరు కూడా తమ భర్తలతోపాటుగా ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వెళ్ళిపోతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. సంస్కరణల అనంతర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
              స్వల్పకాల వలసలు, గుర్తింపు లేని కార్మికుడు
ఆ రకంగా కార్మికుల వలస ధోరణులకు సంబంధించి మరింత సమగ్రమైన, కచ్చితమైన పరిస్థితి మనకు తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే స్వల్పకాల వలసలను జనాభా లెక్కల్లో పరిగణించరు, లెక్కించరు. అయితే, అటువంటి వలసలు కూడా తాజా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అంచనా వేయబడ్డాయి. 2000 నుండి 2008 మధ్య కాలంలో ఇలా స్వల్ప కాల వలసలకు వెళ్ళిన వారి సంఖ్య 12.4 మిలియన్ల నుండి 15.2 మిలియన్లకు పెరిగింది. అంటే దీనర్ధం స్వల్ప కాలం పాటు (అంటే రెండు నుండి ఆరు మాసాలు) వలసలు వెళ్ళే పరిస్థితులు పెరిగాయన్న మాటే. ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది కార్మికులు ఈ రీతిన వలసలకు వెళుతుంటారు. వీరిలో, 85.1శాతం మంది పురుషులే, వీరు పట్టణ ప్రాంతాలకు వలస వెళుతుంటారు. విస్తృత ధోరణిలో చూసినట్లైతే, గ్రామీణ ప్రాంతాల నుండి స్వల్ప కాలానికి వలస వెళ్ళే మహిళల సంఖ్య చాలా పరిమితంగా వుంది. ఈ మొత్తం కథనంలో అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశమేమంటే, 2007-08లో వలస వెళ్ళిన 28 లక్షల మంది మహిళా వలస కార్మికుల్లో 60శాతానికి పైగా ఎస్‌సి, ఎస్‌టిలకు చెందినవారే. ఎస్‌సి, ఎస్‌టి పురుష వలస కార్మికుల కన్నా కూడా ఈ సంఖ్య చాలా ఎక్కువగా వుంది. మొత్తం పురుష కార్మికుల్లో కేవలం 30శాతంగా మాత్రమే వలస కార్మికులు ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే వ్యవసాయేతర లేబర్‌ మార్కెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిల వలసలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ తరహా వలసలకు సంబంధించి పరిగణించాల్సిన మరో అంశం ఏమంటే గ్రామీణ, పట్టణ స్వభావం. స్వల్ప కాలం పాటు వలసలకు వెళ్ళేవారు అక్కడ గల గ్రామీణ యజమానులతో తమ సంబంధాలను అలాగే కొనసాగిస్తారు. ఏడాదిలో కొంత కాలం పాటు వారి సొంత భూముల్లో స్వయం ఉపాధి వ్యవసాయదారులుగా తరచూ పని చేస్తూంటారు. ఈ రకంగా, వారు పూర్తి స్థాయి, పూర్తి కాలం పట్టణ కార్మికులు కారు, లేదా పూర్తి స్థాయి పూర్తి కాలం గ్రామీణ కార్మికులు కాకుండా వుంటారు. గ్రామీణ, పట్టణ పనులు, కార్యకలాపాల పట్ల వారి అనుభవాలే వారి చర్యలను నిర్దేశిస్తాయి. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల వ్యవహారాల్లో వారికి పరిమిత రాజకీయ ప్రాతినిధ్యం ఉంటుంది. సామాజిక రక్షణ కోసం, పథకాల కోసం డిమాండ్‌ చేసేటపుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఈ పథకాలకు శాశ్వత నివాసపు రుజువు అవసరమవుతుంది. ఇలా వలస కార్మికుడు అటు విస్తృత స్థాయిలో తీసుకున్న గణాంకాల్లోనూ, అలాగే రాజకీయ దృశ్యంలోనూ కూడా కనిపించకుండా పోవడానికి వారి సంచార జీవితం, గ్రామీణ, పట్టణ వ్యవస్థలతో పలుచనైన సామాజిక సంబంధాలే కారణం. పైన పేర్కొన్న విస్తృత డేటాను విశ్లేషించడం వల్ల తలెత్తిన సమస్యల్లో ఒకటి ఏంటంటే కార్మికుల సంచారత లేదా వలసలపై అంచనాలు 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకరణ రేట్లకు అనుగుణంగా లేవు. అలాగే పట్టణ ఉపాధి ధోరణులకు అనుగుణంగా కూడా లేవు.
                   పట్టణ కార్మికుల సామాజిక కూర్పు
జనాభా లెక్కలకు సంబంధించి ఇటీవల విడుదలైన మురికివాడల గణాంకాల ప్రకారం చూసినట్లైతే పట్టణ కార్మిక వర్గం విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ ఉపాధి విస్తరణ, పట్టణ కేంద్రాల విస్తరణ ఈ రెండూ కూడా పైన పేర్కొన్న స్వల్ప కాల, దీర్ఘకాల వలసల గురించి బాగా తక్కువ చేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. 2001లో నోటిఫై చేయబడిన మురికివాడల ప్రాంతాలు 1743 ఉండగా అవి 2011 నాటికి 2613కి పెరిగాయి. అయితే, చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన మురికివాడల ప్రాంతాలు మనకు కొంతమేరకే వివరాలు వెల్లడిస్తాయి. కార్మిక వర్గంలో చాలా వరకు జనాభా గుర్తించబడిన మురికివాడల్లో నివశిస్తారు. అవి ఇంకా నోటిఫై చేయాల్సిన మురికివాడలో లేక గుర్తించిన మురికివాడలో అయి వుంటాయి. అంటే మురికివాడల స్వభావాలు కలిగి ఉండి జనాభా గణికులచే గుర్తించబడినవే తప్ప ఇంకా ప్రభుత్వం గుర్తించని వాడల్లో వీరు నివసిస్తారన్నమాట. మరో మాటలో చెప్పాలంటే, 2011 జనాభా లెక్కలు పట్టణ ప్రాంతాల్లోని అన్ని కార్మిక వాడలను డాక్యుమెంట్‌ చేయడానికి ప్రయత్నించాయి. దీని ప్రకారం చూస్తే 2001 నుండి 2011 మధ్యలో మురికివాడల కుటుంబాల సంఖ్య 44.2 శాతం పెరిగింది. అన్ని మురికివాడల్లోని జనాభాలో దాదాపు 36శాతం మంది గుర్తించబడని కాలనీల్లో నివశిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. అందువల్ల వారికి ఎలాంటి గుర్తింపు కానీ, ప్రభుత్వ విధానాల్లో హక్కులు కానీ ఉండవు. కేవలం 34.4 శాతం మంది మురికివాడల ప్రజలు మాత్రమే నోటిఫై చేయబడిన, అధికారిక మురికివాడల్లో నివసిస్తున్నారు. ఈ తరహా మురికివాడలకు కొన్ని మౌలికమైన సౌకర్యాలు ఉంటాయి. దశాబ్ద కాలంలో మహిళా కార్మికుల పురోగతి రేటు పురుషుల కన్నా కూడా దాదాపు 5.7శాతం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న దుస్థితి కారణంగా కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్ళే అంశాన్ని ఇది మరోసారి ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
ఇక ఈ డేటా నుండి వెల్లడైన మరో అంశం ఏమంటే మురికివాడల ప్రజల్లో కూడా వైవిధ్యమైన సామాజిక కూర్పు వుంది. ఇతరుల కన్నా కూడా ఈ దశాబ్ద కాలంలో ఎస్‌సి, ఎస్‌టిల్లో మురికివాడల జనాభా అధిక రేటున పెరిగింది. ఎస్‌సిల్లో ఇది 38శాతంగా ఉంటే ఎస్‌టిల్లో 51.8శాతంగా ఉంది. ఆ రకంగా 2011లో మురికివాడల జనాభాలో ఎస్‌సి జనాభా 20.4శాతంగా వుంది. 2001లో ఇది 18.5శాతంగా వుంది. ఎస్‌టి జనాభా కేవలం 3.4శాతంగా వుంది. 2001లో ఈ సంఖ్య కేవలం 2.5శాతంగా ఉంది. మొత్తం దశాబ్దంలో పట్టణ ప్రాంతాల్లో మురికివాడల జనాభా మొత్తంగా 17.4శాతానికే పరిమితమైనందున పై పెరుగుదల ప్రాముఖ్యమైనదనే చెప్పుకోవచ్చు. అదీకాక, పురుషుల కన్నా కూడా ఎస్‌సి, ఎస్‌టి మహిళల నిష్పత్తి కూడా అధిక రేటున పెరిగింది. 2001 నుండి 2011 మధ్య కాలంలో ఎస్‌సి మహిళల దామాషా 40.3శాతం పెరిగింది. అదే సమయంలో ఎస్‌టి జనాభా 50.4శాతం పెరిగింది. మొత్తంగా మురికివాడల జనాభా గత దశాబ్ద కాలంలో 34శాతం పెరిగిన దానికన్నా కూడా ఈ నిష్పత్తులు చాలా ఎక్కువ.
లేబర్‌ మార్కెట్‌లో అవకాశాలు సంపాదించుకోవడం కోసం పట్టణ, గ్రామీణ కార్మికులు ఎక్కువగా ఈ సమీకరణలు లేదా వలసలపైనే ఆధారపడుతున్నారని ఈ డేటా తెలుపుతోంది. అయితే, అటువంటి వలసల వల్ల వారు గుర్తించబడిన కార్మికులుగా లేదా కార్మిక హక్కులు పొందినవారిగా ఉంటారనడానికి ఎలాంటి హామీ లేదు. అదీకాక, ఇటువంటి కార్మిక వర్గంలో వస్తున్న మార్పుల్లో కూడా వైవిధ్యమైన సామాజిక లక్షణాలు ఉన్నాయి. పైగా అనేక వర్గ, పితృస్వామ్య సంబంధాలు కూడా మధ్యవర్తిత్వం నెరుపుతాయి. కార్మికుల ఐక్యత సాధించేందుకు గానూ ముందుగా కార్మికులందరూ కూడా నమోదు చేసుకుని వుండడం తప్పనిసరి, ముఖ్యం కూడా. అలాగే వలస కార్మికులకు సంబంధించి నిర్దిష్ట సమస్యలను కార్మిక మహా ఉద్యమాల ద్వారా చేపట్టడం కూడా అత్యంత ముఖ్యమైనదే.

-
Prajashakti Telugu  News Paper Dated: 16/11/2013 

No comments:

Post a Comment