Monday, November 4, 2013

అందరికీ విద్య అందేనా ? By శ్రీదేవి కవికొండల


  నూట ఎనభై దేశాలు 2000 ఏప్రిల్‌ లో దకార్‌(సెనెగల్‌)లో ప్రపంచ విద్యా ఫోరమ్‌పై సంతకాలు చేశాయి. వాటిలో భారతదేశం కూడా ఉంది. అవి తమ తమ దేశాల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు కొన్ని ప్రమాణాలు చేశాయి. అవి వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల వారికందరికీ 2015 లోపు విద్యను అందించడం, బాలికలతో సహా పిల్లలందరూ బడికి వెళ్లే అవకాశం కల్పించడం, 50 శాతం వరకు వయోజన విద్య, 2005 కల్లా ప్రాథమిక, మాధ్యమిక విద్యలో లింగ బేధాలను రూపుమాపడం, 2015 నాటికి స్త్రీపురుష సమానత్వం సాధించడం, యువతకు జీవనోపాధి నైపుణ్యాలను నేర్పించడం. ఇవన్నీ ఎంతవరకు సాధించామో, సాధించగలమో చెప్పలేము కానీ 2015 కల్లా పిల్లలందరికీ విద్యనందించేందుకు ప్రస్తుతం విద్యా హక్కు చట్టంతో ప్రాథమిక విద్య మీద దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వం. 2015 ఎంతో దూరంలో లేదు. ఆ దిశగా మన రాష్ట్రంలో పిల్లలు ఏమాత్రం బడికెళ్ళి చదువుకునే అవకాశముందో చూద్దాం. ప్రతి చట్టంలో మాదిరిగానే ఇందులోనూ లొసుగులు, లోటుపాట్లు ఉన్నాయి. అయితే ఇందులో సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. 6-14 మధ్య బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నిర్బంధ విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదే. అందుకోసం వారికి కావలసిన అన్ని సౌకర్యాలూ కల్పించాలి. అయితే 2011-12 లెక్క ప్రకారం వాటిలో చాలా వరకూ నెరవేరలేదు. రాష్ట్రంలో 5,774 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచరు కూడా నియమించబడలేదు. 100 మందికి పైగా పిల్లలున్న 400 స్కూళ్ళలో ఒక్క టీచరు కూడా లేరు. అయిదు, అంత కన్నా తక్కువ పిల్లలున్న స్కూళ్ళు 251 ఉన్నాయి. 100 మంది విద్యార్థులున్న 15,170 ప్రాథమిక పాఠశాలలు ఒక్క టీచర్‌తో నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు, టీచర్ల నిష్పత్తి 1:40 ఉండాల్సింది కేవలం 1:28 మాత్రమే ఉంది.
బడికి వచ్చిన పిల్లలు డ్రాపవుట్‌ లేకుండా చదువు కొనసాగించాలన్నది విద్యా హక్కు చట్టం ఉద్దేశం. బడిబాట, మధ్యాహ్న భోజనం, బడి నిర్వహణ కమిటీలు, విద్యా వాలంటీర్లు, కమ్యూనిటీ కలిసి కృషి చేసినా ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్‌ రేటు చాలా ఎక్కువగానే ఉంది. దీంట్లో ఎక్కువ శాతం బాలికల డ్రాపౌట్‌ రేటు ఉంది. బాలికలను స్కూలుకు పంపకపోవడం వెనుక సామాజిక కారణాలు ఎన్నో ఉన్నాయి. వాటి తర్వాత ముఖ్యమైన రెండు కారణాలలో స్కూల్‌ దగ్గరలో లేకపోవడం, స్కూల్‌లో టారులెట్లు, తాగునీరు లేకపోవడం. ఒక జిల్లాకు పది సర్వేల చొప్పున రాష్ట్రం మొత్తం మీద 945 సర్వేలు జరిపిన ఒక నివేదిక ప్రకారం 70 శాతం పాఠశాలలకు టారులెట్‌లు ఉన్నాయి. కానీ, అందులో 35 శాతం మాత్రమే వాడుకకు అనువుగా ఉన్నాయి. టారులెట్లు లేవని బాలికలు స్కూల్‌ మధ్యలోనే మానేస్తున్నారు.
విద్యా హక్కు చట్టంలో ఇంకో అంకం, బడి నిర్వహణ కమిటీలు. ఈ కమిటీలు స్కూల్‌ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఇందులో పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సర్పంచ్‌తో సహా 15 మంది సభ్యులుండాలి. ఇందులో వెనుకబడిన కులాలు, తరగతుల పిల్లల తల్లిదండ్రులకు, మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆలోచన భేషుగ్గానే ఉందికానీ ఆచరణ శూన్యం. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉన్నత కులాలు, మధ్య తరగతి వారు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదు. ఇక బడి అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడమన్నది ఒక పెద్ద ప్రహసనమే. కొన్ని చెదురుమదురుగా పనులు సాగుతున్నాయంటే అది ఆ స్కూల్‌ హెడ్మాష్టర్‌ నిజాయితీ, శ్రద్ధ, ఆయనకి ఉన్న పలుకుబడే కారణం కావచ్చు.
విద్యా హక్కు చట్టానికి ఇంకో కొసమెరుపు 130 జీవో. దీని ప్రకారం స్కూల్‌లో పిల్లల మార్కులు, చదువు పట్ల వారి ప్రదర్శన బట్టి టీచర్‌కు అవార్డులు, రివార్డులు, శిక్షలు, బదిలీలు. పిల్లలను ఇంటింటికి తిరిగి పట్టుకురావడం దగ్గర నుంచి వారి చదువు సంధ్యలు, భోజనం, బాగోగులు అన్నీ చూడవలసింది టీచర్లే. ఈ లెక్కన 2015 లక్ష్యం నెరవేరుతుందా? అరకొర నిధులతో, నిబద్ధత లేని విద్యా విధానంతో మనం ఈ లక్ష్యాన్ని ఎప్పటికి చేరగలం? పిల్లలందరి హక్కైన విద్య వారి దరికి ఎందుకు చేరడం లేదు? ఈ తప్పు ఎవరిది? దీనికి పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆడపిల్లలు బడికి వెళ్ళాలంటే విద్యా హక్కు చట్టంలో చెప్పిన అన్ని వసతులూ ప్రభుత్వం కల్పించాలి. తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి. అది ఎప్పుడు వస్తుంది? తమ ఆకలి తీరినప్పుడు కదా వారు వేరే విషయాల గురించి ఆలోచిస్తారు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిబడి ఉంటాయి. దీనికి మూలం చివరకు పేదరికం, నిరక్షరాస్యత దగ్గరకు వెళ్తుంది. అక్షరాస్యత పెంపొందాలంటే పేదరిక నిర్మూలన జరగాలి. ఇది జరగాలంటే ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి.Prajashakthi Telugu News Paper Dated: 04/11/2013 

No comments:

Post a Comment