Friday, November 1, 2013

నిజంగానే నీటియుద్ధాలు జరుగుతాయా! By జి. వివేక్‌ రచయిత పార్లమెంట్‌ సభ్యులు


ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు
స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు 
జలయజ్ఞం పేరిటా తరలుతున్న నీరు
అక్రమంగా సీమకు 364 టిఎంసిల నీరు 
సీమకు లేనిహక్కు ఉన్నట్టుగా ప్రచారం 
విభజనతో బయటపడనున్న నీటిచౌర్యం
అందుకే సమైక్య రాష్ట్రం కోసం ఎత్తులు 
కిరణ్‌, బాబు, జగన్‌ సీమనేతలే 
నిజాలు తెలిస్తే నాయకులమీదే యుద్ధం 

రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు వస్తాయని, కొంపలు మునిగిపోతాయని కొంత కాలంగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి గుండెలు బాదుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనుంచి ఈ ముగ్గురు నాయకులు అన్ని ప్రాంతాల ప్రజల్నీ తప్పు దోవ పట్టించేలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ విద్వేషాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ వాదన వెనుక అసలు బండారాన్ని బయటపెట్టి తెలంగాణతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు వాస్తవాలు తెలుసుకోవలసి ఉంది. 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిదేళ్ళు పనిచేసిన చంద్రబాబు నాయుడు, మూడేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒకవైపు, ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడుతున్న వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి మరోవైపు స్వార్ధ రాజకీయాలకోసం తెలంగాణ, కోస్తాంధ్ర ప్రజల జీవితాలతో, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలతో ఆడుకుంటున్నారు.

రాయలసీమ ప్రయోజనాలకోసం లేని హక్కు ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు వస్తాయని ఈ ముగ్గురు నేతలు చేస్తున్న వాదనలో వాస్తవం ఎంతో పరిశీలించాలి. రాయలసీమకు చెందిన ఈ ముగ్గురు నాయకులూ జలయజ్ఞం పేరిట మొదలైన నీటి దొంగతనాన్ని శాశ్వతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు రాష్ట్రాలుగా అందరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నా, ఈ నాయకులు తమ స్వార్ధం కోసం విభజనను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. ప్రజలకు తప్పుడు లెక్కలు చెబూతూ రెచ్చగొడుతు న్నారు. దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్న రాయలసీమ నేతలు కృష్ణానదీ జలాలను అక్రమంగా మళ్ళిస్తున్న వాస్తవం సాగునీటి నిపుణులు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా రావలసిన నీటి వాటా ఇవ్వకుండా తమ ప్రాంతానికి మళ్ళించుకుంటున్నారు. వాళ్ళ పాపాల ఫలితం, తెలంగాణకు అన్యాయం చేసిన ఉసురు అన్నీ కలిసి రాయలసీమను పాడుపెట్టాయి. ఇప్పటికీ మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి- ముగ్గురూ కలిసి చేస్తున్న కుట్రలు ఫలిస్తే ఇటు తెలంగాణ ప్రాంతానికే కాదు, అటు కోస్తాంధ్ర ప్రాంతానికి రావలసిన నీటికి కూడా గండి పడే ప్రమాదం ఉంది. 
మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణానది మన రాష్ట్రంలో ప్రవేశిస్తోంది. 

జూరాల ప్రాజెక్టుకు అధికారికంగా 17 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నా, వాస్తవానికి 10 టిఎంసిలకంటె ఎక్కువ నిల్వ చేయడం లేదు. దీంతో 7 టిఎంసిల నీటిని జూరాల కింద తెలంగానలో ఉపయోగించుకోకుండానే ముందుకు వదిలేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ఠ నీటి మట్టం (జటజూ) 885 అడుగులు ఉండాల్సి ఉండగా, అంతకన్నా దిగువన అంటే 841 అడుగులకే కావాల్సినంత నీటిని అక్రమంగా వాడుకోవడానికి పోతిరెడ్డిపాడు హైడ్‌ రెగ్యులేటర్‌ను ఆధునికీకరించుకున్నారు. ఇలా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండకుండానే పోతిరెడ్డిపాడు తూముల ద్వారా దుర్మార్గంగా నీటిని రాయలసీమకు మళ్ళిస్తున్నారు. అంతేకాదు, గాలేరు- నగరి, హంద్రి-నీవా సుజల స్రవంతి, శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ, వెలుగోడు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్‌, సోమశిల, కండలేరు, వెలుగొండ ప్రాజెక్టులతో పాటు కెసి కెనాల్‌కు అదనంగా 10 టిఎంసిల నీటిని తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 364 టిఎంసిల కృష్ణానీటిని వాడుకునేందుకు రంగం సిద్ధమైంది. 

కృష్ణా బేసిన్‌లో రాయలసీమ ప్రాజెక్టులకు అధికారికంగా ఉన్న వాటా 144.70 టిఎంసిలు. ఇందులో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, కెసి కెనాల్‌ల ద్వారానే 101 టిఎంసిలదాకా ఇప్పటికే వాడుకుంటున్నారు. మరో 50 టిఎంసిల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి వాడుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా 364 టిఎంసిల దాకా మళ్ళించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి మళ్ళిస్తున్న కృష్ణా జలాల్లో కంటితుడుపుగా 50 టిఎంసిల నీటిని నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులకు మళ్ళించి కోస్తా ప్రాంతం మొత్తానికి నీళ్ళు ఇస్తున్నట్టు చెప్పుకోవచ్చుననే కుట్ర కనుపిస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ మన రాష్ట్రానికి కేటాయించిన 811 టిఎంసిల కృష్ణా జలాల్లో 144.70 టిఎంసిలు రాయల సీమకు, 367.34 టిఎంసిలు కోస్తా ఆంధ్రకు, 298.96 టిఎంసిలు తెలంగాణకు స్పష్టమైన వాటాలున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఏకంగా 364 టిఎంసిల నీటిని రాయలసీమకు తరలించడం ఏం న్యాయం? మిగిన ప్రాంతాలకు ఘోరమైన అన్యాయం చేయడం కాదా? పైగా సీమలో హంద్రీ నీవా ఒక్కటే ఎత్తిపోతల స్కీము కాగా, మిగిలిన ప్రాజెక్టులు అధికారిక కేటాయింపులు లేకుండానే గ్రావిటీ ఆధారంగా తేలికగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ ద్వారా నీటిని మళ్ళించుకునే వీలుంది. 

ఇదే సమయంలో తెలంగాణకు అధికారికంగా దక్కాల్సిన 297.96 టిఎంసిల వాటా ఏనాడూ వచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నామనే పేరుతో మొదలు పెట్టిన బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటివన్నీ ఎత్తిపోతల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులే. ఇవన్నీ కలిపినా 60 టిఎంసిలు దాటవు. చిన్న నీటి వనరుల ద్వారా తెలంగాణలో 90 టిఎంసిలు ఉపయోగిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నా, ఆ నీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో మాత్రం చెప్పలేకపోతున్నారు.రాయలసీమలో నీటి కేటాయింపులు లేకుండానే నిర్మిస్తున్న ప్రాజెక్టులు చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ మాత్రమే కాదు, కోస్తాంధ్ర కూడా- అందులోనూ ముఖ్యంగా కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు పోలవరం నీళ్ళొస్తాయనే పేరుతో కృష్ణా జలాలను నాగార్జున సాగర్‌ దాకా కూడా రానీకుండా చేసే కుట్ర జరుగుతోంది. ఇదే జరిగితే తెలంగాణ, కోస్తా ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. 

రాష్ట్ర విభజన జరిగాక, ఇన్నేళ్ళలో నీటిని అక్రమంగా వాడుకున్న లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఇంతకాలం ముఖ్యమంత్రులుగా ఉండి దొంగ లెక్కలతో జనాన్ని వంచించిన సంగతి బయట పడిపోతుంది. అందుకే ఈ కుట్ర బయటపడకుండా విభజనను అడ్డుకోవడానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి సమైక్యాంధ్ర పేరుతో నాటకాలు ఆడుతున్నారు. రైతుల మధ్య యుద్ధాలొస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి భయపెడుతున్నారు. బ్రహ్మాండం బద్దలవుతుందని చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీళ్ళెలా వస్తాయని జగన్మోహన్‌ రెడ్డి జనరల్‌ నాలెడ్జి ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళ డ్రామాలను నమ్మితే కోస్తాంధ్ర, రాయలసీమ జనం కూడా నిండా మునిగే ప్రమాదం ఉంది. 
విభజన తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాల్ని ఈ ముగ్గురు నాయకులూ నాశనం చేస్తున్నారు. వీళ్ళ స్వార్ధ ప్రయోజనాలకోసం కోస్తాంధ్ర ప్రజలను కూడా నిలువునా వంచిస్తున్నారు. రాయలసీమకు న్యాయం చేస్తామనే పేరుతో హక్కు లేకపోయినా నీటిని రప్పిస్తామంటూ సీమ ప్రజలను దగా చేస్తున్నారు. 

ఇలాంటి అవకాశవాదులైన నాయకుల వల్లే దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇదే నాయకులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకే వీళ్ళు విభజనను వ్యతిరేకిస్తున్నారు. జనం మధ్య లేని విభేదాలను రేపుతున్నారు. నీటికి అక్రమంగా మళ్ళించడం కోసం వీళ్ళు చేస్తున్న కుట్రలు బయటపడితే నిజంగానే నీటి యుద్ధాలు వస్తాయి. ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా, స్వార్ధ రాజకీయాలకోసం ఆడిన నాటకాలు తెలిస్తే జనం ఈ నాయకులపైనే యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా ఈ నాయకుల కుట్రల్ని గ్రహించాలి. 




No comments:

Post a Comment