Tuesday, November 26, 2013

తొలి సంఘసంస్కర్త -స్వరూప

తొలి సంఘసంస్కర్త

మనువాద వ్యవస్థలో నలిగిపోతున్న మూలవాసులను చైతన్యవంతుల్ని చేయడానికి జీవితాంతం పోరాడి గెలిచిన సామాజిక విప్లవ చైతన్యమూర్తి జ్యోతిరావు పూలే. 1827 ఏప్రిల్ 11న మహా రాష్ట్రలోని సతారా జిల్లాలో ఖన్‌వాడీ గ్రామంలో గోవిందరావుపూలే, చిమనబాయి దంపతులకు జన్మించాడు. చదువు పై ఆసక్తితో ఏడేళ్ల వయస్సులోనే పాఠశాలకు చేరాడు. ఛాందసులైన మను వాదులు కులం, మతం మంటగలిసి పోతుందని పూలే తండ్రిని హెచ్చరించడంతో పూలేను బడి మాన్పించాడు. కానీ చదువుపై ఆసక్తితో తండ్రిని ఒప్పించి తిరిగి చదువు కోవడానికి పాఠశాలలో చేరాడు. అందరితో స్నేహంగా, చురుకుగా ఉండే పూలేకు చాలా మంది స్నేహితులుండేవారు. అందులో బ్రాహ్మణ మిత్రుల్లో ఒకరు తమ కుటుంబంలో జరిగే పెళ్లికి పిలవడంతో పూలే ఆ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు. ఓ బీసీ పిల్లవాడు అగ్ర వర్ణాలతో సమానంగా కలిసి నడవటం బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. ‘శూద్రుడవై ఉండి మాతో కలిసి నడుస్తావా’ అంటూ పూలేను అవమానించారు. రూపు రేకల్లో సమా నంగా ఉన్నా ఈ ఈసడింపులు ఎందుకు? అని బాధపడ్డాడు. సంఘంలో మనుషుల మధ్యనే ఈ అసమానతలు ఎందుకున్నాయి? వీటిని రూపుమాపే మార్గాలే లేవా? అని ఆలోచిస్తూ.. సమాజాన్ని అధ్యయనం అనేక మత,చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వీటన్నింటిని చదివి మనిషికి విద్యతోనే జ్ఞానం లభిస్తుందని తెలుసుకున్నాడు. దళిత బహుజనులకు విద్యనందించేందుకు కంకణం కట్టుకున్నాడు. బహుజనుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఆబడిలో బహుజనులకు, శూద్రులకు, అతిశూద్రులకు మాత్రమే ప్రవేశం ఉం టుందని పాఠశాల బోర్డుమీద ధైర్యంగా రాయించాడు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ప్రవేశం లేదని రాయించాడు. నాడు స్త్రీలు చదువుకోవడం నేరంగా భావించేవారు. అలాంటి పరిస్థితిలో తన భార్య సావిత్రిబాయి పూలేకు, తన సోదరికి చదువు నేర్పేందుకు బడిలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనతో పాటు తన భార్య సావిత్రీబాయి పూలేను కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేశాడు. ఇంటింటికి తిరిగి విద్య ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసిన మొదటి సంఘసంస్కర్త పూలే. శూద్ర, అతిశూద్ర కులాల్లో విద్యావ్యాప్తికి పూలే చేస్తున్న కృషిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. ఆ సమయంలో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆన్‌కీన్ పేరి 1852లో పూనా నగరానికి గవర్నర్‌తో కలిసి వచ్చినప్పుడు పూలే దంపతులను ఘనంగా సన్మా నించారు. ఆదర్శవంతమయిన ఆయన జీవితం త్యాగశీలతకు సాహసానికి ప్రతీక. ఆ రోజుల్లో వితంతువులకు కలిగిన సంతానం అమానుషంగా చంపబడుతుండేది. దానికి పూలే ఎంతో చలించిపోయారు. అలాంటి పిల్లల కోసం ఒక అనాథాశ్రయాన్ని స్థాపించి అనాథల రక్షకుడైనాడు. సత్యధర్మ స్థాపనకు ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించాడు. దీనిలో భాగంగా మూఢనమ్మకాలను విడనాటం గురించి అవగాహన కల్పించటమేకాకా బ్రాహ్మ ణుల అవసరం లేకుండా సత్యశోధక్ సమాజ్ సంస్కార పద్ధతిలోనే వివాహాలు జరి పించారు. బ్రాహ్మణులకు ఇచ్చే దాన ధర్మాలకన్నా వెనకబడినకులాలకు చేసే విద్యా దానం మిన్న అని నొక్కి చెప్పేవాడు. ప్రజలను చైతన్యం చేయడానికి ‘దీనబంధు’ అనే బహుజన పత్రికను నడిపారు. బ్రాహ్మణులు, మూఢనమ్మకాలతో ప్రవేశపెట్టిన పూజా విధానానికి ప్రత్యామ్నాయంగా హేతుబద్ధంగా ఆచరించే పూజా విధానంఅనే గ్రంథాన్ని సమాజానికి అందిం చా డు. 1888లో పక్షవాతం వల్ల ఆరోగ్యం పాడైపోయింది. 1890 నవంబరు 29 వ తేదీన ఆయన కన్నుమూశారు.
-స్వరూప 

Namasete Telangana Telugu News Paper Dated: 27/11/2013 

No comments:

Post a Comment