Tuesday, November 19, 2013

పట్నం పారిశుద్ధ్యం నాడు, నేడు - గాదె వెంకటేష్


Published at: 19-11-2013 00:22 AM
 
New 
 
0 
 
0 
 
 

1920వ దశకంలో వృధా నీటి, మురుగునీటి శుద్ధి టెక్నాలజీ శాస్త్రీయ సూత్రాల ఆధారంగా తుది రూపం దాల్చింది. దాదాపుగా అదే సమయంలో హైదరాబాద్ ఆ సాంకేతికతను అందుకుంది... హైదరాబాద్ సంస్థానంలో విద్య, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్యం సదుపాయా ల అభివృద్ధిలో ప్రపంచ స్థాయి సాంకేతికతలన అందిపుచ్చుకొని ఆ సాంకేతికతలకు మానవతా స్పృహను జోడించిన దార్శనికుడు ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్.
'నిజాం ది రూలింగ్ ఐకాన్' అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వింతేమీకాదు. కానీ తన పాలనలో ఉన్న ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిజాం సేవలను విస్మరించలేము. చెరువులు తవ్వించడం, మంచి నీళ్ళు, విద్యుత్ సదుపాయాలు కల్పించడం గురించి విని వుండవచ్చు. అయితే మురుగునీటి వ్యవస్థకు ప్రజా ఆరోగ్యానికి సంబంధం ఉందనే సత్యాన్ని విపులంగా అర్థం చేసుకున్న అతి కొద్ది మంది పాలకులలో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఒకరు.
ఒక మనిషికి ఒక రోజుకు 135 లీటర్ల చొప్పున నీళ్లను అందివ్వాలని సెంట్రల్ పబ్లిక్‌హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. దానిలో దాదాపు 80 శాతం మురుగునీరుగా మారుతుంది. మురుగునీటి నిర్వహణ సరైన పద్ధతిలో లేకపోతే డయేరియా, కలరా, పోలియో లాంటి యాభై పైగా వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధులకు ముఖ్యంగా మురికివాడలలో నివసించే పేదలే బలవుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ 1908లో మూసీ వరదల తర్వాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వృథా నీటి, మురుగునీటి నిర్వహణ వ్యవస్థకు పునాదులు వేసి, పారిశుద్ధ్య వ్యవస్థకు పురుడు పోశారు. ఒక శతాబ్దం ముందే బయటి ప్రపంచంతో సమాంతరంగా పారిశుద్ధ్య వ్యవస్థకు ఉన్న ఆవశ్యకతను, ఆ సాంకేతికతను నిజాం నవాబు అంది పుచ్చుకున్నారనడానికి నాటి పారిశుద్ధ్య వ్యవస్థే సాక్ష్యం. చక్కని పారిశుద్ధ్యమే మనుషుల నాగరికతను తెలుపుతుందని నమ్మి, 1922లోనే ప్రజలకు ఆరోగ్యకరమైన పరిసరాలను అందించాలన్న తపన ఊహకందని విషయం. టెక్నాలజీని అర్థం చేసుకొని అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక నిపుణులను, తగు సిబ్బందిని సమకూర్చుకోవడం గొప్ప విషయం. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పారిశుద్ధ్య వ్యవస్థను నిర్మించిన యాభై ఏళ్ల తర్వాత అంటే 1970లలో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటై, నీటి కాలుష్య చట్టానికి చెందిన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత మాత్రమే తెలంగాణేతర ప్రాంతాలలో పారిశుద్ధ్య వ్యవస్థకు చర్యలు చేపట్టారనేది నిర్వివాదాంశం.
1920వ దశకంలో వృధా నీటి, మురుగునీటి శుద్ధి టెక్నాలజీ శాస్త్రీయ సూత్రాల ఆధారంగా తుది రూపం దాల్చింది. దాదాపుగా అదే సమయంలో హైదరాబాద్ ఆ సాంకేతికతను అందుకుంది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, భూగర్భ మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతుల ద్వారా ఆధునికీకరించడం, దుమ్ము -ధూళి లేకుండా రహదారులను శుభ్రపరచడం వంటి ప్రధాన లక్ష్యాలతో 1926లో హైదరాబాద్ మురుగు నీటి విభాగం ఏర్పాటయ్యింది. 1908లో మూసీ వరదల నష్టం తరువాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వరద నీటి నిర్వహణా ప్రణాళికలను తయారుచేయించారు ఆరవ నిజాం. విశ్వేశ్వరయ్య మొదట నగరాన్ని పరిశీలించి ప్రణాళికలు రూపొందించి రూ.52 లక్షలతో నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. అప్పటి శానిటరీ ఇంజనీరు ఎ.డబ్ల్యు స్టోన్‌బ్రిడ్జ్ ఆ ప్రణాళికలకు మెరుగులు దిద్ది మొత్తం నగరానికి రూ.168 లక్షల అంచనాతో వరద నీరు, మురుగునీటి నిర్వహణకు ప్రణాళికలను రూపొందించాడు. 1921లో విశ్వేశ్వరయ్య ఆ ప్రణాళికలను సమగ్రంగా పరిశీలించి స్టోన్‌బ్రిడ్జ్‌ను అభినందించారు.
మురుగునీటి నిర్వహణను కొద్దిగా ఆలస్యంగా చేపట్టినా పర్వాలేదు కానీ మళ్ళా వరదల వల్ల హైదరాబాద్ నష్టపోకూడదని రూ.100 లక్షలతో వరద నీటి సేకరణ కాలువల నిర్మాణాన్ని తొలుత ప్రారంభించమని విశ్వేశ్వరయ్య ముందు చూపుతో సలహా ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎం.ఎ. జమాన్‌కు అప్పగించారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్ల సలహాలు, సూచనలతో జమాన్ ఆ ప్రణాళికలను పటిష్ఠ పరచి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1926లో వరదనీరు, మురుగునీరు నిర్వహణను కలపడం వల్ల మురుగునీటి నిర్వహణ నిర్లక్ష్యానికి గురౌతుందని నిజాం నవాబు భావించారు. వెన్వెంటనే మురుగునీటి నిర్వహణకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నవాబ్ కుర్మత్ జంగ్ బహదూర్‌ను ఛీఫ్ ఇంజనీర్‌గాను, జమాన్‌ను ఎస్ఇగాను ఏడవ నిజాం నియమించారు.
మురుగునీటికి సంబంధించిన పనులు 1926లో రూ.15 లక్షల గ్రాంటుతో ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా 1930లో డ్రైనేజ్ బోర్డు, పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరచడానికి పంపిన ప్రణాళికలను కూడా అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పకుండా ఆమోదించింది. దీన్ని బట్టి నిజాం పారిశుద్ధ్యంపై కనబరిచిన శ్రద్ధ మనకు అర్థమౌతుంది. డ్రైనేజ్ బోర్డు రూ.102.4 లక్షలతో ప్రధాన కాలువలు, ఉప కాలువలు నిర్మించడమే కాకుండా ప్రజల విజ్ఞప్తి మేరకు కనెక్షన్స్ కూడా ఇచ్చింది. 1937లో ఉన్న ఐదు లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని మురుగునీరు నిలువ ఉండకుండా కావాల్సిన కాలువల కోసం ప్రణాళికలు తయారు చేయించారు ఏడవ నిజాం.
నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానాల గదులు, ప్రజల సౌకర్యార్థం నిజాం ప్రభుత్వం ఆరోజుల్లోనే కట్టించింది. మురుగుకాల్వల ద్వారా సేకరించిన నీటిని పాక్షికంగా అంబర్‌పేట ఎస్టీపీ వద్ద శుభ్రపరచేవారు. ఈ శుద్ధి చేసిన నీటితో 1100 ఎకరాలకు సాగునీరు అందించేవారు. సేకరించిన మురుగునీటి శుద్ధి కోసం 'ఆక్సిడేషన్ పాండ్ టెక్నాలజీ'తో 53 ఎమ్ఎల్‌డీ.. ఎస్‌టీపీని నిర్మించారు. ఇదంతా 1937-40 సంవత్సరాల మధ్య నిజాం తెలంగాణ ప్రజలకు అందించారు. అంటే దేశంలో మొదటి మూడు నాలుగు మురుగునీటి శుద్ధికేంద్రాలలో హైదరాబాద్ ఎస్‌టీపీ ఒకటి. ఇతర దేశాల వాళ్లు సైతం మురుగునీటి కాల్వల నిర్వహణ, శుద్ధి అధ్యయనం కోసం (స్టడీ టూర్) ఇక్కడికే వచ్చేవారు. ఆసిఫ్‌నగర్, నారాయణగూడలలో అప్పటికే ప్రసిద్ధి గాంచిన మంచినీటి శుద్ధి కేంద్రాలు ఉండేవి. ఆసిఫ్‌నగర్‌లోని నీటి శుద్ధికేంద్రం 100 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుండడం నిజాం ప్రభుత్వం నాణ్యతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని విశదం చేస్తుంది. 1950లో హైదరాబాద్ మురుగునీటి వ్యవస్థకి, సికింద్రాబాద్, పారిశ్రామిక వాడల నుంచి వచ్చే మురుగునీటి కాల్వలను ఆరు లక్షల రూపాయల వ్యయంతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మురుగునీటి విభాగం ఏర్పాట్లు చేసింది. పారిశుద్ధ్యం విషయంలో ఒక్క హైదరాబాద్ నగరానికే ప్రాధాన్యమిచ్చారనుకుంటే పొరపాటే. తన సంస్థానంలోని అన్ని ప్రధాన పట్టణాలలో మురుగునీటి నిర్వహణకు సమాన ప్రాధాన్యమిచ్చారు. డ్రైనేజీ విభాగంకు కేటాయించిన బడ్జెట్‌తోనే సరిపెట్టక సాధారణ బడ్జెట్ రాబడి నుంచి కూడా అదనంగా మరికొంత బడ్జెట్‌ను డ్రైనేజీ విభాగానికి కేటాయించే వారు. అదీ, పారిశుద్ధ్యం పట్ల ఏడవ నిజాంకు ఉన్న నిబద్ధత.
ఇక వర్తమానానికి వద్దాం. దేశంలోని మొత్తం 5,161 పట్టణాల్లో కేవలం 269 పట్టణాలకు మాత్రమే మురుగునీటి నిర్వహణ ఉంది. అది కూడా పాక్షికంగానే ఉందన్న విషయం బహు బాధాకరమైన వాస్తవం. ప్రస్తుత ప్రభుత్వాలు పారిశుద్ధ్య పనులను చేపడుతున్న విధానంలోనైతే అన్ని పట్టణాలకు మురుగునీటి నిర్వహణ వసతులు కల్పించాలంటే మరో మూడు వేల సంవత్సరాలకు పైగా పడుతుందని ఓ అంచనా! పారిశుద్ధ్యం మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ తొమ్మిది రూపాయలు లాభిస్తాయి. ఎందుకంటే పారిశుధ్ధ్యం మీద ఖర్చు పెట్టడం అంటే ఆరోగ్య వసతుల మీద ఖర్చు పెడుతున్నట్టే. అనారోగ్యాలు, అంగ వైకల్యాలు తగ్గి ఆరోగ్యకరమైన మానవులు రూపొందుతారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో 6,780 కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరా వ్యవస్థ ఉంటే దాదాపు 3600 కిలోమీటర్ల మురుగునీటి వ్యవస్థ విస్తరించి ఉంది. అభివృద్ధిలో ప్రపంచంతో పాటు పరుగెత్తుతున్న హైదరాబాద్‌లో ఇప్పటి పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. జనాభా రోజురోజుకు పెరుగుతున్నా మురుగునీటి కాల్వలను మాత్రం మెరుగుపరచడం లేదు.
తాత్కాలికంగా సమస్యను పరిష్కరించే విధానంతో పైపులను మార్చుతున్నారు. అందుకే హైదరాబాద్‌కి ఎన్ఆర్ సీడీపీ వచ్చిన డబ్బుతో మురుగునీటిని శుద్ధిచేసి మూసీలో వదలడానికి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్‌బీ ఫేస్-1, ఫేస్-2 లుగా ప్రణాళికలు తయారుచేసింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో 1032 ఎంఎల్‌డీల మురుగునీరు ఉత్పన్నమవుతోంది. అందులో 67.8 శాతం అంటే 695 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ , హెచ్ఎండీఏ కలిసి నిర్వహిస్తున్న ఎస్‌టీపీలు 12 ఉన్నాయి. వీటితో 1028 ఎంఎల్‌డీల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు.
నిజాం పాలనలోనే హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ద్వారా 1913లో మింట్ కాంపౌండ్‌లో డీజిల్ పవర్ స్టేషన్‌ను నిర్మించి వీధి దీపాలు, కింగ్‌కోఠిలోని ప్యాలెస్‌కు విద్యుత్ వెలుగులను ఇచ్చారు. 1921-22లో హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను, 1930లో పవర్ హౌజ్‌ను, 1921లో సిటీకాలేజ్‌ను, 1915లో వరద నీటి వ్యవస్థను, 1922లో మురుగునీటి వ్యవస్థను, 1940లో ఎస్‌టీపీ నిర్మించి ఆధునిక సాంకేతిక విప్లవానికి జంట నగరాలలో నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ నాంది పలికారు- అమెరికాలో కొత్త సాఫ్ట్‌వేర్ విడుదలైన మరునాడే అమీర్‌పేటలో కోచింగ్ మొదలైనట్లు. ఇటువంటి ఆధునికీకరణను ఏ హిందూరాజో సాధించివుంటే అది స్వర్ణయుగమని మన (హిందూ) చరిత్రకారులు కొనియాడేవారు కాదా? హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమయినప్పుడు అప్పటి వరకు తన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన వివిధ పరిశ్రమలలోని కార్మికుల ఉద్యోగభద్రత కోసం చేసుకొన్న ఒప్పందాలు ప్రస్తుతం ప్రపంచ స్థాయి మెర్జింగ్, అక్విజషన్ సూత్రాలకు దీటుగా నిలిచి నిజాం నవాబు నిబద్ధతను చాటుతున్నాయి. ఇలా విద్య, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్యం సదుపాయాల అభివృద్ధిలో ప్రపంచ స్థాయి సాంకేతికతలను అందిపుచ్చుకొని ఆ సాంకేతికతలకు మానవతా స్పృహను జోడించిన దార్శనికుడు ఏడవ నిజాం ప్రభువు.
- గాదె వెంకటేష్
అసోసియేట్ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
(నేడు ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం)


Andhra Jyothi Telugu News Paper Dated : 19/11/2013 

No comments:

Post a Comment